breaking news
T Rajinder
-
‘రజనీ, కమల్ కంటే నేనే సీనియర్’
చెన్నై: రజనీకాంత్, కమలహాసన్‌ల కంటే తానే సీనియర్‌నని నటుడు టీ.రాజేందర్ పేర్కొన్నారు. ఈయన గురువారం చెన్నైలోని తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ రజనీకాంత్, కమలహాసన్ రాజకీయాల గురించి తనను అడగడంలో అర్థం లేదని అన్నారు. నటులుగా రజనీకాంత్, కమలహాసన్‌లకు తాను అభిమానినని అన్నారు. అయితే రాజకీయాల్లో తాను వారిద్దరి కంటే సీనియర్‌నని అన్నారు. రాజకీయాల్లో విజయం సాధించడానికి అనుభవం ఉంటే చాలదని,అదృష్టం ఉండాలని అన్నారు, తాను అధికారాన్ని పొందడానికి రాజకీయ పార్టీని ప్రారంభించలేదని అన్నారు. అసలు ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల గురించి మాట్లాడడమే మానుకున్నానని అన్నారు. తన చిత్రాల విజయానికి పామర ప్రజలు, మహిళలే కారణం అన్నారు. అయితే ఇప్పుడు సినిమాలను డబ్బున్న వాళ్లే చూసే పరిస్థితి నెలకొందని అన్నారు. వచ్చే నెల 22న చెన్నై, కాంచీపురం, తిరువళ్లూర్ జిల్లాల సినీ డిస్ట్రిబ్యూటర్ల సంఘానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రాజేందర్ జట్టు పోటీ చేయనున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు.ఈ జట్టులో టీ.రాజేందర్ అధ్యక్ష పదవికి, మన్నర్ ఫిలింస్ మన్నర్ కార్యదర్శి పదవికి పోటీ చేయనున్నట్లు తెలిపారు. -
విశాల్‌పై తిరుగుబాటు
పెరంబూరు: నిర్మాతల మండలి అధ్యక్షుడు, నటుడు విశాల్‌పై ఆయన వ్యతిరేక వర్గం మరోసారి ధ్వజమెత్తారు. దక్షిణ భాతర నటీనటుల సంఘం ఎన్నికలు, నిర్మాతల మండలి ఎన్నికల ముందే విశాల్ తమిళేతరుడని ఆరోపణలు గుప్పించారు. అయినా ఈ రెండు సంఘాల ఎన్నికల్లోనూ విశాల్ విజయదుందుభి మోగించారు. వచ్చే ఎన్నికల్లోనూ విశాల్ వర్గం పోటీకి సిద్ధం అని ఇప్పటికే వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో విశాల్ వ్యతిరేక వర్గం అనూహ్యంగా ఆయనపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఆ వివరాలు చూద్దాం. దర్శకుడు భారతీరాజా, టీ.రాజేందర్, నటుడు రాధారవి, జేకే.రితీశ్ ఆదివారం విలేకరుల సమావేశంలో చేసిన వాగ్దానాలను నెరవేర్చలేకపోయిన నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ వెంటనే ఆ పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. దక్షిణ భారత సినీ వాణిజ్య మండలిని, తమిళ సినీ వాణిజ్య మండలిగానూ, దక్షిణ భారత సినీ నటీనటుల సంఘాన్ని తమిళ సినీ నటీనటుల సంఘంగానూ మార్చాలని ఒత్తిడి చేస్తూ స్థానిక టీ.నగర్‌లోని ఆంధ్రాక్లబ్‌లో దర్శకుడు భారతీరాజ నేతృత్వంలో సమావేశమయ్యారు. విశాల్ అధ్యక్ష పదవినుంచి వైదొలగాలి సమావేశం అనంతరం ఈ బృందం విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే నిర్మాతల మండలి అవసరమా అన్న ప్రశ్న తలెత్తుతోందన్నారు. సీనియర్లు తప్పుకోవడంతో ఎవరెవరో వచ్చి తమిళ నిర్మాతల మండలిని ఏలుతున్నారని విమర్శించారు. నిర్మాతల మండలి అధ్యక్ష పదవి కోసమే ఒకరు ఉన్నారని, మండలి అధ్యక్షుడిగా విశాల్ చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. వాగ్దానాలు నెరవేర్చకపోతే పదవి నుంచి తప్పుకుంటానని ఎన్నికల ముందు చెప్పిన ఆయన ఇప్పటికీ వైదొలగకపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. ఇటీవల 48రోజుల పాటు సమ్మెను ఎందుకు నిర్వహించారన్నది తెలియలేదన్నారు. నిర్మాతల సంఘం సర్వసభ్య సమావేశంలో తమిళతాయ్ గీతం సమయంలో అందరూ నిలబడి మర్యాద ఇవ్వకపోవడం బాధాకరం అన్నారు. ఆ సమావేశంలో సంఘ నిధి రూ.7 కోట్లకు సంబంధిచిన వివరాలను అడిగినప్పుడు విశాల్ ఎందుకు బదులు చెప్పలేదని ప్రశ్నించారు. తమిళ నిర్మాతల మండలిలో తమిళులే కార్య నిర్వాహకులుగా ఉండాలన్నారు. తమిళ సినిమాలో తమిళులే అధిక పెట్టుబడులు పెడుతున్నారని, అయినా ఇతరుల వద్ద బిచ్చమెత్తుకోవలసిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మారాలంటే తమిళులంతా ఏకం కావాలన్నారు. పలు సమస్యలు విశాల్ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా బాధ్యతులు చేపట్టిన తరువాత పరిశ్రమలో పలు సమస్యలు నెలకొన్నాయన్నారు. ఒక చిత్రాన్ని అత్యధికంగా తమిళనాడులో 200ల థియేటర్లలో విడుదల చేయవచ్చునని విశాల్ చెప్పారని అలాంటిది ఆయన నటించిన ఇరుంబుతిరై చిత్రాన్ని 300 థియేటర్లలో ఎలా విడుదల చేశారని ప్రశ్నించారు. నిబందనలకు విరుద్ధంగా విశాల్ ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. తమిళ్ రాకర్స్ వెబ్సైట్ నిర్వాహకులు పట్టుపడ్డారని చెప్పిన విశాల్ ఇçప్పటి వరకూ వారి గురించిన వివరాలను వెల్లడించకపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. కావున ఆయన మండలి అధ్యక్ష పదవి నుంచి వెంటనే వైదొలగాలని, మళ్లీ మండలి ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన కోలీవుడ్‌లో కలకలాన్నే సృష్టిప్తోంది. -
ఎలా విడిపోయారు?
శింబు, నయనతార పీకల్లోతు ప్రేమలో మునిగి, పెళ్లి దాకా వెళ్లి విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రేమకి ఫుల్స్టాప్ పెట్టాక ఈ మాజీ ప్రేమికులు కలిసి నటించిన తమిళ చిత్రం ‘ఇదు నమ్మ ఆళ్’. పాండిరాజ్ దర్శకత్వంలో ‘ప్రేమసాగరం’ టి.రాజేందర్ సమర్పణలో శింబు సినీ ఆర్ట్స్, జేసన్‌రాజ్ ఫిలింస్‌పై టి.రాజేందర్ నిర్మించిన ఈ చిత్రం ‘సరసుడు’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. టి.రాజేందర్ మాట్లాడుతూ– ‘‘సాఫ్ట్వేర్ రంగంలోని యువతీ యువకులు ఎలా ప్రేమలో పడుతున్నారు? ఎలా విడిపోతున్నారు? చివరికి వారి ప్రేమ పెళ్లిదాకా వస్తుందా? లేదా? అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. మా చిన్నబ్బాయి కుళల్ అరసన్ ఈ చిత్రానికి మంచి సంగీతం అందించాడు. నయనతార, ఆండ్రియా, అదా శర్మ డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో నటించారు. జులైలో ఈ సినిమా రిలీజుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కో–ప్రొడ్యూసర్: శ్రీమతి ఉషా రాజేందర్.