breaking news
syama prasad mookerjee birth anniversary
-
ప్రతిపక్ష హోదా అప్పుడుందా: వెంకయ్య
-
ప్రతిపక్ష హోదా అప్పుడుందా: వెంకయ్య
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభలో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు సోమవారం నుంచి ప్రారంభం కానున్న సభను సాగనీయబోమన్న ఆ పార్టీ నేతల హెచ్చరికలపై కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తీవ్రంగా మండిపడ్డారు. సభను ఎలా జరపాలో తమకు తెలుసన్నారు. జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి.. ఆ తరువాత జాతీయ మీడియా ప్రతినిధులతో వెంకయ్య మాట్లాడారు. సంఖ్యా బలం లేనప్పుడు ప్రతిపక్ష హోదాకోసం స్పీకర్‌పై ఒత్తిడి పెంచాలి తప్పితే మొత్తం సభను అడ్డుకుంటామన్న మాటలు సరికాదని హితవు పలికారు. ప్రతిపక్ష పార్టీల్లో ఎవరికీ తగిన సంఖ్యా బలం లేనందున నెహ్రూ, ఇందిరా, రాజీవ్‌ల హయాంలో ప్రతిపక్ష హోదా ఇవ్వని సందర్భాలున్నాయని గుర్తు చేశారు. అప్పటి నిర్ణయాలకు జవాబు చెప్పి కాంగ్రెస్ ఈ చర్చను ముందుకు తీసుకెళితే మంచిదని సలహా ఇచ్చారు. మత రిజర్వేషన్లకు బీజేపీ పూర్తి వ్యతిరేకం మతపరంగా రిజర్వేషన్లు ఏర్పాటు చేయడానికి బీజేపీ పూర్తిగా వ్యతిరేకమని వెంకయ్యనాయుడు చెప్పారు. అలాంటివి తెలంగాణలో ప్రభుత్వం ఇచ్చినా.. యూపీలో ప్రభుత్వం ఇచ్చినా మంచివి కాదన్నారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్ ఇస్తే దేశంలో మతమార్పిడి ఎక్కువయ్యే ప్రమాదముందని హెచ్చరించారు.