breaking news
Swami Vivenakananda
-
కడుపు నిండాలని ఓ పూట భోజనం పెడితే.. ఉన్న కొద్ది డబ్బుతో మద్యం
‘ఏదైనా ఒక విషయం లేదా ఒక ఆలోచన నిన్ను భౌతికం గా కానీ, మేధోపరంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ బలహీన పరుస్తుంటే తక్షణమే దానిని విషంగా భావించి దూరం పెట్టాలి’ అన్నారు స్వామి వివేకానంద. అలాగే ‘రోజుకు కనీసం ఒక్కసారైనా నీతో నీవు మాట్లాడుకో. అలా చేయని పక్షంలో ప్రపంచంలోని ఒక అద్భుతమైన వ్యక్తితో మమేకమయ్యే సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నట్లే’ అని కూడా చెప్పారాయన. మరింత స్పష్టంగా... ‘నీ మీద నీకు విశ్వాసం లేనంత వరకు నువ్వు భగవంతుడిని కూడా విశ్వసించలేవ’ని కూడా చెప్పారు. ఇవన్నీ ఒత్తిడులను జయించమని, నీకు హాని కలిగించే ఆలోచనను విసర్జించగలిగిన పరిణతిని సాధించమని, జీవితాన్ని ఆనందమయం చేసుకోమని చెప్పడమే. కేరళలోని కొన్ని మారుమూల జిల్లాల్లో పిల్లలు పోషకాహార లోపంతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితులను అరికట్టడానికి ప్రభుత్వం కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేసి భోజనం పెడుతోంది. కనీసం ఒక పూట అయినా కడుపు నిండా భోజనానికి భరోసా ఉంటే ప్రాణాలను కాపాడవచ్చనుకున్నారు పాలకులు. ఇది ఇలా ఉంటే... ప్రజలు కమ్యూనిటీ కిచెన్‌లో భోజనం చేస్తూ తాము పని చేసి సంపాదించుకున్న కొద్దిపాటి డబ్బును మద్యం కోసం ఖర్చు చేస్తున్నారు. రెండోపూట పస్తులుంటున్నారు. ఈ ఉదంతంతో ఏం తెలుస్తోంది? కష్టాలను కొనితెచ్చుకోవడం అనేది మనిషి స్వయంగా తనకు తానుగా చేసుకుంటున్నట్లు అనిపించడం లేదా? ఇందుకు వారి బలహీనమైన మానసిక స్థితి కూడా కారణం కావచ్చు. మనసు మీద ఆధిపత్యం సాధించగలిగితే జీవితం మన చేతుల్లోనే ఉంటుంది. సంతోషంగా జీవించవచ్చా, విజయగర్వంతో జీవించవచ్చా అనేది తమకు తాముగానే నిర్ణయించుకోగలుగుతారు. తనతో తాను మాట్లాడుకోగలిగితే ఆ రోజు ఏమేం చేశాననే పునశ్చరణతో పరివర్తనకు బీజం పడుతుంది. ‘దేవుడా! నాకు అదివ్వు ఇదివ్వు’ అని అడగడానికి ముందు తమ మీద తాము విశ్వాసం ఉంచుకోవడం కూడా అవసరమేనన్నారు వివేకానంద. కొత్త సంవత్సరం తీర్మానాల్లో ‘ప్రతిరోజూ ఒకసారి మనతో మనం మాట్లాడుకుందాం. మనకు హాని కలిగించే విషయాన్ని రెండవ ఆలోచన లేకుండా దూరం పెడదాం, అది బయటి వస్తువు కావచ్చు లేదా మన మెదడులోనే ఉండవచ్చు. ఆ విషం మనలో ఉన్నదే అయినా సరే తక్షణం వదిలేద్దాం. అలాగే మన మీద మనం విశ్వాసాన్ని పెంచుకుందాం’. ఏడాదంతా క్షేమంగా జీవిద్దాం. చదవండి: Health Tips: రోజూ ఉసిరికాయ తింటున్నారా... ఇందులో ఉండే క్రోమియం వల్ల -
చెత్త పడేసి వందేమాతరం అంటే ఎలా? : మోదీ
వాళ్లకు మాత్రమే ఆ హక్కు ఉంది మీ సృజనాత్మకతను దేశం కోసం వాడండి వివేకానందుడు కొరుకుంది కూడా అదే చికాగో ఉపన్యాస 125వ విద్యార్థి సదస్సులో ప్రధాని పిలుపు సాక్షి, న్యూఢిల్లీ: దేశాన్ని ప్రక్షాళన చేయాలని భావించే ప్రతీ ఒక్కరూ భరత మాత ముద్దు బిడ్డలేనని.. వాళ్లకు మాత్రమే వందేమాతర నినాదం చేసే హక్కు ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. స్వామి వివేకానంద చికాగో ప్రసంగానికి నేటితో సరిగ్గా 125 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన సదస్సులో విద్యార్థులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. యంగ్ ఇండియా న్యూ ఇండియా- ఏ రిజర్జెంట్ నేషన్. ఫ్రమ్ సంకల్ప్ టూ సిద్ధి పేరిట నిర్వహించిన ఈ సదస్సును సుమారు 40,000 విద్యాసంస్థల్లో లైవ్ టెలికాస్ట్ ఏర్పాట్లు చేసింది యూజీసీ. ఇక కార్యక్రమంలో మోదీ ప్రసంగిస్తూ... 2001 సరిగ్గా ఇదే రోజున అమెరికాలో ఉగ్రవాది చోటు చేసుకుంది. 9/11 అంటే అందరికీ అదే గుర్తుకు వస్తుంది కానీ, వందేళ్ల క్రితం అదే తేదీన కాషాయం బట్టలు ధరించిన ఓ వ్యక్తి చికాగో వేదికగా భారత ఔనత్యాన్ని చాటి చెప్పాడు అని చెప్పుకొచ్చారు. ‘అంతర్జాతీయ వేదికలపై అవకాశం దొరికినప్పుడల్లా తన మాతృభూమి గురించి, ఇక్కడి సాంప్రదయాలు, అపారమైన మేధో సంపద... ఇలా అన్ని అంశాలపై సుదీర్ఘ ఉపన్యాసాలు ఆయన(వివేకానందుడు) ఇచ్చేవారు. అదే సమయంలో జాతిని విమర్శించే వారికి సరైన సమాధానమే ఆయన ఇచ్చేవారు. సంకుచిత భావజాలాలను విడనాడీ దేశ ఔన్నత్యం కోసం పాటుపడాలంటూ తరచూ తన ఉపన్యాసాలలో వివేకానందుడు పిలుపునిచ్చేవారు. ముఖ్యంగా తన జీవితంలో సత్యాన్వేషిగానే ఆయన ఎక్కువ కాలం గడిపారు’ అని మోదీ పేర్కొన్నారు. నోబెల్ బహుమతి ద్వారా రవీంద్రనాథ్ ఠాగూర్, తన ఉపన్యాసం ద్వారా స్వామి వివేకానందుడు ప్రపంచ పటంలో భారత పేరును స్థిరస్థాయిగా నిలిపారని, యాధృచ్ఛికంగా ఈ ఇద్దరూ బెంగాల్‌కు చెందిన వాళ్లే కావటం విశేషమని మోదీ అన్నారు. కేవలం వివేకానందుడి కృషి వల్లే భారత్ ఇప్పుడు యువ జాతిగా వెలుగొందుతుందని మోదీ తెలిపారు. యువత ఉద్యోగాల కోసం రోడ్డున పడటం కాదు.. ఉపాధి కల్పన కల్పించే స్థాయికి చేరుకోవాలన్నది వివేకానందుడి కల అని మోదీ ప్రస్తావించారు. గుళ్లు కాదు.. టాయ్లెట్లు నిర్మించాలి పరిజ్ఞానంతోపాటు నైపుణ్యానికి కూడా మనం సమాన ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. కుల, వర్గ విభజనకు వివేకానందుడు వ్యతిరేకమన్న మోదీ.. ఆ బాటలో ఇప్పటి యువత కూడా ప్రయాణించాలని ఆకాంక్షించారు. ప్రపంచ సమస్యలన్నీ ఆసియా దేశాల ద్వారానే పరిష్కారం అవుతుందన్న ఉద్దేశ్యంతో వన్ ఏషియా నినాదాన్ని వివేకానందుడు ఇచ్చారని తెలిపారు. వందేమాతర నినాదం ప్రతీ ఒక్క భారతీయుడు హక్కు అన్న ఆయన.. దేశాన్ని..తమ ఇళ్లను అపరిశుభ్రంగా ఉంచుకునేవాళ్లకు ఆ నినాదం చేసే హక్కు లేదని.. ఎవరైతే దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతారో వారికి మాత్రమే ఆ హక్కు ఉంటుందని చెప్పకొచ్చారు. దేవాలయాల కంటే ముందు మరుగుదొడ్లు నిర్మించాలన్న ఆవసరం ఉందని మోదీ అభిప్రాయపడ్డారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై అవగాహన పెంచుకోవాలన్న ప్రధాని మోదీ... ఎన్నిక ప్రచార సమయంలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని విద్యార్థి సంఘాలను కోరారు. కాలేజీలో విద్యార్థుల ఆధునిక పోకడలపై పలువురు విమర్శలు వినిపిస్తున్నప్పటికీ.. దేశ సంస్కృతి విఘాతం కలిగించని పక్షంలో తాను వాటికి వ్యతిరేకం కాదని మోదీ చెప్పగా... విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. సృజనాత్మకత లేనిదే మనిషి జీవితం లేదన్న ప్రధాని మీ సృజనాత్మకతను మన దేశ అభివృద్ధికి, ప్రజల ఆశయాలను నెరవేర్చటానికి వినియోగించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. మన దేశాన్ని.. భాషలను.. సంప్రదాయాలను తప్పక గౌరవించాలని ఆయన అన్నారు. భారత్ మారుతోంది. ప్రపంచ వేదికలో వెలుగొందుతోంది. దీనంతటికి జనశక్తే కారణం అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.