breaking news
Sufi teachers
-
ఆత్మ అంతిమంగా ఎక్కడకు చేరుకుంటుందో తెలుసా!
ఓ సూఫీ జ్ఞాని చెప్తున్నారు...మనిషి ఆత్మ భగవంతుడి నుంచి వచ్చింది. అది చివరకు భగవంతుడినే చేరుతుంది. అది అంతిమంగా భగవంతుడిని ఎప్పుడు చేరుతుందో అప్పుడే దాని ప్రయాణం ముగుస్తుంది. అప్పటి వరకూ అది ప్రయాణం చేస్తూనే ఉంటుంది. అంటే అదొక వలయం. అనేక పుట్టుకలు, అనేక మార్గాలు ఇలా ఎలాగైనా అనుకోవచ్చు. చెప్పాలంటే జీవితంలో ఏదో ఒక అన్వేషణ అంటూ ఉంటూనే ఉంటుంది. మనసు ఏదో ఒకటి కోరుతూ ఆ దిశలో పయనిస్తుంది. కానీ అది ఏది కోరుకుంటుందోఎక్కడ తృప్తి చెందుతుందో స్పష్టత ఉండదు. దీనినే ఆ జ్ఞాని ఆత్మాన్వేషణ ప్రయాణం అని చెప్పారు. ఇదంతా వింటున్న ఓ శిష్యుడికి ఓ సందేహం కలిగింది. ‘‘గురువుగారూ, ఆత్మ అంతిమంగా భగవంతుడిని చేరుకోవడంతో దాని ప్రయాణం ముగుస్తుందన్నారు కదా... అంటే ప్రతి ఒక్కరూ భగవంతుడిని చేరుకోవడమే అవుతుందిగా’’ అని అడిగాడు. ‘‘అవును... అందులో సందేహమేముంది? కాస్తంత ముందు వెనుకలు అంతే..అంతకన్నా మరొకటి కాదు... అందరూ చివరికి భగవంతుడిని చేరుకోవలసిందే’’ అన్నారు జ్ఞాని. ‘‘మరి మత పెద్దలు కొందరు మాత్రమే భగవంతుడిని చేరుకుంటున్నారని చెప్పారుగా?’’ అన్నాడు శిష్యుడు. అప్పుడు జ్ఞాని ‘‘నువ్వో పని చెయ్యి. ఊళ్ళోకి వెళ్ళి, వీలున్నంతమందిని కలిసి వారి కోరికేమిటో తెలుసుకుని రా’’ అని సూచించారు. సరేనని శిష్యుడు కొన్ని కాగితాలు, కలం తీసుకుని ఊళ్ళోకి బయలుదేరాడు.అనేకమందిని కలిశాడు. వారు ఏం కావాలనుకుంటున్నారో, వారి లక్ష్యమేమిటో అడిగాడు. వారి మనసు ఏది పొందితే తృప్తి పడుతుందో చెప్పమన్నాడు. వారు చెప్పినవన్నీ రాసుకున్నాడు. జ్ఞాని వద్దకు వచ్చాడు. ‘‘అయ్యా, ఊళ్ళో రాజు మొదలుకుని కూలీవరకూ ఎందరినో కలిసాను. వారు చెప్పినదంతా చదువుతాను వినండి’’ అంటూ మొదలుపెట్టాడు... ‘‘రాజేమో మరిన్ని దేశాలను గెలవాలనుకున్నాడు. యువరాజేమో తెలివైన యువరాణిని పెళ్ళాడాలనుకున్నాడు... ధనవంతుడేమో మరింత డబ్బు గడించాలనుకుంటున్నాడు... ఇలా ఒక్కొక్కరూ ఆశ పడుతున్నారు...’’ చెప్తుండగానే జ్ఞాని చదవడం ఆపమన్నారు. ‘‘అదంతా పోనివ్వు... వారిలో ఎంతమంది భగవంతుడిని చేరుకోవాలనుకుంటున్నారో వారి పేర్లు మొదట చదువు’’ అన్నారు జ్ఞాని. ఒక్కరు కూడా లేరన్నాడు శిష్యుడు. ‘‘అంటే నువ్వు కూడా లేవా ఆ జాబితాలో?’’ అని అతనివంక నవ్వుతూ చూశారు జ్ఞాని. శిష్యుడు తల దించుకున్నాడు. – జగద్రేణు (చదవండి: మంగళకరం) -
పాక్ నుంచి తిరిగొచ్చిన సూఫీ గురువులు
న్యూఢిల్లీ: పాకిస్తాన్ పర్యటనకు వెళ్లి అదృశ్యమైన ఇద్దరు సూఫీ గురువులు సోమవారం ఢిల్లీకి క్షేమంగా తిరిగొచ్చారు. హజ్రత్ నిజాముద్దీన్ దర్గా ప్రధాన గురువు సయ్యద్ ఆసిఫ్ నిజామీ, ఆయన మేనల్లుడు నాజిమ్ అలీ నిజామీ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ విమానంలో వచ్చి ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన తర్వాత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కలిశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. అయితే వారు పాక్‌లో ఎలా అదృశ్యమైంది పూర్తిగా వివరించలేదు. భారత నిఘా సంస్థ ‘రా’తో సంబంధాలు ఉన్నందువల్లే పాక్‌లో నిర్బంధించారనే వార్తలను వారు ఖండించారు. అయితే తమను పాక్ సిబ్బంది నిర్బంధించడం నిజమేనని అం గీకరించారు. తమ నిర్బంధంలో ఐఎస్ఐ పాత్రపై కూడా వారు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ఈ సందర్భంగా వారు మంత్రి సుష్మా స్వరాజ్‌కు, భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. శాంతిని, ప్రేమను ప్రబోధించడానికే పాక్‌కు వెళ్లామని, అక్కడ కొందరికి తమ బోధనలు రుచించలేదని చెప్పారు. తాము మళ్లీ వెళ్తామని ప్రకటించారు. తమను వెనక్కి పంపిన పాక్ ప్రభుత్వానికి కూడా వారు ధన్యవాదాలు తెలిపారు. నిజాముద్దీన్ దర్గాలో వీరికి ఘనస్వాగతం పలికారు. వీరి ద్దరూ 90ఏళ్ల వయసుండే ఆసిఫ్ సోదరిని చూడటానికి ఈనెల 8న లాహోర్‌కు వెళ్లిన తర్వాత వారి సమాచారం తెలియకుండా పోయిన సంగతి తెలిసిందే.