breaking news
suddala foundation
-
‘గోరటి’కి సుద్దాల పురస్కారం
సాక్షి, హైదరాబాద్: కలం యోధుడు సుద్దాల హనుమంతు, జానకమ్మ 2017 సంవత్సరం జాతీయ పురస్కారాన్ని ప్రజాకవి గోరటి వెంకన్న అందుకున్నారు. సుద్దాల ఫౌండేషన్ నేతృత్వంలో హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. ఫౌండేషన్ వ్యవస్థాపక అ«ధ్యక్షుడు సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ.. ఈ పురస్కారాన్ని గోరటి వెంకన్నకు అందించడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. ప్రభుత్వం ట్యాంక్ బండ్‌పై సుద్దాల హనుమంతు విగ్రహాన్ని పెట్టాలని, అలాగే ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారు. హనుమంతు విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెప్పారు. సాయుధ పోరాటంలో తన పాటతో ప్రజలను చైతన్యం చేసిన వ్యక్తి హనుమంతు అన్నారు. హనుమంతు వారసత్వాన్ని అందిపుచ్చుకొని అశోక్‌తేజ ఆ స్ఫూర్తిని కొనసాగిస్తున్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. ఈ పురస్కారాన్ని తనకివ్వడం పట్ల గోరటి వెంకన్న సంతోషం వ్యక్తం చేశారు. నటుడు ఆర్. నారాయణ మూర్తి.. సుద్దాల హనుమంతు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తల్లిదండ్రులు స్ఫూర్తిని కొనసాగిస్తామంటూ సుద్దాల అశోక్ తేజ తన తండ్రిపై రాసిన గీతాన్ని హనుమంతు కుమార్తె రచ్చ భారతి ఆలపించారు. ఈ కార్యక్రమంలో అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.వి.యల్., సిహెచ్. స్వప్న తదితరులు పాల్గొన్నారు. -
రుణం తీర్చుకునేందుకే అమ్మఒడి
సినీ గేయరచయిత సుద్దాల అశోక్‌తేజ వెల్మజాల (గుండాల) : జన్మభూమి, కన్నతల్లి రుణం తీర్చుకునేందుకే అమ్మఒడి కార్యక్రమాన్ని చేపట్టినట్లు జాతీయ అవార్డు గ్రహీత, సుద్దాల ఫౌండేషన్ చైర్మన్ సుద్దాల అశోక్‌తేజ అన్నారు. గురువారం మండలంలోని వెల్మజాల గ్రామంలో గుర్రం జానకమ్మ, హన్మంతుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన సుద్దాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అమ్మఒడి కార్యక్రమంలో మాతృమూర్తులను సన్మానించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రసవమనే ప్రళయం నుంచి అష్టకష్టాలుపడి మనకు అమ్మ జన్మనిస్తే ఆమెకు కూడు పెట్టని రోజులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు జానకమ్మ, హన్మంతుల పేరిట ఫౌండేషన్ స్థాపించి చంద్రునికో నూలు పోగులాగ తన వంతు సహాయంగా మాతృమూర్తులకు అమ్మ ఒడి, రైతులకు అమ్మ మడి, చిన్నారులకు అమ్మ బడి కార్యక్రమాలు స్థాపించి ప్రోత్సహిస్తున్నట్లు ఆయన తెలిపారు. జన్మనిచ్చిన ఊరుకు, తల్లిదండ్రులకు తగిన గౌరవం కల్పించినప్పుడే సమాజంలో సముచిత స్థానం లభిస్తుందని చెప్పారు. సుద్దాల ఫౌండేషన్ ద్వారా శాశ్వతంగా ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని, తనకు రాజకీయంపై ఎలాంటి ఆశలు లేవని, కేవలం సంఘ సేవకే పరిమితమవుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో 30 మంది మాతృమూర్తులను ఘనంగా సన్మానించారు. ఎంపీపీ సంగి వేణుగోపాల్ యాదవ్, వైస్ ఎంపీపీ కాలె మల్లేషం, స్థానిక సర్పంచ్ మేకల రమేష్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గడ్డమీది పాండరి, సీపీఐ మండల కార్యదర్శి కుసుమని హరిశ్చంద్ర, ప్రజా కవులు రచ్చ భారతి, సునీతారెడ్డి, హరగోపాల్ పాల్గొన్నారు.