breaking news
sudarsanam
-
అభివృద్ధిపై చర్చ హుళక్కేనా?
నేడు జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం స్టాండింగ్ కమిటీల ఏర్పాటుకే ప్రాధాన్యం అధికారులతో పరిచయ కార్యక్రమంతో సరి ఎన్నికల కోడ్ అడ్డంకి మచిలీపట్నం : జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఆదివారం జరుగనుంది. జెడ్పీకి నూతన పాలకవర్గం ఏర్పడిన తరువాత తొలి సమావేశం ఇదే కావడం గమనార్హం. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గద్దె అనూరాధ అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. పాలకవర్గం ఏర్పడిన 60 రోజుల్లోపు సమావేశం నిర్వహించడంతో పాటు స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలనే నిబంధన ఉంది. దీంతో ఆదివారం జెడ్పీ సర్వసభ్య సమా వేశాన్ని నిర్వహిం చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 10గంటలకు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ప్రారంభమవుతుంది. తొలుత సమావేశం నిర్వహించి అనంతరం స్టాండింగ్ కమిటీలకు ఎన్నికలను నిర్వహిస్తారు. మధ్యాహ్నం అధికారులకు జెడ్పీటీసీ సభ్యులు, ఎమ్మెల్యేలతో పరిచయ కార్యక్రమం ఉంటుందని జెడ్పీ సీఈవో డి.సుదర్శనం తెలిపారు. నందిగామ ఉప ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. దీంతో ఆదివారం జరిగే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో అభివృద్ధి కార్యక్రమాలపై ఎంత మేర చర్చ జరుగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ పేరుతో కాకుండా అధికారులతో పరిచయ కార్యక్రమం, ఏయే శాఖలో ఏయే పనులు చేపట్టాలి, ఎంతెంత నిధులు అందుబాటులో ఉన్నాయనే అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్‌లతో పాటు శాసనసభ డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలను ఈ సమావేశానికి ఆహ్వానించినట్లు జిల్లా పరిషత్ అధికారులు తెలిపారు. సమస్యలపై దృష్టి సారిస్తారా ... జిల్లా పరిషత్ సమావేశానికి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులంతా హాజరు కానున్నారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ప్రజా ప్రతినిధులంతా ఒక చోట చేరి జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు దృష్టి సారిస్తారా లేదా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఆగస్టు నెల ముగిసినా శివారు ప్రాంతాలకు ఇంకా సాగునీరు చేరలేదు. ఈ ఏడాది డ్రెయిన్లకు కనీస మరమ్మతులు చేయకపోవడంతో కొద్దిపాటి వర్షానికే డ్రెయిన్లు పొంగి పొర్లుతున్నాయి. రైతుల రుణమాఫీతో పాటు డ్వాక్రా సంఘాల రుణమాఫీ ప్రధాన సమస్యగా మారింది. 2011 జూలై 22వ తేదీ నాటికి గత పాలకవర్గం పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి మూడేళ్ల పాటు ఎన్నికలు జరగకపోవడంతో జిల్లా పరిషత్ ప్రత్యేకాధికారుల పాలనలోనే కొనసాగింది. మూడేళ్ల అనంతరం తొలిసారిగా జెడ్పీ సర్వసభ్య సమావేశం జరగనుంది. జిల్లా పరిషత్ సమావేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను లేవనెత్తేందుకు, పాలకపక్షాన్ని నిలదీసేందుకు ప్రతిపక్ష సభ్యులు సంసిద్ధులుగానే ఉన్నారు. అయితే ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారడంతో ఈ సమావేశం సాదాసీదాగా జరుగుతుందా లేక చర్చకు దారి తీస్తుందా అనే అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. స్టాండింగ్ కమిటీల ఏర్పాటు జిల్లా పరిషత్‌లో ఆర్థిక ప్రణాళిక, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య- వైద్యం, మహిళా సంక్షేమం, సాంఘిక సంక్షేమం, పనుల కమిటీలకు సంబంధించి స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 26వ తేదీన స్టాండింగ్ కమిటీలు దాదాపు ఖరారయినప్పటికీ, సభ్యుల పేర్లను ఆదివారం అధికారికంగా ప్రకటించనున్నారు. -
తొలి విడత...ప్రచారానికి తెర
పరిషత్ పోరు 6న మొదటి విడత పోలింగ్ విజయవాడ, మచిలీపట్నం డివిజన్లలో నిర్వహణ 26 జెడ్పీటీసీ స్థానాలకు 99 మంది పోటీ 450 ఎంపీటీసీలకు బరిలో 1,187 మంది పోలింగ్ కేంద్రాలు 1,437 నేడు సిబ్బందికి ఎన్నికల సామగ్రి అప్పగింత మచిలీపట్నం, న్యూస్‌లైన్ : ప్రాదేశిక ఎన్నికల మొదటి విడత ప్రచారానికి శుక్రవారంతో తెరపడింది. విజయవాడ, మచిలీపట్నం రెవెన్యూ డివిజన్లలోని 26 జెడ్పీటీసీ, 450 ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల ఆరో తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జెడ్పీ సీఈవో, స్థానిక సంస్థల ఎన్నికల రిటర్నింగ్ అధికారి డి.సుదర్శనం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గత నెల 24తో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన అనంతరం మొదటి విడత ఎన్నికలు జరిగే మచిలీపట్నం, విజయవాడ డివిజన్లలో జెడ్పీటీసీ స్థానాలకు 99 మంది, ఎంపీటీసీ స్థానాలకు 1,187 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో అధికంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. విస్తృత ప్రచారం... గత 11 రోజులుగా మొదటి విడత ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు విస్తృత ప్రచారం నిర్వహించారు. మొదటి విడత ఎన్నికలు జరిగే మండలాల్లో ప్రచారానికి చివరిరోజైన శుక్రవారం అభ్యర్థులు, వారి తరఫున నాయకులు పోటాపోటీగా పర్యటించారు. బ్యాలెట్ బాక్సుల్లోనే... జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు బ్యాలెట్ పత్రాల ద్వారానే నిర్వహించనున్నారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి ఆయా మండల పరిషత్ కార్యాలయాల వద్ద ఎన్నికల అధికారులు, సిబ్బందికి సామగ్రిని అప్పగించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్ సీపీ జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థి తాతినేని పద్మావతి పోటీలో ఉన్న తోట్లవల్లూరు జెడ్పీటీసీ స్థానానికి మొదటి విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి. రెండు డివిజన్లలోని 26 మండలాల్లో 11,56,122 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొదటి విడత ఎన్నికలు జరిగే విజయవాడ డివిజన్లో 10, మచిలీపట్నం డివిజన్లో 4 ఎంపీటీసీ స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. 1,437 కేంద్రాల్లో పోలింగ్... మచిలీపట్నం రెవెన్యూ డివిజన్లోని 12 జెడ్పీటీసీ స్థానాలకు, 157 ఎంపీటీసీ స్థానాలకు, విజయవాడ రెవెన్యూ డివిజన్లోని 14 జెడ్పీటీసీ స్థానాలకు, 293 ఎంపీటీసీ స్థానాలకు ఆదివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 1,437 పోలింగ్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. 42 అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని తెలుసుకునేందుకు చర్యలు తీసుకున్నారు. 26 మంది మైక్రో అబ్జర్వర్లు ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పరిశీలించనున్నారు. ఒక్కొక్క పోలింగ్ స్టేషన్‌కు ప్రిసైడింగ్ అధికారి, సహాయ ప్రిసైడింగ్ అధికారితో పాటు మరో ముగ్గురిని నియమించారు. మొత్తం 7,185 మంది సిబ్బందితో పాటు మరికొంతమందిని రిజర్వులో ఉంచారు. పటిష్ట బందోబస్తు... మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ జె.ప్రభాకరరావు, ఏఎస్పీ బీడీవీ సాగర్ నేతృత్వంలో బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుని ఎన్నికలు నిలిచిపోతే ఈ నెల ఏడో తేదీన రీపోలింగ్ నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన అనంతరం మండల కేంద్రంలో బ్యాలెట్ బాక్సులు స్వాధీనం చేసుకుని అక్కడి నుంచి ఆయా డివిజన్ కేంద్రాలకు తరలించి స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరుస్తారు. నగదు, మద్యం జోరు... ఎన్నికల ప్రచారం ముగియటంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఆయా గ్రామాల్లో మద్యం పంపిణీని ప్రారంభించారు. పోటీ తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా ఓటుకు వెయ్యి నుంచి రూ.3 వేల వరకు పంపిణీ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎంపీపీ స్థానం ఆశిస్తున్న అభ్యర్థులు పోటీ చేసే స్థానాల్లో ఓటుకు రూ.3 వేలు వరకు పలుకుతోంది. ఐదారు ఓట్లు ఉన్న కుటుంబంలో వారు నగదు తీసుకోరని భావిస్తే గృహోపయోగమైన వస్తువులను అందిస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా గ్రామాల్లో మద్యం పరవళ్లు తొక్కుతోంది. పురపాలక సంఘ ఎన్నికల అనంతరం చెక్‌పోస్టులలో నిఘా తగ్గించటంతో ఎలాంటి ఆటంకం లేకుండానే మద్యం, నగదు గ్రామాలకు చేరిపోతోంది.