breaking news
Stark Facilities
-
రోగం ముదిరినట్టే
సంగారెడ్డి క్రైం: పేరుకే పెద్దాసుపత్రి.. ఇక్కడ వైద్య సేవలు అంతంతే... ఆపరేషన్ చేద్దామంటే మత్తు మందు ఇచ్చే డాక్టరే లేడు... పురిటి నొప్పులతో వచ్చే వారి బాధలు వర్ణణాతీతం... వసతులు అసలే లేవు... వైద్యులు, సిబ్బంది, బెడ్ల కొరత.. టాయిలెట్‌కు వెళ్లాలంటే క్యూ కట్టాలి... ఆరుబయటే చెట్ల కింద భోజనాలు.. స్ట్రెచర్లు, వీల్చైర్లు మూలకు.. పారిశుద్ధ్యం అధ్వానం.. ఇలా ఒకటేమిటి అన్నీ సమస్యలే.. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి అని ఎక్కడెక్కడి నుంచో వైద్యం కోసం నిరు పేదలు ఇక్కడికి వస్తుంటారు. తీరా వైద్యం అందక ఉసూరుమంటున్నారు. రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నా ఆ మేరకు సేవలు, సౌకర్యాలు ఏ మాత్రం మెరుగు పడలేదు. మూడు దశాబ్దాల నాటి సేవలే ఇంకా కొనసాగుతున్నాయి. ఆసుపత్రి స్థాయిని పెంచుతామని పాలకులు చెబుతున్నా ఆచరణలోకి రావడం లేదు. ‘సాక్షి’ మంగళవారం సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర ఆసుపత్రిని పరిశీలించగా వెలుగు చూసిన వాస్తవాలివి.. మూడు దశాబ్దాల కిందట ప్రతి పాదించి ఏర్పాటు చేసిన జిల్లా కేంద్రాసుపత్రి ఇప్పటికీ అరకొర సౌకర్యాలతోనే కొట్టుమిట్టాడుతోంది. అప్పటికీ ఇప్పటికీ వంద శాతానికిపైగా పెరిగిన రోగుల సంఖ్యకనుగుణంగా సౌకర్యాలను పెంచకపోవడంతో రోగుల అవస్థలు వర్ణణాతీతం. నిత్యం వందల మందికి వైద్య సేవలందిస్తున్న సంగారెడ్డిలోని జిల్లా కేంద్రాసుపత్రిని సాధ్యమైనంత త్వరగా అప్‌గ్రేడ్ చేయాల్సిన ఆవశ్యకత వుంది. గతంలో డిప్యూటీ సీఎం గా పనిచేసిన దామోదర రాజనర్సింహ, ప్రభు త్వ విప్‌గా పనిచేసిన తూర్పు జయప్రకాశ్‌రెడ్డి సంగారెడ్డి ఆసుపత్రిని సందర్శించి ఈ ఆసుపత్రిని కచ్చితంగా అప్ గ్రేడ్ చేయాల్సిన అవసరముందని హామీ ఇచ్చి వెళ్లారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కే సీఆర్ మంత్రివర్గం లో డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో రాజయ్య సైతం ఆసుపత్రిని సందర్శించినప్పుడు ఆయన కూడా ఆసుపత్రిలో ఉన్న రోగు ల సంఖ్య, డాక్టర్లు, అధికారులు చేసిన విజ్ఞప్తి మేరకు ఆసుపత్రిని అప్‌గ్రేడ్ చేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆసుపత్రిని సందర్శిం చిన వారంతా హామీలు ఇవ్వడం తప్పితే అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. ప్రతినెలా 450 డెలివరీలు... ఈ ఆసుపత్రికి సంగారెడ్డి పట్టణ ప్రజలేగాక జిల్లాలోని వివిధ ప్రాంతాలు, రంగారెడ్డి జిల్లాలోని మోమిన్‌పేట, శంకర్పల్లి చుట్టుపక్క గ్రామాల ప్రజలు కూడా వైద్యం కోసం ఇక్కడికి వస్తుంటారు. ప్రతినెలా 450 డెలివరీలు నిర్వహిస్తున్న ఈ ఆసుపత్రిలో సౌకర్యాల కొరత కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. ప్రస్తుతం 250 పడకల ఆసుపత్రిగా ఉన్నా రోజూ ఇక్కడ 400 నుంచి 500 మంది వరకు ఇన్‌పేషంట్లు ఉంటున్నారు. నెలకు 450 డెలివరీలు జరుపుతున్న ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వం కేవలం 30 పడకలు మాత్రమే మంజూరు చేసింది. చాలాసార్లు బెడ్లు లేక కుటుంబ నియంత్రణ చేసుకున్న వారిని, డెలివరీకి వచ్చిన వారిని నేలపై పడుకోబెట్టి చికిత్స అందించిన సందర్భాలు ఈ ఆసుపత్రిలో వున్నాయి. మేల్ సర్జికల్ వార్డులో అధికారికంగా 30 బెడ్లు వుండాలి. కానీ రోగుల సంఖ్య ఎక్కువ ఉండ టంతో అధికారులు ఈ వార్డులో 50 బెడ్ల వరకు వేశారు. ఇదే పరిస్థితి ఫిమేల్ సర్జికల్ వార్డులో కూడా ఉంది. రోగులు ఎక్కువ సంఖ్యలో ఉండటం వల్ల వరండాలో కూడా బెడ్లు ఏర్పాటు చేశారు. టాయిలెట్ల సమస్య.. నిబంధనల ప్రకారం పది మంది రోగులుండే వార్డుకు రెండు టాయిలె ట్లు ఉండాలి. కానీ 40 నుంచి 50 మంది రోగులున్న వార్డుల్లో నాలుగంటే నాలుగే టాయిలెట్లు ఉన్నాయి. ఈ టాయిలెట్లు సరిపోక రోగులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇన్‌పేషంట్ల కోసమే కాకుండా అవుట్ పేషంట్లకు కూడా సరిపోను టాయిలెట్లు లేవు. దాదాపు వెయ్యి నుంచి 1200 మంది వచ్చే ఆసుపత్రికి రెండు టాయిలెట్లు మాత్రమే ఉన్నాయి. రోగులు 50 మంది ఉంటే వారికి సహాయకులుగా మరో 50 మంది వరకు ఉంటారు. ఇలా వంద మందికి నాలుగు టాయిలెట్లు ఎలా సరిపోతాయో అధికారులకే తెలి యాలి. ఉదయం పూట క్యూ కట్టాల్సి వస్తుందని రోగులు, వారి సహాయకులు వాపోతున్నారు. వైద్యుల కొరత ఆసుపత్రిలో ఉండాల్సినంత మంది వైద్యులు ఇతర సిబ్బంది కూడా లేరు. 13 మంది సివిల్ సర్జన్ పోస్టులు మంజూరైనా ఇక్కడ కేవలం ఏడుగురు మాత్రమే పనిచేస్తున్నారు. ఆపరేషన్ సందర్భాల్లో అందుబాటులో ఉండాల్సిన అనస్తీషియా పోస్టు కూడా ఖాళీగా ఉంది. రేడియాలజిస్ట్, డెంటల్‌తోపాటు ఆర్ఎంఓ పోస్టు కూడా ఖాళీగా ఉంది. ప్రస్తుతం ఆర్‌ఎంఓతోపాటు డీసీహెచ్ఎస్ పోస్టుల్లో ఇన్‌చార్జీలే కొనసాగుతున్నారు. మూడు డిప్యూటీ సివిల్ సర్జన్ పోస్టులు మంజూరైతే ఒకే ఒక్క డాక్టర్ పనిచేస్తున్నారు. 18 మంది అసిస్టెంట్ సివిల్ సర్జన్ పోస్టులు మంజూరైతే వాటిలో 15 పోస్టులు భర్తీ అయ్యాయి. -
నిప్పు... ముప్పు
సమస్యల వలయంలో అగ్నిమాపక కేంద్రాలు చాలీచాలని సిబ్బంది.. అరకొర వసతులు పెరగని ఫైర్ స్టేషన్లు నాలుగేళ్లలో 4,861ప్రమాదాలు రూ.141 కోట్ల ఆస్తినష్టం 65 మంది మృత్యువాత ఒక చోట నీరుండదు. ఒక చోట సమయానికి వాహనం ముందుకు కదలదు. మరోచోటు నుంచి సకాలంలో ప్రమాద స్థలికి వాహనం చేరుకోదు. ఇంకోచోట సిబ్బంది కూర్చోడానికి కూడా సదుపాయాలు ఉండవు. సిబ్బంది సంఖ్యా అంతంతే... ఒకేసారి ఒకటి...రెండు చోట్ల ప్రమాదాలు సంభవిస్తే ‘సర్దుకుపోతున్నారు’. పొరపాటున ఈ సంఖ్య నాలుగైదుకు చేరుకుంటే ప్రేక్షక పాత్ర పోషించాల్సిందే. ఇదీ నగరంలోని అగ్నిమాపక శాఖ దుస్థితి. ఈ సమస్యలు ఉన్నాయి కదా అని ప్రమాదాలు రాకుండా ఉంటాయా? ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా ఉంటాయా అనేది వేల కోట్ల ప్రశ్న. వేసవి వచ్చిందంటే మండే ఎండలతో పాటు అగ్ని ప్రమాదాలూ నగర వాసులను భయపెడుతుంటాయి.ఏటా ఏదో ఒక ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అదే స్థాయిలో ఆస్తి, నష్టాలు ఉంటున్నాయి. దీన్ని నివారించడానికి అగ్నిమాపక శాఖ సామర్థ్యం సరిపోవడం లేదు. ముందు జాగ్రత్త చర్యలూ అలాగే ఉంటున్నాయి. సిబ్బంది కొరత... వసతుల లేమి...నీరు దొరక్కపోవడం వంటివి ఆ శాఖను వేధిస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో నాలుగేళ్లలో 4,861 అగ్ని ప్రమాదాలు చే టుచేసుకున్నాయి. రూ.141 కోట్ల ఆస్తినష్టంతో పాటు 65 ప్రాణాలు అగ్నికి ఆహుతైపోయాయి. మెట్రోలతో పోలిస్తే... కోల్‌కతా, ముంబయి, చెన్నై, ఢిల్లీ మెట్రో నగరాల్లో అగ్ని మాపక శాఖకు ఉన్న ఆర్థిక వనరులు, ఫైరింజన్లు, సిబ్బందితో పోలిస్తే హైదరాబాద్ బాగా వెనుకబడి ఉందనడంలో సందేహం లేదు. నిబంధనల మేరకు 50 వేల ఠమొదటిపేజీ తరువాయి జనాభాకు ఒక ఫైర్ స్టేషన్ ఉండాలి. నగరంలో ప్రస్తుతం 16 స్టేషన్లే ఉన్నాయి. ఎప్పుడో 1970 నాటి జనాభాను దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసినవి. ప్రస్తుత జనాభాకు కనీసం 17 స్టేషన్లు అదనంగా అవసరం. 228 మంది ఫైర్‌మెన్ కావాల్సి ఉండగా... 149 మంది మాత్రమే ఉన్నారు. వీరితో పాటు 50 డ్రైవర్ పోస్టులు అవసరం.ఇతర మహా నగరాలతో పోలిస్తే అత్యాధునిక పరికరాలు మాత్రం సమానంగానే ఉన్నాయి. సిబ్బంది, స్టేషన్ల కొరత వల్ల ఉన్న వారిపైనే అధిక భారం పడుతోంది. ఇప్పుడున్న స్టేషన్ పరిధి ప్రకారం ట్రాఫిక్ రద్దీలో వెళ్లేసరికి నష్టం జరిగిపోతోంది. ఆ నాలుగు నెలలే కీలకం... గత మూడేళ్లలో అగ్ని ప్రమాదాలను పరిశీలిస్తే మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లోనే అత్యధిక అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గత ఏడాది మొత్తంలో 1,094 ప్రమాదాలు చోటుచేసుకోగా... ఈ నాలుగు నెలల్లోనే 539 ప్రమాదాలు నమోదయ్యాయి. ప్రతిపాదనలు బుట్టదాఖలు జీహెచ్ఎంసీ పరిధిలో 50 వేల జనాభాకు ఒక స్టేషన్ ఉండాలనేది నిబంధన. ఏటా ఆరు కొత్త స్టేషన్లు నెలకొల్పాలని హైపవర్ కమిటి మూడేళ్ల క్రితం ప్రతిపాదించింది. ఈ లెక్కన ఇప్పటికే 17 కొత్త స్టేషన్లు అందుబాటులోకి రావాల్సి ఉంది. ఒక్క స్టేషన్ కూడా కొత్తగా రాకపోవడం గమనార్హం. ఈ ప్రాంతాలలో తప్పనిసరి... ఎల్బీనగర్, మేడ్చల్, జూబ్లీహిల్స్, టోలిచౌకి, ఉప్పల్ నంచి భువనగిరి వరకు ఏదైనా ప్రాంతంలో ఫైర్ స్టేషన్లు ఏర్పాటు చేస్తే మిగిలిన స్టేషన్లపై భారం తగ్గుతుంది. ఆర్టీఓ అనుమతిస్తేనే... అరకొర సిబ్బందితో కొట్టుమిట్టాడుతున్న ఈ శాఖలో అగ్నిమాపక వాహనాల మరమ్మతులు తలనొప్పిగా మారాయి. చిన్నపాటి మరమ్మతులకైనా రోజుల తరబడి వేచి ఉండాల్సిందే. సంబంధిత ప్రాంతీయ రవాణాధికారి (ఆర్టీఓ) అనుమతిస్తేనే ఆ వాహనం మరమ్మతులకు నోచుకుంటుంది. ఈలోగా ప్రమాదాలు సంభవిస్తే అంతే సంగతులు. అగ్నిమాపక శాఖతో ఎలాంటి సంబంధంలేని ఆర్టీఓ అనుమతి తీసుకోవాల్సి వస్తుంది. దీనికి స్వస్తి చెప్పి... వాహన మరమ్మతులకు ప్రత్యేకంగా నగరంలో వర్క్‌షాప్ ఏర్పాటు చేస్తే ఇబ్బందులు తప్పుతాయి. శాశ్వత భవనాలు లేక... హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో 23 కేంద్రాలకు గాను 14 చోట్ల మాత్రమే శాశ్వత భవనాలు ఉన్నాయి. తాత్కాలిక భవనాలలో... అరకొర సౌకర్యాలతో ఇబ్బందులు పడుతున్నామని సిబ్బంది వాపోతున్నారు. మరుగుదొడ్లు, విశ్రాంతి గదులు లేకపోవడంతో సమస్యలు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. శాశ్వత భవనాల్లోనూ సదుపాయాలు అంతంత మాత్రమే. నీళ్లెక్కడ? గ్రేటర్ పరిధిలోని దాదాపు అన్ని ఫైర్ స్టేషన్లలో నీటి కొరత ఉంది. వాహనంలో నీళ్లు నింపేందుకు వారు కిలో మీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. సొంత భవనాలు ఉన్న చోట సైతం బోర్‌వెల్స్ లేవు. ఎక్కడో ఉన్న వాటర్ వర్క్స్ విభాగంపై ఆధారపడుతున్నారు. కొన్నిచోట్ల ట్యాంక్లే దిక్కు. కనిపించని రక్షణ చర్యలు నగరంలోని వివిధ ముఖ్యప్రాంతాలు, కార్యాలయాల్లో అగ్ని ప్రమాదాల నుంచి రక్షించే ఏర్పాట్లు లేవు. ప్రమాదం సంభవిస్తే భారీ స్థాయిలో నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. 1170 ప్రైవేట్ ఆస్పత్రుల్లో కేవలం 465 ఆస్పత్రులకు మాత్రమే ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లున్నాయి. 707 ఫంక్షన్ హాళ్లకుగాను 34 చోట్ల మాత్రమే ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు చేసి జీహెచ్ఎంసీ నుంచి ఎన్ఓసీ పొందాయి. మిగతావాటికి ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లే లేవు. 123 టింబర్ డిపోలకుగాను కనీసం ఒక్కచోట కూడా అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు లేవు. 6124 వస్త్ర దుకాణాలు, ఇత ర షో రూమ్‌లలో ఒక్క చోట కూడా ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు లేవు. ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు లేని సంస్థలపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు ఏటా ప్రకటనలు చేస్తున్నప్పటికీ, ఇంతవరకు ఎవరిపైనా ఎలాంటి చర్యలు లేకపోవడంతో సంబంధిత యాజమాన్యాలు దీన్ని పట్టించుకోవడం లేదు. నోటీసులిచ్చినా .. ఫైర్‌సేఫ్టీ నిబంధనలు పాటించని భవన యజమానులపై కోర్టులో కేసులు న మోదు చేయడం..న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం మినహా జీహెచ్ఎంసీకి అధికారాల్లేవు. దీంతో సంబంధిత అధికారుల ప్రకటనలకు స్పందిస్తున్న వారు లేరు. అంతేకాదు నోటీసులు, తుది నోటీసులతో హెచ్చరికలు జారీ చేస్తున్నా స్పందించడం లేదు. మరోవైపు నగరంలో బ్యాంకులు, పెట్రోలు బంక్‌లు, పరిశ్రమలు ఎన్ని ఉన్నాయో జీహెచ్ఎంసీ వద్ద లెక్కలు లేకపోవడం గమనార్హం. దీని వల్ల సమస్య అలాగే ఉండిపోతోంది. వాహనాల ప్రత్యేకతలు మలక్‌పేట, మొగల్పురా, చందులాల్ బారాదారి, లంగర్‌హౌస్, ఫిలింనగర్, గౌలిగూడ, ముషీరాబాద్, మౌలాలి, సికింద్రాబాద్, సనత్‌నగర్, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, సాలర్జంగ్ మ్యూజియం, పంజగుట్టలలో ఫైర్ స్టేషన్లు ఉన్నాయి. స్నారికల్ (సికింద్రాబాద్)లో బహుళ అంతస్థులలో ప్రమాదాలు నివారించే స్టేషన్ ఉంది. వీటిలో ఫోమ్ టెండర్, డీసీపీ టెండర్, స్నారికల్ (100 ఫీట్ల ఎత్తు), అజ్మత్, బ్రాంటో స్కై లిఫ్ట్ (54 మీటర్ల ఎత్తు) వాహనాలు ఉన్నాయి. ఇరుకు ప్రాంతాల్లో ప్రమాదాలను అరికట్టడానికి మల్కాజిగిరి ఐడీఏ నాచారం అగ్నిమాపక కేంద్రానికి మిస్ట్జిప్ ఫైర్‌ఇంజన్ (మినీ) అందుబాటులోకి వచ్చిందని స్థానిక ఇన్చార్జి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ రాములు తెలిపారు. 300 లీటర్ల నీరు, 50 లీటర్ల ఫోమ్, పెద్ద ఫైర్ ఇంజన్ సామర్థ్యంతో ఈ మినీ ఫైరింజన్ పని చేస్తుంది. వాటర్ టెండర్.... (పెద్ద ఫైరింజన్) వాటర్ టెండర్ 4500 నీటి సామర్ధ్యం కలిగి ఉంటుంది. పెద్ద అగ్ని ప్రమాదాల సమయంలో దీన్ని ఉపయోగిస్తారు. రసాయనాల కారణంగా ప్రమాదాలు జరిగితే ఫోమ్ బ్రాంచిని ఉపయోగిస్తారు. ఒక కేంద్రంలో ఒక వాటర్ టెండర్‌తో పాటు మొత్తం 16 మంది సిబ్బంది ఉంటారు. అందులో స్టేషన్ ఫైర్ ఆఫీసర్-1, డ్రైవర్లు-3, లీడింగ్ ఫైర్‌మెన్-2, ఫైర్‌మెన్-10 మంది ఉంటారు. బ్రాంటో స్కై లిఫ్ట్ ఈ వాహనాన్ని 2009లో సికింద్రాబాద్ స్టేషన్‌కు తెచ్చారు. ఫిన్‌ల్యాండ్‌కు చెందిన వోల్వో కంపెనీ దీన్ని తయారు చేసింది. 54 మీటర్ల పొడవైన నిచ్చెన దీని ప్రత్యేకత.18 అంతస్తుల్లో అగ్ని ప్రమాదం సంభవించినా...మంటలను అదుపు చేయవచ్చు. ఈ నిచ్చెనకు కేజ్ ఉంటుంది. పై అంతస్తులో మంటల్లో చిక్కుకున్న ఇద్దరిని ఒకేసారి రక్షించి తీసుకుని రావచ్చు.ఇందులో నీళ్లు ఉండవు. మరో ఫైరింజన్లోని నీటితో మంటలను అదుపులోకి తెస్తారు.మంటల వేడి నుంచి, రసాయన చర్యల నుంచి రక్షించే ఫైర్ సూట్ ఇందులో అందుబాటులో ఉంటుంది. ఇలాంటి వాహనాలు రాష్ట్రంలో మూడు ఉన్నాయి. (రంగారెడ్డి, సికింద్రాబాద్, విజయవాడ.) స్నారికల్ వాహనం ఇందులో 18 మీటర్ల ఎత్తులో జరిగే అగ్ని ప్రమాదాలను నివారించేలా నిచ్చెన ఉంటుంది .6 అంతస్తుల వరకు పనిచేస్తుంది.ఇద్దరు వ్యక్తులను ఒకేసారి రక్షించవచ్చు. రాష్ట్రంలో ఈ వాహనం ఒకటి మాత్రమే ఉంది.