breaking news
Srinivas kamineni
-
సీఎంకు సాదర స్వాగతం
విమానాశ్రయం(గన్నవరం) : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు గురువారం స్థానిక విమానాశ్రయంలో సాదర స్వాగతం లభించింది. విజయవాడలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 8.30 గంటలకు ఇక్కడికి చేరుకున్నారు. విమానాశ్రయ లాంజ్ రూమ్‌లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ప్రత్యేక కాన్వాయ్‌లో విజయవాడ వెళ్లారు. విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, జిల్లా మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, వల్లభనేని వంశీమోహన్, కాగిత వెంకట్రావ్, బొండా ఉమామహేశ్వరరావు, బోడే ప్రసాద్, జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ, ఎమ్మెల్సీలు ఐలాపురం వెంకయ్య, కేఎస్ లక్ష్మణరావు, జిల్లా కలెక్టర్ ఎం.రఘునందనరావు, జాయింట్ కలెక్టర్ జె.మురళీ, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు దాసరి వెంకట బాలవర్దనరావు, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, వెలంపల్లి శ్రీనివాస్ తదితరులు స్వాగతం పలికారు. పూర్తిగా రుణాలు పూర్తిగా మాఫీ చేయాలి విమానాశ్రయం బయటకు వచ్చిన ముఖ్యమంత్రికి టీడీపీ నాయకులు ప్రత్యేకంగా తీసుకువచ్చిన రైతులు, డ్వాక్రా సంఘాల మహిళలతో సన్మానం చేయించారు. సీఎంకు పుష్పగుచ్చాలు అందజేసిన పలువురు మహిళలు అభినందనలు తెలిపారు. ఎన్నికల ముందు చేసిన వాగ్ధానం మేరకు రుణాలను పూర్తిగా మాఫీ చేసి తమను అదుకోవాలని పలువురు మహిళలు ముఖ్యమంత్రికి విజ్ఞప్తిచేశారు. -
ఆరోగ్యశ్రీ కార్డులన్నీ తొలగిస్తాం: మంత్రి కామినేని
హైదరాబాద్: రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరును మార్చి త్వరలోనే కొత్త పేరు ఖరారు చేస్తామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న కార్డులన్నింటినీ తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని ఇస్తామని చెప్పారు. అలాగే ఈ పథకంలో రూ. 2 లక్షల ప్యాకేజీని పెంచాలన్న ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. మంత్రి బుధవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ కింద ప్రస్తుతం 938 చికిత్సలు లభిస్తున్నాయని.. వాటిని కూడా పెంచుతామని పేర్కొన్నారు. ఆగస్ట్ 15న ప్యాకేజీ పెంపు, చికిత్సల పెంపుపై సీఎం ప్రకటన చేస్తారని తెలిపారు. జర్నలిస్టులకు కూడా ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తామన్నారు. సెప్టెంబర్ ఒకటి నుంచి ఉద్యోగులకు హెల్త్ కార్డులు జారీ చేస్తామని మంత్రి కామినేని తెలిపారు. జర్నలిస్టులకూ హెల్త్ కార్డులు ఇచ్చే ఆలోచన ఉన్నట్టు మంత్రి వివరించారు. -
51 లక్షల మంది ఆరోగ్యానికి మీరే రక్ష
కాకినాడ క్రైం :‘ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం మీ చేతుల్లోనే ఉంది. అనుకుంటే మీరేదైనా చేయగలరు. మీరు మారాలి’ అంటూ వైద్యులకు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ప్రభుత్వాస్పత్రుల వైద్యులకు సూచించారు. శనివారం కాకినాడలో ఆయన కలెక్టరేట్లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, వైద్య విధాన పరిషత్, జీజీహెచ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోనసీమ, మెట్ట, మైదాన, ఏజెన్సీ వంటి ప్రాంతాలతో వైవిధ్యభరితమైన వాతావరణం కలిగిన జిల్లాలోని 51 లక్షల మంది ఆరోగ్యానికి వైద్యులే బాధ్యులన్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన వ్యాధి ప్రబలే అవకాశం ఉన్నందున వైద్యులు పూర్తి బాధ్యతగా విధులు నిర్వహించాలన్నారు. ఆస్పత్రుల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జబ్బు పడి ఆస్పత్రికి వస్తే కొత్త రోగాల బారిన పడతామనే భావన ప్రజల్లో నెలకొందన్నారు. డ్యూటీ వేళలో విధిగా ఆస్పత్రిలోనే ఉండాలని, నర్సింగ్ హోంలకు వెళ్లవద్దని చెప్పారు. జిల్లాలో బయోమెట్రిక్ విధానం అమలవుతున్నందున ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని చెప్పారు. బాధ్యతారాహిత్యాన్ని సహించబోమని హెచ్చరించారు. ‘సమన్వయం’ ఎక్కడ..? జిల్లా వైద్య సేవల సమన్వయాధికారి (డీసీహెచ్ఎస్), జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారుల మధ్య సమన్వయం కొరవడిందని వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం మండిపడ్డారు. డీసీహెచ్ఎస్ ఇచ్చిన నివేదికలకు, వైద్యాధికారులు చెప్పే వివరాలకు పొంతన లేదన్నారు. ఆస్పత్రి ప్రసవాలు, మాతా శిశు మరణాలు, ఎస్ఎన్సీయూ, ఇమ్యూనైజేషన్, జవహర్ బాల ఆరోగ్య రక్ష, టీబీ, హెచ్ఐవీ/ఎయిడ్స్, అంధత్వ నివారణ, స్కూల్ హెల్త్ తదితర కార్యక్రమాలు అమలవుతున్న తీరుపై ఆరా తీశారు. కలెక్టర్ నీతూ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీఎంఈ డాక్టర్ జి.శాంతారావు, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, జాయింట్ కలెక్టర్ ముత్యాలరాజు, ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.పవన్ కుమార్, డీసీహెచ్ఎస్ డాక్టర్ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులు ఆదర్శం కావడం బాధాకరం.. తాను రంగరాయ వైద్య కళాశాలలో వైద్య విద్యనభ్యసించానని, అప్పట్లో ఆ కళాశాలకు ధీటుగా ఉండాలని కార్పొరేట్ ఆస్పత్రుల యజమానులు ఆకాంక్షించేవారని, ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయని మంత్రి కామినేని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా జీజీహెచ్‌ను తీర్చిదిద్దాలనుకోవడం బాధాకరమన్నారు. కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో రూ.20 కోట్లతో ఏర్పాటు చేయనున్న మెటర్నిటీ చైల్డ్ హెల్త్ (ఎంసీహెచ్) బ్లాకుకు మంత్రి శంకుస్థాపన చేశారు. కాకినాడ సీ పోర్ట్సు లిమిటెడ్ సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన ఐసీయూని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వాస్పత్రి అభివృద్ధికి మరిన్ని నిధులిచ్చి పేదలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు సహకరించాలన్నారు. సీఎస్ఆర్ నిధులను పుష్కలంగా అందిస్తే మెరుగైన సౌకర్యాలు జీజీహెచ్‌లోనే సమకూరుతాయన్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ పి.వెంకట బుద్ధ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ నీతూ ప్రసాద్, ఎంపీ తోట నరసింహం, ఆర్ఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.మహాలక్ష్మి, మెన్స్ హాస్టల్ వార్డెన్ డాక్టర్ కె.లకో్ష్మజీనాయుడు, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, సీ పోర్ట్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రి కామినేనిని పలువురు సత్కరించారు. ఆయన జీజీహెచ్, ఆర్ఎంసీలను పరిశీలించారు. జిల్లా ఇన్చార్జిగా సౌరభ్ జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ కార్యక్రమాల సక్రమ అమలుకు ఐఏఎస్ అధికారులను ఇన్చార్జిలుగా నియమించామని మంత్రి కామినేని వెల్లడించారు. జిల్లాకు సౌరభ్‌ను ఇన్చార్జిగా నియమించామన్నారు. ఆయన నెల నెలా జిల్లాకు వచ్చి అధికారులతో సమీక్షించి తనకు నివేదికలు అందజేస్తారన్నారు. మాతా శిశుమరణాలు పెరిగిపోతున్న దృష్ట్యా ప్రజలకు మంచి చికిత్స, ఆరోగ్యం అందించాలనే లక్ష్యంతో ఇన్చార్జిలను నియమించామన్నారు.