breaking news
Srinagar highway
-
శరవేగంగా శ్రీనగర్–లద్దాఖ్ భారీ టన్నెళ్ల నిర్మాణం
శ్రీనగర్ సోనామార్గ్ నుంచి సాక్షి ప్రతినిధి: భూతల స్వర్గం జమ్మూకశ్మీర్‌కే తలమానికంగా నిలిచే శ్రీనగర్–లద్దాఖ్‌ను కలిపే వ్యూహాత్మక రహదారుల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దేశ రక్షణ వ్యవస్థ బలోపేతానికి ఊపిరిలూదడంతోపాటు స్థానిక పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా చేపట్టిన జెడ్–మోర్, జోజిలా టన్నెల్ ప్రాజెక్టుల నిర్మాణ పనులు కీలక దశకు చేరుకున్నాయి. అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో సముద్రమట్టానికి 11,578 అడుగుల ఎత్తున నిర్మిస్తున్న రెండు టన్నెళ్ల నిర్మాణ పనులను మంగళవారం కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పరిశీలించనున్నారు. నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గుర్జిత్‌సింగ్ కాంబో సోమవారం ఈ విషయాన్ని తెలిపారు. ప్రస్తుత దారులు ఏడాదిలో 5 నెలలు మూతే ప్రస్తుతం శ్రీనగర్ నుంచి లేహ్, లద్దాఖ్‌లను కలిపే రహదారులు రవాణాపరంగా, ఆర్థికపరంగా చాలా క్లిష్టంగా ఉన్నాయి. శ్రీనగర్ నుంచి లేహ్‌కు వెళ్లే రహదారిని ఏడాదిలో 5 నెలలపాటు నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు తెరిచి ఉంచే పరిస్థితులు లేవు. తీవ్రమైన హిమపాతం కారణంగా వాహనాల రాకపోకలకు వీల్లేకపోవడంతో సైనిక వాహనాల రాకపోకలకు సమస్యగా మారింది. అదీగాక ప్రత్యా మ్నాయ మార్గాలన్నీ చైనా, పాకిస్తాన్‌కు సరిహద్దుల్లో ఉండటంతో వాటిని అభివృధ్ధి చేసే పరిస్థితి లేదు. దీంతో వ్యూహాత్మక రహదారుల నిర్మాణం ఆవశ్యకమైంది. ఇందులో భాగంగానే జొజిలా, జెడ్–మోర్ టన్నెల్ నిర్మాణాలు తెరపైకి వచ్చాయి. తగ్గనున్న రవాణా భారం... సోనామార్గ్ నుంచి కార్గిల్ మీదుగా లేహ్, లద్దాఖ్‌కు రెండు సొరంగ మార్గాలను కేంద్రం సుమారు రూ. 7 వేల కోట్లతో నిర్మిస్తోంది. వాటితో శ్రీనగర్–లేహ్ మధ్య ప్రయాణ సమయం 6.5 గంటలుSతగ్గుతుంది. ఇందులో జెడ్–మోర్ టన్నెల్ వ్యయం రూ. 2,300 కోట్లుకాగా జోజిలా వ్యయం రూ.4,600 కోట్లు. జోజిలా ప్రాజెక్టును మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా (ఎంఈఐఎల్) దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు కింద 14.15 కి.మీ. మేర టన్నెల్, 18.5 కి.మీ. మేర అప్రోచ్ రోడ్డు నిర్మించాల్సి ఉంటుంది. రెండు వైపులా వాహనాల రాకపోకలకు ఉపయోగపడేలా నిర్మించే టన్నెల్ మార్గం ఎత్తు 7.57 మీటర్లుగాను, వెడల్పు 9.5 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఈ సొరంగ మార్గం పూర్తయితే మూడు గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. ప్రస్తుతం టన్నెల్ తవ్వకం పనులు సుమారు 500 మీటర్ల వరకూ పూర్తయ్యాయి. దీన్ని 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇది అందుబాటులోకి వస్తే ఆసియాలోనే అతిపెద్ద అండర్ టన్నల్‌గా చరిత్రకు ఎక్కనుంది. హైటెక్నాలజీతో మేఘా ప్రాజెక్టు సాధారణ రోడ్డుకు భిన్నంగా జోజిలా ప్రాజెక్టును ఎంఈఐఎల్ సంస్థ నిర్మిస్తోంది. ఈ రోడ్డు నిర్మాణానికి పాలిస్టైరిన్ వినియోగిస్తోంది. మంచు కారణంగా రోడ్డు పాడవకుండా ఈ పాలిస్టైరిన్ కాపాడుతుంది. హిమాలయాల్లో ఈ టెక్నాలజీతో అన్ని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రోడ్డు ఉంటుంది. పాలి స్టైరిన్‌తోపాటు రోడ్డుపై మంచు చేరకుండా స్నోగ్యాలరీలను నిర్మిస్తున్నారు. యూరోపియన్ ప్రమాణాలకు అనుగుణంగా అధునాతన భద్రతా వ్యవస్థతో ఎంఈఐఎల్ ఈ మార్గాన్ని చేపడుతోంది. ఇందులో ఎమర్జెన్సీ లైటింగ్, ఆటోమెటిక్ లైటింగ్, మెసేజ్ సిగ్నలింగ్, ఎమెర్జెన్సీ టెలిఫోన్, రేడియా ఏర్పాటు చేస్తున్నారు. ఈ మార్గంలో గంటకు 80 కి.మి. వేగంతో ప్రయాణించవచ్చు. -
350 మందిని రక్షించిన ఆర్మీ
శ్రీనగర్/జమ్మూ: విపరీతమైన మంచు కారణంగా 15,500 అడుగుల ఎత్తులో చిక్కుకున్న సుమారు 350 మందిని ఆర్మీ రక్షించింది. ఈ మేరకు శుక్రవారం రక్షణ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ రాజేశ్ కలియా వెల్లడించారు. శ్రీనగర్–లేహ్ జాతీయ రహదారిపై ఉన్న జోజిలా పాస్ వద్ద వీరంతా చిక్కుకున్నట్లు తెలిపారు. గురువారం నుంచి మంచు విపరీతంగా పడడంతో రోడ్లు మూసుకొని పోయి వాహనాల్లో ఇరుక్కుపోయారు. బయట ఉష్ణోగ్రతలు –7కు పడిపోయాయి. దాదాపు 250 ట్రక్కులు ఈ ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయాయి. ఆర్మీ, పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం కలసికట్టుగా రాత్రంతా శ్రమించి వీరిని రక్షించారు. ప్రభుత్వం ద్వారా వారి జాడను తెలుసుకున్న ఆర్మీ వారిని రక్షించి, వేడి ఆహారాన్ని, దుప్పట్లను అందించింది. మరోవైపు పోలీసులు, జీఆర్ఈఎఫ్ సిబ్బంది రోడ్డుపై పేరుకున్న మంచు తొలగిస్తూ, ట్రాఫిక్ మళ్లించే ఏర్పాట్లు చేశారు. ఆర్మీ వెనువెంటనే తీసుకున్న నిర్ణయం వల్ల వీరు సురక్షితంగా బయటపడ్డారు. -
కశ్మీర్ సరిహద్దులో కలకలం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ సరిహద్దులో పెద్ద ప్రమాదం తప్పింది. రద్దీగా ఉండే జమ్ము సరిహద్దు ప్రాంతంలో అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడి) భద్రతా దళాలు కనుగొన్నాయి. శ్రీనగర్ ముజఫరా బాద్ హైవేపై, కల్వర్ట్ కింద అమర్చిన ఈ పేలుడు పరికరాన్ని గమనించామని రోడ్ ఓపెనింగ్ పార్టీ రక్షక దళాలు తెలిపాయి. రొటీన్ గా నిర్వహించే తనిఖీల్లో భాగంగా ఈ భారీ పేలుడు పదార్థాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నాయి. దీన్ని నిర్వీర్యం చేయడంతో ఆ మార్గంలో పెద్ద ప్రమాదం తప్పిందని పేర్కొన్నాయి.