breaking news
srimahavisnuvu
-
2016 ఆరు శత్రువులపై గెలుపు మొదలెట్టండి!
బాహ్యశత్రువులను జయించాలంటే అంగబలం, అర్థబలం ఉంటే చాలు. కానీ, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే అంతఃశత్రువులను జయించడం ఆషామాషీ కాదు. ఈ ఆరు అంతఃశత్రువుల ప్రభావంలో పడి పతనమైన ఆరుగురు పురాణ పురుషుల గురించి సోదాహరణంగా తెలుసుకుందాం... హిరణ్యకశిపుడు- క్రోధం సాక్షాత్తు శ్రీమహావిష్ణువు మీద ద్వేషంతో అనవసర క్రోధాన్ని పెంచుకున్న హిరణ్యకశిపుడు తన కొడుకు ప్రహ్లాదుడు నిరంతర హరినామ స్మరణలో మునిగి తేలుతూండటంతో అతడి క్రోధం అదుపు తప్పింది. కొడుకును ఎలాగైనా తన దారిలోకి తెచ్చుకోవాలనే పిచ్చికోపంతో ప్రహ్లాదుడికి క్రూరమైన శిక్షలు విధిస్తాడు. విష్ణువు అనుగ్రహం వల్ల ప్రహ్లాదుడికి ఆ శిక్షల వల్ల ఎలాంటి బాధ కలుగదు సరికదా, అతడి భక్తిపారవశ్యం రెట్టింపవుతుంది. ఇదంతా హిరణ్యకశిపుడికి మరింత క్రోధ కారణమవుతుంది. ‘ఎక్కడుంటాడురా నీ శ్రీహరి? ఈ స్తంభంలో ఉంటాడా..?’ అంటూ ఎదుటనే ఉన్న స్తంభాన్ని గదతో మోదుతాడు. స్తంభాన్ని చీల్చుకుని వచ్చిన నరసింహుడి చేతిలో అంతమైపోతాడు. దుర్యోధనుడు- లోభం అతి లోభం వల్ల నాశనమైన వాళ్లకు దుర్యోధనుడే పెద్ద ఉదాహరణ. రాజ్యమంతా తనకే దక్కాలనేది దురాశ. పాండవుల బలపరాక్రమాలు, కీర్తిప్రతిష్టలపై అమితంగా ఈర్ష్య చెందేవాడు. తమ్ముడు దుశ్శాసనుడు, మామ శకుని, మిత్రుడు కర్ణుడి అండతో అతడి లోభం పాండవులకు సూదిమొన మోపినంత నేలనైనా ఇవ్వబోనని తెగేసి చెప్పేటంతగా ముదిరి, యుద్ధానికి తెగిస్తాడు. యుద్ధంలో భీముడి చేతిలో దుర్యోధనుడి తొంభైతొమ్మిది మంది సోదరులూ నిహతులవుతారు. ప్రాణభీతితో మడుగులో దాగిన దుర్యోధనుడిని కవ్వించి, యుద్ధానికి పిలిచి భీముడితో తలపడేలా చేస్తాడు కృష్ణుడు. భీముడి గదాఘాతాలకు తొడలు విరిగి, నిస్సహాయంగా మరణిస్తాడు. ధృతరాష్ట్రుడు- మోహం కొడుకుల మీద మితిమీరిన మోహంతో ధృతరాష్ట్రుడు నాశనమయ్యాడు. దుర్యోధనుడు సహా తన వందమంది కొడుకుల మీద వల్లమాలిన వ్యామోహం ఆ గుడ్డిమహారాజుది. పాండవుల పట్ల తన కొడుకులు సాగించే అకృత్యాలను ఏనాడూ అతడు అరికట్టలేదు. దుర్యోధనుడిని ఎలాగైనా రాజ్యాభిషిక్తుడిని చేయాలనే కోరికతో కొడుకులను అదుపులో ఉంచే ప్రయత్నాలు చేయలేదు. కురుసభలో సాక్షాత్తు శ్రీకృష్ణుడు విశ్వరూప ప్రదర్శన చేసినా, ధోరణి మార్చుకోలేదు. పాండవుల సంధి ప్రతిపాదనను తన కొడుకు దుర్యోధనుడు తోసిపుచ్చినప్పుడు అడ్డుచెప్పలేదు. నిండుసభలో దుశ్శాసనుడు ద్రౌపదీ వస్త్రాపహరణానికి తెగబడితే మందలించకపోవడం కురుక్షేత్ర యుద్ధానికి కారణమైంది. కురుక్షేత్ర రణరంగంలోని యుద్ధ విశేషాలను సంజయుడి ద్వారా తెలుసుకుంటూ, తన కొడుకుల మరణ వార్తలు వింటూ వగచి వగచి కుములుతాడు మోహపీడితుడైన ధృతరాష్ట్రుడు. రావణుడు- మదం రావణుడు సకల వేదశాస్త్ర పారంగతుడు. అయితే, శివుడి వల్ల పొందిన వరాల బలం వల్ల పూర్తిగా మదాంధుడయ్యాడు. అనవసరపు మదాంధతతోనే సీతను అపహరించి తన లంకలోని అశోకవనంలో బంధిస్తాడు. సముద్రాన్ని లంఘించి, సీత జాడను కనుగొన్న హనుమంతుడు హితవు చెప్పబోతే, మదంతో అతడి తోకకు నిప్పంటిస్తాడు. రామభక్తుడైన హనుమ లంకాదహనం చేసి మరీ హెచ్చరించినా పెడచెవిన పెడతాడు. హితబోధ చేసిన తమ్ముడు విభీషణుడిని తరిమేస్తాడు. వానరసేనతో రామలక్ష్మణులు లంకను చుట్టుముట్టినా, బుద్ధితెచ్చుకోక యుద్ధానికి సిద్ధపడతాడు. చివరకు రామబాణానికి నేలకూలతాడు రావణ బ్రహ్మ. విశ్వామిత్రుడు- మాత్సర్యం బ్రహ్మర్షి అయిన వశిష్టుడి పట్ల ఎనలేని మాత్సర్యం విశ్వామిత్రుడిది. ఆ మాత్సర్యంతోనే అతడికి పోటీగా బ్రహ్మర్షి కావాలనే సంకల్పంతో తపోదీక్షలో ఉన్న విశ్వామిత్రుడి వద్దకు మేనకను పంపుతాడు ఇంద్రుడు. మేనకపై మోహంలో మునిగిపోవడంతో తపోభ్రష్టుడవుతాడు. విశ్వామిత్రుడు మళ్లీ తపస్సు మొదలుపెడతాడు. ఇంద్రుడు ఈసారి రంభను పంపుతాడు. తపోభంగానికి వచ్చిన రంభను చూసి విశ్వామిత్రుడు కోపం పట్టలేక వెయ్యేళ్లు రాయిగా పడి ఉండాలంటూ ఆమెను శపిస్తాడు. ఆగ్రహాన్ని అణచుకోలేకపోవడం వల్ల మళ్లీ తపోభ్రష్టుడవడంతో మరోసారి తపోదీక్ష పడతాడు. పరీక్షలన్నింటినీ తట్టుకుని తపస్సు కొనసాగిస్తాడు. చివరకు బ్రహ్మ స్వయంగా విశ్వామిత్రుడిని బ్రహ్మర్షిగా ప్రకటిస్తాడు. మాత్సర్యం వల్ల భంగపాటు ఎదుర్కొన్న విశ్వామిత్రుడు, ఆ అవలక్షణాన్ని విడనాడిన తర్వాతే తన లక్ష్యాన్ని సాధించగలిగాడు. కీచకుడు- కామం కామం వల్ల కీచకుడు నాశనాన్ని కొనితెచ్చుకున్నాడు. కీచకుడు విరాటరాజుకు బావమరిది. రాజ్యం విరాటరాజుదే అయినా, పెత్తనం మాత్రం సేనాధిపతి అయిన కీచకుడిదే. రాజుకు సైతం తనను నియంత్రించే శక్తి లేకపోవడంతో కీచకుడు సాగించిన అకృత్యాలకు, అరాచకాలకు అంతులేదు. కీచకుడి ఆగడాలు అలా కొనసాగుతుండగానే, కుంజరయూధం దోమ కుత్తుక జొచ్చినట్లుగా పంచపాండవులు ద్రౌపదీ సమేతంగా అజ్ఞాతవాసం కోసం విరాటరాజు కొలువులో వివిధ మారువేషాల్లో చేరుతారు. ద్రౌపది సైరంధ్రిగా అంతఃపురం చేరి, రాణి సుధేష్ణకు సేవలు చేస్తూ ఉండేది. కన్నూమిన్నూ కానని కామంతో కీచకుడు ద్రౌపదిని వేధిస్తాడు. చివరకు నిండు కొలువులోనే ఆమెను చెరబట్టేందుకు బరితెగిస్తాడు. ద్రౌపది తెలివిగా అతడిని నర్తనశాలకు రప్పిస్తుంది. కీచకుడు వచ్చేవేళకు అప్పటికే అక్కడ చీకటిలో కాచుకుని ఉన్న భీముడు అతడిని చప్పుడు కాకుండా మట్టుబెడతాడు. -
నయనమనోహరం శ్రీమహావిష్ణువు అలంకారం
కనులపండువగా శ్రీవారి శాంతికల్యాణం శ్రీమహావిష్ణువుగా దర్శనమిచ్చిన వెంకటేశ్వరుడు ఆలయంలో పుష్పపరిమళాల శోభ కోడూరు : ‘గోవిందా.. గోవిందా..’ నామస్మరణతో వెంకటేశ్వరస్వామివారి ఆలయప్రాంగణం ప్రతిధ్వనించింది. కోడూరులో వేంచేసియున్న శ్రీశ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామివారి 18వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం స్వామివారి శాంతి కల్యాణాన్ని కనులపండువగా నిర్వహించారు. తిరుమలకు చెందిన కోగంటి రామానుజాచార్యులు మంత్రవచనాల మధ్య జరిగిన ఈ కళ్యాణమహోత్సవానికి కోడూరు చెందిన అద్దెపల్లి మోహన్‌బాబు, విజయవాడకు చెందిన అరపల్లి ప్రవీణ్‌కుమార్ దంపతులు కల్యాణకర్తలుగా వ్యవహరించారు. టీటీడీ ధర్మప్రచార పరిషత్ జిల్లా సభ్యులు మొవ్వ రఘశేఖరప్రసాద్ కల్యాణ ఘట్టం గురించి భక్తులకు వివరించారు. వివిధ ప్రాంతాల నుంచి కల్యాణం తిలకించేందుకు వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. ముందుగా స్వామివారి మూలమూర్తులకు మంగళాశాసనం నిర్వహించి, వేదపండితుల పర్యవేక్షణలో పుష్పార్చన కార్యక్రమాన్ని భక్తిప్రపత్తులతో చేశారు. మల్లెపూలతో శ్రీమహావిష్ణు అలంకారం.. బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు శ్రీవెంకటేశ్వరస్వామివారి మూలమూర్తిని మల్లెపూలతో శ్రీమహావిష్ణుగా అలంకరించారు. ఆలయ ప్రధానార్చకులు ధుంబాల శ్రీధరాచార్యుల పర్యవేక్షణలో వివిధ రకాల పుష్పాలతో స్వామివార్లను శ్రీమహావిష్ణువుగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అలంకారంలో స్వామివారు గధ ధరించినట్లు ఏర్పాటు చేసి, బంతిపువ్వులుతో మకరతోరణాన్ని అలంకరించారు. మేల్కోట తరహాల్లో స్వామివార్లను అలంకరించినట్లు ప్రధానార్చకులు తెలిపారు. పోలీస్ అధికారులు సమకుర్చిన వివిధ రకాల పుష్పాలతో ఆలయాన్ని నయనమనోహరంగా తీర్చిదిద్దారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శ్రీవారి విద్యుత్ చిత్రపటం భక్తులను ఆకట్టుకుంది. రాత్రికి ఆలయ కల్యాణమండలంలో కోట వారి వంశీయులచే సహస్రదీపాలంకరణ సేవ నిర్వహించారు. దీపాలంకరణసేవలో దీపాలు వెలిగించడానికి కోడూరు, కృష్ణాపురం, యర్రారెడ్డివారిపాలెం, ఇస్మాయల్బేగ్పేట తదితర గ్రామలకు చెందిన మహిళలు పోటెత్తారు. అనంతరం స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఒక్కో ప్రదక్షణకు.. ఒక్కో వాయిద్యంతో..భక్తుల హరినామ సంకీర్తనల మధ్య ద్వాదశ ప్రదక్షణాలు భక్తిప్రపత్తులతో జరిపారు. అనంతరం స్వామివార్లను ఆలయ ప్రవేశం చేయించి శ్రీపుష్పయాగం, స్వామివారికి దేవే రులతో కలిసి పవళింపు సేవ కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. నేటి కార్యక్రమాలు.. బ్రహ్మోత్సవాల ముగింపును పురస్కరించుకుని ఆదివారం ఉదయం ఆలయ ప్రాంగణంలో విష్ణు సహస్రనామ అర్చన నిర్వహిస్తారు. అనంతరం లక్ష మల్లెలతో స్వామివారికి అర్చన చేసి ఉత్సవాలు ముగించనున్నట్లు ఆలయ ధర్మకర్త కోట పద్మావతి వరప్రసాద్ తెలిపారు. -
నేడు సూర్య, చంద్ర ప్రభ ఉత్సవాలు
కదిరి, న్యూస్‌లైన్: లోకం.. పుట్టడం, జీవించడం, మరణించడం అనే మూడు ప్రక్రియలు కాలాధీనాలు. ఆ కాల స్వరూపుడుని తానే అంటూ భక్తులకు చాటి చెప్పేందుకు నారసింహుడు మంగళవారం పగలు సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనాలను అధిష్ఠించి భక్తులకు దర్శనమిస్తారు. సూర్య మండల మధ్యస్థుడైన శ్రీమహావిష్ణువుకు నారాయణుడనే పేరు కలదు. పగటికి సూర్యుడు రారాజు. రేయికి చంద్రుడు అధిపతి. సృష్ఠికి ఎంతో ముఖ్యమైన ఈ రాత్రింబవళ్లను శ్రీమహావిష్ణువు రెండు కళ్లుగా కలిగివుండి వాటిని వాహనాలుగా చేసుకొని సృష్ఠిలో సర్వం తానే అని చాటిచెప్పడానికి తిరువీధుల్లో ఊరేగుతారు. సాధారణంగా ఉదయం గ్రామోత్సవం నిర్వహించి రాత్రి సమయంలో మాత్రమే శ్రీవారి విహారానికి వాహనం వినియోగిస్తారు. అయితే రెండు వాహనాల్లో విహరించడం నేటి ఉత్సవ ప్రత్యేకత. ఉదయం యాగశాల ప్రవేశం, నిత్య హోమాలతో ప్రారంభ మై శ్రీవారి తిరువీధుల్లో సూర్య ప్రభ ఉత్సవం జరుగుంది. రాత్రి విశేష అలంకరణలతో నారసింహుడు చంద్ర ప్రభ వాహనంపై తిరువీధుల్లో విహరిస్తారని ఆలయ సహాయ కమిషనర్ పట్టెం గురుప్రసాద్ పేర్కొన్నారు.