breaking news
Sridhar Goud
-
అతనిపై పీడీ యాక్ట్ తప్పు కాదు
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ అనుచరుడు శ్రీధర్‌గౌడ్‌ను తెలంగాణ పోలీసులు పీడీ యాక్ట్ కింద నిర్బంధంలోకి తీసుకోవడంలో ఎటువంటి తప్పులేదని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. శ్రీధర్‌గౌడ్ వంటి వ్యక్తులు సాధారణ చట్టాలకు భయపడే పరిస్థితి లేదని, అటువంటి వారిపై పీడీ యాక్ట్ ప్రయోగమే సరైన చర్యని అభిప్రాయపడింది. శ్రీధర్‌గౌడ్‌పై పీడీ యాక్ట్ ప్రయోగించ డాన్ని సవాలు చేస్తూ అతని భార్య ఎన్.శ్రీలత దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్, జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. శ్రీధర్‌గౌడ్‌పై పీడీ యాక్ట్ ప్రయోగిస్తూ రాచకొండ కమిషనర్ 2016లో ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని తెలంగాణ ప్రభుత్వం ఆమోదిస్తూ 2017 జనవరి 5న జీవో జారీ చేసింది. అనంతరం పీడీ యాక్ట్ కింద శ్రీధర్‌గౌడ్‌ను నిర్బంధిం చడాన్ని సలహా బోర్డు కూడా ధ్రువీకరిం చింది. వీటన్నింటిపై శ్రీధర్ గౌడ్ భార్య శ్రీలత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన భర్తను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించా లంటూ హెబియస్ కార్పస్ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా హోంశాఖ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, 2016 జనవరి నుంచి ఆగస్టు వరకు శ్రీధర్‌గౌడ్ 8 నేరాలు చేశారన్నారు. నేరాలకు పాల్పడటం శ్రీధర్‌గౌడ్ అలవాటు చేసుకున్నారని, దీని వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందన్నారు. నయీమ్ ఎన్కౌంటర్ తరువాత కూడా శ్రీధర్‌గౌడ్ తన తీరును మార్చుకోలేదన్నారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, శ్రీధర్ చర్యలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఉన్నాయంది. పోలీస్ కమిషనర్, ప్రభుత్వం అనాలోచితంగా నిర్బంధ ఉత్తర్వులు జారీ చేయలేదని తెలిపింది. ఈ ఉత్తర్వుల్లో ఎటువంటి తప్పులేదంటూ శ్రీలత పిటిషన్‌ను కొట్టేసింది. -
నయీమ్ నమ్మినబంటు శ్రీధర్‌గౌడ్!
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ కాలంపాటు తనను తాను రక్షించుకోవడానికే శక్తియుక్తుల్ని వినియోగించిన గ్యాంగ్‌స్టర్ నయీమ్.. దాదాపు గత ఏడేళ్లపాటు ధనార్జనే ధ్యేయంగా పని చేశాడు. ఈ నేపథ్యంలో ఎవరినీ పూర్తిస్థాయిలో నమ్మేవాడు కాదు. వనస్థలిపురం పరిధిలోని తుర్కయాంజాల్‌కు చెందిన శ్రీధర్‌గౌడ్‌కు మాత్రమే తన ప్రధాన ‘డెన్’ వివరాలు తెలిపాడు. ఇతడే టార్గెట్ల ‘రవాణా’ బాధ్యతలు చూసుకునేవాడు. అలాగే నయీమ్ తన చేతిలో హతమైన వారి ‘అంత్యక్రియల’ సమయంలో మహిళా అనుచరులతో నల్లవస్త్రాలు ధరింపజేసేవాడని తెలిసింది. పోలీసుల విచారణలో నయీమ్ భార్య హసీనా బేగం పలు కీలక అంశాలను వెల్లడించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ‘కీలక ఘట్టాలన్నీ’ షాద్‌నగర్ ఇంట్లోనే.. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లోని మిలీనియం టౌన్షిప్లో తన సమీప బంధువు సయ్యద్ సాదిఖ్ పాషా పేరుతో ఉన్న ఇంటినే నయీమ్ తన ప్రధాన డెన్‌గా వినియోగించుకున్నాడు. ఇంట్లో తన సమీప బంధువు మతీన్ కుటుంబాన్ని ఉంచి.. టార్గెట్లను బెదిరించడంతోపాటు కీలక వ్యవహారాలూ ఇక్కడ నుంచే నెరపేవాడు. అత్యంత అరుదైన సందర్భాల్లో తప్ప సాధారణంగా కుటుంబీకుల్ని అక్కడకు తీసుకువెళ్లేవాడు కాదు. ‘మామిడి’ అనే పేరు పెట్టిన ఈ ఇంటి వివరాలను అందరికీ తెలియనీయలేదు. ప్రతి ఒక్కరినీ అనుమానించే నయీమ్.. యాక్షన్ టీమ్ సభ్యులతోపాటు తనకు నమ్మిన బంటుగా ఉన్న శ్రీధర్‌గౌడ్‌కు మాత్రమే ఇంటి గురించి చెప్పాడు. టార్గెట్లను తొలుత అనుచరుల ద్వారా, ఆపై ఫోన్లో బెదిరించేవాడు. అవసరమైతే వారిని ‘మామిడి’కి రప్పించి ‘గడాఫీ సైన్యం’ మధ్యలో కూర్చుని బెదిరించే వాడు. రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి చెందిన వారినైనా ఎల్బీ నగర్ మీదుగానే షాద్‌నగర్‌లోని డెన్‌కు రప్పించేవాడు. టార్గెట్లను అనుచరులు ఎల్బీనగర్ వరకు తీసుకొస్తారు. అక్కడి నుంచి వారి కళ్లకు గంతలు కట్టి, షాద్‌నగర్‌కు తరలించేది మాత్రం శ్రీధర్‌గౌడ్ అని తెలిసింది. శ్రీధర్‌గౌడ్ ఈ దందాల్లో ‘రెడ్డి భయ్యా’గా చెలామణి అయ్యాడని వెల్లడైంది. ఆ సమయంలో వారంతా నల్లవస్త్రాల్లో.. అనుమానం, విభేదాలు, అసహనం.. కారణమేదైనా నయీమ్ సమాధానం మాత్రం హత్యే. సొంత బావతోపాటు అనేక మంది పసి పిల్లలు, పని పిల్లల్ని తన ఇంట్లోనే కుటుంబీకులతో కలసి దారుణంగా చంపేవాడు. హత్యలు చేసిన తర్వాత మృతదేహాలను స్వయంగా తీసుకువెళ్లే నయీమ్.. నిర్మానుష్య ప్రాంతాల్లో కాల్చేయడమో, శివార్లలో పూడ్చేయడమో చేసేవాడు. అంత్యక్రియల కోసం మృతదేహాలను రవాణా చేసే సమయంలో మాత్రం తన వెంట ‘గడాఫీ సైన్యాన్ని’ తీసుకెళ్లేవాడు. ఆ సమయంలో వారు కచ్చితంగా నల్లరంగు వస్త్రాల్లో ఉండాలని స్పష్టం చేసేవాడు. అక్క సలీమా బేగం రెండో భర్త నదీం, పని పిల్ల నస్రీన్లను అల్కాపురి టౌన్‌షిప్‌లోని ఇంట్లో చంపిన నయీమ్.. నల్లవస్త్రాల్లో ఉన్న మహిళా అనుచరులతో వెళ్లి మృతదేహాల అంత్యక్రియలు నిర్వహించాడని వెలుగులోకి వచ్చింది. ‘మావో’ల కనుమరుగు తర్వాతే ధనార్జన మావోయిస్టు పార్టీలో చేరడం.. పోలీసులకు కోవర్ట్‌గా మారడం.. మావోయిస్టు నేత ఈదన్న హత్యతోపాటు ఇతర పరిణామాల నేపథ్యంలో ఉద్యమం నుంచి బయటకు రావడంతోపాటు మావోయిస్టుల్ని అంతం చేస్తానంటూ నయీమ్ ప్రకటించాడు. దీంతో అతడు మావోయిస్టులకు టార్గెట్‌గా మారాడు. ఈ నేపథ్యంలో తనను తాను కాపాడుకోవడంపైనే దృష్టిపెట్టాడు. 2008 తర్వాతే నయీమ్ దృష్టి ధనార్జనపై పడింది. అప్పటికి రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో తన అనుచరగణాన్ని పెంచుకుని, శత్రువుల్ని తుంచేయడంతో డబ్బు పైనే దృష్టి కేంద్రీకరించి సంపాదించడం ప్రారంభించాడు. -
నయీమ్ అనుచరులను చర్లపల్లికి తరలింపు
పోలీసులు అరెస్టు చేసిన నయీమ్ అనుచరులు శ్రీధర్ గౌడ్, బలరాంలను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. కోర్టు ఇచ్చిన 5 రోజుల పోలీస్ కస్టడీ ముగియడంతో సోమవారం వీరిని హయత్ నగర్ కోర్టులో హాజరు పరిచిన వనస్థలిపురం పోలీసులు తదనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు. కాగా.. నయీం కేసులో ప్రధాన నిందితుడు టెక్ మధుని పిటి వారెంట్ మీద నల్లగొండ జైలు నుంచి తరలించారు. సోమవారం మధును సైతం హయత్ నగర్ కోర్టులో హాజరు పరిచారు.