breaking news
Sri Padmavathi Amman
-
లోక జననీ నమస్తే!
తిరుచానూరు: తిరుచానూరులో కొలువైన లక్ష్మీ స్వరూపిణియైన శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం వరలక్ష్మీవ్రతం వేడుకగా జరిగింది. ప్రతి ఏటా శ్రావణ పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని నోచుకోవడం సంప్రదాయం. పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశించిన వరలక్ష్మీ వ్రతాన్ని నోచుకోవడం వల్ల శుభం కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది. అందులోనూ వరాలు ప్రసాదించే వరప్రదాయిని, సిరులతల్లి లక్ష్మీదేవి స్వరూపిణి, నిండు ముత్తయిదువైన శ్రీవారి ధర్మపత్ని పద్మావతీ అమ్మవారి చెంత వ్రతం నోచుకుంటే సిరిసంపదలు, దీర్ఘసుమంగళి, సత్సాంతానం కలుగుతుందన్నది భక్తుల నమ్మకం. ఇందులోభాగంగా అమ్మవారిని వేకువజామున 1.30 గంటలకు సుప్రభాతంతో మేల్కొల్పి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. 3.30 గంటలకు అమ్మవారి మూలవర్లు, ఉత్సవర్లకు ఆలయ అర్చకులు అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని వజ్రవైఢూర్య ఆభరణాలతో అలంకరించి, ఉదయం 8 గంటలకు సన్నిధి నుంచి ఆస్థాన మండపంలోని వ్రతమండపానికి వేంచేపుగా తీసుకొచ్చి కొలువుదీర్చారు. తరువాత అమ్మవారి ఎదుట కలశాన్ని ఉంచి అందులో నారికేళాన్ని ప్రతిష్టించారు. దానికి చెవులు, కన్ను, ముక్కు ఏర్పాటు చేశారు. అనంతరం పాంచరాత్య్ర ఆగమ శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు కలశంలోకి వరలక్ష్మీని ఆవాహనం చేసి, షోడశోపచార పూజలు నిర్వహించారు. రక్షకట్టిన తరువాత పసుపు, కుంకుమ, పూలతో వ్రతం నిర్వహించి, వ్రత మహత్యాన్ని తెలిపే కథను వినిపించారు. అధిక సంఖ్యలో దంపతులు పాల్గొన్నారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయం, పరిసర ప్రాంతాల్లో భక్తుల రద్దీతో ఏర్పడింది. గత అనుభవాల దృష్ట్యా ఈ ఏడాది ఆస్థాన మండపం వద్ద ప్రత్యేక బారీకేడ్లు ఏర్పాటు చేయడంతో తోపులాటలు జరగలేదు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో ఎంజీ.గోపాల్, తిరుపతి జేఈవో పోలా భాస్కర్, ఆలయ స్పెషల్‌గ్రేడ్ డెప్యూటీ ఈవో భాస్కర్‌రెడ్డి, ఏఈవో నాగరత్న, సూపరింటెండెట్లు కేపీ.వెంకటరత్నం, వరప్రసాద్ పాల్గొన్నారు. -
అటకెక్కిన ‘ఆధ్యాత్మికం’
తిరుచానూరును పట్టించుకోని టీటీడీ ఆధ్యాత్మిక అనుభూతి కలగలేదంటున్న భక్తులు మరి మాస్టర్ ప్లాన్ సంగతేంటి? తిరుచానూరు : తిరుమల శ్రీవారి ఆలయం తర్వాత అంత ప్రాశస్త్యమున్నది తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయానికే. శ్రీవారి ధర్మపత్ని శ్రీపద్మావతి అమ్మవారి దర్శనార్థం నిత్యం వేలాది మంది భక్తులు తిరుచానూరుకు వస్తుంటారు. పంచాయతీ పరిధిలో ఉన్న తిరుచానూరులో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా తీర్చిదిద్దాలన్నది టీటీడీ ఆలోచన. దీనికోసం ప్రభుత్వానికి ఏడాది క్రితం పంపిన ప్రతిపాదన మూలనపడింది. ఆధ్యాత్మిక కేంద్రంగా తిరుపతికి, ఆధ్యాత్మిక, ధార్మిక సంస్థగా టీటీడీకి మంచి గుర్తింపు ఉంది. స్వామి, అమ్మవార్ల దర్శనార్థం నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తి, ఆధ్యాత్మికం వెల్లివిరిసేలా ఇదివరకే మద్యం, మాంసం, బీడీ, సిగరెట్లు, పాన్‌మసాల, గుట్కా వంటివి పూర్తిగా నిషేధించారు. అదే తరహాలో పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరులోనూ అమలు చేయాలని టీటీడీ సంకల్పించింది. తిరుచానూరును ఆధ్యాత్మిక కేంద్రం పరిధిలోకి తీసుకురావాలని ఏడాది క్రితం ప్రతిపాదన పంపింది. ఆ ప్రతిపాదనను ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. మద్యం, మాంసం బంద్! ప్రస్తుతం అమ్మవారి ఆలయ పరిసరాల్లో మద్యం, మాంసంతో పాటు బీడీ, సిగరెట్లు, గుట్కా, పాన్‌మసాల వంటివి లభ్యమవుతున్నాయి. తద్వారా అమ్మవారి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలగడం లేదనేది టీటీడీ వాదన. వీటన్నింటినీ నిషేధించేందుకు గ్రామాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరినా ఇంతవరకు ఎటువంటి స్పందనా లేదు. మాస్టర్‌ప్లాన్ సంగతేంటి? తిరుచానూరులో మరోమారు మాస్టర్‌ప్లాన్ అమలు చేయాలని టీటీడీ అధికారులు ఆలోచనలో ఉన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల వైకుంఠం తరహాలో ఇక్కడ కూడా క్యూకాంప్లెక్స్, వసతి సముదాయాలు నిర్మించాలని ఆలోచిస్తున్నారు. అందుకు అనువైన స్థలం లేకపోవడంతో తాత్కాలికంగా వాయిదా పడింది. తీవ్రవాద ముప్పు ఉన్న నేపథ్యంలో అమ్మవారి ఆలయ పరిసరాలను ఫ్రీజోన్‌గా ఏర్పాటు చేయాలన్న వాదన కూడా ఉంది. దీనికోసం ఆలయ పరిసరాల్లోని షాపింగ్ కాంప్లెక్స్‌లు, నివాస గృహాలను తొల గించాలనే ప్రతిపాదనను విజిలెన్స్ విభాగం ఇప్పటికే టీటీడీ ఉన్నతాధికారులకు నివేదిక కూడా అందజేసింది. స్థలసేకరణ ద్వారా పెద్ద మొత్తంలో నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. స్థానికుల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. అయితే ఇవన్నీ ఊహాగానాలు మాత్రమేనని, ఇంకా మాస్టర్‌ప్లాన్‌పై ఒక స్పష్టత రాలేదని టీటీడీ అధికారులు కొట్టిపడేస్తున్నారు. ఒకవేళ మాస్టర్‌ప్లాన్ అమలైతే తిరుమల తరహాలో ఇక్కడ కూడా భక్తులకు మెరుగైన వసతులు అందుతాయనడంలో సందేహం లేదు. దీనిపై స్థానికుల్లో నెలకొన్న అపోహలను తొలగించాల్సిన బాధ్యత టీటీడీ ఉన్నతాధికారులపై ఉంది.