breaking news
sri indhu college
-
Sakshi Premier League 2022: రెండో రోజు నాలుగు మ్యాచ్‌లు.. విజేతలు వీరే
ఇబ్రహీంపట్నం/హైదరాబాద్: రెండోరోజు సాక్షి ప్రీమియర్ లీగ్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఆదివారం మొత్తం నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. ఔత్సాహిక క్రికెటర్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ‘సాక్షి మీడియా గ్రూప్’ ఆధ్వర్యంలో లీగ్ మ్యాచ్‌లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. శేరిగూడలోని శ్రీఇందు కాలేజీ వేదికగా కొనసాగుతున్న మ్యాచ్‌లకు ఆదివారం ఆయా విద్యాసంస్థల చైర్మన్ ఆర్. వెంకట్రావ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లోని క్రీడానైపుణ్యాన్ని వెలికితీసేందుకు సాక్షి మీడియా చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. ఈ అవకాశాన్ని యువత అందిపుచ్చుకొని ప్రతిభను చాటాలన్నారు. సాక్షి ప్రీమియర్ లీగ్‌కు రీఫ్రెష్మెంట్ డ్యూక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సుధాకర్ పీవీసీ సంస్థలు తెలంగాణ రీజియన్ స్పాన్సర్స్‌గా వ్యవహరిస్తున్నాయి. రెండోరోజు నాలుగు మ్యాచ్‌లు రెండోరోజు నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. మొదటి మ్యాచ్‌లో దిల్సుఖ్నగర్ అవంతి పీజీ కళాశాల, ఘట్కేసర్ వీబీఐటీ జట్లు పోటీపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అవంతి కళాశాల జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 67 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ చేసిన వీబీఐటీ జట్టు 9 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసి విజయం సాధించింది. రెండో మ్యాచ్ శేరిగూడ శ్రీఇందు ఇన్స్టిట్యూట్, ఘట్కేసర్ శ్రీనిధి కళాశాల జట్లు పోటీ పడ్డాయి. శ్రీఇందు విద్యాసంస్థల చైర్మన్ వెంకట్రావ్ టాస్ వేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీఇందు జట్టు 10 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 85 పరుగులు సాధించింది. అనంతరం శ్రీనిధి కళాశాల జట్టు 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 42 పరుగులు మాత్రమే చేసింది. శ్రీఇందు జట్టులో శివ అత్యుత్తమంగా బ్యాటింగ్ చేసి 22 బాల్స్‌కు 41 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. శ్రీఇందు ఇన్స్టిట్యూట్ జట్టును విద్యాసంస్థల చైర్మన్ వెంకట్రావ్ అభినందించారు. మూడో మ్యాచ్‌లో హైదరాబాద్ ఓయూ జట్టు, ఇబ్రహీంపట్నం గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల జట్టు తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఓయూ జట్టు 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గురునానక్ జట్టు 7 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 56 పరుగులు సాధించి విజేతగా నిలిచింది. నాలుగో మ్యాచ్‌లో అల్వాల్ లయోలా డిగ్రీ కళాశాలతో సికింద్రాబాద్ వెస్లీ డిగ్రీ కళాశాల పోటీపడ్డాయి. టాస్ గెలిచిన లయోలా జట్టు వెస్లీ జట్టుకు బ్యాటింగ్ అప్పగించింది. 10 ఓవర్లల్లో 8 వికెట్ల నష్టానికి వెస్లీ జట్టు 50 పరుగులు చేసింది. అనంతరం లయోలా జట్టు 8.2 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు సాధించి విజయాన్ని దక్కించుకుంది. -
కాంగ్రెస్ పార్టీ ‘మేధోమథన సదస్సు’
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రాష్ట్రంలో పార్టీ పూర్వవైభవం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ‘మేధోమథన సదస్సు’ నిర్వహిస్తోంది. ఇబ్రహీంపట్నం మండలం శ్రీ ఇందూకాలేజీలో జరిగే ఈ సదస్సుకు అతిరథమహారథులు హాజరవుతున్నారు. కేంద్రం, రాష్ర్టంలో ఘోర పరాజయం చవిచూసిన కాంగ్రెస్ పార్టీ.. ఓట మికి దారితీసిన పరిస్థితులను ఈ సమావేశంలో సమీక్షించనుంది. రెండు రోజుల ఈ సదస్సులో పది అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. గ్రూపుల వారీగా చర్చించడం ద్వారా భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికకు తుదిరూపు ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మండల/బ్లాక్/ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ఇటీవల ఎన్నికల్లో గె లుపొందిన, ఓడిపోయిన అభ్యర్థులుసహా టీపీసీసీ కార్యవర్గం, అనుబంధ సంఘాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. దాదాపు 1300 మంది ప్రతినిధులు పాల్గొనే ఈ సమావేశాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు దానం నాగేందర్, క్యామ మల్లేశ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి భారీ ఏర్పాట్లు చేశారు. కళాశాల ఆవరణను పార్టీ తోరణాలతో, బెలూన్లతో అలంకరించిన కాంగ్రెస్ శ్రేణులు.. ఇప్పటికే సభా ప్రాంగణాన్ని అందం గా ముస్తాబు చేశారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారి జరుగుతున్న ప్లీనరీ ఏర్పాట్లను శనివారం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్, ఏఐసీసీ ఎస్సీ సెల్ కన్వీనర్ కొప్పుల రాజు, ఏఐసీసీ ప్రతినిధి కుంతియా, టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య పరిశీలించారు. తప్పులను సమీక్షిస్తాం: దిగ్విజయ్ ఇటీవల ఓట మికి కారణమైన అంశాలను సదస్సులో సమీక్షిస్తామని దిగ్విజయ్‌సింగ్ స్పష్టం చేశారు. కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని, భవిష్యత్తులో తప్పులు పునరావృతంగాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నైరాశ్యంలో ఉన్న కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపేందుకు మేధోమథన సదస్సు దోహపడుతుందని, అందుకనుగుణంగా పలు అంశాలపై తీర్మానాలను చేయనున్నట్లు వెల్లడించారు. అగ్రనేతల రాక! రెండు రోజుల సదస్సుకు కాంగ్రెస్ ముఖ్యనేతలు తరలిరానున్నారు. సిద్దిరామయ్య, గులాం నబీ అజాద్, సచిన్‌పెలైట్, జ్యోతిరాదిత్య సిందియా, జైరాం రమేశ్ తదితరులు ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు తెలిపారు. పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ పర్యటనల షెడ్యూల్‌ను మాత్రం ఇంకా ఖరారు కాలేదని తెలిసింది. వచ్చేనెల 21న ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక సదస్సు హైదరాబాద్: ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఆధ్వర్యంలో సెప్టెంబర్ 21న సదస్సు నిర్వహించనున్నట్టు విరసం నేత వరవరరావు తెలిపారు. శనివారం హైదర్‌గూడలోని ఎస్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదేళ్ల ఐక్య విప్లవ ఉద్యమానికి జేజేలు పలుకుతూ ఈ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. కమ్యూనిస్టు నేత ఎంటీ ఖాన్‌కు ఈ సందర్భంగా నివాళులర్పిస్తామన్నారు. విప్లవంలో మూడు మూలిక నిర్మాణాలు, ఈ దశాబ్ది విప్లవ పోరాటాలు, విప్లవోద్యమం-బోల్షివీకరణ అనే అంశాలపై వక్తలు పాణీ, అమిత్ భట్టాచార్య, సీఎస్ఆర్ ప్రసాద్ ప్రసంగిస్తారని చెప్పారు.