breaking news
Sports technologist
-
‘స్పోర్ట్స్ డేటా గేమ్‌థాన్’ను ప్రారంభించింన FIFS..
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10, 2025: స్పోర్ట్స్ టెక్‌లో భారతదేశాన్ని గ్లోబల్ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్ (FIFS) ఆధ్వర్యంలో డ్రీమ్11 సమర్పనలో స్పోర్ట్స్ AI ఛాలెంజ్ ‘స్పోర్ట్స్ డేటా గేమ్‌థాన్’ను ప్రారంభించింది. ఈ అధునాతన సాంకేతిక పోటీ డేటాను సమగ్రపరచడంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML) వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను క్రీడలకు ఉపయోగించుకోవడానికి నూతన మార్గాలను అన్వేషించే దిశగా అడుగులేస్తుంది.ఈ గేమ్థాన్లో ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ల నుండి విద్యార్థి జట్లు పాల్గొంటాయి. ఇందులో పాల్గొనే వారు ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సందర్భంగా రోజువారీ ఫాంటసీ స్పోర్ట్స్ ఫార్మాట్లో పోటీపడతారు. ముఖ్యంగా డేటా అనలిటిక్స్ నైపుణ్యాలను ఉపయోగించుకుంటూ, గేమ్‌థాన్ యొక్క బదిలీ పరిమితులు ఇతర నియమాలకు కట్టుబడి విజేతగా నిలవడానికి వ్యూహాన్ని రూపొందించడంలో ఏఐ, ఎమ్ఎల్ నమూనాలను నిర్మించాలి.ఈ ప్రతిష్టాత్మక పోటీకి 30 కి పైగా ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపాయి. వారి వ్యూహాత్మక ప్రణాళికలను సమీక్షించిన తర్వాత., IIT బాంబే, IIT ఢిల్లీ, IIT ఖరగ్‌పూర్, IIT కాన్పూర్, IIIT ధార్వాడ్ వంటి సంస్థల నుండి 52 జట్లు షార్ట్‌లిస్ట్ చేయబడ్డాయి. మొదటి మూడు జట్లు వరుసగా రూ.12.5 లక్షలు, 7.5 లక్షలు, 5 లక్షలు అందుకుంటూ మొత్తంగా 25 లక్షల బహుమతిని గెలుచుకుంటారు.గేమ్‌థాన్ అంతటా విద్యార్థులకు మద్దతుగా, FIFS ఇద్దరు నిపుణులను ఆన్-బోర్డ్ చేసింది - ప్రఖ్యాత క్రికెట్ విశ్లేషకుడు జాయ్ భట్టాచార్య మరియు USలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో AI వైస్ డీన్ ప్రొఫెసర్ విశాల్ మిశ్రా, విద్యార్థి బృందాలకు వారి నిపుణుల మార్గదర్శకత్వాన్ని అందిస్తారు.ఈ సందర్భంగా FIFS డైరెక్టర్ జనరల్ జాయ్ భట్టాచార్య మాట్లాడుతూ.., "స్పోర్ట్స్ డేటా గేమ్‌థాన్ యొక్క మొదటి ఎడిషన్‌ను ప్రారంభించడానికి మేము సంతోషిస్తున్నాము. మా ప్రయత్నానికి విశేష స్పందన లభిస్తుంది. ఈ గేమ్థాన్లో ప్రధానంగా యువతరం పోటీ పడటం పట్ల మేము సంతోషిస్తున్నామ’’ని అన్నారు.‘స్పోర్ట్స్ డేటా గేమ్‌థాన్’ అనేది ఆవిష్కరణకు ప్రోత్సాహక వేదికగా మారడంతో పాటు భారతదేశాన్ని స్పోర్ట్స్ టెక్నాలజీలో ప్రపంచ నేతగా ఎదగడమే లక్ష్యంగా ముందుకు తీసుకెళ్లన్నుంది. ఈ తరంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్పోర్ట్స్ అనలిటిక్స్ రంగంలో యువ ప్రతిభను పెంపొందించడంతో గేమ్‌థాన్ అభిమానుల భాగస్వామ్యాన్ని పునర్నిర్వచించడానికి.. అత్యాధునిక సాంకేతికత, డిజిటల్ కంటెంట్ అనుసంధానం చేసే విశిష్టమైన వ్యవస్థను పెంపొందిస్తుంది. -
ఆటలు.. కెరీర్‌కు రాచబాటలు
నేడు కెరీర్లో ఎదిగేందుకు ఆటలు మంచి మార్గంగా మారాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కొలువులు సాధించేందుకు క్రీడలు దారి చూపుతున్నాయి. ప్రభుత్వాలు కూడా క్రీడాకారులకు భారీ నజరానాలు అందిస్తున్నాయి. దీంతో ఎక్కువ మంది క్రీడలవైపు దృష్టి సారిస్తున్నారు. తల్లిదండ్రుల దృక్పథంలోనూ మార్పు వస్తోంది. తమ చిన్నారులను ఆటల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో క్రీడల శిక్షకులు, ఇతర సిబ్బంది అవసరం నానాటికీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సిటీలో, దేశంలో స్పోర్ట్స్ సంబంధిత కోర్సులను అందిస్తున్న యూనివర్సిటీలు, అర్హతలు, అవకాశాలపై ఫోకస్.. అవకాశాలెన్నో ఆటగాళ్లను ఫిట్‌గా ఉండేలా చూసే ఫిట్నెస్ ట్రైనర్, గాయాలబారిన పడితే సేవలందించే ఫిజియో థెరపిస్ట్, ఆత్మవిశ్వాసం, మానసిక స్థైర్యాన్ని పెంపొందించే స్పోర్ట్స్ సైకాలజిస్ట్, ఒత్తిడిని ఎదుర్కోవడానికి దారిచూపే యోగా ట్రైనర్, సరైన ఆహారం తీసుకునేలా సూచనలిచ్చే న్యూట్రిషనిస్ట్, క్రీడాకారుల వ్యవహారాలు పర్యవేక్షించే స్పోర్ట్స్ మేనేజర్, ఎప్పటికప్పుడు క్రీడా రంగంలో వస్తున్న నూతన టెక్నాలజీని విశ్లేషించే స్పోర్ట్స్ టెక్నాలజిస్ట్, వివిధ క్రీడల్లో ప్రావీణ్యం కల్పించే కోచ్, స్పోర్ట్స్ మసాజ్ స్పెషలిస్ట్, ఎక్సర్‌సెజైస్ స్పెషలిస్ట్.. ఇలా ఎన్నో ఉద్యోగావకాశాలు క్రీడా రంగంలో యువతకు అందుబాటులో ఉన్నాయి. కోర్సులు - స్పెషలైజేషన్లు క్రీడలంటే మక్కువ.. క్రీడాంశాలను కెరీర్‌గా ఎంచుకోవాలనేవారికి ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు పలు కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. సర్టిఫికెట్ కోర్సులు మొదలుకుని డిప్లొమా, పీజీ డిప్లొమా, యూజీ, పీజీ, ఇంటిగ్రేటెడ్ పీజీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎంఫిల్, పీహెచ్డీ, ఇంటిగ్రేటెడ్ ఎంఫిల్ - పీహెచ్డీ, ఎంబీఏ వంటి కోర్సులను దేశంలో వివిధ యూనివర్సిటీలు అందిస్తున్నాయి. ఈ కోర్సులను అందించడంలో గ్వాలియర్‌లో ఉన్న లక్ష్మీబాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌కు మంచిపేరుంది. ఇది కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ పరిధిలో ఏర్పాటైన సంస్థ. దీంతోపాటు పాటియాలాలో ఉన్న నేతాజీ సుభాశ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ కూడా వివిధ కోర్సులను అందించడంలో ప్రఖ్యాతి పేరుగాంచింది. ఇవేకాకుండా మరెన్నో విద్యా సంస్థలు ఈ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. స్పెషలైజేషన్ల విషయానికొస్తే ఎక్సర్సైజ్ ఫిజియాలజీ, స్పోర్ట్స్ సైకాలజీ, స్పోర్ట్స్ బయోమెకానిక్స్, ఫిట్నెస్ మేనేజ్మెంట్, స్పోర్ట్స్ ఇంజూరీస్ మేనేజ్మెంట్, స్పోర్ట్స్ కోచింగ్, స్పోర్ట్స్ మేనేజ్మెంట్ , యోగా, స్పోర్ట్స్ టెక్నాలజీ, స్పోర్ట్స్ మెడిసిన్, స్పోర్ట్స్ మసాజ్, లైఫ్‌గార్డ్స్ అండ్ పూల్ స్విమ్మింగ్, గ్రౌండ్ మేనేజ్మెంట్ వంటివి అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సుల వ్యవధి ఏడాది, యూజీ కోర్సుల వ్యవధి మూడేళ్లు/నాలుగేళ్లు, పీజీ కోర్సుల వ్యవధి రెండేళ్లు. నగరంలో పలు ఫిట్నెస్ స్టూడియోలు, జిమ్‌లు.. ఫిట్నెస్ సంబంధిత ఏరోబిక్స్, ఫిజియోమసాజ్, వెయిట్ రిడక్షన్, యోగా, మెడిటేషన్ వంటి అంశాల్లో శిక్షణ ఇస్తుండడంతోపాటు.. సర్టిఫికేషన్ కోర్సులను నిర్వహిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో పీఈసెట్.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ యూనివర్సిటీల పరిధిలోని కళాశాలల్లో యూజీడీపీఈడీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రతిఏటా ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్టును నిర్వహిస్తారు. యూజీడీపీఈడీ వ్యవధి రెండేళ్లు, బీపీఈడీ వ్యవధి ఏడాది. అర్హత: యూజీడీపీఈడీకి ఇంటర్మీడియెట్, బీపీఈడీకి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక: శారీరక సామర్థ్య పరీక్ష, ఏదైనా క్రీడలో ప్రతిభ ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. వేతనాలు మనదేశంలో క్రీడలంటే నిన్నమొన్నటి వరకు క్రికెట్ మాత్రమే. ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. ఆర్చరీ, షూటింగ్, బ్యాడ్మింటన్, టెన్నిస్, రెజ్లింగ్, బాక్సింగ్, చెస్, అథ్లెటిక్స్ వంటి క్రీడలకు ఆదరణ పెరుగుతోంది. స్పోర్ట్స్ మేనేజర్లకు ప్రారంభంలో నెలకు రూ.15,000 నుంచి రూ.25,000 వరకు వేతనాలు ఉంటాయి. క్రీడా శిక్షకులు, సైకాలజిస్ట్లకు మొదట రూ.15,000తో కెరీర్ ఆరంభమవు తుంది. ఆ తర్వాత పనితీరు, అనుభవాన్ని బట్టి మరింత ఆదాయం పొందొచ్చు. రెండేళ్ల అనుభవం, మంచి నైపుణ్యాలు ఉంటే సొంతంగా శిక్షణా సంస్థను కూడా ఏర్పాటు చేసుకోవ చ్చు. ఫిజియో థెరపిస్ట్‌లు, న్యూట్రిషనిస్ట్‌లు ప్రారంభంలో రూ.25,000 వేతనం అందుకోవచ్చు. ఈ రంగంలో మంచి పేరు సాధిస్తే రూ.లక్షల్లో ఆదాయం గడించొచ్చు. కోర్సులను అందిస్తున్న యూనివర్సిటీలు ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్: www.osmania.ac.in ఆంధ్రా యూనివర్సిటీ వెబ్సైట్: www.andhrauniversity.edu.in ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వెబ్సైట్: www.nagarjunauniversity.ac.in జేఎన్టీయూ - కాకినాడ కోర్సు: ఎంఎస్ హెల్త్ సైన్స్ అండ్ స్పోర్ట్స్ టెక్నాలజీ వ్యవధి: రెండేళ్లు అర్హత: ఎంబీబీఎస్/బీయూఎంఎస్/బీఎన్‌వైఎస్/బీఏఎంఎస్/బీహెచ్ఎంఎస్/బీపీటీ/ఎంపీటీ ఉత్తీర్ణత. వెబ్సైట్: www.jntuk.edu.in ప్రవేశం ప్రవేశం ఆయా యూనివర్సిటీల నియమ నిబంధనల మేరకు ఉంటుంది. దాదాపు అన్ని యూనివర్సిటీలు శారీరక సామర్థ్య పరీక్ష, ఏదైనా క్రీడలో ప్రావీణ్యం, రాతపరీక్ష ఆధారంగా క్రీడాకారులకు ప్రవేశం కల్పిస్తున్నాయి. గేమ్స్ అడ్డా.. సిటీ స్పోర్ట్స్ కోర్సులను అభ్యసించినవారికి ఎన్నో అవకాశాలున్నాయి. నగరంలో క్రికెట్, చెస్, టెన్నిస్, బ్యాడ్మింటన్, గోల్ఫ్, పోలో, స్విమ్మింగ్, అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్ వంటి క్రీడల్లో శిక్షణనిస్తున్నారు. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియం - యూసఫ్‌గూడ, లాల్ బహదూర్ స్టేడియం, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ, జింఖానా గ్రౌండ్స్, హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్, హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్, సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం, గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం, సానియామీర్జా టెన్నిస్ అకాడమీ మొదలైనవి ఎన్నో నగరంలో కొలువుదీరాయి. * వివిధ క్రీడలు, క్రీడా పరికరాలపై మంచి పరిజ్ఞానం ఉండాలి. * నెట్వర్కింగ్ నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్. * నాయకత్వ లక్షణాలు. * పరిశీలన, పరిశోధనాత్మక దృక్పథం. * నిర్ణయ సామర్థ్యాలు. * దూర ప్రాంతాలకు ప్రయాణం చేయగల సంసిద్ధత. తల్లిదండ్రుల ప్రోత్సాహమే కీలకం భారత ప్రభుత్వం పంచాయత్ యువ క్రీడ ఔర్ ఖేల్ అభియాన్ (పీవైకేకేఏ), అర్బన్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్‌లతో క్రీడలను ప్రోత్సహిస్తోంది. ప్రాథమిక విద్య దశలోనే క్రీడల్లో విద్యార్థుల భాగస్వామ్యం తప్పనిసరి చేయనుంది. కార్పొరేట్ ఉద్యోగాల ఎంపిక సమయంలోనూ గేమ్స్, స్పోర్ట్స్‌లో ప్రవేశం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. క్రీడాకారుల్లో ఉండే లీడర్షిప్, టీమ్బిల్డింగ్తో ఉద్యోగాన్ని సమర్థంగా నిర్వహించగలరని కంపెనీలు భావిస్తున్నాయి. స్కూల్ స్థాయి నుంచే పిల్లలను ఇండోర్, ఔట్‌డోర్ ఏదో ఒక ఆటకు అలవాటయ్యేలా తల్లిదండ్రులు దృష్టిసారిస్తే.. ఆరోగ్యం, కెరీర్ రెండూ బాగుంటాయి. -డాక్టర్ ఎం.వి.ఎల్.సూర్యకుమారి, ఫిజికల్ ఎడ్యుకేషన్ డెరైక్టర్, జి. నారాయణమ్మ మహిళా ఇంజనీరింగ్ కళాశాల