breaking news
Spell Bee Championship
-
స్పెల్లింగ్ బీ విజేత హైదరాబాదీ
ఓక్సన్ హిల్ (అమెరికా): హైదరాబాద్‌కు చెందిన ఫైజన్ జకీ అనే 13 ఏళ్ల బాలుడు అమెరికా జాతీయ స్పెల్లింగ్ బీ (Spelling Bee) చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. ఫైనల్లో జకీతో పోటీపడ్డ మరో ఇద్దరు చిన్నారులు సర్వజ్ఞ కదం, సర్వ్ ధరవనెవి కూడా భారత మూలాలే కావడం విశేషం. గురువారం రాత్రి జరిగిన ఫైనల్లో వారిద్దరినీ జకీ అలవోకగా ఓడించాడు. తద్వారా గతేడాది వెంట్రుకవాసిలో తప్పిపోయిన స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ చాంపియన్‌షిప్‌ను ఈసారి సగర్వంగా సాధించాడు. రెండో స్థానంలో నిలిచిన 14 ఏళ్ల కదం కాలిఫోర్నియావాసి. కాగా మూడో స్థానంలో నిలిచిన సర్వ్ వయసు కేవలం 11 ఏళ్లే.జార్జియాకు చెందిన అతనికి మరో మూడేళ్లు పోటీల్లో పాల్గొనే అవకాశముంది. అత్యంత కఠినమైన, ప్రతిష్టాత్మకమైన స్పెల్లింగ్ బీ పోటీలకు ఇది 100వ ఏడాది కావడం విశేషం. ఈసారి పోటీ 21 రౌండ్ల పాటు హోరాహోరీగా సాగింది. 18వ రౌండ్లోనే జకీకి గెలిచేందుకు సువర్ణావకాశం వచ్చిది. కదం, సర్వ్ వరుసగా రెండు స్పెలింగులు తప్పు చెప్పారు. కానీ జకీ కూడా తనకిచ్చిన పదం తాలూకు వివరణ కూడా వినకుండానే బదులిచ్చేందుకు తొందరపడ్డాడు. కానీ తొలి అక్షరమే తప్పుగా చెప్పాడు. అయినా నిరాశ పడకుండా మరో మూడు రౌండ్ల తర్వాత ‘ఎక్లెయిర్‌సిస్‌మెంట్’ పదం స్పెలింగ్ సరిగా చెప్పడం ద్వారా విజయపతాక ఎగురవేశాడు. ఆ వెంటనే ఆనందం పట్టలేక వేదికపై కుప్పకూలిపోయాడు.‘‘గెలుస్తానని అనుకోలేదు. ఈ అనూభూతిని వర్ణించేందుకు మాటల్లేవు’’ అంటూ సంబరపడిపోయాడు. జకీ కొంతకాలంగా ఫ్రెంచ్ నేర్చుకుంటున్నాడు. దాంతో ఫ్రెంచ్ మూలాలున్న ‘ఎక్లెయిర్‌సిస్‌మెంట్’ స్పెల్లింగ్ చెప్పడం సులువుగా మారింది. ప్రైజ్‌మనీ (Prize Money) కింద అతనికి 50 వేల డాలర్లు (దాదాపు రూ.42 లక్షలు) లభించాయి. అందులో అధిక మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు విరాళంగా ఇస్తానని జకీ ప్రకటించాడు. ఈసారి తుది రౌండ్లకు అర్హత సాధించిన చిన్నారుల్లో మరో నలుగురు భారతీయులుండటం విశేషం. గతేడాది రన్నరప్ స్పెల్లింగ్ బీ పోటీల్లో పాల్గొనడం జకీకి ఇది నాలుగోసారి. ఇందుకోసం ఏడేళ్ల వయసు నుంచే కఠోరంగా సాధన చేస్తూ వచ్చాడు. 2019లో ఏడేళ్ల వయసులోనే తొలిసారి పోటీల్లో పాల్గొన్నా 370వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. 2023లో రెండోసారి సెమీస్ దాకా చేరి 21వ స్థానంలో నిలిచాడు. 2024లో మాత్రం ఒక్క స్పెల్లింగ్ కూడా తప్పు చెప్పకుండా ఫైనల్ రౌండ్ దాకా దూసుకెళ్లాడు. అక్కడ తాను సాధన చేయని లైటెనింగ్ రౌండ్ ఎదురైంది. అయినా హోరాహోరీ తలపడి టై బ్రేకర్ దాకా తీసుకెళ్లినా చివరికి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.చదవండి: మిస్ యూఎస్ఏ తెలుగు టాలెంటెడ్‌గా పోలవరం యువతిఅతనిపై నెగ్గిన బృహత్ సోమవి కూడా భారత మూలాలే. ఈసారి టైటిల్ సాధనలో జకీకి అతను అండదండగా నిలిచాడు. జకీ కుటుంబం టెక్సాస్‌లో డాలస్‌లోని అలెన్‌లో నివసిస్తోంది. స్థానిక సీఎం రైస్ మిడిల్ స్కూల్లో అతను సెవెన్త్ గ్రేడ్ చదువుతున్నాడు. ‘‘మావాడు రెండేళ్లకే చదవడం మొదలు పెట్టాడు. చూస్తుండగానే ఇంగ్లిష్ డిక్షనరీ మొత్తాన్నీ బట్టీ పట్టేశాడు’’ అని జకీ తల్లిదండ్రులు అర్షియా, అన్వర్ ఆనందంగా చెప్పుకొచ్చారు. ఇప్పుడిక మ్యాథ్స్ ఒలింపియాడ్ (maths olympiad) తన తదుపరి లక్ష్యమని వివరించారు. జకీ తాత, నానమ్మ కూడా హైదరాబాద్ (Hyderabad) నుంచి ఫైనల్‌ను ఆసాంతం వీక్షించారు. మనోళ్లదే హవా అమెరికా జాతీయ స్పెల్లింగ్ బీ పోటీల్లో ఏళ్ల తరబడి భారత సంతతి బాలలే ఆధిపత్యం చలాయిస్తున్నారు. గత 36 పోటీల్లో ఏకంగా 30 సార్లు విజేతలుగా నిలిచి సత్తా చాటారు. -
స్పెల్ బీ విజేతలు.. శ్రీరామ్, సుజోయ్
వాషింగ్టన్: ప్రతిష్టాత్మక స్పెల్ బీ చాంపియన్‌షిప్‌లో మరోసారి భారత సంతతి విద్యార్థులు సత్తా చాటారు. స్క్రిప్స్ నేషనల్ స్పెల్ బీ కాంటెస్ట్‌లో న్యూయార్క్‌కు చెందిన శ్రీరామ్ హత్వర్ (14), టెక్సాస్‌కు చెందిన అన్సన్ సుజోయ్ (13) సంయుక్త విజేతలుగా నిలిచి చరిత్ర సృష్టించారు. స్పెల్ బీ పోటీల చరిత్రలో ఇలా ఇద్దరు సంయుక్త విజేతలుగా నిలవడం ఇది నాలుగోసారి మాత్రమే. 1962లో చివరిసారిగా ఇద్దరు సంయుక్త విజేతలుగా నిలిస్తే.. మళ్లీ 52 ఏళ్ల తర్వాత ఇప్పుడు శ్రీరామ్, సుజోయ్ ఆ ఘనత సాధించారు. గురువారం రాత్రి జరిగిన స్పెల్ బీ ఫైనల్ రౌండ్లో 25 పదాలకుగానూ వీరిద్దరూ 12 పదాలను సరిగ్గా చెప్పి టైటిల్‌తో పాటు 30 వేల డాలర్ల స్కాలర్షిప్ కూడా దక్కించుకున్నారు. టెక్సాస్‌లోని ఫోర్ట్ వర్త్‌కు చెందిన సుజోయ్ సెవెన్త్ గ్రేడ్ చదువుతున్నాడు. న్యూయార్క్‌కు చెందిన శ్రీరామ్ ఇప్పటికే నాలుగు సార్లు ఈ పోటీల్లో పాల్గొన్నాడు.