breaking news
Special telangana state
-
త్యాగాల వెలుగు దీపిక
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన త్యాగధనులు ఇవాళ ప్రతి తెలంగాణవాసికీ ప్రాతఃస్మరణీయులు. వారు ఏ ఆకాంక్షలతో, కలలతో ఆత్మ బలిదానాలు చేసుకున్నారో వాటిని సాకారం చేసేందుకు స్వరాష్ట్రం ఇప్పటికే పని ప్రారంభించింది. అదే సమయంలో తెలంగాణ అస్తిత్వానికీ, ఆత్మగౌరవానికీ పెద్దపీట వేసి స్వరాష్ట్ర సాధనలో నేలకొరిగిన అమరుల నుంచి స్ఫూర్తి పొందడానికి నిత్యం జ్వలించే ‘అమర జ్యోతి’ని ప్రభుత్వం నిలిపింది. రాష్ట్ర పరిపాలనా కేంద్రం సచివాలయం ఎదురుగా దీన్ని నెలకొల్పడం ప్రశంసనీయం. అమరుల త్యాగానికి ఇది నిలువెత్తు రూపం. స్మృతి వనంలోని ఈ జ్యోతి భవిష్యత్ తరాలకు వెలుగు దీపిక. మనకాలంలో మనమందరమూ పాల్గొని విజయం సాధించిన ఒక మహోద్యమానికి ప్రతీక! దీపం జ్యోతి పరబ్రహ్మ – అంటే దీపం దైవంతో సమానం అని అర్థం. ‘తమసోమా జ్యోతిర్గమయ’ అంటే చీకటిని చీల్చుకుని వెలుతురు ఉదయిస్తుందని భాష్యం. ఏ వెలుగు కోసమైతే మనుషులు తమ ప్రాణాల్ని తృణ ప్రాయంగా ఎంచి ఆహుతి అయిపోయారో ఆ వెలుగు, ఆ త్యాగాన్ని స్మరించుకుని, ఆ త్యాగం నుండి స్ఫూర్తి పొందడానికి వెలిగించే జ్యోతి ‘అమర జ్యోతి’. దానిని నిలపడమంటే త్యాగధనులకు మనం ప్రక టించే కృతజ్ఞత మాత్రమే కాదు, మన బాధ్యతను నెరవేర్చడం కూడా. తెలంగాణ నేలతల్లి రుణం తీర్చుకునేందుకు నేలకొరిగిన వీరుల త్యాగాలను మననం చేసుకుంటూ, వారికి నివాళులర్పిస్తూ తెలంగాణ సమాజం వందనం చేస్తోంది. అమరుల త్యాగాలను గుర్తు చేసుకోవ డానికీ, ఆ త్యాగాల నుంచి స్ఫూర్తి పొందడానికీ ‘అమరజ్యోతి’ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ జ్యోతి ఉన్న ‘స్మృతి వనం’ తెలంగాణ అస్తిత్వ ఉద్యమ కాంతులను ఎగజిమ్ముతోంది. ఈ స్మారక స్థలం త్యాగధనులను మననం చేసుకుంటూ భవిష్యత్ తెలంగాణ ను నిర్మించుకునేందుకు ప్రతినబూనే ప్రతిజ్ఞాస్థలం. తెలంగాణ రాష్ట్రం కోసం అమరత్వాన్ని ముద్దాడి అమరులైన వీరులారా, ఆత్మబలిదానాలు చేసుకుని ఆదర్శంగా నిలిచిన యోధులారా, మిమ్ములను ఎప్పటికీ ఈ మట్టి మరిచిపోదని చాటిచెబుతూ అమరుల త్యాగాల చిహ్నంగా అమరజ్యోతి నిర్మాణం జరిగింది. తెలంగాణ సమాజం మీ త్యాగాలను నిత్యం మననం చేసుకుంటూ ముందుకు సాగుతుంది. 1969 ఉద్యమంలో పోలీసు కాల్పుల్లో నేలకొరిగిన వీరులను తలచుకుంటూ రగిలిన మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన మహో ద్యమంలో అసువులు బాసిన వారి అమరత్వానికి ప్రతీకగా అమర జ్యోతిని నిర్మించుకోవడం గర్వించదగినది. అమరులు కన్నుమూసి మన కళ్ళ ముందు దీపాలు వెలిగించారు. ఆ దీపాల మహాజ్యోతే ఈ అమరజ్యోతి. ఇవ్వాళ ఎన్నెన్నో కొత్త ఆలోచనల విత్తనాలు, నూతన భావ సంఘర్షణలు, ఉద్యమకలలు, ఉద్వేగాలు, దేదీప్యమానంగా అమరజ్యోతిలో ప్రతిఫలిస్తున్నాయి. అమరులను స్మరించుకోవటం చారిత్రక కర్తవ్యంగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. వారిని తలచుకోవడం మనందరి బాధ్యత, కర్తవ్యమని గుర్తుచేస్తూ తెలంగాణ ప్రభుత్వం అమరుల త్యాగాలను గుండెనిండా నింపుకుని భవిష్యత్ తెలంగాణను పునర్నిర్మించుకుంటుందని చెప్పడానికి వెలుగుతున్న అమరజ్యోతే సాక్ష్యం. తెలంగాణ ప్రభుత్వం అమరజ్యోతిని ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. అమరులకు మొత్తం తెలంగాణ సమాజమే తలవంచి నివాళులర్పిస్తూ, వందనాలు తెలియజేస్తోంది. తెలంగాణ నేల మీద ఎన్నెన్నో పోరాటాలు జరిగాయి. భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాటాలు జరిగాయి. ప్రపంచానికే మహత్తర సందేశం అందించిన మానవీయ పోరాటాలు ఈ మట్టిపై జరిగాయి. ప్రపంచ అస్తిత్వ ఉద్యమాల చరిత్రలో మరువలేని మహత్తర దీర్ఘకాలిక శాంతియుత ఉద్యమం తెలంగాణ రాష్ట్రసాధన పేరున జరిగింది. ఇది మన కాలంలో మనందరం పాల్గొని, ఒక్కతాటిపై నడిచి విజయం అంచుల వరకు చేరి స్వరాష్ట్రం సాధించుకున్న చరిత్ర. ఈ ప్రపంచీకరణ కాలమే అబ్బురపడే విధంగా చెరగని చరిత్రగా నిలిచిపోతుంది. నీళ్ళు, నిధులు, నియామకాల కోసం ఎగిసిన స్వరాష్ట్ర ఉద్యమం 14 ఏళ్ళు శాంతియుతంగా కొనసాగింది. 2009 డిసెంబరు 9న తెలంగాణ రాష్ట్రం ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటన తర్వాత సీమాంధ్రకు చెందిన టీడీపీ, కాంగ్రెస్ నేతలు యూ టర్న్ తీసుకున్నాక కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగటంతో తెలంగాణ అగ్నిగుండంగా మారింది. తెలంగాణ గుండె గాయపడింది. కేసీఆర్ నిరాహారదీక్షకు మద్దతుగా తెలంగాణ అంతా ముక్తకంఠంతో గర్జించింది. ఎల్బీ నగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి ‘జై తెలంగాణ’ అని నినదిస్తూ ఆత్మబలిదానానికి సిద్ధపడి తన ఒంటికి నిప్పంటించుకుని అమరత్వాన్ని పొందారు. కేసీఆర్ గుక్కపట్టి ఏడ్చారు. ఏ పిల్లల భవిష్యత్తు బాగుండాలని స్వరాష్ట్ర ఉద్యమాన్ని చేస్తున్నారో ఆ పిల్లలే ఆత్మబలిదానాలకు పాల్పడడంతో తెలంగాణ గుండె తల్లడిల్లింది. కేసీఆర్ ఆత్మబలిదానాలు వద్దని మొరపెట్టుకున్నారు. అయినా తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమంలో ఆత్మబలిదానాలు కొనసాగాయి. ఉస్మానియా యూనివర్సిటీలో మెయిన్ గేటు దగ్గర యాదయ్య తన ఒంటికి నిప్పంటించుకుని బలయ్యారు. కానిస్టేబుల్ కిష్టయ్య రివా ల్వర్తో కాల్చుకుని నేలకొరిగారు. ఇటువంటి త్యాగాలు స్వరాష్ట్ర ఉద్యమంలో చాలా చోటుచేసుకున్నాయి. కేసీఆర్ ఒక పక్క తన శాంతి యుత ఉద్యమాన్ని కొనసాగిస్తూ, ఆత్మబలిదానాలు వద్దని యువతకు పదేపదే విన్నవించుకుంటూ బిడ్డలు నేలరాలుతున్న తీరును చూసి తల్లడిల్లిపోయారు. కన్నీటి ప్రవాహాలు, ఆవేదనలు, ఆందోళనలు, జనప్రళయ ప్రభంజనాలను ప్రజాఉద్యమాలుగా మలచుకుంటూ ముందుకు సాగడంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. స్వరాష్ట్ర స్వప్నం సాకారం చేసుకున్న తర్వాత మొదటి తెలంగాణ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తూ కేసీఆర్ తొలి అసెంబ్లీ సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకుని అమ రత్వం పొందిన వారిని మననం చేసుకుని, వారి త్యాగాలకు గుర్తుగా బంగారు తెలంగాణ నిర్మించేందుకు ముందుకు సాగుదామని ప్రతిన తీసుకున్నారు. ప్రజలంతా ముక్తకంఠంతో ఎలా ఉద్యమించి కదిలారో వారి ఆకాంక్షలకు అనుగుణంగానే తెలంగాణ పునర్నిర్మాణాన్ని కొనసాగిస్తానని తొలి తెలంగాణ ప్రభుత్వం ప్రతిజ్ఞ చేసింది. ఆ దిశ గానే అడుగులు వేస్తూ ముందుకు సాగింది. ఇదే క్రమంలో 9 ఏళ్ళలో తెలంగాణ అన్ని రంగాలలో ప్రగతిని సాధిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రసాధన ఉద్యమాన్ని ప్రజా హృదయాలలో చెదరని ముద్రగా నిలపడానికి అమరజ్యోతి సాక్షిగా నూతన సచివాలయాన్ని నిర్మించుకుని దానికి డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ పేరు పెట్టుకోవడం ముదావహం. ఎవరూ ఊహించని విధంగా మన తెలంగాణ ఖ్యాతిని దిగ్దిగంతాలకు వినిపించే విధంగా అద్భుత మహాసౌధంగా రాష్ట్ర సచివాలయాన్ని నిర్మించుకోవడం గొప్ప అనుభూతినిస్తోంది. సరిగ్గా సచివాలయానికి ఎదురుగా ప్రతి నిత్యం అమరుల త్యాగాలను గుర్తుచేసే విధంగా అఖండమైన అమరజ్యోతిని కేసీఆర్ ఏర్పాటు చేయడం ఆయన దార్శ నిక ఆలోచనలకు నిదర్శనం. 2001 ఏప్రిల్ 27న ఏ ప్రదేశంలోనైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవటమే ఏకైక లక్ష్యమని కేసీఆర్ ప్రకటించారో, ఆ ‘జలదృశ్యం’ లోనే త్యాగమూర్తుల స్మారక మహారూపాన్ని ప్రతిష్ఠించుకోవటం జరిగింది. నాలుగు కోట్ల మంది తెలంగాణీయులు అమరుల త్యాగాలను మననం చేసుకునే మహాస్థలిగా అమర మహాజ్యోతి ఇక చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అసెంబ్లీ కెదురుగా గన్ పార్కులో ఉన్న అమరవీరుల స్తూపం దగ్గర ప్రతిన తీసుకుని కదిలిన ఉద్యమం... తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని, ఇప్పుడు అమర జ్యోతిని నిర్మించుకుంది. ఈ అమరజ్యోతి నిర్మాణం కేవలం తెలంగాణకే కాకుండా ప్రపంచంలోని అస్తిత్వ ఉద్యమాల చరిత్రకే మకుటాయమానంగా నిలుస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద భారీ అంబేడ్కర్ విగ్రహం చూపే చూపుడువేలు సాక్షిగా తెలంగాణ సమాజం ముందుకు సాగాలని అమరజ్యోతి మనకు దారిదీపంలా తోవ చూపుతోంది. జూలూరు గౌరీశంకర్ వ్యాసకర్త తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ (నేడు తెలంగాణ అమరుల స్మృతివనం – ‘అమరజ్యోతి’ ప్రారంభం) -
ఖమ్మం జిల్లా జెడ్పీ చైర్మన్ ఎన్నికలపై స్టే
* హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు * ఎంపీపీ అధ్యక్ష ఎన్నికలపైనా స్టే * కౌంటర్ దాఖలు చేయాలని పంచాయతీరాజ్ శాఖకు ఆదేశం * విచారణ రెండు వారాలకు వాయిదా సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో పాటు, ఖమ్మం జిల్లా నుంచి ఏడు మండలాలను తొలగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఖమ్మం జెడ్పీ చైర్మన్, ఎంపీపీ అధ్యక్షుల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. ఉమ్మడి రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలు జరిగాయని, అప్పుడు రాష్ట్రం మొత్తాన్ని, జిల్లా మొత్తాన్ని యూనిట్లుగా తీసుకుని రిజర్వేషన్లు ఖరారు చేశారని, ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావడంతో పాటు, ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలను తొలగించారని, అందువల్ల తిరిగి రిజర్వేషన్లను ఖరారు చేసేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బి.విజయగాంధీ, కె.రోశిరెడ్డిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ రమేష్ రంగనాథన్ శుక్రవారం మరోసారి విచారించారు. ఉమ్మడి రాష్ట్రంలో రిజర్వేషన్ల ప్రకారం జెడ్పీపీ చైర్మన్ పోస్టును ఎస్సీ మహిళకు కేటాయించారని, దీని వల్ల గాంధీ జెడ్పీపీ చైర్మన్ పోస్టుకు పోటీ చేయలేకపోయారని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది కోర్టుకు నివేదించారు. అలాగే రోశిరెడ్డి కూడా ఎంపీపీ పోస్టుకు అర్హుడని, అందువల్ల కొత్త మార్పులను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లను ఖరారు చేసేలా అధికారులను ఆదేశించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. ఈ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. ఈ సమయంలో పంచాయతీరాజ్ శాఖ తరఫు న్యాయవాది పాండురంగారెడ్డి స్పందిస్తూ, రెండు వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని, తమకు అందుకు సమయం ఇవ్వాలని కోర్టును కోరారు. అయితే అప్పటి వరకు ఖమ్మం జిల్లా జెడ్పీపీ చైర్మన్, ఎంపీపీ అధ్యక్షుల ఎన్నికల నిర్వహణను నిలుపుదల చేస్తామని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.