ఆటల్లో మేటి.. కష్టాలు కోటి
సాక్షి, సిద్దిపేట: ఆటలపై మక్కువ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ఆర్థిక ఇబ్బందులు మాత్రం పాతాళానికి లాగుతున్నాయి. సిద్దిపేట జిల్లా అక్బర్పేట–భూంపల్లి మండటం జంగాపల్లికి చెందిన బేస్‌బాల్ క్రీడాకారిణి పోసానిపల్లి సౌమ్యారెడ్డి పరిస్థితి ఇది. చైనాలో నవంబర్‌లో జరిగే బేస్‌బాల్ మహిళా ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టులో ఆమె చోటు సంపాదించింది. ఇటీవల బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా కప్ క్వాలిఫైయింగ్ పోటీలలో భారత జట్టు సిల్వర్ మెడల్ సాధించడంలో సౌమ్యారెడ్డి కీలకపాత్ర పోషించింది. చిన్నప్పటి నుంచి ఆటలే లోకం సౌమ్యారెడ్డి తల్లిదండ్రులు ప్రతాప్‌రెడ్డి, కవిత. వీరికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు సౌమ్యారెడ్డి, చిన్న కూతురు మాధురి. సౌమ్య క్రీడల్లో రాణిస్తుండటంతో మంచి శిక్షణ ఇప్పించేందుకు హైదరాబాద్‌కు మకాం మార్చారు. ప్రతాప్‌రెడ్డి ఇళ్లకు పెయింటింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సౌమ్యకు చిన్నప్పటి నుంచి ఆటలే లోకం. 8వ తరగతి చదువుతున్నప్పుడే త్రో బాల్ నేషనల్స్ ఆడింది. సాఫ్ట్‌బాల్, క్రికెట్, బేస్‌బాల్ ఆటలో సైతం రాణిస్తోంది. హైదరాబాద్ పీజీ గ్రౌండ్లో బేస్‌బాల్ కోచింగ్ తీసుకుంది. ఇప్పటివరకు బేస్‌బాల్‌లో 12 నేషనల్స్ ఆడింది.అండర్ –19 క్రికెట్‌తోపాటు సాఫ్ట్‌బాల్ 15 నేషనల్స్లలో పాల్గొంది. నవంబర్‌లో చైనాలో జరిగే ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టుకు ఇటీవల ఎంపికైంది. అయితే, పేద కుటుంబం కావటంతో ప్రయాణ ఖర్చులు భారంగా మారాయి. పోటీలలో పాల్గొనేందుకు నెల రోజుల ముందే చైనాకు చేరుకుని ప్రాక్టీస్ చేయాలి. ప్రయాణం ఖర్చులతో పాటు అక్కడ నెలపాటు ఉండేందుకు దాదాపు రూ.5 లక్షల వరకు అవసరం. అంతమొత్తం భరించే స్తోమత ఆ కుటుంబానికి లేకపోవటంతో సౌమ్య నిరాశలో కూరుకుపోయారు.ఇండియాకు మెడల్స్ తీసుకొస్తా ఇండియా తరఫున ఆడి మెడల్స్ తీసుకువస్తా. చైనాలో జరిగే ఆసియా కప్‌ను గెలుపొందేందుకు కృషి చేస్తా. చైనాకు వెళ్లాలంటే ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది. హైదరాబాద్‌లో బేస్‌బాల్ శిక్షణ, ప్రాక్టీస్ కోసం రోజు 14 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్తున్నాను. నన్ను ప్రోత్సహిస్తున్న బేస్‌బాల్ అసోసియేషన్¯ ప్రధాన కార్యదర్శి శ్వేత, కోచ్ చిన్న, ఖాదర్, షానవాజ్‌లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. – సౌమ్యారెడ్డి, బేస్‌బాల్ క్రీడాకారిణి. బ్యాంకాక్‌కు బంగారం కుదువపెట్టి పంపించాం బ్యాంకాక్ పోటీల్లో పాల్గొనేందుకు దాదాపు రూ.3.5 లక్షలు ఖర్చు అయింది. మా బిడ్డ లక్ష్యంకు చేరుకునేందుకు మా దగ్గర ఆర్థిక స్తోమత లేనప్పటికీ బంగారం బ్యాంకులో కుదువపెట్టి ఆ డబ్బుతో పంపించాము. కొంత అప్పు కూడా చేశాం. నవంబర్‌లో చైనా వెళ్లేందుకు రూ.5 లక్షలు అవుతుందని తెలిసింది. అంత ఖర్చు భరించే స్తోమత మాకు లేదు. ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఆదుకోవాలి. – సౌమ్య తల్లిదండ్రులు ప్రతాప్‌రెడ్డి, కవిత