నిద్రావస్థలో ఉద్యానశాఖ
అమలుకాని పథకాలు
ప్రణాళికలకే పరిమితమైన రూ.50 కోట్ల బడ్జెట్
అనంతపురం అగ్రికల్చర్ : ఉద్యానశాఖ నిద్రావస్థలో ఉంది. ఆర్థిక సంవత్సరం ఆరంభమై ఐదు నెలలవుతున్నా పథకాల అమలు కాలేదు. జిల్లాకు కేటాయించిన రూ.50 కోట్ల బడ్జెట్లో పైసా ఖర్చు చేయకుండా ప్రణాళికలకే పరిమితమైంది. ప్రస్తుత 2016–17 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ హార్టికల్చర్ (ఎంఐడీహెచ్) కింద రూ.29.38 కోట్లు, నార్మల్ స్టేట్ప్లాన్ (ఎన్ఎస్పీ) కింద రూ.12.20 కోట్లు, రాష్ర్టీయ కృషి వికాస యోజనా (ఆర్కేవీవై) కింద రూ.8.50 కోట్ల బడ్జెట్ కేటాయించింది.
వివిధ పథకాలకు వాటిని ఖర్చు చేయాలని దిశ నిరే్ధశం చేశారు. అరటి, బొప్పాయి, చీనీ, జామ, దానిమ్మ లాంటి కొత్త తోటల విస్తరణ, పాతతోటల పునరుద్ధరణ, మల్చింగ్,ప్యాక్హౌస్, గ్రీన్హౌస్, షేడ్నెట్స్ లాంటి రక్షిత వ్యవసాయం, తదితరాలకు పథకాల వారీగా ప్రభుత్వం కేటాయింపులు చేసింది.
ఏడీల పరిధిలోని హార్టికల్చర్ అధికారుల (హెచ్వో)కు మండలాల వారీగా టార్గెట్లు కూడా ఇచ్చారు. ఇప్పటికి రెండు నెలలు పూర్తి అవుతున్నా ఒక్క రైతుకు కూడా లబ్ధిచేకూరలేదు. లబ్ధిదారుల గుర్తింపు, ఆన్లైన్ అంటూ కాలయాపన చేస్తూ నెట్టుకొస్తున్నారు. సీఎం పర్యటనలు, కమిషనర్ పర్యటనలు, ఇతరత్రా వీడియోకాన్ఫరెన్స్లు, సమావేశాలు, సమీక్షలతోనే రోజులు గడచిపోతున్నా పండ్లతోటల రైతులకు మాత్రం చేసిందేమీ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.