breaking news
slaughter house
-
స్టోరీ రాస్తావా..! అంటూ మాఫియా దాడి
సాక్షి, బెంగుళూరు: అక్రమంగా నిర్వహిస్తున్న కబేళాన్ని వెలుగులోకి తెచ్చిన ఓ జర్నలిస్టుపై కర్ణాటకలో దాడి జరిగింది. పోలీసుల ఎదుటే ఈ దాడి జరగడం గమనార్హం. సరైన బలగం లేనందున కబేళం లోనికి వెళ్లలేమని హెచ్చరించిన పోలీసులు పశువుల అక్రమ రవాణా మాఫియాకు ఉప్పదించి వారిని కాపాడేందుకు ప్రయత్నించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలు.. రాంనగర్ జిల్లాలోని కుడూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కొడిపాల్యా గ్రామంలో అక్రమ కబేళం నిర్వహిస్తున్నారని తెలుసుకున్న ఓ జంతు ప్రేమికుడు పోలీసులకు సమాచారమిచ్చారు. రోజూ 200 ఆవుదూడలను వధించి, మాంసాన్ని రవాణా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తగిన పోలీసు బలగం లేనందున కబేళంలోనికి ప్రవేశించడానికి జంతు ప్రేమికుడు జాషైన్ ఆంథోని, ఓ జాతీయ పత్రికకు చెందిన రిపోర్టర్‌కు డీఎస్పీ అనుమతిన్విలేదు. మరుసటి రోజు (మంగళవారం) ఇద్దరు పోలీసులతో పాటు ఆంథోని, రిపోర్టర్ అక్కడికి చేరుకున్నారు. డీఎస్పీ ఆదేశాలతో కుడూర్ పోలీసులు ఆ కబేళంపై దాడి చేశారు. అయితే అప్పటికే కబేళం నిర్వహిస్తున్న మాఫియాకు సమాచారం అందడంతో అక్కడ ఆవుదూడల జాడ లేకుండా చేశారనీ, ఎవరికీ అనుమానం రాకుండా వాటిని అక్కడి నుంచి వేరే చోటికి తరలించారని రిపోర్టర్ ఆరోపించారు. పరిసరాల్లో లభ్యమైన పశువుల వ్యర్థాలు, ఎముకలు, రక్తపు మరకలతో అక్కడ కబేళం నిర్వహిస్తున్నారనే నిర్ధారించుకున్న రిపోర్టర్ ఆవుదూడలు దాచిపెట్టిన స్థలాన్ని కనుగొన్నాడు. ఘటనపై మరిన్ని వివరాలు సేకరించేందుకు ప్రయత్నించగా అక్కడే కాపుగాసిన కబేళం నిర్వహిస్తున్న కొందరు రిపోర్టరుపై దాడి చేశారని పోలీసులు తెలిపారు. 71 ఆవుదూడలను స్వాధీనం చేసుకున్న పోలీసులు రిపోర్టరుపై దాడి చేసిన గజీపీర్, ఖాసీ, సయ్యద్, ముబారఖన్, నూర్, ఇంతియాజ్, తాబ్రేజ్‌లపై కేసు నమోదు చేశారు. పశువుల అక్రమ రవాణలపై కూడా కేసులు పెట్టారు. -
కబేళాకు తరలిస్తున్న పశువుల పట్టివేత
కాజీపేట : కబేళాకు తరలిస్తున్న 55 పశువులను గో సంరక్షణ సమితి సభ్యుల ఫిర్యాదు మేరకు గురువారం స్వాధీనం చేసుకుని నలుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ ఎల్.రమేష్‌కుమార్ తెలిపారు. విజయవాడ నుంచి కాజీపేట మీదుగా పశువులను కబేళాలకు తరలిస్తున్నారని గో సంరక్షణ సమితి సభ్యులు 100 నెంబర్‌కు ఫోన్లో ఫిర్యాదు చేశారని, దీంతో బాపూజీనగర్ చౌరస్తా వద్ద కంటైనర్ వాహనంలో హైదరాబాద్‌కు తరలుతున్న పశువులను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. కాజీపేట పీఎస్‌లో కేసు నమోదు చేసి పశువులను ధర్మసాగర్ మండలం ముప్పారంలోని బృందావనం గోసంరక్షణశాలకు తరలించారు. -
మంచి మాంసానికి ఇంకెన్నాళ్లు?
పనులు పూర్తయినా అందుబాటులోకి రాని స్లాటర్‌హౌస్‌లు సిటీబ్యూరో: మాంసంలో కల్తీ జరుగకుండా ఉండేందుకు, గ్రేటర్ కార్పొరేషన్‌కు మాంసపు వ్యర్థాల నిర్వహణ భారం తగ్గించేందుకు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నగర ప్రజల అవసరాల కోసం ఆధునిక స్లాటర్‌హౌస్‌ల ఏర్పాటుకు అవసరమైన నిధులు మంజూరు చేశారు. నాలుగు స్లాటర్ హౌస్‌లతోపాటు ఒక రెండరింగ్(మాంసపు వ్యర్థాల ప్రాసెసింగ్) ప్లాంట్ ఏర్పాటుకు దాదాపు రూ. 70 కోట్లు వెచ్చించారు. దేశంలోని మరే ఇతర నగరాల్లో లేని విధంగా అంతర్జాతీయ ప్రమాణాల కనుగుణంగా అత్యాధునికంగా వీటిని ఏర్పాటు చేయాలని భావించారు. వివిధ కారణాలతో తీవ్ర జాప్యం జరిగినప్పటికీ ఎట్టకేలకు రెండేళ్లక్రితం ప్లాంట్ల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. అంబర్‌పేట, న్యూబోయిగూడ, గౌలిపురా, రామ్నాస్పురాలలో ఆధునిక స్లాటర్‌హౌస్‌లు, చెంగిచెర్లలో రెండరింగ్ ప్లాంటు ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. రెండరింగ్ప్లాంట్ను జర్మనీకి చెందిన కంపెనీ, నాలుగు స్లాటర్‌హౌస్‌లను నెదర్లాండ్ కంపెనీలు అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేశాయి. వీటి ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ (ఓ అండ్ ఎం) కోసం టెండర్లు ఆహ్వానించి కాంట్రాక్టు ఏజెన్సీలను సైతం ఎంపిక చేశారు. ఇది జరిగి రెండేళ్లయినా.. ఎంపికైన కాంట్రాక్టు సంస్థలకు నిర్వహణ బాధ్యతలు మాత్రం ఇంకా అప్పగించలేదు. గౌలిపురా స్లాటర్ హౌస్‌కు సంబంధించి.. ప్లాంట్ ఏర్పాటు చేసిన భూమి పరిసరాల్లోని కొన్ని భూములు కోర్టు వివాదంలో ఉండటంతో అక్కడ కాంట్రాక్టు సంస్థకు బాధ్యతలప్పగించలేదు. మిగతా ప్రాంతాల్లోని స్లాటర్‌హౌస్‌లను కాంట్రాక్టు పొందిన సంస్థలకు అప్పగించకపోవడానికి కారణం రెండరింగ్ ప్లాంట్ వినియోగంలోకి రాకపోవడం. స్లాటర్ హౌస్‌ల నిర్వహణకు సంబంధించిన నిబంధనలు, పీసీబీ నిబంధనలు తదితర అంశాల నేపథ్యంలో స్లాటర్ హౌస్‌లను వాణిజ్య కార్యకలాపాలకు వినియోగించాలంటే.. వాటినుంచి వెలువడే జంతువ్యర్థాలను ప్రాసెసింగ్ చేసే యూనిట్ 25 కి.మీ.లలోపు దూరంలో అందుబాటులో ఉండాలని సంబంధిత నిపుణులు పేర్కొంటున్నారు. చెంగిచెర్లలోని రెండరింగ్ ప్లాంట్ పూర్తయి, దానికి సైతం ఓ అండ్ ఎంకు టెండర్లు పిలిచినప్పటికీ.. చెంగిచెర్లలోని స్లాటర్ హౌస్ నిర్వాహకులు రెండరింగ్ప్లాంట్ నిర్వహణ తమకే ఇవ్వాలంటూ కోర్టు నాశ్రయించినట్లు తెలిసింది. కోర్టు తీర్పు వెలువడేంత వరకు దాని నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకెవరికీ కాంట్రాక్టుకివ్వరాదని కోర్టు ఆదేశించినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. దాంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో దాదాపు రూ.70 కోట్లు వెచ్చించి నెలకొల్పిన ప్లాంట్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. మరోవైపు స్లాటర్ హౌస్‌ల నిర్వహణను మాంసం అమ్మకం వృత్తిగా కలిగిన వారికే కాంట్రాక్టు కివ్వాలనే వివాదాలు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చెంగిచెర్లలోని మీట్ కార్పొరేషన్‌కు చెందిన జంతువధశాల కాంట్రాక్టు పొందిన నిర్వాహకులే అటు రెండరింగ్ప్లాంట్తో పాటు ఇటు స్లాటర్‌హౌస్‌లను ఇతరులకు ఓ అండ్ ఎం బాధ్యతలు అప్పగించకుండా వివిధ ప్రయత్నాలతోపాటు రాజకీయంగానూ చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలున్నాయి. రాజకీయ కారణాల వల్లే జీహెచ్ఎంసీ సైతం చేష్టలుడిగి చూస్తోందనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం నాలుగు స్లాటర్ హౌస్‌లను వందరోజుల ప్రణాళికలో ఉన్నందున ఆలోగా అవి అందుబాటులోకి రాగలవని పలువురు విశ్వసిస్తున్నారు. ప్రమాణాలు పాటించాలి.. కేంద్ర ప్రభుత్వం, పీసీబీ తదితర నిబంధనల మేరకు స్లాటర్‌హౌస్‌లు తగిన ప్రమాణాలు పాటించాలి. అపరిశుభ్రత, దుర్గంధాలకు తావులేకుండా ఏర్పాట్లుండాలి. జంతువ్యర్థాలను సరైన పద్ధతుల్లో డిస్పోజ్ చేయాలి. అంటే.. రెండరింగ్ప్లాంట్లో ప్రాసెసింగ్ చేయాలి. పరిసరాల ప్రజలకు కాలుష్యం వెదజల్లకుండా తగిన పర్యావరణ ఏర్పాట్లు చేయాలి. మొక్కలు నాటాలి. పార్కింగ్ సదుపాయాలుండాలి. ప్రతి మూడునెలలకోమారు సంబంధిత సంస్థలు తనిఖీలు నిర్వహించాలి ప్రారంభోత్సవం జరిగినా.. రెండేళ్ల క్రితమే స్లాటర్‌హౌస్‌ల నిర్మాణాలు పూర్తికావడంతో అప్పటి మేయర్ మాజిద్ హుస్సేన్ రామ్నాస్పురాలోని స్లాటర్‌హౌస్‌కు లాంఛనంగా ప్రారంభోత్సవం కూడా చేశారు. అంతకుమించి ఓ అండ్ ఎం పనులు జరగలేదు. స్లాటర్ హౌస్‌లు వినియోగంలోకి వస్తే.. జీహెచ్ఎంసీకి ఏటా దాదాపు రూ. 30 కోట్ల ఆదాయం రానుండటమే కాక, వేల టన్నుల మాంసం విదే శాలకు ఎగుమతయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. స్లాటర్ హోస్లో జంతువులను ఇలా వధిస్తారు ఈ ఆధునిక వధశాలల్లో శాస్త్రీయ పద్ధతుల్లో జంతువుల్ని వధిస్తారు. వధించేందుకు ముందు ఒక యంత్రం వద్ద హలాల్ చేస్తారు. జంతువుల చర్మం, ఎముకలు, ఇతరత్రా వ్యర్థాలు వేర్వేరు మార్గాల్లోవచ్చేలా ప్లాంట్లలో ప్రత్యేక ఏర్పాట్లున్నా యి. రక్తం సైతం ఆటోమేటిక్‌గా ప్రత్యేక ట్యాంకులోకి చేరుతుంది. ఆహారంలో వినియోగించే మాంసం మాత్రమే విడిగా వచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లున్నాయి. మాంసం చెడిపోకుండా నిల్వ ఉంచేందుకు కోల్డ్ స్టోరేజీ ఏర్పాట్లున్నాయి. జంతువులుఆరోగ్యంగా ఉన్నట్లు వెటర్నరీ అధికారులు పరీక్షించి నిర్ధారిస్తారు. ఇక్కడ వృథా ఆయ్యే వ్యర్థాలంటూ ఉండవు. స్లాటర్ హౌస్‌లలో నీటినిల్వ చేసేందుకు పెద్ద నీటి ట్యాంకులు, తదితర ఏర్పాట్లున్నాయి. పరిసరాల్లో దుర్గంధం వెదజల్లకుండా వాయువులు ఆకాశంలోకి పోయేలా ఎత్తై గొట్టాలు ఏర్పాటు చేశారు. అంబర్‌పేట స్లాటర్ హౌస్ ప్లాంట్ వ్యయం : రూ. 22.16 కోట్లు కాంట్రాక్టు విలువ: రూ. 10 కోట్లు స్లాటర్‌హౌస్ సామర్ధ్యం: 2వేల గొర్రెలు/ మేకలు, 300 పశువులు న్యూబోయిగూడ.. ప్లాంట్ వ్యయం : రూ. 14.92 కోట్లు కాంట్రాక్టు విలువ: రూ. 9 కోట్లు సామర్ధ్యం: 2వేల గొర్రెలు/ మేకలు, 200 పశువులు రామ్నాస్పురా.. ప్లాంట్ వ్యయం : రూ.8.61 కోట్లు కాంట్రాక్టు విలువ: రూ. 3.5 కోట్లు స్లాటర్‌హౌస్ సామర్ధ్యం: 100 పశువులు గౌలిపురా : వ్యయం : రూ.4.38 కోట్లు, కాంట్రాక్టు విలువ: రూ. 1.5 కోట్లు , సామర్ధ్యం: , 400 మేకలు/గొర్రెలు చెంగిచెర్ల రెండరింగ్ ప్లాంట్ : వ్యయం రూ. 19.17 కోట్లు, ఓ అండ్ఎం కాంట్రాక్టు అంచనా : రూ. 6 కోట్లు ,ప్రాసెసింగ్ సామర్ధ్యం: 80 మెట్రిక్ టన్నులు -
ఆవుల తరలింపును అడ్డుకున్న పోలీసులు
విజయవాడ (పడమట) : మూడు లారీల్లో ఆవులను గుంటూరులోని కబేళాకు తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటన విజయవాడలోని ఏలూరు రోడ్డులో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. మూడు లారీల్లో 80 ఆవులను తరలిస్తుండగా జ్ఞాన విజ్ఞాన వేదిక సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దాడులు చేసి లారీ డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. ఆవులను గుంటూరులోని గో సంరక్షణ కేంద్రానికి తరలించారు.