breaking news
SKS Microfinance
-
భారత్ ఫైనాన్షియల్ ‘ఇన్‌క్లూజన్’గా ఎస్కేఎస్ మైక్రో ఫైనాన్స్
న్యూఢిల్లీ: ఎస్కేఎస్ మైక్రో ఫైనాన్స్ కంపెనీ పేరు భారత్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్గా మారింది. సోమవారం (ఈ నెల 13) నుంచి ఈ కొత్త పేరు అమల్లోకి వస్తుందని కంపెనీ వెల్లడించింది. భారత్‌లో అతి పెద్ద సూక్ష్మరుణ సంస్థల్లో ఒకటిగా భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్(గతంలో ఎస్కేఎస్ మైక్రోఫైనాన్స్) కార్యకాలాపాలు నిర్వహిస్తోంది. 18 రాష్ట్రాల్లో లక్షకు పైగా గ్రామాల్లో 63.65 లక్షల మహిళ సభ్యుల సూక్ష్మ రుణ అవసరాలను తీరుస్తోంది. ఈ సంస్థ రుణ రికవరీ పద్ధతులు దారుణంగా ఉండటంతో పలువురు ఆత్మహత్యలకు పాల్పడడం 2010లో సంచలనం సృష్టించింది. ఇక బీఎస్ఈలో సోమవారం భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ షేర్ 1.1 శాతం తగ్గి రూ.668 వద్ద ముగిసింది. -
దుమ్మురేపిన మార్కెట్
ఇటీవల కన్సాలిడేషన్ దిశలో కదలుతున్న మార్కెట్లు మళ్లీ పుంజుకున్నాయి. వెరసి సెన్సెక్స్ గత పది రోజుల్లోలేని విధంగా 319 పాయింట్లు ఎగసింది. తొలిసారి 24,500కు ఎగువన 24,693 వద్ద నిలిచింది. ఈ బాటలో నిఫ్టీ కూడా 91 పాయింట్లు పురోగమించి 7,400 సమీపాన 7,367 వద్ద స్థిరపడింది. ఇవి కొత్త గరిష్ట స్థాయి ముగింపులుకాగా, బ్యాంకింగ్, విద్యుత్, ఆయిల్, రియల్టీ, మెటల్, క్యాపిటల్ గూడ్స్ రంగాలు 4-2% మధ్య బలపడ్డాయి. ఎఫ్ఎంసీజీ నామమాత్రంగా నష్టపోయింది. మోడీ అధ్యక్షతన బాధ్యతలు చేపట్టనున్న ఎన్డీఏ ప్రభుత్వం విద్యుత్, ఇన్ఫ్రా, తయారీ, బ్యాంకింగ్ తదితర రంగాలకు జోష్‌నిచ్చేందుకు పటిష్ట చర్యలను చేపడుతుందన్న అంచనాలు ఆయా రంగాల షేర్లకు డిమాండ్ పెంచుతున్నాయని నిపుణులు విశ్లేషించారు. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకురానున్న సంస్కరణలు, మెరుగుపడనున్న పెట్టుబడి వాతావరణం కారణంగా వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి 6.5%కు పుంజుకుంటుందన్న అంచనాను గోల్డ్‌మన్ శాక్స్ వెలువరించడంతో సెంటిమెంట్ మెరుగుపడిందని తెలిపారు. ప్రభుత్వ బ్యాంకుల జోష్ ఆర్థిక ఫలితాలు ప్రకటించిన ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ ఏకంగా 10% జంప్‌చేయడంతో బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 18,000 కోట్లకుపైగా ఎగసి రూ. 2,05,700 కోట్లకు చేరింది. షేరు ఇంట్రాడేలో మూడేళ్ల గరిష్టం రూ. 2,775ను తాకి చివరికి రూ. 2,755 వద్ద ముగిసింది. ఈ బాటలో కెనరా బ్యాంక్ 13% దూసుకె ళ్లగా, ఓబీసీ, ఆంధ్రా, సెంట్రల్, సిండికేట్, కార్పొరేషన్, అలహాబాద్ బ్యాంక్‌లతోపాటు బీవోఐ, పీఎన్బీ, బీవోబీ 9-3% మధ్య లాభపడ్డాయి. ఇక సెన్సెక్స్ దిగ్గజాలలో టాటా పవర్, మారుతీ, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, సెసాస్టెరిలైట్, భెల్, భారతీ, ఆర్ఐఎల్, ఎంఅండ్ఎం, ఎల్అండ్టీ 6-2% మధ్య పుంజుకోగా, హిందాల్కో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐటీసీ 2-5% మధ్య నష్టపోయాయి. గత మూడు రోజుల్లో రూ. 650 కోట్లకుపైగా అమ్మకాలు చేపట్టిన ఎఫ్ఐఐలు తాజాగా రూ. 417 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. చిన్న షేర్లకు డిమాండ్ యథాప్రకారం చిన్న షేర్లకు డిమాండ్ కొనసాగింది. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు దాదాపు 2% లాభపడ్డాయి. మిడ్ క్యాప్స్‌లో రెయిన్, కోల్టే పాటిల్, హెచ్‌సీఎల్ ఇన్ఫో, బజాజ్ హిందుస్తాన్, అశోక్ లేలాండ్, స్పైస్‌జెట్, టాటా టెలీ, జిందాల్ సౌత్, జైన్ ఇరిగేషన్, ఐఎఫ్సీఐ, సుజ్లాన్, ల్యాంకో ఇన్ఫ్రా, మహీంద్రా హాలిడే, నాల్కో, అడ్వాంటా, ఐఐఎఫ్ఎల్, హిందుస్తాన్ జింక్, బీఏఎస్ఎఫ్, బాంబే డయింగ్, బాల్మర్ లారీ, మోనట్ ఇస్పాత్, పుంజ్లాయిండ్, పొలారిస్ ఫైనాన్షియల్ 20-7% మధ్య జంప్ చేశాయి. -
ఎస్కేఎస్ ముంబైకి తరలుతోంది..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎస్కేఎస్ మైక్రోఫైనాన్స్ నమోదిత కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రలోని ముంబైకి తరలించేందుకు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అనుమతిచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడేళ్ల క్రితం సూక్ష్మ రుణ సంస్థల కార్యకలాపాల విషయంలో నిబంధనలను కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. దీంతో కంపెనీకి ఇక్కడ వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. దాదాపు 14 ఏళ్ల క్రితం రాష్ట్రంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన కంపెనీ అంచెలంచెలుగా ఎదిగి 15 రాష్ట్రాలకు విస్తరించింది. వ్యాపార పరంగా చూస్తే మూడేళ్ల క్రితం వరకూ కంపెనీకి సింహ భాగం ఆంధ్రప్రదేశ్ నుంచే సమకూరేది. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితులు తారుమారయ్యాయి. ఈ కారణంగానే ఎస్కేఎస్ మహారాష్ట్రకు తరలుతున్నట్టుగా తెలుస్తోంది. నూతన కార్యాలయాన్ని ముంబైలో ఎక్కడ ఏర్పాటు చేసేది ఇంకా నిర్ణయించలేదని కంపెనీ ప్రతినిధి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కాగా, కార్యాలయాన్ని తరలిస్తున్నందున 10వ ఏజీఎంను డిసెంబరు 31లోగా నిర్వహించుకునేందుకు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ అనుమతిచ్చింది.