breaking news
sisiter
-
ఓ మై గాడ్.. వీరిద్దరూ ఎంత ముద్దుగా ఉన్నారు!
ఓ చిన్నారి తన అక్కకు మేకప్ వేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ అక్కాచెల్లెళ్లు ఒకరిపట్ల ఒకరూ ప్రేమ కురిపించుకోవడం చూసి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. ఈ వీడియోలో 11 ఏళ్ల వర్తీ తన అక్కకు మేకప్ వేస్తున్న తీరు చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కలిస్టా అనే యువతి 11 ఏళ్ల చెల్లెలు వర్తీ.. తన అక్కను మేకోవర్ చేస్తున్న ఈ వీడియోకు ఇప్పటి వరకు వేలల్లో లైక్స్ వందల్లో కామెంట్స్ వచ్చాయి. ఇప్పటికీ ఆ సంఖ్య పెరుగుతూనే ఉంది. (చదవండి: వేధింపులకు తాళలేక టిక్‌టాక్ స్టార్ ఆత్మహత్య) ‘చాప్ స్టిక్ ఎల్లప్పుడూ అవసరం అంటూ’ కలిస్టా తన ఇన్‌స్టాగ్రామ్‌లో మంగళవారం ఈ వీడియో షేర్ చేసింది. ఇందులో వర్తీ తన అక్క తల దువ్వుతూ.. మేకప్ వేసి లిప్‌స్టిక్ పెడుతూ కలిస్టాను అందంగా తీర్చిదిద్దుతోంది. ‘ఓ మై గాడ్ ఈ అక్కాచెల్లెల్లు ఎంత ముద్దుగా ఉన్నారు’, ‘ఈ వీడియో చాలా బాగుంది’, ‘వర్తీ హేర్ స్పెషలిస్టు మాత్రమే కాదు మేకప్ కూడా బాగా వేయగలదని నిరూపించుకుంటుంది’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. (చదవండి: ట్రంప్ దంపతుల విడాకులు ఖాయమేనా..) View this post on Instagram A post shared by KALISTA JAIDE HESCH (@kalistajaideee) -
ఆ మృగాన్ని శిక్షిస్తేనే వారి ఆత్మకు శాంతి
హైదరాబాద్ : ఉదయం ఇంటి నుంచి బయలుదేరింది మొదలు..తిరిగి ఇంటికొచ్చే దాకా.. గంట గంటకు ఫోన్ చేసేవారు. ఎన్నో జాగ్రత్తలు చెప్పేవారు... ..అమ్మా వేళకు బస్సు దొరికిందా? నువ్వు క్షేమంగా ఆఫీసుకు చేరుకున్నావా....జాగ్రత్తగా వెళ్లు..భోజనం చేశావా.. .ఇంటికొచ్చేటప్పుడు జాగ్రత్త అంటూ నా కన్నతల్లిలా నా బిడ్డలు నన్ను ఫోన్లో పలకరించేవారు. వాళ్లు చదువుల సరస్వతులు. నేను ఎన్ని కష్టాలొచ్చినాసరే వారిని బాగా చదివించాలనుకున్నాను. నా బంగారు తల్లుల కలలు నిజం చేయాలనుకున్నాను. కానీ వాడు నా ఇద్దరు బిడ్డలను దారుణంగా చంపేశాడు....దుఖఃతో హైమావతి గొంతు జీరబోయింది. ఉన్మాది ఘాతుకానికి తన ఇద్దరు కూతుళ్లను కోల్పోయి వారం గడిచినా ఆమె ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. కన్నీరు మున్నీరుగా విలపిస్తూనే ఉంది. నిత్యం యామినీ సరస్వతి,శ్రీలేఖలతో ఆనందంగా గడిపే ఆ తల్లి ఇపుడు బతికున్న శవంలా కాలం వెళ్లదీస్తోంది. ఇటీవల ఇద్దరు అక్కాచెల్లెళ్లను ప్రేమోన్మాది అమిత్‌సింగ్ అత్యంత కిరాతకంగా హతమార్చిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. ఇద్దరు కూతుళ్లను కోల్పోయిన ఆ తల్లి మాత్రం పుట్టెడు దుఖఃతో తల్లడిల్లుతోంది. తన కంటికి రెప్పలా కాపాడుకున్న ఇద్దరు కూతుళ్లను కోల్పోవడంతో వెక్కి వెక్కి ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయి ధీనంగా చూస్తోంది. కోటి ఆశలు పెట్టుకొని గారాబంగా పెంచుకున్న తన ఇద్దరు కూతుళ్లను కోల్పోయి మౌనంగా రోదిస్తోంది. అత్యంత దారుణం.. హైమావతి కూతుళ్లు యామినీ సరస్వతి(22), శ్రీలేఖ(21)లను ఈనెల 14న ఉదయం 8.30 గంటలకు కొత్తపేట్‌లో వారు అద్దెకుంటున్న ఇంట్లోనే అమిత్‌సింగ్ అనే ఉన్మాది పాశవికంగా చంపి పారిపోయాడు. ఈ జంట హత్యలు జరిగి మంగళవారానికి సరిగ్గా వారమైన నిందితుడి ఆచూకీ మాత్రం ఇంకా చిక్కలేదు. కనీసం పుట్టెడు శోకంలో ఉన్న హతురాళ్ల తల్లిని ఓదార్చే విషయంలో సర్కారు పెద్దలకు మనసు రాలేదు. నిందితున్ని గంటల్లో పట్టుకుంటామని హత్య జరిగిన రోజు హడావుడి చేసిన పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండటం వారి దుఖాఃన్ని మరింత పెంచుతోంది. హస్తినాపురం(వనస్థలిపురం)లో నివాసం ఉంటున్న ఆమె సోదరుడు చౌదరిరెడ్డి ఇంట్లో తలదాచుకున్న హైమావతిని మంగళవారం 'సాక్షి' ప్రతినిధి పలకరించగా..ఆ తల్లి కన్నీళ్ల పర్యంతమైంది. కూతుళ్లే నాకు సర్వస్వం.. ఇరవై రెండేళ్లుగా నా కూతుళ్లే నాకు సర్వస్వం. వారి కోసమే నేను బతుకుతున్నా. ఇద్దరూ చదువుల్లో సరస్వతీ పుత్రులే. పెద్దమ్మాయి యామిని(22)ఇంజినీరింగ్ పూర్తిచేసింది. చదువులో ఎప్పుడూ టాప్ ర్యాంకరే. షాద్‌నగర్‌లో చదువుకున్నప్పుడు ఎస్సెస్సీలో టాపర్‌గా నిలిచింది. ఇటీవలే ఇంజినీరింగ్ పూర్తిచేసింది. బ్యాంకు పీఓ పోస్టు పరీక్షకు సన్నద్ధమౌతోంది. వారి ఉన్నత చదువుల కోసమే ఏడాది క్రితం హైదరాబాద్‌కు మకాం మార్చాం. ప్రభుత్వ ఉన్నతోద్యోగం సాధించడమే యామిని ధ్యేయం. చిన్నమ్మాయి శ్రీలేఖ(21) చేవెళ్లలోని సాగర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతోంది. ఈమె కూడా చదువుల్లో ఎప్పుడూ ఫస్ట్ ర్యాంకరే. అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదవాలన్నది ఆమెలక్ష్యం. ఇన్నేళ్లుగా నేను వారి కోసమే బతుకుతున్నా. వారి బంగారు భవిష్యత్ కోసమే కష్టపడుతున్నా. అప్పుడప్పుడూ నేను వారితో గడపాలని కోరితే వెంటనే ఉద్యోగానికి సెలవు పెట్టేదాన్నని హైమావతి జీరబోయిన గొంతుతో చెప్పింది. పరామర్శకు కూడా నోచుకోలేదు... ఇద్దరు కూతుళ్లను కోల్పోయిన నన్ను హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా మంత్రులు లకా్ష్మరెడ్డి,జూపల్లి కృష్ణారావులు కనీసం పరామర్శించలేదు. అమిత్‌సింగ్ తప్పించుకు తిరుగుతున్నా వాడిని వారం రోజులుగా పోలీసులు పట్టుకోలేకపోయారు. నా కూతుళ్లను పాశవికంగా చంపేసిన ఆ మృగాన్ని కఠినంగా శిక్షిస్తేనే వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది. భవిష్యత్‌లో ఆడపిల్లలు ఇంటి నుంచి బయటికి వెళ్లి ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేసుకోవాలంటే ఇలాంటి మృగాలను సమాజంలో బతకనీయకూడదు. మరొకరికి చూపునిచ్చిన అక్కాచెల్లెళ్లు... హత్యకు గురైన యామినీ సరస్వతి, శ్రీలేఖల నేత్రాలను ఎల్వీప్రసాద్ ఐ ఇన్సిట్యూట్‌కు దానం చేశారు. మరణించినా ఆ ఇద్దరు సరస్వతులు ఇంకొకరి జీవితాల్లో వెలుగులు నింపడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. తల్లి హైమావతి అంగీకారం మేరకే ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం జరుగుతున్న సమయంలో వారి నేత్రాలను ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్సిట్యూట్ నిపుణులు సేకరించారు. నా చేతులతో పెంచా... చిన్నప్పటి నుంచి నేను ఆ ఇద్దరమ్మాయిలతోనే ఉంటూ వారి ఆలనా పాలనా చూస్తూ నా చేతులతోనే అల్లారుముద్దుగా పెంచా. హత్య జరిగిన రోజు నేను ఇంట్లో ఉండి ఉంటే నా ప్రాణం అడ్డుపెట్టి మరీ ఆ పిల్లలను దక్కించుకునే దాన్ని. ఆ మృగాన్ని కఠినంగా శిక్షించాలి. - నారమ్మ, హతురాళ్ల అమ్మమ్మ