breaking news
Single Permit Policy
-
‘పర్మిట్’పై ప్రతిష్టంభనకు తెర ఎప్పుడు?
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా లారీల సమ్మె నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న సింగిల్ పర్మిట్ అంశం మరోమారు తెరపైకి వచ్చింది. రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు దాటుతున్నా ఇరు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని ఈ పర్మిట్ల గొడవతో తెలంగాణకు చెందిన లారీల యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం 2015 సెప్టెంబర్‌లో సింగిల్ పర్మిట్ ఒప్పందంపై సంతకం పెట్టి ఫైల్‌ను ఏపీ సీఎంకు పంపినా ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు ట్రావెల్స్ ఒత్తిడితో ఈ ఫైలుపై సంతకానికి చంద్రబాబు ససేమిరా అంటున్నారని తెలంగాణ లారీ యజమానులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ లారీల నుంచి వస్తున్న ఆదాయాన్ని దండుకోవాలనే ఆలోచనతోపాటు ప్రైవేటు ట్రావెల్స్ లాబీయింగ్‌కు తలొగ్గారని విమర్శిస్తున్నారు. తాత్కాలిక పర్మిట్‌తోనే.. ఉమ్మడి రాష్ట్రంలో రిజిస్టర్ అయిన వాహనాలు విభజన అనంతరం 2015 మార్చి 31 వరకు చలానాలు లేకుండానే తిరిగాయి. కానీ ఆ తర్వాత రెండు రాష్ట్రాలు తాత్కాలిక పర్మిట్లకు తెరతీశాయి. దీని ప్రకారం తెలంగాణ నుంచి ఒక లారీ ఆంధ్రప్రదేశ్ వెళ్లి రావడానికి తాత్కాలిక పర్మిట్ కింద రూ. 1,400, ముడుపుల కింద మరో రూ. 200 కలిపి మొత్తం రూ. 1,600 చెల్లించాల్సి వస్తోంది. ఆంధ్రప్రదేశ్ లారీలు తెలంగాణకు రావాలన్నా ఈ మొత్తాన్ని కట్టాల్సిందే. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలమైన పరిస్థితి ఉండటంతో ఆదాయం కోసం ఏపీ ప్రభుత్వం సింగిల్ పర్మిట్ ఒప్పందానికి ఆసక్తి కనబరచట్లేదు. తీరప్రాంతం లేకపోవడం, రైలు మార్గాలు కూడా తక్కువగా ఉండటంతో తెలంగాణ ఎక్కువగా రోడ్డు రవాణా మీదే ఆధారపడి ఉంది. అందులో లారీల ద్వారా జరిగే రవాణా కీలకపాత్ర పోషిస్తోంది. కానీ తెలంగాణకు చెందిన లారీల్లో ఎక్కువ వాటికి నేషనల్ పర్మిట్లు లేవు. 12 ఏళ్లు పైబడిన లారీలకు నేషనల్ పర్మిట్ ఇవ్వకపోవడంతో పాత వాహనాలు తాత్కాలిక పర్మిట్లతోనే ఏపీకి వెళ్లి వస్తున్నాయి. అదే ఏపీ విషయానికి వస్తే అక్కడ ఎక్కువగా నేషనల్ పర్మిట్ ఉన్న లారీలే ఉన్నాయి. దీంతో తెలంగాణకు రావాలన్నా అదనంగా ఏమీ చెల్లించకుండానే ఏపీ లారీలు రాకపోకలు సాగిస్తున్నాయి. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే లారీలు ప్రతిరోజూ 120 నుంచి 400 వరకు ఉంటాయని అంచనా. ఈ లారీల ద్వారా ఏటా ఏపీకి రూ. కోట్లలో ఆదాయం వస్తోంది. దీంతో ఏపీ ప్రభుత్వం సింగిల్ పర్మిట్ ఒప్పందం కుదుర్చుకునేందుకు ముందుకు రావట్లేదు. సింగిల్ పర్మిట్ అంటే...! దేశంలో సరుకు రవాణా చేసే ఏ లారీ అయినా పొరుగు రాష్ట్రాలకు వెళ్లాలంటే పర్మిట్ తప్పనిసరి. ఈ పర్మిట్లు రెండు రకాలుగా ఉంటాయి. అందులో ఒకటి నేషనల్ పర్మిట్కాగా రెండోది సింగిల్ పర్మిట్. నేషనల్ పర్మిట్ లారీలు నిర్ణీత రుసుము చెల్లించి దేశంలోని ఏ రాష్ట్రానికైనా సరుకు రవాణా చేయొచ్చు. అదే సింగిల్ పర్మిట్ మాత్రం రెండు పొరుగు రాష్ట్రాల మధ్య జరిగే ఒప్పందమన్నమాట. ఈ పర్మిట్ తీసుకున్న ఒక రాష్ట్రానికి చెందిన లారీ ఏడాదికి రూ. 5 వేలు చెల్లించి ఒప్పందం చేసుకొని పొరుగు రాష్ట్రంలో రాకపోకలు సాగించవచ్చు. దీని ప్రకారమే కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లతో సింగిల్ పర్మిట్ విధానాన్ని తెలంగాణ కొనసాగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కూడా ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, కర్ణాటకలతో సింగిల్ పర్మిట్ ఒప్పందం కుదుర్చుకున్నా తెలంగాణతో మాత్రం ఒప్పందం కుదుర్చుకోలేదు. ఈసారైనా మోక్షం కలిగించండి 2015లో జరిగిన లారీల సమ్మె సందర్భంగా కూడా ఇదే అంశాన్ని ఇరు రాష్ట్రాలకు నివేదించాం. కానీ ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పటికే పలుమార్లు ఏపీకి చెందిన రవాణా మంత్రి, అధికారులను కలిశాం. కానీ ఆ ఫైలు ఆమోదానికి నోచుకోవడం లేదు. ఈ విషయంలో తెలంగాణ సర్కారు ఏపీ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి చేయాలి. లారీల సమ్మె సందర్భంగా మేం ఇదే అంశాన్ని ప్రధానంగా పరిష్కరించాలని కోరుతున్నాం. – భాస్కర్‌రెడ్డి, తెలంగాణ లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు చంద్రబాబే కారణం తెలంగాణ ప్రభుత్వం సింగిల్ పర్మిట్ విధానానికి ఇప్పటికే ఆమోదం తెలిపింది. కానీ చంద్రబాబుతోనే పేచీ వస్తోంది. ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాల ఒత్తిడితో ఆయన నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారు. – వి.శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే (తెలంగాణ లారీ యజమానుల సంఘం గౌరవాధ్యక్షుడు) -
‘సరిహద్దు’ చిచ్చు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య మరోసారి సరిహద్దు వివాదం రాజుకుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే తెలంగాణ లారీలను చెక్‌పోస్టుల వద్ద అడ్డుకుని రోజుల తరబడి నిలిపేయటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రెండు రాష్ట్రాల మధ్య సింగిల్ పర్మిట్ విధానానికి ఒప్పందం కుదరకపోవటంతో ఇబ్బంది పడుతున్న తమను ఇప్పుడు ఏపీ అధికారులు కావాలనే వేధిస్తున్నారంటూ తెలంగాణ లారీ యజమానుల సంఘం భగ్గుమన్నది. రాష్ట్ర విభజన అనంతరం సరిహద్దు దాటాలంటే పన్ను కట్టాల్సిందేనంటూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ‘సరిహద్దు’ వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండు రాష్ట్రాల అధికారుల చర్చల ఫలితంగా వివాదం సద్దుమణిగింది. నాలుగు రోజులుగా దాచేపల్లి, పొందుగుల, నాగార్జునసాగర్ తదితర చెక్‌పోస్టుల వద్ద వందల సంఖ్యలో తెలంగాణ లారీలను ఏపీ అధికారులు నిలిపేస్తున్నారు. ఇందులో ఎక్కువగా ఇసుక లారీలే ఉన్నాయి. సరైన వే బిల్స్ ఉన్నా స్థానికంగా కంప్యూటరీకరణ లేనందున వాటిని నర్సరావుపేట కార్యాలయానికి వెళ్లి సరిచూసుకోవాలనే కారణంతో లారీలను రెండు, మూడురోజులపాటు నిలిపేశారు. దీంతో తెలంగాణ లారీ యజమానులు ధర్నాలకు కూడా దిగారు. ఇది రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారుతోందని గుర్తించిన ఏపీ అధికారులు గురువారం చాలా లారీలను వదిలేశారు. ‘తోక బిల్లు’ లేదని... ఓ చెక్‌పోస్టులో లారీని తనిఖీ చేశాక పత్రాలన్నీ సరిగా ఉంటే ‘పత్రాలు సరిగానే ఉన్నాయి సరిహద్దు దాటేందుకు అభ్యంతరం లేదు’ అని పేర్కొంటూ ఓ పత్రం ఇస్తారు. దానిని లారీల డ్రైవర్లు తోక బిల్లుగా వ్యవహరిస్తారు. ఆ బిల్లు లేదనే సాకుతో అధికారులు లారీ డ్రైవర్లను వేధిస్తున్నారని తెలంగాణ లారీ యజమానుల సంఘం ఆరోపిస్తోంది. ఒక్కో లారీ నుంచి ఏపీ అధికారులు రూ.400 వరకు వసూలు చేస్తున్నారని, ఇప్పుడు అంతకంటే ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా రెండు ప్రభుత్వాలు చర్చించుకుని లారీలకు సింగిల్ పర్మిట్ విధానం ప్రారంభించాలని తెలంగాణ లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఇసుక దందా... ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఒకరు అక్రమంగా సిలికా ఇసుకను తెలంగాణకు సరఫరా చేస్తున్నట్టు బయటపడింది. తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల నుంచి ఇసుక సరఫరా బాగా తగ్గిపోయింది. దీంతో హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో ఇసుక కొరత ఏర్పడింది. దీన్ని ఆసరా చేసుకున్న ఆ ఎమ్మెల్యే చిలుకలూరిపేట, రేపల్లె తదితర ప్రాంతాల నుంచి సిలికా ఇసుక అక్రమ సరఫరాకు తెరలేపారు. దీనికి ఆ ఎమ్మెల్యే హైదరాబాద్‌కు చెందిన లారీలనే వినియోగించటం గమనార్హం. అధికారులు పట్టుకున్న లారీల్లో ఇవీ ఉండటంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.