breaking news
silver jubilee conference
-
'జై తెలంగాణ.. జై ఆంధ్ర... జై హింద్'
► ఎక్కడ ఉన్నా.. తెలుగువారంతా ఒక్కటే : ఎంపీ కవిత ► రెండో రోజు అంగరంగ వైభవంగా ఆటా ఉత్సవాలు ► బతుకమ్మ బోనాలతో ఘనస్వాగతం ► హాజరైన తెలంగాణ, ఏపీలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు రాయికల్: ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఒక్కటేనని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. అమెరికాలోని చికాగోలో ఆటా రజతోత్సవ వేడుకలలో రెండో రోజైన శనివారం కార్యక్రమానికి ఎంపీ కవిత ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఏ దేశంలోనైనా ఏదైనా ప్రమాదం జరిగితే తెలుగువారు ఎలా ఉన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీస్తారని కవిత చెప్పారు. గతంలో అమెరికా అంటేనే తానా మహాసభలు, ఆటా మహాసభలు గుర్తుకు వచ్చేవని పేర్కొన్నారు. ముఖ్యంగా తెలుగు ఆచార సంప్రదాయాలను కాపాడటం కోసం ఆటా చేస్తున్న కృషి సహకరించిన ప్రతినిధులను అభినందించారు. కేవలం పరిపాలన సౌలభ్యం కోసం మాత్రమే రాష్ట్రాలు విడిపోయాయని అన్నారు. జై తెలంగాణ.. జై ఆంధ్ర... జై హింద్ తన ప్రసంగాన్ని ముగించారు. అనంతరం తెలంగాణ సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధూంధాం అలరించింది. కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ బోనాలతో సభావేదికపైకి చేరుకోవడం ఆకట్టుకుంది. కార్యక్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కార్మిక, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, భానుప్రసాద్, ఎంపీ జితేందర్‌రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, కాంగ్రెస్‌పార్టీ నాయకులు మధుయాష్కీగౌడ్, రాజగోపాల్‌రెడ్డి, ఆటా సంఘం అధ్యక్షుడు పెర్కారి సుధాకర్, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. -
ఆటా రెండో రోజు ఉత్సవాలు
(ఆటా సమావేశాల నుంచి జీ.శ్రీనాథ్): ఆత్మీయ పరిచయాలు, కళా ప్రదర్శనలు, వ్యాపార-వాణిజ్య ఎగ్జిబిషన్లు, రాజకీయ నాయకుల ప్రసంగాలు.. ఇవీ రెండో రోజు అమెరికా తెలుగు సంఘం రజతోత్సవాల్లో ముఖ్యాంశాలు. అమెరికాలోని 50 సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న తెలుగు కుటుంబాలకు చెందిన దాదాపు పది వేల మంది చికాగోలోని రోజ్ మంట్ కన్వెన్షన్ సెంటర్‌కు బారులు తీరారు. అమెరికాలో ఎండా కాలం సెలవులు కొనసాగుతుండడంతో పాటు బిగ్ వీకెండ్ కావడంతో పెద్ద ఎత్తున తెలుగు జనం పోటెత్తారు. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం తొమ్మిది గంటలకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఆటా అధ్యక్షుడు సుధాకర్ పేర్కరీ జ్యోతి వెలిగించి ఈ వేడుకలను ప్రారంభించారు. ఇల్లినాయిస్ గవర్నర్ బ్రూస్ రానర్ తన భార్య డయానాతో కలిసి రెండో రోజు కూడా ఆటా సమావేశాలకు హాజరయ్యారు. వరుసగా రెండో రోజూ సుదీర్ఘ ఉపన్యాసం చేశారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. తొలి రోజు చెప్పిన ప్రసంగాన్ని మళ్లీ రిపీట్ చేసిన వెంకయ్య.. దానికి అదనంగా మరింత విశ్లేషణను జోడించారు. చెప్పిన విషయాన్నే వేర్వేరు సామెతలు, భాషా ప్రయోగాలతో, ఆకట్టుకునే మాటలను జోడించి ఆహుతులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం ముందుకు దూసుకుపోతోందని చెప్పుకొచ్చారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. తాను నిద్ర పోడని, ఎవరిని నిద్ర పోనివ్వట్లేదని కొందరు కలత చెందుతున్నారని, అయితే మోదీ కష్టమంతా దేశం కోసమేనన్నారు వెంకయ్య. అలాగే గతంలోలా దేశ సంపదను తాను తినడని, ఎవరిని తిననివ్వడన్నారు. అమెరికాలో ఎంతో అభివృద్ధి చెందిన ప్రవాస తెలుగు ప్రజలు.. తమ వంతుగా తాము పుట్టి పెరిగిన ఊర్లకు ఎంతో కొంత సాయమందించాలన్నారు. ఎంత సంపాదించినా.. అది కేవలం అద్దంలో చూసుకోడానికేనని, అదే సంపదను కొంత మొత్తం తమ వాళ్లకు అందించగలిగితే ఆ తృప్తి వేరన్నారు. ఇక్కడి ఎన్నారైలు ఇప్పటికీ వైఎస్సార్ సంక్షేమ పాలనను గుర్తు చేసుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. అలాంటి పాలన మళ్లీ జగన్ నేతృత్వంలో రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ అభివృద్ధికి ఎన్నారైల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. మీరందరూ ముందుకు వచ్చి అక్కడ పెట్టుబడులతో పాటూ ఇతర కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని మిథున్ రెడ్డి కోరారు. అలరించిన కార్యక్రమాలు తెలుగు వారు పెద్ద సంఖ్యలో ఒక చోట కలిస్తే పండగ. అది అమలాపురం అయినా.. అమెరికా అయినా.. అంతే సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించారు. ఆటా వేడుకల్లో ఓ వైపు సాహిత్య, కళా ప్రదర్శనలు ఆస్వాదిస్తూనే మరో వైపు షాపింగ్, గేమింగ్, యూత్ ఫెస్టివల్స్, పొలిటికల్ డిస్కషన్స్, ఇతర కార్యక్రమాలతో గడిపారు. ఆరోగ్యం ఆరోగ్యం కోసం ఆటా వేదికగా ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించారు. క్యాన్సర్ నివారక యోగ థెరపీలను ప్రాక్టీస్ చేయించారు. అలాగే సూపర్ బ్రెయిన్ యోగా, మెడిటేషన్, ఒత్తిడిని నివారించేందుకు కసరత్తులు చేయించారు. పంచకర్మ, ఆయుర్వేద థెరపీలతో పాటు ఓ ప్రశ్న-జవాబుల సెషన్ నిర్వహించారు. యూత్ ఫెస్టివల్స్ తెలుగు రాష్త్రాల్లో ఉన్న యూనివర్సిటీలు, వివిధ ప్రముఖ కాలేజీల నుంచి అమెరికాలో సెటిలయిన విద్యార్థులు.. తమ తమ విద్యాసంస్థలకు సంబంధించి గెట్ టు గెదర్ కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. ఆట పాటలతో హోరెత్తించారు. కళా ప్రదర్శనలు వివిధ నృత్యరూపాలు, కూచిపూడి, జానపదంతో సయ్యాట అనిపించారు ఇక్కడి వాళ్లు. తెలుగు గడ్డకు ఎంతో దూరంలో ఉన్నా.. ఇక్కడి కళలను మాత్రం ఆదరిస్తూనే ఉన్నామని తమ ప్రదర్శనలతో నిరూపించారు. బిజినెస్ మీటింగ్స్ ఆటా ఉత్సవాలు జరుగుతున్న కన్వెన్షన్ సెంటర్లోనే దాదాపు 50 స్టాళ్లు ఏర్పాటు చేశారు. నగలు, అభరణాలు, దుస్తులు, వంటకాలకు సంబంధించిన స్టాళ్ల దగ్గర హడావిడి కనిపించింది. దీంతో పాటు రియల్ ఎస్టేట్ స్టాళ్లు ఎక్కువగా కనిపించాయి. తెలుగు రాష్ట్రాల్లో నిర్మించబోతున్న వివిధ ప్రాజెక్టుల గురించి తెలుపుతూ ఎన్నారైలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. వేర్వేరు రంగాల వ్యాపార వేత్తలు ఎన్నారైలతో చర్చలు జరిపారు. ఇన్వెస్ట్ మెంట్ల గురించి చర్చించారు. పెళ్లి సంబంధాలు నలుగురు తెలుగు వారు కలిస్తే.. చర్చకు వచ్చే మొదటి అంశం పెళ్లి సంబంధం. తెలుగు కన్వెన్షన్లు ఎక్కడ జరిగినా.. ఎన్నారైలలో ఇదే తాపత్రయం. వీరి ఆసక్తిని గమనించిన మాట్రిమోనియల్ కంపెనీలు.. ఆటా వేదికగా ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేసుకున్నారు. ఏ అబ్బాయికి, ఏ అమ్మాయి కుదురుతుందన్న డాటా బేస్‌లతో తల్లితండ్రులకు వివరించారు. అగ్రరాజ్యంలో సెటిల్ అయినా కుల, ప్రాంతాలకు సంబంధించిన విషయాల్లో మాత్రం రాజీ పడకపోవడం కనిపించింది. అమెరికాలో ఫలానా రాష్ట్రంలో మా అమ్మాయి ఉంది, మాకు ఇక్కడి అబ్బాయి కోసం చూస్తున్నామని, ఇండియా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేకంటే ఇక్కడి వారి సంబంధం కోపమే చూస్తున్నామని ఓ తండ్రి అభిప్రాయపడ్డారు. ప్రత్యేక ఆకర్షణగా బతుకమ్మ తెలంగాణ ఎంపీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో బతుకమ్మ వేడుకలను ఆటాలో ప్రత్యేకంగా జరుపుకున్నారు. పలువురు తెలంగాణ ఎన్నారై మహిళలు రంగురంగుల పూలతో పెద్ద పెద్ద బతుకమ్మలతో తరలివచ్చారు. అమ్మవారి ప్రతిమతోపాటు, త్రిశూలాలు, ఇతర పూజా సామాగ్రి.. అచ్చం తెలంగాణ సంస్కృతి కొలువు దీరినట్లు కనిపించింది. బతుకమ్మ తరలి వస్తుంటే పలువురు ఆనందంతో నృత్యం చేశారు. 'ప్రపంచంలో తెలుగు వారంతా ఒక్కటే. రాష్ట్రఆలు కేవలం పరిపాలనా సౌలభ్యం కోసమే విభజించినా.. విదేశాల్లో మాత్రం తెలుగు వారంతా కలిసే ఉంటారని అనడానికి ఈ వేడుకలే నిదర్శనం. విదేశాల్లో ఏ కార్యక్రమం జరిగినా, ఎవరికి సాయం కావాల్సి వచ్చినా తెలంగాణ సీఎం కెసిఆర్ ముందుంటారన్నారు. జై తెలంగాణ, జై ఆంధ్ర, జై హింద్' అని కవిత అన్నారు.