breaking news
SIDDIPET One Town police
-
మొక్కే కదా అని పీకేస్తే.. కేసే!
సాక్షి, సిద్దిపేట: హరితహారంలో భాగంగా నాటిన మొక్కను ఓ దుకాణ యజమాని తొలగించడంతో అతనిపై సిద్ధిపేట వన్‌టౌన్ ఠాణాలో గురువారం కేసు నమోదైంది. సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మోహినిపురా వెంకటేశ్వరాలయం సమీపంలో ఓ చెప్పుల దుకాణం ఎదుట నాలుగు రోజుల క్రితం స్థానిక కౌన్సిలర్, అధికారులు హరితహారంలో భాగంగా వేప మొక్కలు నాటారు. ఈ నెల 7న రాత్రి అక్కడి దుకాణం యజమాని ఉమేశ్ మొక్కను తొలగించాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ ఘటన వెలుగుచూడడంతో పట్టణ ఉద్యాన శాఖాధికారి ఐలయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
వార్ పేరుతో రియల్ బెదిరింపులు
సిద్దిపేట క్రైం : సులువుగా డబ్బు సంపాదించేందుకు పీపుల్స్‌వార్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులను టార్గెట్ చేస్తున్న ముఠా గుట్టును సిద్దిపేట వన్‌టౌన్ పోలీసులు రట్టు చేశారు. ఘటన వివరాలను మంగళవారం వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్ వెల్లడించారు. సిద్దిపేట పట్టణం భారత్‌నగర్‌కు చెందిన ఆరగొండ విఠల్, లక్ష్మీనారాయణ సోదరులు. వీరి మధ్య ఆస్తి తగదాలున్నాయి. ఈ క్రమంలో లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన అడెపు కృష్ణమూర్తిని కలిసి తమ వివాదం గురించి చెప్పాడు. దీంతో కృష్ణమూర్తి.. గతంలో పీపుల్స్‌వార్ అనుబంధ సంస్థ ఆర్ఎస్యూలో పని చేసిన వరంగల్ జిల్లా బొడ్లాడ మండలం నెల్లికుదురుకు చెందిన రాపాక శ్రీరాములు అలియాస్ ప్రసాద్‌ను లక్ష్మీనారాయణకు పరిచయం చేశాడు. ప్రసాద్‌తో పాటు కృష్ణమూర్తి, వెంకటేశ్వరరావు, కొమురయ్య, జెట్టి యాకయ్య, రావుల యాకయ్య, ఉడుగుల కృష్ణ కలిసి ముఠాగా ఏర్పడ్డారు. విఠల్-లక్ష్మీనారాయణ మధ్య ఉన్న ఆస్తి తగదాను అనువుగా చేసుకుని ప్రజాప్రతిఘటన పార్టీ శ్యాం పేరున లేఖలు ముద్రించి, విఠల్‌కు బెదిరింపు లేఖ రాశారు. అందులో విఠల్ ఆస్తి వివరాలను పేర్కొంటూ తమకు రూ. 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గుట్టు రట్టయిందిలా.. మొదట బెదిరింపు లేఖపై విఠల్ స్పందించలేదు. దీంతో ముఠా సభ్యులు ఫోన్‌చేసి కుటుంబసభ్యులందరిని చంపేస్తామని బెదిరించారు. విఠల్ భయపడి రూ.50 వేలు ప్రసాద్‌కు అందించాడు. మరో వారం తర్వాత ప్రసాద్ ఫోన్‌చేసి మిగతా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో విఠల్ వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల సూచనతో విఠల్.. సిద్దిపేటకు వచ్చి డబ్బులు తీసుకోవాలని ప్రసాద్ ముఠాకు చెప్పాడు. మంగళవారం ప్రసాద్, కృష్ణ, కొమురయ్య, జెట్టి యాకయ్య, రావుల యాకయ్య సిద్దిపేట వచ్చారు. మాటువేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, రూ. 40వేలు, కత్తి స్వాధీనం చేసుకున్నారు. గతంలో వీరు బెదిరించి వసూలు చేసిన రూ. 98వేలు బ్యాంక్ ఖాతాలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఏడుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు వెంకటేశ్వర్రావు పరారీలో ఉన్నాడు. కేసును చేధించిన వన్‌టౌన్ సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి, ఐడీ సిబ్బంది సంపత్, బాల్‌రెడ్డి, చంద్రశేఖర్‌ను డీఎస్పీ అభినందించారు. ఏపీ, తెలంగాణలో 11 కేసులు వరంగల్ జిల్లాకు చెందిన రాపాక శ్రీరాములు అలియాస్ ప్రసాద్.. తన మిత్రుడైన సీతారాంరెడ్డితో కలిసి ప్రజాప్రతిఘటన పార్టీ శ్యాం పేరుతో లెటర్ ప్యాడ్‌ను కొట్టించి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బెదిరింపు లేఖలు రాసేవారు. బంజరాహిల్స్, జూబ్లీహిల్స్‌లో కొందరిని బెదిరించి డబ్బులు వసూలు చేయగా, అక్కడి టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ప్రసాద్.. మరో స్నేహితుడైన వెంకటేశ్వర్రావుతో కలిసి ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, ఉప్పల్ ప్రాంతాల్లోని మరికొందరికి లేఖలు రాసి డబ్బులు డిమాండ్ చేయగా, ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొవ్వూరులోని స్టోన్‌క్రషర్ యజమాని, కాకినాడలోని స్వామిజీకి కూడా ఫోన్‌చేసి బెదిరించిన కేసుల్లో అక్కడి పోలీసులకు పట్టుబడ్డారు. ప్రసాద్ ముఠాపై వివిధ ప్రాంతాల్లో 11 కేసులు నమోదైనట్టు పోలీసులు వివరించారు. ఎవరికైనా బెదిరింపు ఫోన్లు, లేఖలు వస్తే పోలీసులను సంప్రదించాలని, సెటిల్మెంట్ల జోలికి పోవద్దని డీఎస్పీ శ్రీధర్ సూచించారు.