breaking news
Siddhi Vinayaka Temple
-
‘షేక్‌హ్యాండ్ ఇవ్వండి.. ఆశీర్వాదం పొందండి’
ముంబై: సాధారణంగా ఆలయానికి వెళ్లినప్పడు పూజారి ఆశీర్వదిస్తాడు. అక్కడ ఎవరైనా సాధువులు, సన్యాసులు ఉంటే వారికి నమస్కరించి.. ఆశీర్వాదం తీసుకుంటాము. కానీ మీరు ఎప్పుడైనా కుక్క ఆశీర్వాదం తీసుకున్నారా.. లేదా. పోని దానికి భక్తితో నమస్కరించారా.. ఆ పని కూడా చేయలేదా. అయితే ఈ వీడియో చూడండి.. ఆ తర్వాత మీరు ఎప్పుడైనా గుడికి వెళ్తే.. అక్కడ కుక్క కనిపిస్తే.. ఈ వీడియో తప్పకుండా మీ మదిలో మెదులుతుంది. ఇంతకు ఆ వీడియోలో ఏం ఉందో తెలియాలంటే ఇది చదవాల్సిందే. వివరాలు.. మహారాష్ట్ర అహ్మద్‌నగర్ జిల్లా సిద్ధతేక్ ప్రాంతంలో ఉన్న సిద్ధివినాయక ఆలయం చాలా ఫేమస్. ప్రతిరోజు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తారు. (చదవండి: ఏడేళ్ల క్రితం చనిపోయిన తండ్రి.. తిరిగి ప్రత్యక్షం) ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఈ ఆలయ ప్రాంగణంలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. గుడి బయట.. మెట్ల పక్కన కాస్త ఎత్తుగా ఉన్న ప్రాంతంలో ఓ కుక్క కూర్చుని ఉంది. ఇక దర్శనం చేసుకుని బయటకు వచ్చిన భక్తులను పిలిచి మరి షేక్ హ్యాండ్ ఇవ్వడమే కాక ఆశీర్వదించింది. ఈ వింత సంఘటనను కొందరు వీడియో తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేయ్యడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఇక దీన్ని చూసిన నెటిజనులు ‘ఈ వీడియో చూసి మనసుకు ఎంతో ప్రశాంతత లభించింది.. మంచి మనసుతో ఆశీర్వదిస్తుంది’ అంటూ కామెంట్ చేస్తున్నారు. -
ఇషా అంబానీ వివాహం : మొదటి ఆహ్వానం ఎవరికంటే
ముంబై : అంబానీ కుటుంబంలో సంతోషాలు వరుస కడుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ముఖేష్ అంబానీ, నీతా అంబానీల గారాల పట్టి ఇషా అంబానీ, పిరమాల్ గ్రూప్ వారసుడు ఆనంద్ పిరమాల్ ఎంగేజ్మెంట్ ఇటలీ లేక్ కోమో అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. డిసెంబర్లో వీరి వివాహ వేడుక జరగనున్నట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకూ దీని గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఇప్పటికే ఇరు కుటుంబాలు పెళ్లి పనులు ప్రారంభించారు. ఈ క్రమంలో నిన్న రాత్రి అంబానీ కుటుంబ సభ్యులు ముంబైలోని ప్రసిద్ధ సిద్ధి వినాయకుని ఆలయాన్ని సందిర్శించారు. ఇషా - పిరమిల్‌ల తొలి వివాహ ఆహ్వాన పత్రికను వినాయకుని పాదాల చెంత ఉంచి ఎటువంటి విఘ్నాలు లేకుండా తమ కుమార్తె వివాహం జరగాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముకేష్ అంబానీ దంపతులతో పాటు వారి కుమారుడు అనంత్ అంబానీ.. ముకేష్ అంబానీ తల్లి కోకిలా బెన్ కూడా హాజరయ్యారు. గతంలో ముకేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ - శ్లోకా మెహతాల తొలి నిశ్చితార్థపు ఆహ్వాన పత్రికను కూడా ఇదే ఆలయంలో ఉంచి పూజలు నిర్వహించారు. -
అడిగిన వరాలనిచ్చే అయినవిల్లి విఘ్నేశ్వరుడు
పుణ్య తీర్థం ఎప్పటినుంచో తీరని కోరికలు ఉన్నాయా? ఎన్ని ప్రయత్నాలు చేసినా నెరవేరడం లేదా? ఏ పని తలపెట్టినా ముందుకు సాగడం లేదా? అయితే అయినవిల్లిలోని సిద్ధివినాయకుడి గుడికి వెళ్లి, ఒక టెంకాయను సమర్పించి అక్కడ కొలువుదీరిన వినాయకుడి ముందు కోరికను నివేదించుకుంటే సరి! చూడటానికి ఇదేదో వ్యాపార ప్రకటనలా ఉన్నా, తీరని కోరికలను అయినవిల్లి వినాయకుడికి విన్నవించుకుంటే ఆ కోరికను నెరవేర్చే పని భక్తవత్సలుడైన ఆ స్వామివారే స్వయంగా చూసుకుంటారని విశ్వాసం. తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలంలోని అయినవిల్లిలో కొలువైన విఘ్నేశ్వరుడు కోరిన వెంటనే వరాల నొసగే స్వామిగా ప్రసిద్ధి కెక్కాడు. స్వయంభువుగా వెలిసిన ఈ స్వామి నారికేళ ప్రియుడు. నిత్యం ప్రభాత వేళ మంగళవాద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ ఉదయం ఐదుగంటలకు స్వామివారి మేల్కొలుపుతో ఆలయ పూజలు ఆరంభమవుతాయి. ఈ స్వామి దక్షిణాభిముఖుడై భక్తులకు దర్శనమిస్తారు. ఈ స్వామిని కొలిచి దక్షయజ్ఞం విఘ్నాలు లేకుండా పూర్తి చేసినట్లు పురాణాలు ఇతిహాసాలు చెబుతున్నాయి. నిత్యం వేలాదిగా భక్తులు స్వామిని సేవించుకుంటారు. ఆలయంలో వేకువజామున స్వామికి పంచామృత అభిషేకం, నిత్యగణపతిహోమం వంటి ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. ఆలయంలో అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామివారు; శ్రీదేవి, భూదేవి సమేత కేశవస్వామివారు, క్షేత్రపాలకుని కాలభైరవస్వామివారు కొలువై ఉన్నారు. బదిలీపై జిల్లాకు వచ్చిన ఉన్నతోద్యోగులు స్వామిని దర్శిస్తే గానీ తమ పనులు ప్రారంభించరు. ఎన్నికల సమయంలో అభ్యర్థులు, పరీక్షల సమయంలో విద్యార్థులు విజయాన్ని కోరుతూ స్వామికి మొక్కులు మొక్కుకోవడం పరిపాటి. స్థలపురాణం: అయినవిల్లి వినాయకుడి ఆలయం కృతయుగం నుంచే ఉన్నట్లు తెలుస్తోంది. కాణిపాకం వినాయకుని కన్నా అయినవిల్లి గణపతి ఆలయం ప్రాచీనమైనదిగా చెబుతారు. అంతేకాదు, అయినవిల్లి వినాయకుడిని స్వయంగా వేదవ్యాసుల వారు ప్రతిష్ఠించి పూజలు నిర్వహించినట్లు స్థలపురాణం చెబుతోంది. ఇందుకు సంబంధించిన ఒక కథ ఇలా ఉంది... మహాభారత యుద్ధం ముగిసిన అనంతరం వేదవ్యాసమహర్షి తన శిష్యులను, మునులను వెంటబెట్టుకుని దక్షిణదేశ యాత్రకు వచ్చిన సందర్భంలో ఈ ప్రాంతంలో కొంతకాలం గడిపాడట. ఈ సందర్భంగా గతంలో అష్టాదశ పురాణాలు, మహాభారతం వంటివాటిని తాను చెబుతూ ఉండగా వినాయకుడు లేఖకుడిగా ఉండి వాటిని రాసిన విషయాలను నెమరువేసుకున్నాడట. ఆ సమయంలో వినాయకుడు పదే పదే తన మదిలోకి వస్తుండటంతో వేదవ్యాసుడు స్వయంగా వినాయకుడిని ప్రతిష్ఠించగా దేవతలు స్వయంగా ఆలయాన్ని నిర్మించి పూజలు చేసినట్లు పురాణ కథనం. తనను పూజించిన వారి అభీష్టాలను సిద్ధింపజేయడం వల్ల ఈ స్వామికి సిద్ధివినాయకుడు అనే పేరు వచ్చిందని ప్రతీతి. రవ్వలడ్డు, పులిహోర ప్రసాదాలు ఇక్కడి ప్రత్యేకత. నిత్యం వేలాదిమందికి ఉచిత అన్నప్రసాద వితరణ ఉంటుంది. పరీక్షల సమయంలో లక్షకలాలను స్వామివారి సన్నిధిలో ఉంచి వాటిని విద్యార్థులకు కానుకగా ఇచ్చి, వారిలో స్వామివారి అనుగ్రహమనే మనోబలాన్ని నింపడం మరో ప్రత్యేకత. ఇతర ప్రదేశాలు: ఇక్కడికి సమీపంలో ముక్తేశ్వరంలో ముక్తికాంత సమేత క్షణముక్తేశ్వరస్వామివారు కొలువై ఉన్నారు. బ్రహ్మహత్య పాప నివారణ కోసం ఈ స్వామిని శ్రీరాముడు పూజించినట్లు, శ్రమణి అనే రుషి భార్యకు శాపం విమోచనం కల్గించినట్లు చెబుతారు. ఈ ఆలయానికి ఆనుకుని ముక్తిగుండం అనే తీర్థం కనబడుతుంది. అంతేకాదు, అగస్త్యేశ్వర స్వామి వారి ఆలయం, ఇంకా సమీపంలోని ఇతర ఆలయాలను సందర్శించవచ్చు. ఆలయానికి ఇలా చేరుకోవచ్చు ∙జిల్లా కేంద్రమైన కాకినాడ మీదుగా బస్సులో అమలాపురం చేరుకుని అక్కడి నుంచి అయినవిల్లి చేరుకోవచ్చు. రాజమండ్రిలో దిగి బస్సులో రావులపాలెం మీదుగా అయినవిల్లి చేరుకోవచ్చు. – రాము భావిశెట్టి సాక్షి, అయినవిల్లి