breaking news
Short-pitched balls
-
నాటౌట్‌గా ‘ఆట' ముగించాడు!
ఐదేళ్ల క్రితం... ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్‌లో షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కొనేందుకు ఫిలిప్ హ్యూస్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాతా అదే బలహీనత వెంటాడటంతో ఆసీస్ జట్టులో సుస్థిర స్థానం సాధించలేకపోయాడు. క్రికెట్ పుస్తకంలో ఉండే, సంప్రదాయ షాట్లకు భిన్నంగా ఊళ్లలో ఆడుకునే తరహాలో ఉండే హ్యూస్ శైలికి బౌన్సర్లు కొరుకుడు పడలేదు. దాంతో జట్టులో ఎవరో గాయపడితే తప్ప అవకాశం రాని పరిస్థితి. అయితే ఫిల్ దీనిని సులువుగా వదిలి పెట్టలేదు. పట్టుదలగా పోరాడాడు. బిగ్బాష్లాంటి టోర్నీలను కాదని కౌంటీల బాట పట్టాడు. ఆసీస్ దేశవాళీ మ్యాచ్‌లలో బౌన్సర్లను ఆడటం సాధన చేశాడు. అందులో పర్ఫెక్షనిస్ట్గా మారాడు. షెఫీల్డ్ షీల్డ్ పోటీల్లో కూడా అలవోకగా బౌన్సర్లను ఎదుర్కొన్నాడు. అయితే ఈసారి మాయదారి బౌన్సర్ కెరీర్‌నే కాదు ప్రాణాలనే తీసుకుపోయింది. ఆ ఒక్క బంతి హ్యూస్కు ఆఖరిది అయింది. దానిని సరిగా అంచనా వేయడంలో జరిగిన వైఫల్యం ఈ యువ క్రికెటర్ జీవితాన్ని అర్ధంతరంగా ముగించింది. క్రికెట్‌పై పిచ్చితో... న్యూసౌత్‌వేల్స్‌లో కేవలం 7 వేల మంది జనాభా ఉన్న మాక్స్‌విలేలో హ్యూస్ పుట్టాడు. తండ్రి అరటికాయలు పండించే రైతు. పాఠశాల స్థాయిలో రగ్బీతో పాటు క్రికెట్లో రాణించిన హ్యూస్లో ఉత్సాహం చూసిన తల్లిదండ్రులు అతని కోసమే సిడ్నీకి మకాం మార్చారు. అక్కడి పాఠశాలలో చేరింది మొదలు అత్యుత్తమ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్న హ్యూస్, ఆ తర్వాత అదే వేగంతో దూసుకుపోయాడు. దాంతో న్యూసౌత్‌వేల్స్ కాంట్రాక్ట్ దక్కడం, ఆ తర్వాత 2008 అండర్-19 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్‌గా ఆడటం చకచకా జరిగిపోయాయి. అన్నీ నంబర్వన్లే 19 ఏళ్ల వయసులోనే షెఫీల్డ్ షీల్డ్ టోర్నీ ఫైనల్లో సెంచరీతో ఆ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా హ్యూస్ ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫలితమే దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు స్థానం. కెరీర్ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగే బంతులాడి డకౌట్! అయితే ఫిల్ అసలు ప్రతిభ రెండో టెస్టులో బయటపడింది. డర్బన్లాంటి ఫాస్టెస్ట్ వికెట్‌పై స్టెయిన్, మోర్కెల్‌లాంటి బౌలర్లనూ ఎదుర్కొంటూ రెండు ఇన్నింగ్స్‌లలోనూ అతను సెంచరీలు బాదాడు. ఇక్కడా తక్కువ వయసులో ఈ ఘనత సాధించిన రికార్డు అతనిదే. గత ఏడాది ఆడిన తొలి వన్డేలోనూ సెంచరీ చేసి హ్యూస్ మరే ఇతర ఆస్ట్రేలియన్‌కు సాధ్యం కాని రికార్డును అందుకున్నాడు. ఈ ఏడాది జూలైలో మరో ‘మొదటి’ రికార్డు అతని ఖాతాలో చేరింది. లిస్ట్ ‘ఎ’ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆస్ట్రేలియా ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకొని తన వన్డే సత్తా కూడా బయటపెట్టాడు. 23 ఏళ్ల వయసులో ఆర్కీ జాక్సన్ (1933) టీబీతో చనిపోయిన తర్వాత ఇంత చిన్న వయసులో తనువు చాలించిన ఆస్ట్రేలియన్‌గా హ్యూస్ మరణంలోనూ పిన్న వయస్కుడిగానే నిలవడం విషాదం! ఆగిన ఆశ...శ్వాస కొన్నాళ్ల క్రితమే హ్యూస్ ఆటతీరులో వచ్చిన మార్పును గమనించిన అతని మిత్రుడు, ఆసీస్ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ‘100 టెస్టుల వీరుడు’ అంటూ ప్రశంసలు కురిపించాడు. తొందరగా తప్పులు దిద్దుకొని అగ్రస్థానానికి ఎదిగే సత్తా అతనిలో ఉందంటూ హేడెన్, లాంగర్లాంటి ఓపెనర్లతో అంతా అతడిని పోల్చారు. హ్యూస్ కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలోనే ఉన్నాడు. రెండేళ్ల క్రితమే అతను సొంత జట్టు న్యూసౌత్‌వేల్స్‌ను వదిలి సౌత్ ఆస్ట్రేలియాతో చేరాక మరింత రాటుదేలాడు. తుది జట్టులో స్థానం రాకపోయినా వరుస సిరీస్‌లలో జట్టుతో ఉంటూ వచ్చిన అతను దానిని నామోషీగా భావించలేదు. ‘నేను రిజర్వ్ ఆటగాడినే కావచ్చు. కానీ నా సహచరులకు సర్వీస్ చేయడం తప్పుగా భావించను. జట్టుతో ఉండటమే ముఖ్యమని నేను భావిస్తా. నా అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. వచ్చిన రోజు నిరూపించుకోవడమే నా పని’ అని అతను చెప్పేవాడు. ఇటీవలే ఆస్ట్రేలియా ‘ఎ' తరఫున 243 పరుగులు చేయడం అతని అవకాశాలను మెరుగుపర్చింది. మంగళవారం కూడా అతను అదే లక్ష్యంతో బరిలోకి దిగాడు. ఆ సమయంలో మరో వారం రోజుల్లో మళ్లీ టెస్టు క్రికెట్ ఆడతాననే విశ్వాసంతో కనిపించిన హ్యూస్ జీవిత ఇన్నింగ్స్ ఇంతలోనే ముగిసిపోవడం నిజంగా బాధాకరం. - సాక్షి క్రీడావిభాగం -
టీమిండియా ఆరంభ శూరత్వం
-
‘కెప్టెన్ కూల్’ తప్పటడుగులు!
మహేంద్ర సింగ్ ధోని అంటే మైదానంలో కదిలే కంప్యూటర్లాంటివాడు... ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఒత్తిడికి లోను కాకుండా ప్రత్యర్థిని బోల్తా కొట్టించడంలో అతని ప్రత్యేకతే వేరు. తనదైన శైలిలో కొత్త తరహా వ్యూహాలతో ఎదుటి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయగల సామర్థ్యం అతని సొంతం. మ్యాచ్ చేజారిపోతున్న క్షణాల్లోనూ కేవలం కెప్టెన్ సూచనలతోనే ఫలితాలు సాధించామని బౌలర్లంతా చెబుతారు. మరి ఇంగ్లండ్ సిరీస్‌లో ఆ వ్యూహాలు ఏమయ్యాయి? గత రెండు టెస్టుల్లో ధోనికి అంతా రివర్స్‌లో జరుగుతోంది. సంప్రదాయ వ్యూహాలను దాటి భిన్నంగా చేస్తున్న ఏ ప్రయత్నమూ విజయవంతం కావడం లేదు. అసలు అతనికి తన బౌలర్ల మీద నమ్మకం సడలిందా... లేక ఇక ఏమీ చేయలేమంటూ ముందే చేతులెత్తేస్తున్నాడా... అన్నింటికి మించి అతని వన్డే వ్యూహాలు టెస్టులకు పనికి రావడం లేదా! ధోని వ్యూహాలు విఫలం బౌలర్లపై అనవసరపు ఒత్తిడి సహచరులపై నమ్మకం సడలిందా! సాక్షి క్రీడా విభాగం : లార్డ్స్ టెస్టు...రెండో ఇన్నింగ్స్‌లో షార్ట్ పిచ్ బంతులు వేయమని ఇషాంత్‌కు ధోని సూచించాడు. అయితే ఇషాంత్ ఆరంభంలో ఇష్టపడలేదు. కానీ కెప్టెన్ నచ్చజెప్పాక షార్ట్ బంతులతో చెలరేగాడు. ఫలితంగా భారత్‌కు చిరస్మరణీయ విజయం దక్కింది. ఈ విషయాన్ని ఇద్దరూ స్వయంగా వెల్లడించారు. సాధారణంగా తన గురించి తక్కువగా మాట్లాడే ధోని కూడా తనకూ, ఇషాంత్‌కు మధ్య ఎలాంటి చర్చ సాగిందో, అది ఎలాంటి ఫలితాన్నిచ్చిందో పదే పదే చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఇప్పుడు అదే ధోనిలో అతి విశ్వాసానికి కారణమైనట్లుంది. అవసరం లేకపోయినా కెప్టెన్ దిశానిర్దేశం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇలాగే బంతులు వేయండి! ఓల్డ్ ట్రాఫర్డ్ టెస్టులో వరుణ్ ఆరోన్ తన కొత్త స్పెల్ వేసేందుకు సిద్ధమయ్యాడు. అంతలో గల్లీలో ఉన్న విరాట్ కోహ్లి లెగ్స్లిప్కు మారాడు. ఇలా ఎందుకంటూ ఆరోన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అయితే కెప్టెన్ దానిని అంగీకరించకుండా బౌలింగ్ వేయమని ఆరోన్‌కు సూచించాడు. ఆ తర్వాత జడేజా విషయంలోనూ అదే జరిగింది. ఓవర్ ది వికెట్ వేసేందుకు జడేజా ముందుకొచ్చాడు. అంతే...అతడిని ఆపి రౌండ్ ది వికెట్ వేయమని ధోని చెప్పాడు. ఈ సారి అయితే జడేజా మారు మాట్లాడకుండా కెప్టెన్ చెప్పినట్లే చేశాడు. సాధారణంగా బౌలర్ తన ఆలోచనలను, వ్యూహాలను కెప్టెన్‌తో పంచుకుంటాడు. దానికి అనుగుణంగా ఫీల్డర్లను పెట్టమని కోరతాడు. ఫీల్డింగ్ ప్రకారమే తాను బంతులు విసిరేందుకు ప్రయత్నిస్తాడు. అయితే ఇంగ్లండ్ సిరీస్‌లో ధోని బౌలర్ల మనసులో దూరి తాను అనుకున్న విధంగా చేస్తున్నట్లు అనిపిస్తోంది. విజయవంతమైనా, విఫలమైనా ఎక్కువ ఆలోచనలు వికెట్ల వెనకనుంచే వస్తున్నాయి. పరిస్థితి చూస్తుంటే భారత్ వైఫల్యంలో బౌలర్లను నిందించడంకన్నా ధోని వ్యూహాలనే తప్పు పట్టాల్సి వస్తోంది. తాను కోరుకున్న ఫీల్డింగ్‌నే పెట్టడం, దానికి అనుగుణంగానే బౌలింగ్ చేయమని ఒత్తిడి తేవడం అనూహ్యం. లెగ్ స్లిప్, ఫైన్ లెగ్, షార్ట్ స్క్వర్ లెగ్ వంటి ఫీల్డింగ్‌తో ఏ పేస్ బౌలరైనా బౌలింగ్ చేస్తాడా అనేది ఆశ్చర్య పడాల్సిన విషయం. ఊరించే షార్ట్ పిచ్ బంతులు వేస్తే తప్ప లెగ్‌సైడ్‌లో వికెట్ వెనక ముగ్గురు ఫీల్డర్లు అనవసరం. కానీ ఇషాంత్ తరహాలో పేస్, దూకుడు లేని భువనేశ్వర్, పంకజ్లాంటి పేసర్ల బౌలింగ్‌తో ఏం ఫలితం దక్కుతుంది? పైగా లార్డ్స్ టెస్టులో చేసిన తప్పునే ఇంగ్లండ్ మళ్లీ ఎందుకు చేస్తుంది. ఇది చూస్తే ఒకే తరహా మూస వ్యూహంతో ధోని వెళుతున్నట్లు కనిపించింది. అసలు టెస్టుల్లో లెగ్ స్లిప్‌లో క్యాచ్ లభించడం చాలా అరుదు. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ అసలు ఆ వైపు చూడకుండా స్లిప్స్పైనే దృష్టి పెట్టి ఆఫ్ స్టంప్‌పై బంతులతో విజయవంతమైంది. పైగా కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్ చేసే భువనేశ్వర్ పదే పదే లెంగ్త్ మార్పుతో మరో కొత్త బంతి వచ్చే సమయానికి తీవ్రంగా అలసిపోయి ప్రభావం చూపలేకపోతున్నాడు. వికెట్లు అవసరం లేదా! ఒక టెస్టు మ్యాచ్ నెగ్గాలంటే ప్రత్యర్థి జట్టును రెండు సార్లు ఆలౌట్ చేయాల్సిందేననేది ప్రాథమిక సూత్రం. వన్డేల్లోనైతే పరుగులు రాకుండా నిరోధించినా మ్యాచ్‌లు గెలుచుకోవచ్చు. ఈ సూత్రాన్ని పరిమిత ఓవర్లలో ధోని అత్యద్భుతంగా అమలు చేశాడు. కానీ టెస్టుల్లో అలా కాదు. సౌతాంప్టన్ టెస్టులో ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లు కుక్, బాలెన్స్ క్రీజ్‌లో ఉన్నప్పుడు ఏడుగురు ఫీల్డర్లను లెగ్‌సైడ్‌లో ఉంచి జడేజాతో ధోని బౌలింగ్ చేయించాడు. 21 ఓవర్ల ఆ స్పెల్‌లో జడేజా 30 పరుగులే ఇచ్చాడు. కానీ బ్యాట్స్‌మెన్ ఎలాంటి రిస్క్ తీసుకోకపోవడంతో పరుగులు రాలేదు కానీ వారిపై ఒత్తిడి తగ్గిపోయింది. ఆ తర్వాత కుక్ స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించాడు. సెంచరీకి ముందు కుక్ అవుటైనా అప్పటికే సమయం మించిపోయింది. అసలు జడేజా వికెట్లు తీయగలడని ధోనికి నమ్మకం లేదా! వాస్తవానికి మొయిన్ అలీ అటాకింగ్ బౌలింగ్‌తో పోలిస్తే జడేజా, అశ్విన్‌లు ఆత్మ రక్షణ ధోరణిలో బంతులు విసరడంతోనే వారికి వికెట్లు దక్కలేదు. మూడో టెస్టులో భారత్ 163.4 ఓవర్ల పాటు బౌలింగ్ చేస్తే ధోని 52 సార్లు బౌలింగ్ మార్పులు చేయడం విశేషం! నిజాయితీగా ఆలోచిస్తే భారత్‌లో మూడు లేదా నాలుగో రోజు పిచ్‌లపై స్పిన్నర్లు పండగ చేసుకుంటారు. బౌలర్ కొంత కష్టపడితే పిచ్ అండగా నిలుస్తుంది. కానీ సౌతాంప్టన్, మాంచెస్టర్లాంటి మైదానాలు అలా కాదు. కాబట్టి ఇక్కడి దాని కోసం ప్రత్యేక వ్యూహాలు అవసరం. ఇప్పుడు సిరీస్ గెలిచే అవకాశమైతే లేదు కానీ చివరి టెస్టు నెగ్గాలంటే కెప్టెన్ కూల్ తన మేధస్సుకు మరింత పదును పెట్టాల్సి ఉంది. కాస్త ఓపిక పడదాం: గవాస్కర్ న్యూఢిల్లీ: ప్రస్తుతం భారత జట్టు సంధికాలంలో ఉన్నందున ఫలితాల గురించి ఆందోళన చెందకుండా, కాస్త ఓపిక పట్టాలని మాజీ కెప్టెన్ గవాస్కర్ అభిమానులకు సూచించారు. ‘కొద్ది కాలం క్రితం ప్రపంచ ప్రసిద్ధ ఆటగాళ్లు భారత జట్టుకు దూరమయ్యారు. ప్రస్తుతం టీమిండియా సంధికాలంలో ఉంది. దిగ్గజ ఆటగాళ్ల స్థానాలను యువ ఆటగాళ్లు అంత సులువుగా భర్తీ చేయలేరు. అందుకే కాస్త ఓపిక పట్టాలి. అయితే ఇటీవల టెస్టు ఫార్మాట్లో జట్టు ఇబ్బంది పడుతుందనే విషయం వాస్తవం’ అని గవాస్కర్ అన్నారు. ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ అలీ అద్భుత బంతులేమీ వేయలేదని, పరుగులు తీయాలనే తొందరలో భారత ఆటగాళ్లు అవుటైనట్టు చెప్పారు. ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న భారత్‌పై సహజంగానే చాలామందికి అసూయగా ఉంటుందని, అందుకే జట్టును తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నిస్తుంటారని అన్నారు. అయితే భారత ఆటగాళ్లు టెస్టులు ఆడదలుచుకుంటే కచ్చితంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పాల్గొనేలా చూడాలని టీమ్ మేనేజ్మెంట్కు, బీసీసీఐకి సన్నీ సూచించారు.