breaking news
Off shore companies
-
రూ.24,900 కోట్ల అప్పు కోసం బ్యాంకులతో చర్చలు?
రిలయన్స్ ఇండస్ట్రీస్ 3 బిలియన్ డాలర్లు(రూ.24,900 కోట్లు) రుణాన్ని పొందేందుకు బ్యాంకులతో చర్చలు జరుపుతున్నట్లు బ్లూమ్‌బర్గ్ తెలిపింది. వచ్చే ఏడాది చెల్లించాల్సిన రుణాన్ని రీఫైనాన్స్ చేయడానికి ఈ నిధులను ఉపయోగించుకోనున్నట్లు తెలిసింది. ఈమేరకు దాదాపు ఆరు బ్యాంకులతో చర్చలు జరుపుతున్నట్లు బ్లూమ్‌బర్గ్ పేర్కొంది.కంపెనీ గతంలో తీసుకున్న దాదాపు 2.9 బిలియన్ డాలర్ల రుణాల మెచ్యురిటీ 2025 మొదటి త్రైమాసికంలో ముగుస్తుంది. కాబట్టి కంపెనీ ఆయా రుణాలు చెల్లించి తిరిగి రిఫైనాన్స్కు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకే బ్యాంకు ఇంతమొత్తంలో చెల్లించడం ఒకింత రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం కాబట్టి, దాదాపు ఆరు బ్యాంకులతో సంస్థ అధికారులు చర్చలు జరుపుతున్నారని బ్లూమ్‌బర్గ్ తెలిపింది. అయితే ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.ఈ ఒప్పందం కార్యరూపం దాలిస్తే 2023 నుంచి కొంత విరామం తర్వాత రిలయన్స్ ఆఫ్‌షోర్ రుణాల(ఇతర దేశాలు అందించే అప్పులు) మార్కెట్లోకి తిరిగి ప్రవేశించినట్లుగా అవుతుంది. ఇదిలాఉండగా, రిలయన్స్ అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఇటీవల రుణాల ద్వారా 8 బిలియన్ డాలర్లకు పైగా నిధులు సేకరించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ క్రెడిట్ ప్రొఫైల్ మెరుగ్గా ఉండడంతో రుణాలు పొందేందుకు మార్గం సులువవుతుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: గ్లోబల్ సౌత్ లీడర్‌గా భారత్మూడీస్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ క్రెడిట్ రేటింగ్‌ను Baa2 వద్ద స్థిరంగా ఉంచింది. ఇది ఇండియన్ సావరిన్ గ్రేడ్ కంటే మెరుగ్గా ఉండడం కూడా రిలయన్స్‌కు కలిసొచ్చే అంశంగా భావించవచ్చు. సంస్థ ఆర్థిక స్థితి, విభిన్న వ్యాపార నమూనా, వినియోగదారుల్లో విశ్వసనీయత..వంటి అంశాలు కూడా రుణదాతలకు భరోసా కల్పిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. -
ప్రపంచవ్యాప్తంగా పనామా ప్రకంపనలు!
లండన్: 'పనామా పేపర్స్' ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సంపన్నులు, రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు, తాజా మాజీ దేశాధ్యక్షులు.. ఇలా చాలామంది పన్ను ఎగ్గొట్టి విదేశాల్లో అక్రమంగా నల్లడబ్బు దాచినట్టు వెలుగులోకి వచ్చిన వివరాలపై ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు విచారణ ప్రారంభించాయి. పనామాలోని ఓ లా కంపెనీకి చెందిన 1.15 కోట్ల పత్రాలు లీకవ్వడంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిన్ పుతిన్ సన్నిహితులు, బ్రిటన్ ప్రధాని కామెరాన్, చైనా ప్రధాని జింగ్పింగ్ బంధువులు, పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ కొడుకులు, ఉక్రెయిన్ ప్రధాని కుటుంబసభ్యులు అక్రమంగా విదేశీ బోగస్ కంపెనీలు ఏర్పాటుచేసినట్టు వెల్లడైంది. వీరితోపాటు ఎంతోమంది రాజకీయ నాయకులు, సినీ, క్రీడా ప్రముఖుల నల్లడబ్బు లోగుట్టు కూడా వెలుగుచూసింది. నల్లడబ్బును దాచేందుకు బోగస్ కంపెనీలు సృష్టించడంలో పనామాకు చెందిన మొసాక్ ఫొనెస్కా లా కంపెనీ దిట్ట. ఆ కంపెనీ ఇప్పటివరకు వివిధ ప్రముఖుల కోసం 2.40 లక్షల బోగస్ కంపెనీలు సృష్టించింది. అనేకమంది ప్రముఖులు ఈ కంపెనీల్లో నల్లడబ్బును దాచినట్టు వెలుగులోకి వస్తున్నది. లియోనల్ మెస్సీ, జాకీచాన్, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ వంటి ప్రముఖుల పేర్లు ఈ జాబితాలో ఉండటం కలకలం రేపుతున్నది. ఈ నేపథ్యంలో రష్యా మొదలు బ్రిటన్ వరకు అన్ని దేశాలు ఈ బాగోతంపై స్పందించాయి. పుతిన్ సన్నిహితుల నల్లడబ్బు వ్యవహారంపై రష్యా స్పందిస్తూ.. ఇందులో కొత్తదనంకానీ, సమగ్ర ఆధారాలుకానీ లేవని కొట్టిపారేసింది. ప్రధాని డేవిడ్ కామెరాన్ దివంతగ తండ్రికి కూడా ఈ కంపెనీతో సంబంధాలు ఉన్నట్టు వచ్చిన వార్తలపై స్పందించడానికి బ్రిటన్ ప్రభుత్వం నిరాకరించింది. ఇది ప్రైవేటు మ్యాటర్ కాబట్టి స్పందించబోమని పేర్కొంది. తన సన్నిహితుల పేర్లు 'పనామా పేపర్స్'లో ఉండటంపై ఐస్లాండ్ ప్రధాని సిగ్ముందర్ గున్లలగ్సన్ నోరువిప్పలేదు. తన కుటుంబసభ్యులు ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ వివరణ ఇచ్చారు. ఇక తమ దేశాల ప్రముఖుల పేర్లు ఈ జాబితాలో ఉండటంతో ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, ఫ్రాన్స్, స్వీడన్, నెదర్లాండ్ తదితర దేశాలు విచారణకు ఆదేశించాయి. మరోవైపు పనామా దేశం కూడా ప్రపంచంలోనే అతిపెద్ద లీక్ బాగోతంగా భావిస్తున్న ఈ వ్యవహారంపై దర్యాప్తుకు ఆదేశించింది.