breaking news
sharath rao
-
సామాజిక సమీకరణలో వరించిన అదృష్టం
కరీంనగర్ సిటీ : జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్ అభ్యర్థి ఎంపికలో టీఆర్ఎస్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. మొదటినుంచి బెజ్జంకి జెడ్పీటీసీ సభ్యుడు తన్నీరు శరత్‌రావు పేరు వినిపించగా, చివరి నిమిషంలో హుస్నాబాద్ జెడ్పీటీసీ సభ్యుడు రాయిరెడ్డి రాజిరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు పట్టుబట్టడంతో అప్పటివరకు పరిశీలనలో ఉన్న రాజిరెడ్డి అభ్యర్థిత్వాన్ని అధిష్టానం ఖరారు చేసినట్లు సమాచారం. చైర్‌పర్సన్‌గా బీసీ మహిళ ఉండటంతో వైస్‌చైర్మన్ పదవిని ఓసీలకు కేటాయించాలని పార్టీ ముందుగానే నిర్ణయించింది. వెలమ సామాజిక వర్గానికి చెందిన తన్నీరు శరత్‌రావు పేరును దాదాపు ఖరారు చేసింది. పార్టీలో రెడ్డి సామాజిక వర్గానికి తగినంత ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్‌ను కొంతమంది నేతలు తెరపైకి తీసుకువచ్చారు. దీంతో పార్టీ హైకమాండ్ చివరకు రాజిరెడ్డిని వైస్‌చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన అభ్యర్థిత్వాన్ని చందుర్తి జెడ్పీటీసీ అంబటి గంగాధర్ ప్రతిపాదించగా, వెల్గటూరు జెడ్పీటీసీ గంగుల పద్మ బలపరిచారు. శరత్‌రావుకు బుజ్జగింపు వైస్‌చైర్మన్ అభ్యర్థిత్వం చేజారిన శరత్‌రావును పార్టీ నేతలు బుజ్జగించారు. రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ తదితరులు శరత్‌రావుకు పార్టీ నిర్ణయాన్ని చెప్పారు. సామాజిక సమీకరణల కారణంగా అభ్యర్థిత్వాన్ని మార్చాల్సి వచ్చిందని సర్ధిచెప్పారు. జెడ్పీ సమావేశ మందిరం నుంచి బయటకు వెళ్లిన శరత్‌రావును ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వెళ్లి లోనికి తీసుకొచ్చారు. తుల ఉమ అభ్యర్థిత్వాన్ని శరత్‌రావు ప్రతిపాదించాలని పార్టీ నేతలు సూచించినా.. ఎన్నికల అధికారి ప్రతిపాదకులు, బలపరిచేవాళ్లను పిలవకపోవడంతో ఆ అవకాశం రాలేదు. -
వైస్‌చైర్మన్‌గా శరత్‌రావు!
జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్‌గా బెజ్జంకి జెడ్పీటీసీ సభ్యుడు తన్నీరు శరత్‌రావు పేరు దాదాపు ఖరారైంది. పార్టీలో సీనియర్ నాయకుడైన శరత్‌రావు అధిష్టానానికి సన్నిహితంగా ఉన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్‌గా బీసీ మహిళ కానుండటంతో, వైస్‌చైర్మన్‌ను ఓసీలకు ఇవ్వాలని ముందుగానే నిర్ణయించారు. ఆ సామాజికవర్గంలో సీనియర్ నాయకుడైన శరత్‌రావు పార్టీకి అందించిన సేవలు, విశ్వసనీయతను దృష్టిలో ఉంచుకొని ఆయనకే వైస్‌చైర్మన్ పదవి కట్టబెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. హుస్నాబాద్ జెడ్పీటీసీ రాజిరెడ్డి, జమ్మికుంట జెడ్పీటీసీ వీరేశలింగం పోటీపడ్డప్పటికీ అధిష్టానం శరత్రావువైపే మొగ్గుచూపినట్లు సమాచారం. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.