breaking news
september 27
-
గూగుల్ తల్లికి ఈ రోజు వెరీ స్పెషల్
-
గూగుల్ తల్లికి ఈ రోజు వెరీ స్పెషల్
ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్‌కు సెప్టెంబర్ 27వ తేదీ చాలా ప్రత్యేకమైనది. ఈ రోజు గూగుల్ కంపెనీ 18వ బర్త్ డే. ఈ సందర్భంగా గూగుల్ హోం పేజీలో ప్రత్యేక డ్యూడుల్ దర్శనమిచ్చింది. గాల్లో బెలూన్లు వేలాడుతున్నట్టుగా.. జీ ఫర్ గూగుల్ అనే అక్షరాలతో బర్త్ డే సెలెబ్రేట్ చేసుకుంటున్నట్టు డ్యూడుల్ను రూపొందించారు. 1998 సెప్టెంబర్‌లో లారీ పేజ్, సెర్జీ బ్రిన్.. గూగుల్‌ను స్థాపించారు. కాగా కంపెనీని ఏ తేదీన స్థాపించారన్న విషయంపై స్పష్టత లేదు. పేజ్, బ్రిన్ సహా ఎవరూ వ్యవస్థాపక దినాన్ని గుర్తుపెట్టుకోలేదు. దీంతో గూగుల్ కంపెనీ ఆరు వేర్వేరు తేదీల్లో బర్త్ డే జరుపుకొంది. మొదట్లో సెప్టెంబర్ 26, సెప్టెంబర్ 7, సెప్టెంబర్ 8న బర్త్ డే చేసుకున్నారు. గూగుల్ హిస్టరీ లిస్ట్‌లో వ్యవస్థాపకం దినం సెప్టెంబర్ 4 అని ఉంది. 2006 నుంచి మాత్రం సెప్టెంబర్ 27వ తేదీన బర్త్ డే నిర్వహించాలని యాజమాన్యం నిర్ణయించింది. -
'బ్లడ్‌మూన్'.. ఓ అద్భుత ఆవిష్కారం
సెప్టెంబర్ 27 ఆదివారం రాత్రి ఖగోళంలో ఓ అరుదైన, అపురూపమైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. గత 33 ఏళ్లలో ఇలాంటి ఘటన సంభవించడం ఇదే మొదటిసారి కాగా, మరో 18 ఏళ్ల దాకా ఈ దృశ్యాన్ని మనం చూడలేము. అదే సూపర్ మూన్. చంద్రగ్రహణం, సూపర్ మూన్ రెండూ ఒకేసారి సాక్షాత్కరిస్తాయి. ఈ అరుదైన బ్లడ్ మూన్‌ను వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రజ్ఞులు, విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భూమికి చంద్రుడికి మధ్య సాధారణంగా ఉండే దూరం.. బాగా తగ్గడమే సూపర్ మూన్. అంటే రోజూ మనకు కనిపించే చందమామ ఈ 27 రాత్రి మరింత పెద్దగా, ఎర్రగా కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే దీన్ని బ్లడ్ మూన్ అని పిలుస్తున్నామంటున్నారు. స్కై అండ్ టెలిస్కోప్ పత్రిక కథనం ప్రకారం వాతావరణం అనుకూలిస్తే ఉత్తర అమెరికాలోని తూర్పుప్రాంత ప్రజలు ఈ చంద్రగ్రహణం మొదలైనప్పటి నుంచి పూర్తయ్యేదాకా అన్ని దశలను చూడగలుగుతారు. ఈ సమయంలో చంద్రుడు మామూలు సమయంలో ఉండే సైజు కన్నా 14 శాతం పెద్దగా ఉంటాడని, అందుకే దీన్ని 'సూపర్ మూన్'గా పిలుస్తారని ఆ పత్రిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 1982లో సూపర్ మూన్, చంద్రగ్రహణం ఒకేసారి ఏర్పడ్డాయి. తర్వాత మళ్లీ 2015 సెప్టెంబర్ 27న ఇలా కనిపిస్తుంది. 2033 లో అరుదైన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది ఖగోళంలో సంభవించే అరుదైన చంద్రగ్రహణాల్లో ఒకటి. చంద్రుడికి, సూర్యుడికి మధ్యగా భూమి వచ్చినప్పుడు ఏర్పడేదే చంద్రగ్రహణం అని మనందరికీ తెలుసు. కానీ ఈ ఆదివారం సంభవించే సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో భూమి నీడ చంద్రుడిని పూర్తిగా కప్పేస్తుంది. అయినా కొంత సూర్యకాంతి చంద్రుడిపై పడుతూ ఉండడంతో అప్పుడు జాబిల్లి నారింజరంగులో మెరిసిపోతూ అబ్బురంగా కనిపించనుంది. అందుకే శాస్త్రజ్ఞులు బ్లడ్ మూన్ అంటున్నారు. కాగా, ఈ సంపూర్ణ చంద్రగ్రహణం భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7.40 గంటలకు ప్రారంభమై సుమారు 72 నిమిషాల పాటు (గంటా 12 నిమిషాల పాటు) కొనసాగనుంది. ఉత్తర, దక్షిణ అమెరికాలు, ఐరోపా, ఆఫ్రికా ఖండాలు, పశ్చిమాసియా, తూర్పు పసిఫిక్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చెబుతోంది. అంటే భారత ఉపఖండం సహా మిగతా ఆసియా, ఆస్ట్రేలియా ఖండాల్లో ఇది కనిపించదట. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం ఈ గ్రహణం సంభవిస్తుంది, చంద్రుడు కూడా పెద్దగా కనిపిస్తాడు. అయితే అప్పటికి భారతదేశంలో సూర్యోదయం అయిపోతుంది కాబట్టి, చంద్రుడు కనిపించడు. ఈస్ట్రన్ డేలైట్ టైమ్ (ఈడీటీ) ప్రకారం ఆదివారం రాత్రి 10 గంటల సమయం కాబట్టి, అప్పుడు పాశ్చాత్య దేశాల్లో చంద్రుడు కనిపిస్తాడు. మరోవైపు ఉత్తరాభాద్ర నక్షత్ర మీనరాశిలో కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుందని గ్రహశాస్త్రపండితులు తెలిపారు. 72 నిముషాల సుదీర్ఘకాలం పాటు కొనసాగే సంపూర్ణ గ్రహణం భారతదేశంలో కనపడకపోయినా ద్వాదశ రాశులపై దాని ప్రభావం ఉంటూనే ఉంటుందంటున్నారు.