రోకలితో కొట్టి.. భర్తను హతమార్చింది
మధురై: తమిళనాడులోని మధురైలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. మధురై జిల్లా వాడిపట్టి గ్రామంలో భార్యభర్తల మధ్య కొన్నాళ్లుగా సాగుతున్న విభేదాలు, వివాదాలు భర్త హత్యకు దారి తీశాయి. సెల్వి(35), చెల్లాపాండి (38) ఇద్దరూ భార్యభర్తలు. వీరికి 15, 14 ఏళ్ల వయసున్న కుమార్తె, కుమారుడు ఉన్నాడు. చెల్లాపాండికి వివాహేతర సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో పాటూ, చేతబడి చేస్తాడనే అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి.
ఈ నేపథ్యంలో గురువారం రాత్రి కూడా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. తరువాత చెల్లాపాండి నిద్రపోయాడు. ఇదే అదనుగా భావించిన సెల్వి రోకలిబండతో భర్త తలపై బలంగా కొట్టడంతో అతను ప్రాణాలు వదిలాడు. అనంతరం సెల్వి పోలీసులకు లొంగిపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.