breaking news
Self-check
-
కాలేజీలోకి అడుగుపెడుతున్నారా!
సెల్ఫ్ చెక్ స్కూళ్లు, కాలేజీలు తెరిచే సమయం వచ్చేసింది. పదో తరగతి పూర్తిచేసుకుని కళాశాలల్లో అడుగుపెట్టే విద్యార్థులకు అంతా కొత్తగానే ఉంటుంది. అన్నీ వింతగానే తోస్తాయి. మగపిల్లల సంగతి ఎలా ఉన్నా... కొత్తగా కళాశాలలో అడుగుపెడుతున్న అమ్మాయిలు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ర్యాగింగ్ లాంటి విషయాలన్నమాట. కొత్త స్నేహాలు తెచ్చిపెట్టే సమస్యలకు కూడా దూరంగా ఉండాలి. మరి మీరెలా ఉండబోతున్నారు! 1. మీరు చేరబోతున్న కాలేజీ గురించి వివరాలు సేకరిస్తారు. అక్కడ విద్యార్థులు, అధ్యాపకుల పట్ల ఎలా మసలుకోవాలో తెలుసుకుంటారు. ఎ. అవును బి. కాదు 2. కాలేజీలో చేరాక అక్కడ ర్యాగింగ్ వంటివి ఎక్కువగా ఉంటే అలాంటి విషయాల్ని గోప్యంగా ఉంచుకొని మీలో మీరే ఇబ్బంది పడకుండా అధ్యాపకులకు, తల్లిదండ్రులకు మీ సమస్యల గురించి తెలియజేస్తారు. ఎ. అవును బి. కాదు 3. స్నేహితుల వివరాలు, వారి ఇంటి అడ్రసుల గురించి మీ తల్లిదండ్రులకు చెబుతారు. తల్లిదండ్రుల అనుమతి లేకుండా స్నేహితులతో కొత్త ప్రదేశాలకు వెళ్లరు. ఎ. అవును బి. కాదు 4. ఇన్నాళ్లు స్కూలు పేరుతో బందిఖానా జీవితాన్ని గడిపారు. ఇప్పుడు కాలేజీలోకి అడుగుపెట్టారు కాబట్టి అన్ని విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవచ్చనుకుంటారు. అన్నింటిలో తల్లిదండ్రుల ప్రమేయాన్ని ఇష్టపడరు. ఎ. కాదు బి. అవును 5. మీరు చేరబోయేది కో-ఎడ్యుకేషన్ కాలేజీ అయితే అబ్బాయిలతో స్నేహాలకు హద్దులు పెట్టుకుంటారు. చదువుల వరకూ స్నేహం చేసినా వారి వివరాలు తప్పనిసరిగా తల్లిదండ్రులకు చెపుతారు. ఎ. అవును బి. కాదు మీ ఆలోచనావిధానంలో ‘ఎ’లు ఎక్కువగా ఉంటే కాలేజీ జీవితంలో మీరు సమస్యలకు చాలావరకూ దూరంగా ఉంటారని అర్థం. లేదంటే సమస్యల్ని కోరితెచ్చుకున్నవారవుతారు. కాలేజీ చదువు ఓ కీలకమైన దశ అని గుర్తించి, జాగ్రత్తగా ముందడుగు వేస్తే చదువులోనే కాదు...జీవితంలోనూ మీరే ఫస్ట్! ఆల్ ది బెస్ట్! -
కాస్త... సర్దుకుపోదాం!
సెల్ఫ్చెక్ 1. మీకు నచ్చని కూర వండితే ముఖం మాడ్చుకుంటారు. ఆ రోజు ఉపవాసమే బెటర్ అనుకుంటారు. ఎ.కాదు. బి.అవును. 2. టీ ఇవ్వడానికి కాస్త ఆలస్యం అయినా... భార్య మీద మండిపడతారు. ఎ.కాదు. బి.అవును 3. చెప్పిన పని సకాలంలో చేయలేదని అలకబూనుతారు. ఎ కాదు. బి.అవును. 4. అతి క్రమశిక్షణతో కుటుంబసభ్యులను చీకాకు పెడతారు. ఎ.కాదు. బి.అవును. 5. భార్య సరదాగా చిన్న మాట అన్నా... పరువు పోయినట్లు బాధపడతారు. ఎ.కాదు బి.అవును 6. ప్రతి విషయంలోనూ మీ మాటే చెల్లుబాటు కావాలనుకుంటారు. ఎ.కాదు బి.అవును 7. సర్దుకుపోవడం అంటే లొంగిపోవడం అనే భావనలో ఉంటారు. ఎ. కాదు బి.అవును సంసారం అనే రథానికి భార్యభర్తలు రెండు చక్రాల్లాంటి వారు...అనే డైలాగు పాతదైనా ఎప్పటికప్పుడు కొత్తగా గుర్తు తెచ్చుకోవాల్సిన పవర్ఫుల్ డైలాగు. సంసారం అనే బండి సజావుగా నడవాలంటే, సర్దుకు పోవడాన్ని మించిన గొప్ప ఐడియా లేదు. పై వాటిలో మీకు ‘బి’లు ఎక్కువగా వచ్చాయంటే మీలో సర్దుకుపోయేతత్వం తక్కువ అని. కాబట్టి కాస్త జాగ్రత్త పడండి. ‘‘ఇంత కాలం ఎలాంటి గొడవ లేకుండా కాపురం చేశారు కదా! ఏమిటి మీ విజయరహస్యం?’’ అని ఒక సీనియర్ భర్తను ఒక జూనియర్ భర్త అడిగాడట. అప్పుడు ఆయన తన తెల్లగడ్డం సవరిస్తూ ‘‘ఆమె బల్లిని చూసి పిల్లి అంటుంది. నేను ఖండించకపోగా... ఎంత ముద్దుగా ఉందో అంటాను’’ అంటూ తన విజయరహస్యం చెప్పాడట. ఇది హాస్యానికే కావచ్చుగానీ, దీని నుంచి నేర్చుకోవల్సింది కూడా ఉంది. ప్రతి దాన్నీ విభేదిస్తూ పోవడం వల్ల అశాంతి తప్ప ఏమీ మిగలదు.