self-awareness
-
సత్యాన్వేషణ
నీలోని ఆత్మ చైతన్యమే సత్యం. నేను వ్యక్తిని అనే భావన పూర్తిగా నీ మనస్సు కల్పితం. నీకు కనిపించే వ్యక్తులు, పాత్రలు, బంధాలు, సమాజం మొదలైనవన్నీ మనస్సు కల్పనలేగాని సత్యాలు కావు. భార్య, పిల్లలు, ఉద్యోగం, లక్ష్యాలు, అన్వేషణ మొదలైనవన్నీ నిజాలని నమ్ముతూ వాటిలో చిక్కుకొనిపోయి ఒక దుఃఖ ప్రపంచంలోకి వెళ్ళి పోతున్నాం. ఇవన్నీ అసత్యాలు కదా అని వీటిని వదిలేయటం కూడా పరిష్కారం కాదు. సత్యాన్ని తెలుసుకునే మార్గం, అనందాన్ని పొందే మార్గం ఉంది. నీనుండి విడివడలేనంత దగ్గరగా ఉంది. ప్రశాంతత, అనందం అనేవి నీ ఆత్మలోనే ఉన్నాయి. అవి దైవత్వ పరిమళాలు. ఇది బయటి ప్రపంచంలో కనిపించే ప్రశాంతత కాదు. అది అంతం లేనిది నీ అంతర్గత ప్రశాంతత. అది విషయ సంబంధమే కాదు. కాలానికి, స్థలానికి అతీతమైనది. ఆ నిగూఢమైన ప్రశాంతతే నీ ఆత్మ, నీ నిజతత్వం. నేను వ్యక్తిని అనే భావన పుట్టుకతో నీలో లేదు. నీ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల, సమాజం వల్ల క్రమంగా నేను అనే భావనలో చిక్కుకుని కాలంతో కలిసిపోయాం. నీ నిజస్థితి దివ్యచైతన్య స్థితి. అద్వైతస్థితి. మాయవల్ల ఆ చైతన్యం నుండి విడివడి నేను శరీరాన్ని, మనస్సును అనే పరిమితిలో చిక్కుకుని పోయావు. నీ కలలో నీవు చిక్కుకు పోయావు. అసలు చైతన్యం అనేది ఒక వ్యక్తికి, ఒక రూపానికి పరిమితమైనదే కాదు. అది అనంతం, నిర్గుణం. అది దేనికీ అంటదు. కేవలం సాక్షితత్వమే ఉంటుంది. నేను అనే భావన క్రమంగా బలపడి ఇష్టాయిష్టాలతో, నమ్మకాలతో, కోరికలతో బందీ ఐపోతాము. నిజానికి అందరిలో ఉన్న ఆత్మ ఒక్కటే. నేను సాక్షీ చైతన్యాన్ని అనే సత్యాన్ని తెలుసుకున్నపుడే ఈ దుఃఖ ప్రపంచం నుండి బయటపడగలవు.నీ మనస్సుకు కూడా మూలం ఆత్మనే. ఈ విషయ ప్రపంచం, ఈ భిన్నత్వం అంతా కూడా ఆత్మ నుంచి ఉద్భవించినవే. కానీ వీటిని ‘నేను’ అనుకుని ఒక పరిమితి కల్పించుకుని, విశ్వ చైతన్యం నుండి వేరుపడిపోయాము, నమ్మకాలను సృష్టించుకున్నాం. వ్యక్తి అనేవాడు కూడా దైవత్వ వ్యక్తీకరణే. విశ్వ చైతన్యంలో భాగమే. మాయవల్లనే నేను వేరు అనే భావన కల్పించుకొని, భద్రతను సృష్టించుకుని, అభద్రతను కూడా సృష్టించుకుని దుఃఖంలో ఉన్నాము. ఈ నాటకమంతా నీ సృష్టే. ఇందులోని పాత్రలన్నీ పరస్పర సంబంధమైనవే. సృష్టికర్త సృజనాత్మక వ్యక్తీకరణే ఈ నాటకం. ఆ రచయిత నీవే. అత్మతత్వాన్ని తెలుసుకున్నప్పుడు నీవే ఆ దివ్యచైతన్యమని, సృష్టికర్తవని తెలుస్తుంది. వీటన్నింటికీ ఒక సాక్షిగా ఉంటావు, వేటికీ అంటకుండా.కలలో ఉన్నప్పుడు నీవు కలలో ఉన్నట్టు తెలియదు. కలలో గెంతుతాము, అరుస్తాము, భయపడతాము... ఇది కల అని తెలియగానే కల మాయమైపోతుంది. ఇప్పటి మన జీవితమంతా ఈ కలలాంటిదే. సత్యాన్ని తెలుసుకున్నపుడే ఈ కలలనుండి బయటపడతావు. ఎల్లప్పుడూ నీ నిజతత్వాన్ని తెలుసుకునే దిశగానే ప్రయాణించు. ఈ జీవితం నాటకమైనప్పటికీ ఇందులో జీవించడం అవసరం. శరీరం, మనస్సులకు సాక్షిగా ఉంటూ జీవించు. నీలోని ఆత్మచైతన్యం బలపడినప్పుడే ఈ కలల నుండి బయటపడతావు. మనస్సుకు స్వతహాగా బలం ఉండదు. అది నీ ఆత్మశక్తిని లాక్కుని జీవిస్తుంది. నీవు సాక్షిగా గమనించినప్పుడు అది బలహీనమైపోతుంది. నీలోని నమ్మకాలకు, కోరికలకు, సంవేదనలకు అన్నింటికీ సాక్షిగా ఉంటూపో! వేటితోనూ అంటకు.– స్వామి మైత్రేయ ఆధ్యాత్మిక బోధకులు -
అభ్యాసంతోనే ఆత్మజ్ఞానం
ఆత్మీయం ఆత్మజ్ఞానాన్ని పొందటం ఎలాగో యముడు నచికేతునికి చెబుతున్నాడు. మనస్సును ఎలా నడిపించాలో వివరిస్తున్నాడు....నీ శరీరమే రథం. ఆత్మ రథికుడు. బుద్ధి సారథి. మనస్సు ఆ సారథి చేతిలో ఉండే కళ్లెం. ఆ రథానికి గుర్రాలు ఇంద్రియాలు. విషయాలు, కోరికలే దారులు. శరీరం, ఇంద్రియాలు, మనస్సుతో కూడిన ఆత్మనే జ్ఞానులు ‘భోక్త’ అని పిలుస్తున్నారు. అంటే ఆత్మ ఉనికికి ఈ మూడూ కారణమన్నమాట. అదుపులోలేని మనస్సుతో ఆత్మజ్ఞానం లేకుండా తిరిగేవాడి ఇంద్రియాలు సారథి అధీనంలో లేని అశ్వాల్లాగా విచ్చలవిడిగా యథేచ్ఛగా పరుగెత్తుతాయి. ఎవడు విజ్ఞానవంతుడై మనస్సును స్వాధీన పరచుకుంటాడో అతడి ఇంద్రియాలు సారథి అదుపులో ఉన్న గుర్రాల్లాగా సరైన దారిలో ప్రయాణిస్తాయి. మనస్సును అదుపులో పెట్టుకోకుండా, విజ్ఞానం లేకుండా శారీరకంగా మానసికంగా అశుభ్రంగా ఉండేవాడు సంసారాన్ని దాటలేడు. పరమపదాన్ని పొందలేడు. చావుపుట్టుకల మధ్య తిరుగుతూ ఉంటాడు. ఎవడు విజ్ఞానవంతుడై, మనస్సును అధీనంలో ఉంచుకుంటాడో శుచిగా ఉంటాడో వాడు మాత్రమే మళ్లీ జన్మించనవసరం లేని పరమపదాన్ని చేరుకుంటాడు. ఎవడు విజ్ఞానాన్ని సారథిగా, మనస్సును కళ్లెంగా చేసుకుంటాడో ఆ మానవుడు సర్వవ్యాప్తమైన పరమపదానికి చేరుకుంటాడు. ఇంద్రియాల కంటే విషయాలు, విషయాలకంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి, బుద్ధికంటే ఆత్మ బలమైనవి. ఆత్మ కంటె అవతల ఉండేది అవ్యక్తం. అవ్యక్తానికి పైన ఉండేది పరమ పురుష స్థితి. దానికి మించినది ఏదీ లేదు. అదే మానవుడు చేరుకోవలసిన అత్యున్నత స్థితి. అన్ని ప్రాణుల్లోనూ ఆత్మ గూఢంగా కనపడకుండా ఉంటుంది. సూక్ష్మమూ, ఏకాగ్రమూ అయిన బుద్ధితో తపస్సుతో సాధన చేసేవారికి మాత్రమే అది గోచరిస్తుంది. సాధకుడైన మానవుడు జ్ఞానవంతుడై తన వాక్కును మనస్సులో, మనస్సును బుద్ధిలో, బుద్ధిని ఆత్మలో, ఆత్మను పరమశాంతమైన పరమాత్మలో లీనం చేసుకోవడం అభ్యాసం చెయ్యాలి. -
జరామరణాలు
జన్మ, మృత్యువు ఒకే నాణానికి ఉన్న బొమ్మ, బొరుసూ వంటివి. జన్మకు, మృత్యువుకు మధ్య సాగే ఈ జీవన ప్రయాణంలో మనిషి చేసే పాప, పుణ్య కర్మల ఫలమే అతని ‘అంతిమ మృత్యు దశ’కి, ‘మరు జన్మ’కి కూడా ఆధారం. మృత్యువు ఒక్కొక్కరికి, ఒక్కో రూపంలో రావటం వెనుక రహస్యం ఇదే. మృత్యువు ఒక వాస్తవికత. దానిని అందరూ ఎదుర్కోవాల్సిందే. నిజానికి మృత్యువు జీవితానికి ‘అంతిమ దశ’ కాదు. మరో కొత్త జీవితానికి ‘ప్రవేశ ద్వారం’ వంటిది. మనిషికి ‘జన్మ-మృత్యువు’కి సంబం ధించిన సత్యజ్ఞానం లేకపోవటం మరియు మహాకాలు డైన ‘పరమాత్మ’తో మనస్సు సంబంధం, స్మృతి లేని కారణంగా ‘మృత్యువు’ పేరు వింటేనే భయభ్రాంతు లకు లోనవుతున్నాడు. జీవన పర్యంతం మనిషి అజ్ఞా నానికి వశమై ‘‘ధన, గణ, యవ్వన గర్వం’’ అంటే ధనం, పదవి, యవ్వనం అశాశ్వత మైన ఈ మూడింటికి వశమై ఎంతో గర్వంతో ఈశ్వరుడిని విస్మరించి, ధర్మాచరణను ప్రక్కనపెట్టి తోటి వారికి దుఃఖాన్ని, నష్టాన్ని కల్గిస్తూ ఎంతో పాపాన్ని మూటగట్టుకొం టాడు. కానీ మృత్యువు, సమయం ఏది వచ్చినా పై ‘మూడూ’ పరిసమాప్తం అవుతాయి. కాగా చేసిన పాప కర్మల శిక్షల ఫలంగా అంతిమంలో ‘మరణవేదన’ అనుభవించిన పిమ్మట కానీ తనువు చాలించరు. మనిషి వైజ్ఞానికంగా ఎంత ప్రగతిని సాధించినా మృత్యువును తప్పించలేడు. ‘వంద కోట్లకు’ అధిపతు లైనా ‘ఒక్క నిమిషం’ ఆయుష్షును కొనలేరు. ధన సంపాదనకై ధర్మ చింతనకు దూరమై ‘లక్షల రూపా యల’ ధనాన్ని కూడబెట్టినా ‘ఒక్క రూపాయి’ సుఖాన్ని కూడా పొందలేరు. ఇదే కర్మ సిద్ధాంతం. ‘‘మనిషి సంపాదించిన ధన సంపద- నేలమీద; పశు సంపద- గోశాలలో; ఆలి- ఇంటివాకిట వరకు; బంధువులు- బజారు వరకు; వదలిన శరీరం- శవం చితిమీదే మిగిలిపోతుంది. అవి అంతవరకే తోడువస్తాయి. మరణించిన వాడికి వెన్నంటి వచ్చేది ‘ధర్మాచరణ’ మాత్రమే. కాబట్టి గర్వాన్ని వదలిన మానవుడు సత్ప్రవర్తన ఫలితంగా సౌఖ్యాన్ని పొందుతాడు. మృత్యువుని తప్పించలేరు. మరణం అంటే ఆత్మ తన శరీరమనే వస్త్రాన్ని మార్చుకోవటం, తన ‘అడ్రస్’ని మార్చుకోవటం మాత్రమే. ఆత్మజ్ఞాని ‘పరమాత్ముని స్మృతి’లో పండు తొడిమ నుంచి దానంతటదే వేరై కిందపడినంత సహజంగా శరీరమనే వస్త్రాన్ని వదలి పెడతాడు. వర్తమాన సమయంలో అన్ని సమస్యలకు కారణం ‘‘ఆత్మజ్ఞానాన్ని’’ ఉపేక్షించటం, పరమాత్మతో బుద్ధి వియోగం, దేహాభిమానానికి వశమై రాగ, ద్వేషాదుల్లో ఇరుక్కుపోవటం, ఆత్మ స్వరూపాన్ని తెల్సుకొని అనుభవం చేసుకొన్న తర్వాతే భోగాలతో అనాసక్తత, ఈర్ష్య, లోభం, కామ, క్రోధాదులతో ముక్తి, తద్వారా ‘మృత్యు భయం’ నుంచి విముక్తి లభిస్తుంది. సదా ఈశ్వరీయ సేవలో... - బ్రహ్మకుమారి వాణి -
మౌనమూ బోధనే
జెన్ పథం జెన్ గురువు విన్సీ దగ్గరకు ఒకరోజు శిష్యులు వచ్చారు. అవీ ఇవీ మాట్లాడుతూ మాట్లాడుతూ ‘‘అన్నట్టు గురువుగారూ, మీరు బుద్ధుడు, బోధిధర్ముడు వీరిద్దరిలో ఎవరిని ఉన్నతులుగా పేర్కొంటారు?’’ అని అడిగారు. వారు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ‘‘నేను ఆ ఇద్దరికీ ప్రాధాన్యమివ్వను’’ అని చెప్పారు. బుద్ధుడిని వెతుకుతున్నప్పుడు బుద్ధుడిని కోల్పోతున్నాం. బోధిధర్ముడిని వెతుకుతున్నప్పుడు బోధిధర్ముడిని కోల్పోతున్నాం అనేది జెన్ తత్వం. దేని కోసమూ వెతుకుతూ తిరగకు. ఒకవైపే ఉండకు. సొంతమనేదేదో నీకు నువ్వు తెలుసుకో అనేది పరమార్థం. జెన్ గురువు యౌషన్ ఏదీ మాట్లాడరు. శిష్యులు అనేక మంది ఆయను చూసి మాట్లాడేందుకు వచ్చినా సరే ఆయన ఏమీ మాట్లాడరు. వారిలో ఒకరు ఉండబట్టలేక ‘‘గురువుగారూ, మీదగ్గర ఆత్మజ్ఞానం పొందుదామనే ఉద్దేశంతో మేమందరం వచ్చాం. నేనైతే ఇదే విషయాన్ని తెలుసుకోవాలని అనేక సార్లు వచ్చాను. వెళ్లాను. కానీ మీరు ఒక్క మాటా మాట్లాడటం లేదు....’’ అన్నాడు. ‘‘సరే, సాయంత్రం మీరందరూ ఇక్కడికి రండి. మాట్లాడుకుందాం’’ అని చెప్పారు గురువుగారు. సాయంత్రం భారీ సంఖ్యలో శిష్యులు తరలివచ్చారు. గురువుగారు వారి వంక మౌనంగా చూశారు. కాస్సేపు తర్వాత ఆయన అక్కడి నుంచి తిరిగివెళ్ళడానికి సిద్ధపడ్డారు. అందరూ విస్తుపోయారు. వారిలో ఒకరు ‘‘గురువుగారూ, జ్ఞానామృతం ఏదైనా చెప్తారేమోనని మేమందరం వచ్చాం. ఇక్కడకు రావలసిందిగా మీరు చెప్పారు కూడా. మీరేదో చెప్తారని మేమొచ్చాం. కానీ మీరు ఒక్క మాటా మాట్లాడకుండా వెళ్ళిపోతే ఏమనుకోవాలి?’’ అని అడిగాడు. గురువు ఇలా అన్నారు...... ‘‘క్రమశిక్షణ నేర్పడానికి అనేకమంది ఆచార్యులు ఉన్నారు. నీతి కథలు చెప్పడానికీ చాలా మంది ఉన్నారు. ధర్మాల గురించి చెప్పడానికీ అనేక మందే ఉన్నారు. అటువంటివి చెప్పడం నా పని కాదు. జెన్ అనేది భాషకు అతీతం. మాటకు అతీతం. దేనికీ లొంగదు. మరి దానిని నేనెలా చెప్పగలను? సహజసిద్ధంగా ఉన్న దానిని ఏదో విడమరిచి చెప్పడానికి ప్రయత్నిస్తే ఉన్నదంతా చెడి అర్థంపర్థం లేకుండా పోతుంది. సహజసిద్ధమైనదానిని ఉన్నదున్నట్లుగానే గ్రహించాలి’’ అని చెప్పారు. మరొక జెన్ గురువు. ఆయన చుట్టూ అనేక మంది శిష్యులు. ఆయననే అందరూ చూస్తూ రెప్పవాల్చక కూర్చున్నారు. ఆయన ఏ క్ష ణాన ఏం చెప్తారా అని చూస్తున్నారు. అప్పుడు ఆ ఆశ్రమ ఆవర ణలోని ఒక పక్షి కీచుకీచుమని అరుస్తోంది. ఆ అరుపు వినసొంపుగా ఉంది. అది కాస్సేపటికి అరవడం ఆపేసింది. ‘‘ఏమిటి అందరూ విషయాన్ని గమనించారుగా?’’ అని గురువుగారు లేచి వెళ్ళిపోయారు. ఇంకొక గురువు. ఆయన జ్ఞానోపదేశం కోసం అనేక మంది వచ్చారు. వారిని చూసి ‘‘మీరందరూ వెళ్లి తేనీరు తాగి రండి’’ అని చెప్పారు. అంతే అంతకన్నా ఆయన మరేదీ చెప్పలేదు. జ్ఞానం, ఉపదేశం, వివరణ, విడమరిచి చెప్పడం వంటివన్నీ వొట్టి సంగ తులు. అవన్నీ అప్రధానమైనవి. వాటికోసం బుర్రలు బద్దలుకొట్టుకోవడం మూఢత్వం అంటుంది జెన్. వెళ్లి టీ తాగి రండి అనే దానిపై అనేక వివరణలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కోలా చెప్పారు. అయినా అదే ఫలానా అర్థమని ఎవ్వరూ చెప్పలేకపోయారు. జెన్ యథార్థమైంది. చిక్కుల్లేనిది. నిజాన్ని తెలుసుకోవడానికి చదువో సంధ్యో తెలివితేటలో ఇవేవీ అక్కర్లేదు. ఎవరైనా జ్ఞానాన్ని పొందవచ్చు అంటుంది జెన్. - సమయ