breaking news
second innigs
-
IND Vs NZ 1st Test: విజయం ఊరిస్తోంది!
రికార్డులకెక్కే వ్యక్తిగత స్కోర్లు లేకున్నా... సమష్టిగా జట్లు భారీ స్కోర్లు నమోదు చేయకున్నా... ఏ ఒక్కడూ తన బౌలింగ్‌తో పడేయకున్నా... నాలుగు రోజుల క్రితం మొదలైన కాన్పూర్ టెస్టు సెషన్ సెషన్‌కు మలుపులు తిరుగుతూ రసకందాయంలో పడింది. ఈ నేపథ్యంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టులో రెండు జట్లనూ విజయం ఊరిస్తోంది. ఆఖరి రోజు భారత్ నెగ్గాలంటే తొమ్మిది వికెట్లు తీయాలి. న్యూజిలాండ్ విజయం రుచి చూడాలంటే మరో 280 పరుగులు చేయాలి. కాన్పూర్: ఆట ఆఖరి మజిలీకి చేరింది. న్యూజిలాండ్‌ను లక్ష్యం ఊరిస్తోంది. భారత్‌ను గెలుపు పిలుస్తోంది. టెస్టు మలుపులు తీసుకుంటూ సాగిపోతోంది. నాలుగో రోజు తొలి సెషన్‌ను కివీస్ బౌలర్లు శాసించారు. మరో సెషన్లో మన కథ సమాప్తమన్నట్లుగా రెచ్చిపోయారు. కానీ శ్రేయస్ అయ్యర్ (125 బంతుల్లో 65; 8 ఫోర్లు, 1 సిక్స్) కొత్త వాడినే... కానీ సత్తా ఉన్న వాడినంటూ బ్యాట్‌తో మరోసారి చాటుకున్నాడు. కీపర్ వృద్ధిమాన్ సాహా (126 బంతుల్లో 61 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) కూడా అజేయ అర్ధ శతకంతో అయ్యర్‌కు కలిసొచ్చాడు. నాలుగో రోజు భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 81 ఓవర్లలో 7 వికెట్లకు 234 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. సౌతీ (3/75), జేమీసన్ (3/40) ఆకట్టుకున్నారు. 284 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 4 ఓవర్లలో వికెట్ నష్టానికి 4 పరుగులు చేసింది. హడలెత్తించిన సౌతీ, జేమీసన్ స్పిన్ ట్రాక్‌పై న్యూజిలాండ్ సీమర్లు సౌతీ, జేమీసన్ బెంబేలెత్తించడంతో తొలి సెషన్లో భారత్ నాలుగు కీలక వికెట్లను కోల్పోయింది. ఓవర్‌నైట్ స్కోరు 14/1తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్‌ను కివీస్ పేసర్లు అంతలా దెబ్బతీశారు. పుజారా (33 బంతుల్లో 22; 3 ఫోర్లు), రహానే (4) స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరారు. కాసేపటికే సౌతీ ఒకే ఓవర్లో ఓపెనర్ మయాంక్ (17; 3 ఫోర్లు), రవీంద్ర జడేజా (0)ల ఆట కట్టించాడు. స్కోరు చూస్తే 51/5. అప్పటికీ భారత్ ఆధిక్యం 100 పరుగులు మాత్రమే. ఆదుకున్న అయ్యర్, సాహా ఇక లెక్కకు సగం వికెట్లు మిగిలున్నట్లు కనబడినా... స్పెషలిస్టు బ్యాటర్స్ అయితే ఇద్దరే! అయ్యర్, సాహా. కానీ సాహాకంటే ముందుగా క్రీజులోకి వచ్చిన అశ్విన్, అయ్యర్‌తో కలిసి తొలి సెషన్లో మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. దీంతో లంచ్ విరామనికి భారత్ 84/5 స్కోరు చేయగలిగింది. రెండో సెషన్లో జట్టు స్కోరు వంద పరుగులు దాటాక అశ్విన్ (32; 5 ఫోర్లు)ను జేమీసన్ బౌల్డ్ చేశాడు. తర్వాత సాహా రావడంతో రెండో సెషన్ సాఫీగా సాగిపోయింది. ఏడో వికెట్‌కు 64 పరుగులు జోడించాక టీ విరామానికి ముందు అయ్యర్‌ను సౌతీ ఔట్ చేశాడు. అదే స్కోరు 167/7 వద్ద టీబ్రేక్‌కు వెళ్లారు. మూడో సెషన్ పూర్తిగా భారత్ ఆధీనంలో నడిచింది. అక్షర్ పటేల్ (28 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) అండతో సాహా అదరగొట్టేశాడు. అబేధ్యమైన ఎనిమిదో వికెట్‌కు 67 పరుగులు జోడించారు. కొన్ని ఓవర్లే మిగిలి ఉండటంతో ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలో పడేసేందుకు 234/7 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశారు. ఆశించినట్లే అశ్విన్ కివీస్ ఓపెనర్ యంగ్ (2)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ► అరంగేట్రం టెస్టులో సెంచరీ, అర్ధ సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్‌గా శ్రేయస్ అయ్యర్ గుర్తింపు పొందాడు. ► భారత్‌లో భారత్‌పై 200 పరుగులకుపైగా లక్ష్యాన్ని ఇప్పటివరకు రెండు జట్లు మాత్రమే ఛేదించాయి. 1972లో ఢిల్లీ వేదికగా జరిగిన టెస్టులో ఇంగ్లండ్ 207 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి అధిగమించింది. 1987లో ఢిల్లీలో జరిగిన టెస్టులో వెస్టిండీస్ 276 పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ► భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో హర్భజన్ సింగ్ (417 వికెట్లు) సరసన అశ్విన్ (417 వికెట్లు) చేరాడు. ప్రస్తుతం హర్భజన్‌తో కలిసి అశ్విన్ సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. అనిల్ కుంబ్లే (619 వికెట్లు) అగ్రస్థానంలో, కపిల్‌దేవ్ (437 వికెట్లు) రెండో స్థానంలో ఉన్నారు. ► నాలుగేళ్ల విరామం తర్వాత టెస్టుల్లో భారత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అర్ధ సెంచరీ సాధించాడు. 2017లో చివరిసారి సాహా (67) కొలంబోలో శ్రీలంకపై అర్ధ సెంచరీ చేశాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 345; న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 296; భారత్ రెండో ఇన్నింగ్స్: మయాంక్ (సి) లాథమ్ (బి) సౌతీ 17; శుబ్‌మన్ గిల్ (బి) జేమీసన్ 1; పుజారా (సి) బ్లన్‌డెల్ (బి) జేమీసన్ 22; రహానే (ఎల్బీడబ్ల్యూ) (బి) ఎజాజ్ 4; శ్రేయస్ (సి) బ్లన్‌డెల్ (బి) సౌతీ 65; జడేజా (ఎల్బీడబ్ల్యూ) (బి) సౌతీ 0; అశ్విన్ (బి) జేమీసన్ 32; సాహా (నాటౌట్) 61; అక్షర్ పటేల్ (నాటౌట్) 28; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (81 ఓవర్లలో 7 వికెట్లకు డిక్లేర్డ్) 234. వికెట్ల పతనం: 1–2, 2–32, 3–41, 4–51, 5–51, 6–103, 7–167. బౌలింగ్: సౌతీ 22–2–75–3, జేమీసన్ 17–6–40–3, ఎజాజ్ 17–3–60–1, రచిన్ 9–3–17–0, సొమర్విల్లే 16–2–38–0. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: లాథమ్ (బ్యాటింగ్) 2; విల్ యంగ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 2; సోమర్విల్లే (బ్యాటింగ్) 0; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (4 ఓవర్లలో వికెట్ నష్టానికి) 4. వికెట్ల పతనం: 1–3. బౌలింగ్: అశ్విన్ 2–0–3–1, అక్షర్ పటేల్ 2–1–1–0. -
పూజారా హాఫ్ సెంచరీ
బెంగళూరు: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో నిరాశపరిచిన భారత ఆటగాడు చటేశ్వర పూజారా.. రెండో ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీతో మెరిశాడు. 128 బంతుల్లో 3 ఫోర్లు సాయంతో అర్థ శతకం సాధించాడు. భారత కోన్ని కీలక వికెట్లను చేజార్చుకుని కష్టాల్లో పడ్డ సమయంలో పూజారా నిలకడగా ఆడాడు. ఆసీస్ బౌలింగ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ బాధ్యతాయుత ఇన్నింగ్స్ తో పరిస్థితిని చక్కదిద్దాడు. అతనికి జతగా రహానే క్రీజ్ లో ఉన్నాడు. అంతకుముందు అభినవ్ ముకుంద్(16),కేఎల్ రాహుల్(51),కోహ్లి(15), రవీంద్ర జడేజా(2)లు పెవిలియన్ కు చేరాడు. -
విరాట్ కోహ్లి మళ్లీ విఫలం
బెంగళూరు:ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఘోరంగా విఫలమైన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మరోసారి కూడా నిరాశపరిచాడు. శనివారం ఇక్కడ చిన్నస్వామి స్టేడియంలో ఆరంభమైన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో కోహ్లి(12) వైఫల్యం చెందాడు. ఆసీస్ స్పిన్నర్ లయన్ బౌలింగ్ లో కోహ్లి ఎల్బీగా అవుటయ్యాడు. దాంతో 88 పరుగుల వద్ద భారత్ జట్టు మూడో వికెట్ ను కోల్సోయింది. అంతకుముందు చటేశ్వర పూజారా(17),అభినవ్ ముకుంద్(0)లు సైతం నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. అభినవ్ ముకుంద్ పరుగులేమీ చేయకుండా అవుటయ్యాడు. ఆ తరువాత పూజారా-కేఎల్ రాహుల్ జంట ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టింది. ఈ జంట 61 పరుగులు జత చేసిన తరువాత పూజారా అవుటయ్యాడు. ఆపై కాసేపటికి కోహ్లి వెనుదిరగడంతో భారత్ కష్టాల్లో పడింది.