breaking news
the scale of Finance
-
అప్పుతిప్పలు.. మాఫీ మెలికలు
టీడీపీ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తవుతున్నా.. ఇప్పటికీ రైతు రుణమాఫీ ఓ కొలిక్కి రాని పరిస్థితి. ఎన్నికల ముందు హడావుడి ప్రకటన చేసినా.. అధికారంలోకి రాగానే మాట మారింది. అమలు సవా‘లక్ష’ మెలికలు తిరిగింది. అలా కాదు ఇలా.. అది కాదు ఇది అంటూ జాబితాలో భారీగా కోతలు విధించింది. తీరా ఎంపిక చేసిన రైతులకు వర్తించిన మాఫీ గొర్రె తోకను తలపిస్తోంది. ఇప్పటికీ మా మాటేంటని రైతులు పొలం పనులు పక్కనపెట్టి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి రావడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో 5.23 లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హత సాధించారు. దాదాపు రూ.3 వేల కోట్లు మాఫీ కావాల్సి ఉంది. ఫేజ్-1లో 2.87 లక్షల మందికి, ఫేజ్-2లో 1.30 లక్షల మందికి ఉపశమనం లభించింది. మొత్తంగా 4.17 లక్షల మందిని రైతు రుణ మాఫీ జాబితాలో చేర్చినా.. ఇందులో పది శాతం మందికీ రుణ భారం నుంచి విముక్తి లభించకపోవడం గమనార్హం. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పేరిట ప్రభుత్వం రుణాల్లో భారీగా కోత పెట్టింది. మిరప పంటకు కొన్ని చోట్ల స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఎకరాకు రూ.30 వేలుగా, మరికొన్ని చోట్ల రూ.12 వేలుగా తీసుకుని మాఫీ వర్తింపజేశారు. ఒకే గ్రామంలోనూ తేడాలు ఉండటం గందరగోళానికి తావిస్తోంది. మొదటి ఫేజ్ రుణమాఫీపై గ్రీవెన్స్ కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతున్నాయి. 2.87 లక్షల మందికి రుణ మాఫీ ప్రకటించగా.. మాకు నిబంధనల ప్రకారం రుణాలు మాఫీ కాలేదంటూ దాదాపు లక్ష మంది రైతులు మీ-సేవ కేంద్రాల ద్వారా ప్రభుత్వానికి తగిన ఆధారాలతో నివేదించారు. ప్రభుత్వం వీటిని ఇప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇకపోతే జిల్లాలో 1.06 లక్షల మందికి రుణ మాఫీలో ప్రభుత్వం మొండిచెయ్యి చూపింది. ఆధార్ నెంబర్ చెల్లుబాటు కాలేదని.. డేటా నాట్ ఫౌండ్.. రేషన్ కార్డు ఇన్వ్యాలిడ్.. తదితర కారణాలతో మాఫీకి దూరం చేసింది. వీరంతా తగిన ఆధారాలతో గ్రీవెన్స్ ఇచ్చుకోవచ్చని ప్రకటించినా.. మొదట హైదరాబాద్‌లోనే వినతులు స్వీకరించారు. అక్కడికి రైతుల తాకిడి పెరగడంతో జిల్లా కేంద్రాల్లో ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేశారు. ఇక్కడా అదే పరిస్థితి ఎదురవడంతో ఫిర్యాదుల విభాగాన్ని వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ కేంద్రాలకు మార్పు చేశారు. హైదరాబాదులో దాదాపు 25వేల మంది.. జిల్లా స్థాయిలో ఇప్పటివరకు 15,500 మంది ఫిర్యాదు చేసుకున్నారు. వీటన్నింటినీ ఎక్కడికక్కడ మూలనపడేస్తుండటంతో రైతుల్లో మాఫీపై ఆశ సన్నగిల్లుతోంది. ఇదిలాఉంటే రుణమాఫీ అస్తవ్యస్తం కావడంతో 2014లో బ్యాంకర్లు రైతు రుణాల పట్ల ఆసక్తి కనబర్చలేదు. 2015లోనూ పరిస్థితి అదేవిధంగా ఉంటోంది. మాఫీ అయిన మేరకే తిరిగి రుణాలిచ్చే ఆలోచనలో ఉండటం రైతులను నిరాశకు గురిచేస్తోంది. రూ.3వేల కోట్లలో మాఫీ రూ.650 కోట్లే.. జిల్లాలో రుణ మాఫీకి అర్హత పొందిన రైతులు 5.23 లక్షలకు పైనే. వీరి రుణాల మొత్తం రూ.3వేల కోట్లు. అయితే రెండు విడతలుగా 4.17 లక్షల మంది రైతులకు రూ.650 కోట్లు మాత్రమే మాఫీ చేశారు. దీన్ని బట్టి రుణాల మాఫీ అరకొర అనే విషయం ఇటే తెలిసిపోతోంది. రూ.50 వేల లోపు రుణాలను ఒకేసారి మాఫీ చేస్తామని ప్రకటించినా అమలులో విఫలమయ్యారు. పూర్తిస్థాయిలో మాఫీ కావాలంటే రైతులు 2019 వరకు వేచి ఉండాల్సి రావడం విమర్శలకు తావిస్తోంది. మాఫీ బూటకం రాచర్ల గ్రామ పరిధిలోని 113 సర్వే నెంబర్లో రెండెకరాల భూమి ఉంది. హుసేనాపురం ప్రాథమిక, వ్యవసాయ సహకార పరపతి సంఘంలో వేరుశెనగ సాగుకు రూ.24 వేల పంట రుణం తీసుకున్నా. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద ఎకరాకు రూ.8వేలు చొప్పున రూ.16వేలు మాత్రమే మాఫీ చేసినారు. మిగిలిన మొత్తానికి రుణం తీసుకున్న రోజు నుంచి వడ్డీ కట్టాలంట. ఇదేం మాఫీనో ఏమో. - జి.శివమ్మ, నేరడుచెర్ల, ప్యాపిలి మండలం అంతా మాటలే నాకు 2.7 ఎకరాల పొలం ఉంది. రూ. 10 వేల అప్పు తీసుకున్నా. రుణమాఫీ కింద నాకు ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. అధికారులను అడిగితే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్ పుస్తకాల జిరాక్స్‌లు మళ్లీ తెచ్చివ్వమన్నారు. బ్యాంకులో కొత్త రుణం ఇవ్వడం లేదు. ప్రభుత్వం చెప్పేవన్నీ మాటలే. మా బాధలు ఎవరికి సెప్పుకోవాల. -బోయ రామన్న, ఎస్.నాగలాపురం -
స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారమే రుణమాఫీ
-
పరపతే కొలమానం
స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారమే రుణమాఫీ: పరకాల జాబితాలో పేర్లు లేని రైతులు జనవరి 9వ తేదీ లోపు సవరణలు చేసుకోవాలి నేడు చిత్తూరులో సీఎం చేతుల మీదుగా రుణ విముక్తి సర్టిఫికెట్లు సాక్షి, హైదరాబాద్: ‘‘రైతులు తీసుకున్న రుణం అంతా మాఫీ చేయమంటే ఎలా సాధ్యం? బ్యాంకర్లు ఇష్టం వచ్చినట్లు రుణాలు ఇస్తే ప్రభుత్వానికి ఏమి సంబంధం? అందుకే ప్రభుత్వం రుణ మాఫీ పథకం అమలుకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను కొలమానంగా తీసుకుంది’’ అని ప్రభుత్వ సమాచార సలహాదారుడు పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. ఆయన బుధవారం సచివాలయంలో విలేకరులతో మాటాడారు. రైతులను అయోమయానికి గురి చేసే విధంగా కొన్ని పత్రికలు తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నాయని ఆరోపించారు. వాటిని నమ్మి ఎవ్వరూ అపోహలకు గురి కావద్దన్నారు. ‘రుణ మాఫీ హామీ ప్రకటన చేసిన సమయంలో చంద్రబాబు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని రైతులకు చెప్పలేదు కదా?’ అని విలేకరులు ప్రశ్నించగా.. నేరుగా సమాధానం చెప్పకుండా ‘‘ఒక రైతు కుటుంబం 15 ఖాతాల ద్వారా రూ. 70 లక్షల రుణం తీసుకుంది.. అదంతా మాఫీ చేయమంటారా?’’ అని పరకాల ఎదురు ప్రశ్న వేశారు. మొదటి విడతగా 22.79 లక్షల రైతు కుటుంబాలను రుణ విమోచన చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో 10 లక్షల మంది రైతులకు మొత్తం రుణం ఒకేసారి మాఫీ అవుతోందన్నారు. డేటా ఎంట్రీ సమయంలో కొన్ని తప్పులు దొర్లాయని వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు. లోపాలున్న జాబితాను ఆన్లైన్లో ఉంచామని.. ఏ కారణం చేత తొలి జాబితాలో పేరు లేదో తెలుసుకొని సంబంధిత డాక్యుమెంట్లను జనవరి 9వ తేదీ లోపు ఆధారాలతో సహా ఇస్తే సరిచేసి రుణ మాఫీకి అర్హులుగా గుర్తిస్తామని చెప్పారు. రుణ మాఫీ పథకాన్ని సీఎం చంద్రబాబు గురువారం చిత్తూరు జిల్లాలో ప్రారంభిస్తారని.. ఈ సందర్భంగా రైతులకు వాటికి సంబంధించిన సర్టిఫికెట్లను అందజేస్తారని ఆయన వివరించారు. తెలంగాణలో ఆధార్, రేషన్ కార్డు ఉన్నవారికి ఆంధ్రప్రదేశ్‌లో పొలం ఉండటంతో పాటు అక్కడే రుణం తీసుకున్న వారి విషయంలో ఏమి చేయాలని ఒకటి రెండు రోజుల్లో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా 2013 డిసెంబర్ 31వ తేదీ తర్వాత వచ్చే బీమా మొత్తం రైతుల ఖాతాకే జమ అవుతుందన్నారు.