breaking news
Save Shakthi
-
వరలక్ష్మీ చుట్టూ రాజకీయం!
తమిళసినిమా: నటి వరలక్ష్మి బీజేపీలో చేరారా? తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న విషయం ఇదే. కథానాయకి, ప్రతి కథానాయకి అంటే తారతమ్యాలు చూపకుండా చేతి నిండా చిత్రాలతో యమ బీజీగా ఉన్న నటి వరలక్ష్మీశరత్‌కుమార్. అంతే కాకుండా మహిళా రక్షణ కోసం సేవ్‌శక్తి అనే సేవాసంస్థను నెలకొల్పి మహిళల కోసం గళం విప్పుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అనూహ్యంగా నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ను బుధవారం బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధరన్ ఆమె ఇంట్లో కలిశారు. అంతే మీడియా వరలక్ష్మీ శరత్‌కుమార్ చుట్టూ రాజకీయాన్ని అల్లేస్తోంది. నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారనే ప్రచారం సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. ఈ వ్యవహారంపై స్పందించిన వరలక్ష్మీశరత్‌కుమార్ తన ట్విట్టర్లో పేర్కొంటూ మహిళా రక్షణ తదితర విషయాల గురించి తాను మురళీధరన్‌తో భేటీ అయిన సందర్భంగా చర్చించిన మాట వాస్తవమేనని, ఇది మంచి భేటీగా అమరిందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోదీ తమ అభిప్రాయాలను తెలుసుకోవాలనుకోవడం మంచి పరిణామం అని అన్నారు. అయితే మురళీధరన్‌తో తన భేటీని మీడియా నిరాధార వార్తలను ప్రచారం చేస్తోందని అన్నారు. అలాంటి వారికి తాను చెప్పేదొక్కటేనన్నారు. తానూ ఏ రాజకీయ పార్టీలోనూ చేరలేదని వరలక్ష్మీ శరత్‌కుమార్ స్పష్టం చేశారు. అయితే నిప్పు లేనిదే పొగ రాదన్న సామెతను గుర్తు చేసుకోవలసిన పరిస్థితిది. పైగా సినీ తారలు రాజకీయాలపై మోజు పడుతున్న తరుణం ఇది. ఏమో ఏ పుట్టలో ఏ పాముందో! నటి వరలక్ష్మిది రాజకీయ నేపథ్యమే కదా! ఆమె తండ్రి శరత్‌కుమార్ ఒక పార్టీని నడుపుతున్న విషయం తెలిసిందే. -
మూడేళ్ల దాకా ఆ ప్రసక్తే లేదు!
పెళ్లి ప్రసక్తి మరో మూడేళ్ల వరకూ కచ్చితంగా ఉండదంటున్నారు నటి వరలక్ష్మీశరత్‌కుమార్. పోడాపోడి చిత్రంతో కథానాయకిగా పరిచయమైన ఈ బ్యూటీ ఆ మధ్య తారైతప్పట్టై చిత్రంతో నటిగా తానేమిటో నిరూపించుకున్నారు. పాశ్చాత్య సంగీతంలో మంచి ప్రావీణ్యం కలిగిన వరలక్ష్మి పేరిప్పుడు కోలీవుడ్‌లో మారు మోగుతోంది. ఆ మధ్య విశాల్‌తో చెట్టాపట్టాల్, త్వరలో పెళ్లి, లేదు ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు అంటూ రకరకాల ప్రచారాలకు కేంద్రబిదువుగా మారిన నటి వరలక్ష్మీశరత్‌కుమార్.ఇలాంటి వదంతుల మధ్య నటిగా తన వృత్తిలో బిజీగా ఉన్న వరలక్ష్మి ఇటీవల మహిళల రక్షణ కోసం నడుంబించారు.అందుకు సేవ్ శక్తి అనే సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ విధి విధానాలు, సినిమా, వ్యక్తిగత అంశాల గురించి వరలక్ష్మీశరత్‌కుమార్‌తో చిట్‌చాట్.. సేవ్ శక్తి సంస్థను ప్రారంభించాలన్న అనూహ్య నిర్ణయానికి కారణం? మహిళలపై హింసాత్మక సంఘటనలనేవి మొదటి నుంచి జరుగుతూనే ఉన్నాయి.అయితే ఇటీవల మరీ మితిమీరిపోతున్నాయని చెప్పవచ్చు. ఇంతకు ముందు నేరస్తులెవరన్నది గుర్తించగలిగేవారం.ఇప్పుడు ఎవరిలో మృగత్వం ఉందో తెలియనంతగా ఉన్నత స్థాయిలో ఉన్న వారే దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.ఈ తరం అమ్మాయిలు అరకొర దుస్తులు ధరించడం కారణం గానే అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఒక వర్గం పురుషులు చేస్తున్న ఆరోపణలు.అయితే మూడేళ్ల చిన్నారి ఎలాంటి దుస్తులు ధరించిందని పాపపుణ్యాలు కూడా చూడకుండా మృగాల్లా ప్రవర్తిస్తున్నారు? ఇలాంటి ఆటవిక మృగాలనుంచి మహిళలు తమను తాము రక్షించుకునే విధంగా అవగాహన కలించాలన్న ఒక లక్ష్యంతో ప్రారంభించిన సంస్థ సేవ్ శక్తి. ఇలాంటి సమాజక సేవకు ప్రత్యక్షంగా నడుంబిగించారు.వ్యక్తిగతంగా సమస్యలను ఎదర్కోవలసి వస్తుందేమో? ఎలాంటి సమస్యలు తలెత్తవనే భావిస్తున్నాను. ఒకవేళ అలాంటివి ఎదరైనా ఫేస్ చేయడానికి నేను సిద్ధమే. స్త్రీ అనే నా జాతికి జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా నేను పోరాడుతున్నాను. చిత్రాలను ఎక్కువగా చేయడం లేదే? నేను అవకాశాలను వెతుక్కుంటూ ఎప్పుడూ వెళ్లను.వచ్చిన అవకాశాల్లో నాకు బాగున్నాయనిపించిన పాత్రలనే ఎంచుకుని నటిస్తున్నాను. తారైతప్పట్టై చిత్రం తరువాత చాలా అవకాశాలు వచ్చాయి.అందులో చాలా మంది దర్శకులు తారాతప్పట్టై చిత్రంలోని సూరావళి పాత్రలా అంటూ చెప్పడం మొదలెట్టారు. సూరావళిలా ఒక సారే నటించగలం. ప్రస్తుతం విక్రం వేద, సత్య, నిపుణన్, అమ్మాయి చిత్రాల్లో నటిస్తున్నాను. వీటితో పాటు రెండు మలయాళ చిత్రాలు అంగీకరించాను. మీ వ్యక్తిగతం కూడా చర్చనీయాంశంగా మారింది.పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు? నటి అన్నాక ఇలాంటి చర్చనీయాంశాలు సాధారణమే. అలాంటి వాటిని సీరియస్‌గా తీసుకోను. ఇక పెళ్లి అంటారా,మరో మూడేళ్ల వరకూ ఆ ప్రసక్తే లేదు.