breaking news
Savages
-
దోమకుట్టినట్టైనా లేదు
జనావాసాల్లో ఖాళీ స్థలాలు మురుగు నీటితో గుంతలుగా మారి కంపు కొడుతున్నాయి. ఓనర్ల నిర్లక్ష్యం.. అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రజలకు పాట్లు తప్పడం లేదు. ఇటీవలి వర్షాలతో నగరంతో పాటు శివారు మేడ్చల్– మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలలోని పురపాలికల్లో మురుగు సమస్య తీవ్రంగా పరిణమిచ్చింది. ఖాళీ స్థలాల్లో చెత్తా చెదారం, మురుగు నీరు పేరుకుపోయి దోమలు విజృంభిస్తున్నాయి. కాలనీల వాసులు అనారోగ్యం బారిన పడుతున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులకు మాత్రం చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం గమనార్హం. – సాక్షి, సిటీబ్యూరోఅపరిశుభ్రతకు నిలయాలుగా.. పురపాలిక చట్టం ప్రకారం ఖాళీ స్థలాల్లో ఎలాంటి ముళ్ల పొదలు పెరగకుండా, అపరిశుభ్రత లేకుండా స్థల (ప్లాట్ల) ఓనర్లు చూసుకోవాలి. లేదంటే పుర అధికారులు స్థలం యజమానికి నోటీసులు ఇచ్చి శుభ్రం చేయించాలి. కానీ.. శివారు జిల్లాల పరిధిలోని జీహెచ్ఎంసీ సర్కిళ్లతో సహా 29 పురపాలికల్లోని పలు కాలనీల్లో ఖాళీ ప్లాట్లు అపరిశుభ్రతకు నిలయంగా మారాయి. భావి అవసరాల దృష్ట్యా కొందరు ఇళ్ల స్థలాలను కొనుగోలు చేసి అలాగే ఖాళీగా వదిలేస్తున్నారు. ఆయా కాలనీల్లో గృహ నిర్మాణాలు ఊపందుకుని, ప్లాట్లకు విలువ పెరిగిన తర్వాత చూద్దాంలే అనుకొని ఏళ్ల తరబడి వదిలేయడంతో చెత్త, ముళ్లకంప చెట్లు పెరిగి దోమలకు నిలయాలుగా మారుతున్నాయి. నగర శివారు జిల్లాల్లోని మేడ్చల్, మల్కాజిగిరి, అల్వాల్, కుత్బుల్లాపూర్ తదితర మున్సిపల్ సర్కిళ్లతో పాటు జవహర్‌నగర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, పోచారం, ఘట్కేసర్, నాగారం, దమ్మాయిగూడ, గుండ్లపోచంపల్లి, తూముకుంట తదితర 29 పురపాలక సంఘాల్లో ఇటీవల కురిసిన వర్షం జల్లులతో కాలనీలు, లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలిచి దోమలు పెరగడంతో డెంగీ, మలేరియా, టైఫాయిడ్, వైరల్ జ్వరాలు ప్రబలుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ స్థలాల్లోనూ.. ప్రైవేటు ప్లాట్ల సంగతి ఇలా ఉంటే.. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు,డంపింగ్ యార్డులు అంతర్గత, ప్రధాన రహదారుల వెంట ఉన్న గ్రీన్ బెల్టు తదితర స్థలాలు చెత్తకుండీలుగా, మురుగునీటి నిలయాలుగా మారుతున్నాయి. పందులు, కుక్కలకు ఆవాసాలుగా మారుతున్నాయి. నిర్మాణ వ్యర్ధాలను, భోజన, ప్లాస్టిక్ వ్యర్థాలను డంపు చేస్తున్నారు. ప్రతి ఏటా పట్టణ ప్రగతి, ఇతర ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల అమలు సందర్భంగా వీటిని శుభ్రం చేసేందుకు రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. కరువైన పర్యవేక్షణ.. స్థల యజమానులు తమ ప్లాట్లలో మురుగు, వర్షం నీరు నిలవకుండా, పిచ్చి మొక్కలు పెరగకుండా, ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాల్సిన్నప్పటికీ, పట్టించుకోవటం లేదు. దీన్ని పర్యవేక్షించాల్సిన పురపాలిక అధికారులు.. అటువైటు కన్నెత్తి కూడా చూడటం లేదు. దీంతో ఆ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరిగి.. చెత్తాచెదారంతో ఖాళీ ప్లాట్లు మురుగు కూపాలుగా మారుతున్నాయి. సంబంధిత ఓనర్లకు పురపాలక సంఘాలు అడపాదడపా నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకొంటున్నాయి. కొందరి పాట్ల ఓనర్ల వివరాలు తెలియక నోటీసులు కూడా ఇవ్వకపోవడం గమనార్హం. -
కిరాతకులు అమ్మను చంపేశారు..!
– కొట్టి.. పురుగులమందు తాపి.. – అతిగా మద్యం సేవించొద్దన్నందుకే కుమారుల ఘాతుకం – నార్కట్‌పల్లి మండలంలో దారుణం – పోలీసుల అదుపులో నిందితులు..? నవమాసాలు మోసి.. పురిటినొప్పులను పంటి బిగువన అదిమి జన్మనిచ్చిందనే విషయాన్నే మరచిపోయారు.. లాలిపాటలు.. గోరుముద్దలు గుర్తుకే రాలేదు.. విద్యాబుద్ధులు చెప్పించి పెంచి పెద్దచేసిందనే కనికరం కూడా చూపలేదు.. అతిగా మద్యం తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని సూచించిన ఆ మాతృమూర్తిని పొట్టనబెట్టుకున్నారు.. ఇద్దరు కిరాతక కుమారులు. ఈ దారుణ ఘటన గురువారం నార్కట్‌పల్లి మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. – నార్కట్‌పల్లి నార్కట్‌పల్లి మండలం నక్కలపల్లి గ్రామపంచాయతీ పరిధి గద్దగోటిబావి గ్రామానికి చెందిన బోగిని సైదులు, పిచ్చమ్మ(48) దంపతులకు వెంకన్న,నరేష్ కుమారులు. తమకున్న కొద్దిపాటి భూమిని సాగు చేసుకుంటూ, కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. గురువారం గ్రామంలో బంధువుల ఇంట్లో జరుగుతున్న చిన్నకర్మకు తల్లితో పాటు ఇద్దరు కుమారులు వెళ్లారు. ఆరోగ్యాన్ని పాడు చేసుకోద్దనందుకు.. బంధువుల ఇంట్లో కార్యక్రమం జరుగుతుండగానే కుమారులిద్దరు పక్కనే మద్యం సేవిస్తున్నారని పిచ్చమ్మకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి వెళ్లి అతిగా తాగి ఆరోగ్యాలను పాడు చేసుకోవద్దని పెద్ద కుమారుడు వెంకన్నకు సూచించింది. దీంతో వెంకన్న ఆగ్రహావేశానికి లోనై తల్లిని అక్కడే కొడుతుండగా చిన్న కుమారుడు నరేష్ కూడా వచ్చాడు. ఇద్దరూ కలిసి పరువు తీస్తావా అంటూ ఆ మాతృమూర్తిని కొట్టుకుంటూ ఇంటికి తీసుకువచ్చారు. బలవంతంగా పురుగుల మందు తాపి.. కుమారులు కొడుతుండడంతో లబోదిబోమంటూ పిచ్చమ్మ ఇంట్లో నుంచి బయటికి పరుగుతీయడంతో ఆమెను ఈడ్చుకుంటూ మళ్లీ ఇంట్లోకి తీసుకెళ్లారు. ఈ ఘటనను చూసిన వారి ఇద్దరి భార్యలు అడ్డురావడంతో వారిని కూడా చితకబాదారు. ఆపై వ్యవసాయ సాగు కోసం తెచ్చిన పురుగులమందును పిచ్చమ్మకు బలవంతంగా తాపించి గదిలో పడవేసి గడియపెట్టి వ్యవసాయ బావి వద్దకు వెళ్లిపోయారు. కాసేపటికి ఇరుగుపొరుగు వారు వెళ్లి చూడడంతో అప్పటికే పిచ్చమ్మ మృతిచెందింది. గ్రామస్తుల సమాచారం మేరకు సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎస్ఐ మోతీరామ్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతురాలి భర్త సైదులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. కాగా, వ్యవసాయ బావి వద్ద ఉన్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. -
అడుగడుగునా అమానుషాలే!
పేగు బంధాన్నీ మర్చిపోతున్న కిరాతకులు కన్న బిడ్డలపైనా కత్తికడుతున్న వైనం ‘‘మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు... మచ్చుకైనా లేడు చూడు మనసున్న వాడు... అనుబంధ ఆత్మీయత అంతా ఒక బూటకం... ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం...’’ ఏనాడో కవుల కలాల నుంచి జాలువారిన ఈ పాటలు ప్రస్తుత పరిస్థితుల్లో పచ్చినిజాలవుతున్నాయి. పేగుబంధాన్ని సైతం మర్చిపోతున్న కిరాతకులు కన్న, కడుపున పుట్టిన వారినీ అంతం చేస్తున్నారు. ఈ ఘాతుకాల వెనుక అనేక కారణాలు ఉంటున్నా... ప్రధానంగా మానసిక రుగ్మతలు, పరిపక్వత లేని ఆలోచనలతో పాటు ఆర్థికాంశాలు, క్షణికావేశాలే కారణం. తాజాగా నేరేడ్మెట్ పరిధిలో నివసించే పూర్ణిమ 23 రోజుల వయస్సున్న కన్న బిడ్డను హతమార్చడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ధోరణి పెరగడానికి యాంటీ సోషల్ పర్సనాలిటీ, కొన్ని రకాలైన డిజార్డర్స్ కారణమని మానసిక నిపుణులు చెప్తుండగా... చట్టమంటే భయం... వ్యవస్థ పట్ల గౌరవం లేకపోవడమే కారణమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. -సాక్షి, సిటీబ్యూరో ఆర్థిక కారణాలే అధికం... హార్థిక సంబంధాలను మర్చిపోయి తన వారినే పగవారుగా చూసే ధోరణికి ప్రధానంగా ఆర్థిక పరమైన అంశాలే కారణమవుతున్నాయి. ఆస్తి పంపకాల్లో తలెత్తిన వివాదాలు, ఉమ్మడి వ్యాపారంలో వచ్చిన స్పర్థలు సొంత వారి మధ్యే చిచ్చుపెడుతన్నాయి. దీనికి ఈర్ష్యాద్వేషాలు తోడు కావడంతో విపరీత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆనంద్‌నగర్ కాలనీలో సొంత అన్నను చంపించిన తమ్ముడు, పంజగుట్ట పరిధిలో చోటు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన ‘సిసోడియాల’ కేసు ఈ కోవలోకే వస్తాయి. కొన్ని సందర్భాల్లో నమ్మకమే పెట్టుబడిగా విదేశాల్లో ఉన్న బంధువుల సొమ్ముకాజేస్తున్న దగాకోరులు లెక్కలు చెప్పాల్సి వచ్చేసరికి కర్కశంగా మారిపోతున్నారు. సికింద్రాబాద్‌లోని ఆర్ఏకే లాడ్జ్‌లో జరిగిన ఎన్ఆర్ఐ కుటుంబం దారుణ హత్య ఇలాంటి కారణాల నేపథ్యంలోనే జరిగింది. కేవలం హత్యలే కాకుండా అనేక కిడ్నాప్‌లు, దాడులు సైతం నిత్యం నగరంలో వెలుగులోకి వస్తూనే ఉంటున్నాయి. చనిపోతూ చంపేస్తున్నారు... తల్లిదండ్రులు చేసిన అనాలోచిత నిర్ణయా లు, ఆర్థిక లావాదేవీలు సైతం పసిబిడ్డల పాలిటి శాపంగా మారుతున్నాయి. వ్యక్తిగత, వ్యాపార కారణాలతో చేస్తున్న అప్పులు తీరే మార్గం లేక... తట్టుకుని నిలబడి, ప్రత్యామ్నాయ మార్గాల్లో సంపాందిచే మానసిక స్థైర్యం లేని వారు ఆత్మహత్యల వైపు మొగ్గు చూపుతున్నారు. తమతో పాటే తమ వారసులూ ‘రావాలన్న’ ఉద్దేశంతోనో, తామే లేకపోతే తమ వారిని ఎవరు చూస్తారనే భయంతోనే ఆత్మహత్యకు ముందు కడుపున పుట్టిన వారినీ కడతేర్చేస్తున్నారు. హబీబ్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో నివసించిన భార్యాభర్తలు బాలరాజ్, సురేఖ ఆర్థిక కారణాలతో ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. చనిపోయే ముందు 13 నెలల వయస్సున్న కవలలు మేథ, మేఘనల ఉసురుతీశారు. బోరబండ వినాయక్‌నగర్‌కు చెందిన సరిత సైతం ఆత్మహత్య చేసుకుంటూ కడుపున పుట్టిన మూడేళ్ల ప్రత్యుష, తొమ్మిది నెలల శరణ్యలను చంపేసింది. మానసిక రుగ్మతలతో మరో ప్రమాదం... పేగుబంధాలను నిర్ధాక్షణ్యంగా తెంపేస్తున్న ఉదంతాల్లో ఈ ఘాతుకానికి ఒడిగడుతున్న వారి మానసిక రుగ్మతలు మరో ప్రధాన కారణంగా ఉంటున్నాయి. తాము ఊహించుకున్న, భావించిన అంశాలనే నిజాలుగా నమ్ముతూ కన్న వారి ఉసురుతీస్తున్నారు. ఆనక పోలీసుల విచారణలో ఘాతుకానికి ఒడిగట్టిన వారి అనుమానాలు వాస్తవాలు కాదని తేలుతున్నా... అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఎల్బీనగర్ చంద్రపురి కాలనీలో నివసించే పద్మ మానసిక స్థితి సరిగ్గా లేనికారణంగా కడుపున పుట్టిన అక్షర, సహస్రల్ని సంపులో పడేసి అంతం చేసింది. ఈ ఘటనతో ఆ కుటుంబం మొత్తం తీవ్రమైన షాక్‌లోకి వెళ్లిపోయింది. ఈస్ట్‌మారేడ్‌పల్లి టీచర్స్ కాలనీలో నివసించే రజని అకారణంగా తన భర్తనే ‘అనుమానించింది’. కుమార్తెలు తివిష్క, అశ్వికల్ని గొంతుకోసి చంపేసింది. ఇంతటి ఘోరం చేసిన తర్వాత కూడా పోలీసుల ఎదుట బిడ్డలకు ‘విముక్తి’ కల్పించానంటూ చెప్పుకొచ్చింది. ఈ తరహా ఉదంతాల్లో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా నిందితులుగా మారుతున్నారని పోలీసులు చెప్తున్నారు. కనిపించని కిరాతకులెందరో... ఇవన్నీ ఘాతుకానికి ఒడిగట్టింది ఎవరో సమాజానికి తెలిసే ఉదంతాలు. అలాకాకుండా చేయాల్సిన ‘పని’ చేసేసి... సమాజం దృష్టిలో మాత్రం గుట్టుగా బతికేస్తున్నా వారూ ఎందరో ఉంటున్నారు. లంగర్‌హౌస్ ఠాణా పరిధిలో ఓ ఆడశిశువు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శవపంచనామా నేపథ్యంలోనే ఆ శిశువుకు ఉరివేసి, గుండెపై ఏదో వస్తువుతో బాది చంపేసినట్లు తేలింది. ఇలాంటి మృతదేహాలు నిత్యం నగరంలో ఏదో ఒకచోట బయటపడుతూనే ఉన్నాయి. వీటిలోనూ కొన్ని కన్నవారు చేసినవే అని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే వారెవరో గుర్తించడం సాధ్యం కాక మిన్నకుండిపోవాల్సి వస్తోందంటున్నారు. యాంటీ సోషల్ పర్సనాలిటీయే కారణం ఈ తరహా విపరీత ధోరణులకు మనుషుల్లో పెరుగుతున్న యాంటీ సోషల్ పర్సనాలిటీ ప్రధాన కారణం. మరికొందరిలో ఉంటున్న మానసిక రుగ్మతలు (డిజార్డర్స్) సరైన సమయానికి గుర్తించలేకపోవడం, గుర్తించినా అవసరమైన స్థాయిలో వైద్యం, శ్రద్ధ తీసుకోని కారణంగా విపరీత చర్యలు జరుగుతున్నాయి. మీడియా, సినిమాల ప్రభావంతోనూ కొందరు స్త్రీలు పేగుబంధాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. - డాక్టర్ రాజశేఖర్, మానసిక నిపుణులు