breaking news
Saraswati Samman Award
-
శివారెడ్డికి ‘సరస్వతీ సమ్మాన్’
సాక్షి, హైదరాబాద్: కొంచెం స్వేచ్ఛ గావాలి మనిషిని మనిషని చెబటానికి పశువుని పశువని చెబటానికి కొంచెం స్వేచ్ఛ గావాలి రాత్రిని రాత్రని చెబటానికి పగటిని పగలని చెబటానికి కొంచెం స్వేఛ్చ గావాలి రెక్కలల్లార్చి గాల్లో ఎగరడానికి .. అంటూ కాంక్షించిన ప్రముఖ కవి కె. శివారెడ్డిని ప్రతిష్టాత్మక ‘సరస్వతీ సమ్మాన్’వరించింది. కేకే బిర్లా ఫౌండేషన్ అందజేసే ఈ ప్రతిష్టాత్మక సాహితీ పురస్కారానికి శివారెడ్డి కవితా సంపుటి ‘పక్కకి ఒత్తిగిలితే...’ఎంపికైంది. 2016లో విడుదలైన ఈ కవితా సంపుటిని 2018 సంవత్సరానికిగాను పురస్కారానికి ఎంపిక చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ పురస్కారం కింద జ్ఞాపిక, ప్రశంసాపత్రంతోపాటు రూ. 15 లక్షల నగదు అందజేయనున్నారు. లోక్‌సభ సచివాలయం పూర్వ సెక్రెటరీ జనరల్‌గా పనిచేసిన డాక్టర్ సుభాష్ సి. కశ్యప్ ఆధ్వర్యంలో పలువురు ప్రముఖ రచయితలతో కూడిన చయన్ కమిటీ పలు వడపోతల అనంతరం పురస్కారానికి రచనలను ఎంపిక చేస్తుంది. అందుకే దేశవ్యాప్తంగా సరస్వతీ సమ్మాన్‌కు ప్రత్యేక స్థానం ఉంది. దేశవ్యాప్తంగా 22 భాషల్లో వెలువడే రచనల్లోంచి మంచి సాహితీ విలువలతో కూడిన రచనలను పరిగణనలోకి తీసుకుంటారు. ఒక తెలుగు రచనకు ఈ పురస్కారం లభించడం ఇదే తొలిసారి కావడం విశేషం. సమాజ కోణంలోంచి... మా చేతులు చూడండి మా అరచేతులు చూడండి అక్కడ కనపడుతుంది క్రైర్యం, దౌష్టం నిరాధారులం, అనాధలం మా లేత చేతుల మీద పడ్డ వాతల్లో ఏం కనపడుతుంది అనాధల్ని చేసిన తల్లిదండ్రులా– దేశమా రాజ్యమా, మా చుట్టు ముళ్లకంచలా అల్లుకున్న సమాజమా ఆయాలు ఆడవాళ్లే, అమ్మలాంటి వాళ్లే కానీ, వాళ్లు ఈ నిర్దయ లోకానికి గుర్తు.... అంటూ కన్నీళ్లు తెప్పించే కవిత కూడా ఆ సంపుటిలో భాగం. కరీంనగర్‌లోని శిశు గృహంలో ముగ్గురు చిన్నారులు అన్నం తినలేదని ఆయాలు చెంచాను కాల్చి అరచేతిపై వాతలు పెట్టిన ఘటనకు ఇలా కవిత రూపంలో ఆవేదన చెందారు శివారెడ్డి. గుంటూరుకు చెందిన శివారెడ్డి ఎన్నో కవితా సంపుటిలు, సంకలనాలు వెలువరించారు. సమాజ దృష్టికోణం నుంచి ఆయన రచనలు వెలువడతాయి. అందుకే వాటిల్లో కొన్ని ఇతర భాషల్లోకి కూడా అనువాదమయ్యాయి. కవితలు రాయడం అంత సులువు కాదని, అది కత్తిమీద సామే అని ఆయన అంటారు. పక్కకి ఒత్తిగిలితే తగిలిందో వాక్యం పూర్వం ఒక రాజు తనకీ, పెళ్లానికీ మధ్య కత్తి నాటాడట పక్క మధ్యలో ఎవరు కదిలినా రక్తం పలుకుతుంది పండిన వేపయా హృదయం తీయతీయగా చేదు చేదుగా తడితడిగా. అంతే కవిత్వం రాయడమంటే ఖడ్గంతో సహజీవనం చెయ్యటం మొద్దుబారటానికీ వీల్లేదు మోడుగా మిగలటానికీ వీల్లేదు. ఈ మాటలను ఎంపిక కమిటీ ప్రత్యేకంగా ప్రస్తుతించింది. -
గుజరాతీ రచయితకు సరస్వతి సమ్మాన్
న్యూఢిల్లీ: ప్రముఖ గుజరాతీ రచయిత సీతాన్షు యశశ్చంద్ర కవితా సంకలనం ‘వాఖర్’ 2017 ఏడాదికి సరస్వతి సమ్మాన్ అవార్డు గెలుచుకుంది. లోక్‌సభ మాజీ ప్రధాన కార్యదర్శి సుభాష్ సి. కశ్యప్ నేతృత్వంలోని కమిటీ ఈ ఎంపిక చేసింది. 2009లో వాఖర్ ప్రచురితమైంది. 1941లో భుజ్‌లో జన్మించిన యశశ్చంద్ర సమకాలీన గుజరాతీ రచయితల్లో అగ్రగణ్యులుగా పేరొందారు. కవి, నాటక రచయిత, అనువాదకుడు, విద్యావేత్త అయిన ఆయన వాఖర్‌తో పాటు మరో రెండు కవితా సంకలనాలను రాశారు. నాటకాలపై 10 పుస్తకాలు, విమర్శనాత్మక సాహిత్యంపై మూడు పుస్తకాలు వెలువరించారు. కేకే బిర్లా ఫౌండేషన్ ప్రదానం చేసే ఈ అవార్డు కింద రూ.15 లక్షల నగదు, ప్రశంసా పత్రం, జ్ఞాపిక ఇస్తారు. -
మొయిలీకి సరస్వతీ సమ్మాన్ పురస్కారం
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ ప్రతిష్టాత్మక సరస్వతీ సమ్మాన్ పురస్కారానికి ఎంపికయ్యారు. కన్నడంలో ఆయన రాసిన ప్రసిద్ధ ‘రామాయణ మహాన్వేషణం’ కావ్యానికి గాను దీన్ని ప్రకటించారు. మొయిలీ ఈ కావ్యం ద్వారా లౌకిక, ఆధునిక దృక్పథంతో రామరాజ్యం, ఆదర్శ రాజ్యాల మూలసూత్రాలను అన్వేషించడానికి ప్రయత్నించారని అవార్డు అందిస్తున్న కేకే బిర్లా ఫౌండేషన్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్సీ లహోటీ నేతృత్వంలోని జ్యూరీ.. మొయిలీని ఈ అవార్డుకు ఎంపిక చేసింది. అవార్డు కింద రూ. 10 లక్షల నగదు, ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు. 2007 లో వెలువడిన ‘రామాయణ మహాన్వేషణం’ ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లోకి అనువాదమైంది.