breaking news
santamaguluru
-
రుణ మాఫీ.. కుచ్చుటోపీ
నాడు... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో పాలనా పగ్గాలు చేపట్టగానే ఎటువంటి నిబంధనలు లేకుండా బ్యాంకులు తీసుకున్న రుణాలన్నీ, మెట్ట రైతులకు విద్యుత్ బకాయిలతో సహా ఒక్క సంతకంతో మాఫీ చేశారు. రాష్ట్రంలోని అందరి రైతుల్లానే సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు రెవెన్యూ గ్రామ పరిధిలోని రైతుల రుణాలు మాఫీ అయ్యాయి. అప్పుల ఊబి నుంచి బయటపడి అన్నదాతలు ఊపిరి పీల్చుకున్నారు. నేడు... ఎన్నికల వేళ రైతులు, డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ చేస్తామని హామీలు గుప్పించి అందలమెక్కిన చంద్రబాబు..రుణ మాఫీ చేస్తామంటూనే రోజుకో నిబంధనతో రైతులకు కుచ్చుటోపీ పెడుతున్నారు. ఆధార్‌కార్టు, రేషన్‌కార్డు, సర్వేనంబర్ల ఆన్లైన్, పట్టాదారు పుస్తకాల ఆన్లైన్ అంటూ ఆంక్షల వలయంలో రైతన్నను బంధించి రుణమాఫీకి దూరం చేశారు. ఫలితంగా కొమ్మాలపాడు రెవెన్యూ పరిధిలో 2,900 మంది రైతులు రూ.23 కోట్ల రుణమాఫీ కోల్పోయారు. సంతమాగులూరు: రోజుకో కొత్త నిబంధనతో సాధ్యమైనంత ఎక్కువ మందిని రుణమాఫీకి దూరం చేయాలన్న సర్కారు పన్నాగానికి వేలాది మంది రైతులు నష్టపోతున్నారు. కొమ్మాలపాడు రెవెన్యూ గ్రామ పరిధిలోని అగ్రహారం భూములు సాగు చేసుకుంటున్న రైతులే దీనికి నిదర్శనం. రైతుల సాగుభూములు వారిపేర్లతో ఆన్లైన్ చేయని కారణంతో ఆ రెవెన్యూ పరిధిలోని కొమ్మాలపాడు, మక్కెనవారిపాలెం, సజ్జాపురం, బల్లికురవ మండలం చెన్నుపల్లి గ్రామాలకు చెందిన 2,900 మంది రైతులు రూ.23 కోట్ల మేర రుణమాఫీ సదుపాయాన్ని కోల్పోతున్నారు. రుణమాఫీపై ఆంక్షలు ఎత్తివేసి బ్యాంకులు పంట రుణాలు అందజేసిన అందరికీ మాఫీ వర్తింపజేయాలని రైతు సంఘాల నాయకులు, వామపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కొమ్మాలపాడు కథ ఇదీ... స్వాతంత్య్రానికి పూర్వం కొమ్మాలపాడు గుంటూరు జిల్లా పరిధిలో ఉండేది. అప్పట్లో ఈ ప్రాంతం జాగర్లమూడి కుప్పుస్వామి జమీందారిలో సర్వే నంబరు 1 నుంచి 230 వరకు 4,874 ఎకరాలు ఉండేది. స్వాతంత్య్రానంతరం జమీన్దారులకు ఏటా కప్పం కడుతూ సాగు చేసుకుంటున్న భూములు రైతుల ఆధీనమయ్యాయి. అయితే భూములు సాగు చేసుకుంటున్న వారి పేర్లు రికార్డుల్లో నమోదు కాలేదు. 1972లో ప్రకాశం జిల్లా ఆవిర్భావంతో సంతమాగులూరు సమితి ప్రాంతం గుంటూరు జిల్లా నుంచి విడిపోయి ప్రకాశంలోకి వచ్చింది. మండలాల ఏర్పాటుకు పూర్వమే కొమ్మాలపాడు రెవెన్యూ గ్రామ పరిధిలోని భూముల్లో సాగులో ఉన్న రైతులు తమ భూములు రీ సర్వే జరిపి యాజమాన్య హక్కులు కల్పించాలని అనేకమార్లు అధికారులకు మొరపెట్టుకున్నారు. అయినా ఫలితం శూన్యం. అయితే రైతువారీగా పంటల వివరాలను, అడంగల్‌లో అనుభవదారులైన రైతుల పేర్లు ఏటా నమోదు చేస్తున్నారు. బ్యాంకులు కూడా రెవెన్యూ అధికారులు జారీ చేసే అడంగల్ ఆధారంగా ఆయా రైతులకు పంటరుణాలు మంజూరు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి చేసిన రుణమాఫీలో కొమ్మాలపాడు రెవెన్యూ పరిధిలోని రైతులందరికీ రుణాలు పూర్తిగా మాఫీ అయి రుణవిముక్తులయ్యారు. తాజాగా రుణమాఫీకి అర్థ రహితమైన నిబంధనలు పెట్టడంతో వీరంతా రుణమాఫీ జాబితాలోకి రావడం లేదు. ఈ భూములన్నీ అగ్రహారం భూములని రెవెన్యూ రికార్డుల్లో ఉండటం, రైతు ఖాతాలు ప్రారంభించకపోవడం, ఖాతాలు లేనిదే కంప్యూటర్ అడంగల్ నమోదు కాకపోవడం, అడంగల్‌కు ఆధార్‌కు రుణమాఫీకి లింకు పెట్టడంతో వీరంతా రుణమాఫీ ప్రయోజనాన్ని పొందలేకపోతున్నారు. ఈ విషయమై ఇటీవల జరిగిన సంతమాగులూరు మండల పరిషత్ సమావేశంలో సభ్యులు తమ ఆవేదనను వ్యక్తపరచారు. తక్షణమే నిబంధనలు సడలించి కొమ్మాలపాడు రెవెన్యూ పరిధిలోని రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
హుండీలో చేయి ఇరుక్కుపోయి..
సంతమాగులూరు: ఎరక్కపోయి ఇరుక్కుపోయాడు ఓ దొంగ. ఆలయంలో దొంగతనానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరులో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో చోరీకి ప్రయత్నించాడో దొంగ. హుండీలో చేయి పెట్టి సొమ్ము నొక్కేసేందుకు యత్నించాడు. హుండీలో చేయి ఇరుక్కుపోవడంతో బుక్కైపోయాడు. బాధతో కేకలు వేస్తూ విలవిల్లాడు. గట్టు రట్టవడంతో అక్కడున్న వారు దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. -
రక్తం చిందిన రోడ్డు
*అర్ధరాత్రి సమయంలో రహదారి రక్తసిక్తమైంది. గుంటూరు-కర్నూలు * రోడ్డుపై మృత్యుఘోష మార్మోగింది. మద్యం మత్తు, అతివేగం * కారణంగా సంతమాగులూరు-పాతమాగులూరు మధ్య మంగళవారం * అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వినుకొండలోని ఒకే * కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు * తీవ్రగాయాలపాలయ్యారు. సంతమాగులూరు(ప్రకాశంజిల్లా), వినుకొండ, న్యూస్‌లైన్ :వినుకొండ పట్టణం రెడ్డినగర్‌కు చెందిన ఆవుల అంజిరెడ్డి (45), ఆవుల శ్రీనివాసరెడ్డి (35), ఆవుల సంజీవరెడ్డి (27), ఆవుల నారాయణరెడ్డి సోదరులు కలిసి అమ్మ కార్ ట్రావెల్స్ నిర్వహిస్తుంటారు. వారిలో ఆవుల శ్రీనివాసరెడ్డికి ఇద్దరు భార్యలు కాగా, మొదటి భార్యతో విభేదాలు రావడంతో విడాకుల నిమిత్తం అంజిరెడ్డి, సంజీవరెడ్డి, నారాయణరెడ్డి, మరో స్నేహితుడు రామినేని ప్రసాద్‌తో కలిసి మంగళవారం ఉదయం కారులో గుంటూరులోని కోర్టుకు వెళ్లారు. సాయంత్రానికి అక్కడ పని ముగించుకుని నరసరావుపేట చేరుకున్నారు. అందరూ కలిసి అర్ధరాత్రి వరకూ నరసరావుపేటలో పూటుగా మద్యం సేవించారు. అనంతరం అక్కడి నుంచి వినుకొండ బయలుదేరారు. శ్రీనివాసరెడ్డి కారు నడుపుతుండగా అంజిరెడ్డి పక్కన కూర్చున్నాడు. వెనుకసీట్లో సంజీవరెడ్డి, నారాయణరెడ్డి, ప్రసాద్ కూర్చున్నారు.గుంటూరు జిల్లా సరిహద్దు దాటి సంతమాగులూరు మండలం పాతమాగులూరు పంచాయతీ పరిధిలో కారు వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో ఎడమవైపు ముందుటైరు పగిలిపోయింది. దీంతో ఒక్కసారిగా అదుపుతప్పి ముందువైపు ఆగి ఉన్న టిప్పర్‌ను వెనుకనుంచి బలంగా ఢీకొట్టి కారు ఇరుక్కుపోయింది. ఇది గమనించిన టిప్పర్ డ్రైవర్ అక్కడే ఉంటే పోలీస్ కేసులో ఇరుక్కుని ఇబ్బందిపడాల్సి వస్తుందన్న భయంతో వాహనాన్ని స్టార్ట్‌చేసి వేగంగా పోనిచ్చాడు. అయితే, టిప్పర్ వెనుకవైపు ఇరుక్కుపోయిన కారు విడిపోలేదు. అయినప్పటికీ అలాగే పోనిచ్చాడు. దీంతో పాతమాగులూరు నుంచి సంతమాగులూరు వరకూ సుమారు మూడు కిలోమీటర్ల పొడవున కారును టిప్పర్ ఈడ్చుకెళ్లింది. అనంతరం గోతులు రావడంతో కుదుపులకు టిప్పర్ నుంచి విడిపోయిన కారు రోడ్డుకు తూర్పువైపున ముళ్లపొదల్లోకి దూసుకెళ్లి ఆగింది. టిప్పర్ మాత్రం ఆగకుండా వెళ్లిపోయింది. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలు... అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఎవరూ గమనించలేదు. ఆ రోడ్డుపై రెండుసార్లు పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించినప్పటికీ కారును గుర్తించలేదు. తెల్లవారిన తర్వాత బహిర్భూమికి అటుగా వెళ్లిన సంతమాగులూరు గ్రామస్తులు రోడ్డుపక్కన కారును గమనించారు. అధిక సంఖ్యలో అక్కడకు చేరుకుని ట్రాక్టర్ సాయంతో కారును రోడ్డుపైకి చే ర్చి పోలీసులకు సమాచారం అందించారు. దర్శి డీఎస్పీ బి.లక్ష్మీనారాయణ, స్థానిక ఎస్సై ఎ.శివనాగరాజులు సిబ్బందితో వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. అప్పటికే కారులోని ముందుసీట్లలో కూర్చుని ఉన్న శ్రీనివాసరెడ్డి, అంజిరెడ్డి మృతిచెందగా, వెనుకసీట్లోని సంజీవరెడ్డి, నారాయణరెడ్డి, ప్రసాద్ ప్రాణాలతో ఉన్నారు. అయితే, కారు నుజ్జునుజ్జు కావడంతో వారంతా లోపల ఇరుక్కుపోయారు. పోలీసులు, స్థానికులు శ్రమించి కారుడోర్లను ఇనుపరాడ్లతో బద్దలుకొట్టి అందరినీ బయటకు తీశారు. కానీ, అప్పటికే వెనుకసీట్లోని సంజీవరెడ్డి కూడా కన్నుమూశాడు. తీవ్రగాయాలతో ఉన్న నారాయణరెడ్డి, ప్రసాద్‌లను 108 వాహనంలో నరసరావుపేటలోని వైద్యశాలకు తరలించారు. మూడు మృతదేహాలను కూడా పోస్టుమార్టం నిమిత్తం అదే ఆస్పత్రికి తీసుకెళ్లారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అంజిరెడ్డి, శ్రీనివాసరెడ్డి తల్లి, బంధువులు బోరున విలపించిన తీరు చూపరుల కంటతడిపెట్టించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సంఘటన జరిగిన తీరును ఆయన పూర్తిగా పరిశీలించారు. దాన్నిబట్టి ఆగిఉన్న టిప్పర్ వెనుకవైపు కారు ఢీకొని ఇరుక్కుపోయి ఉంటుందని, అలా ఇరుక్కుపోయిన కారును టిప్పర్ ఈడ్చుకొచ్చి ఉంటుందని భావిస్తున్నామన్నారు. మృతుల నేపథ్యం... మృతుల్లో అంజిరెడ్డి, శ్రీనివాసరెడ్డి సొంత అన్నాదమ్ములు. అంజిరెడ్డికి భార్య, ఇంజినీరింగ్ చదువుతున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రీనివాసరెడ్డికి ఇద్దరు భార్యలు కాగా, మొదటి భార్యకు ఇద్దరు కుమారులు. రెండో భార్యకు సంతానం లేదు. మరో మృతుడు సంజీవరెడ్డి, గాయాలతో చికిత్స పొందుతున్న నారాయణరెడ్డి సొంత అన్నాదమ్ములు. సంజీవరెడ్డికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన గొట్టిపాటి వైఎస్సార్ సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త, తాజా మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని పోలీసులకు సూచించారు. రోదనలతో మిన్నంటిన ఏరియా వైద్యశాల నరసరావుపేటటౌన్, న్యూస్‌లైన్: స్థానిక ఏరియా వైద్యశాలలో బుధవారం రోడ్డు ప్రమాద మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. ప్రమాదంలో మృతి చెందిన ఆవుల శ్రీనివాసరెడ్డి,అంజిరెడ్డి,సంజీవరెడ్డి మృతదేహాలను పోస్టుమార్టుం నిమిత్తం ఇక్కడకు తరలించారు. విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు పెద్దసంఖ్యలో ఏరియా వైద్యశాలకు చేరుకొని బోరున విలపించారు. దీంతో ఏరియా వైద్యశాలలో విషాదచాయలు అలముకున్నాయి. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బందువులకు అప్పగించారు. కాగా గాయపడిన నారాయణరెడ్డి, ప్రసాద్‌రెడ్డిలను మెరుగైన వైద్యం కోసం ఏరియా వైద్యశాల నుంచి పట్టణంలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. -
కారు ప్రమాదంలో ముగ్గురి మృతి.. పలు అనుమనాలు
ప్రకాశం జిల్లా సంతమాగులూరు వద్ద ఘోరం జరిగింది. ఓ కారును గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ముగ్గరు మరణించగా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులను వినుకొండ మండలం రామిరెడ్డి పాలేనికి చెందిన అంజిరెడ్డి, లక్ష్మణరెడ్డి, శ్రీనివాసరెడ్డిగా గుర్తించారు. అయితే ప్రమాదం జరిగిన తీరును బట్టి చూసిన స్థానికులు మాత్రం దీనిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు మృతులతో పాటు క్షతగాత్రులను తీసుకొచ్చి కారుతో సహా సంతమాగులూరు వద్ద పడేసి ఉంటారని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి గురైన కారును వినుకొండకు చెందినదిగా గుర్తించారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.