ఆచరణీయం శ్రీకృష్ణ తత్వం
రామాపురం : ఆచరణీయమైనది భగవాన్ శ్రీ కృష్ణ తత్వమని హంపి పీఠాధిపతి జగత్గురు శంకారాచార్య విద్యారమ్యభారతి మహాస్వామిజీ అన్నారు. శ్రీ కృష్ణ విగ్రహ(మూలవీరాట్) ప్రతిష్ఠ ఆలయ గోపురం కుంభాభిషేకం అనంతర స్వామిజీ మాట్లాడుతూ శ్రీకృష్ణ తత్వాన్ని గ్రహించి గోప్పఅనుభూతి పొందిన మహనీయులు ఎందరో ఉన్నారన్నారు. గీత ద్వారా ప్రపంచానికి ఎంతో విజ్ఞానాభాండగారాన్ని ధార్మిక, ఆధ్యాత్మిక భక్తి మార్గాన్ని నిర్దేశించిన భగవాన్‌గా నేటికి అందరితో ఆధారింపబడుతున్నారన్నారు.
ప్రతి ఒక్కరిలో భక్తిభావం పెరగాలి :
ప్రస్తుత సమాజంలో పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ భక్తిభావంతో వ్యవహరించాల్సి ఉందని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఆధాత్మిక చింతనకు మానసిక ప్రశాంతతకు ఆలయాలే నిలయాలుగా మారుతున్నాయన్నారు. ప్రేమాలయ వ్యవస్థాపకులు చింతం వెంకటరెడ్డి దాతల సహకారంతో మందిరాన్ని నిర్మించి విగ్రహ ప్రతిష్ఠను నిర్వహించడం హర్షించతగ్గ విషయం అన్నారు. అనంతరం టీటీడీకి చెందిన గాయకులు అన్నమయ్య గీతాలు ఆలపించారు. కార్యక్రమంలో ఆశ్రమ కార్యదర్శి పెద్దిరెడ్డి గంగిరెడ్డి, కోశాధికారి నారాయణమ్మ, పలువురు నాయకులు, భక్తులు పాల్గొన్నారు.