2జీ, 3జీ, 4జీ.. డేటాకు ఒకే రేటు: ఐడియా
ఈ నెలాఖరు నుంచి అమలు
న్యూఢిల్లీ: ఈ నెలాఖరు నుంచి 1 జీబీకి మించిన 2జీ, 3జీ, 4జీ మొబైల్ డేటా ప్యాకేజ్‌లను ఒకే రేటుకు అందించనున్నట్లు టెలికం సంస్థ ఐడియా సెల్యులార్ వెల్లడించింది. మార్చి 31 నుంచి దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయనున్నట్లు వివరించింది. ప్రస్తుతం కొన్ని టెలికం సర్కిల్స్‌లో 2జీ డేటా కన్నా 4జీ డేటా చౌకగా ఉంటోంది. 2జీకి సంబంధించి 1జీబీ డేటా రీచార్జ్ (నెల రోజుల వాలిడిటీ) రూ. 170 ఉండగా, 4జీ డేటా ఖరీదు రూ. 123గా ఉంది.
మార్కెట్లో పోటీ తీవ్రతరమవుతుండటంతో ఐడియా సెల్యులార్ రేట్లను క్రమబద్ధీకరిస్తోంది. సాధారణ వేగం ఉండే 2జీ నెట్‌వర్క్‌తో పోలిస్తే 4జీ వంటి అధిక స్పీడ్ ఇంటర్నెట్ ప్లాన్స్‌లో డేటా పరిమితి చాలా త్వరగా కరిగిపోతుంది. రిలయన్స్ జియో ఉచిత కాల్స్ వంటి ఆఫర్లతో ఊదరగొడుతుండటంతో టెలికం రంగంలో తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో ఐడియా ప్రణాళికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.