breaking news
sale of land
-
లీజు కాదు.. అమ్మకమే
పరిశ్రమలు, పర్యాటక ప్రాజెక్టులకు భూముల విక్రయం * అయినకాడికి విక్రయిద్దామన్న సీఎం * పారిశ్రామిక విధానంలో సవరణలు తెస్తూ జీవో 48 జారీ * ఇక ప్రైవేట్ సంస్థలు ఇష్టానుసారంగా ఆ భూములను అమ్మేసుకోవచ్చు * మూడు సంస్థలకు ఇప్పటికే 1,617.56 ఎకరాల విక్రయం సాక్షి, హైదరాబాద్: పేద రైతుల పొట్ట కొట్టి పెద్దలకు విందు భోజనం పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఏపీఐఐసీని అడ్డుపెట్టుకుని రైతులనుంచి నామమాత్రపు ధరకు సేకరించిన వేలాది ఎకరాల భూములను కారుచౌకగా ప్రైవేటు సంస్థలకు సంతర్పణ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. లీజుకు ఇవ్వాల్సిన భూములను అన్ని హక్కులతో అమ్మేసేందుకు సవరణలు తీసుకువస్తూ సీఎం చంద్రబాబు స్వయంగా జీవో జారీ చేయించేశారు. దీనిపై అధికార వర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. పరిశ్రమలు, పర్యాటక ప్రాజెక్టులకు భూములను 99 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వాలని పారిశ్రామిక, పర్యాటక విధానంలో ఉంది. అలాగే వెనుకబడిన ప్రాంతంగా ప్రభుత్వం నోటిఫై చేసిన ప్రాంతంలో రూ.100 కోట్లకు పైగా పెట్టుబడితో ఏర్పాటు చేసే మెగా ప్రాజెక్టులకు అన్ని హక్కులతో భూములు విక్రయించే విషయాన్ని సీఎం అధ్యక్షతన జరిగే పారిశ్రామిక ప్రోత్సాహక మండలి పరిశీలించవచ్చునని 2015 ఏప్రిల్ 29వ తేదీన ప్రకటించిన పారిశ్రామిక విధానంలో పేర్కొన్నారు. ఆ భూములను తమకు పూర్తిగా విక్రయించకపోతే పెట్టుబడులు తీసుకురావడం కష్టంగా ఉందని కొందరు ప్రైవేట్ వ్యక్తులు ముఖ్యమంత్రిని కలిసి విన్నవించారు. దీంతో చంద్రబాబు సానుకూల నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం పారిశ్రామిక విధానంలోనే సవరణలు తేవాలని గత నెల 2వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ఆ మేరకు ‘ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే మండలి సమావేశం’ అనే పదాన్ని తొలగించేశారు. లీజుకు ఇవ్వాల్సిన భూములను సర్వ హక్కులు కల్పిస్తూ పారిశ్రామికవేత్తలకు విక్రయించడాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)తో పాటు సంబంధిత శాఖల అధికారులు వ్యతిరేకించిన నేపథ్యంలో ఏకంగా నూతన పారిశ్రామిక విధానంలోనే సవరణలు తీసుకువచ్చారు. సీఎస్ అధ్యక్షతన జరిగిన ఎంపవర్డ్ కమిటీ ఆఫ్ కార్యదర్శుల సమావేశంలో కూడా ఔట్ రైట్ సేల్‌ను వ్యతిరేకించారు. అయినాసీఎం అధ్యక్షతన జరిగిన పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఔట్ రైట్ సేల్కు నిర్ణయం తీసుకుని జీవో-48 జారీ చేయించారు. భూములు విక్రయించాలంటూ క్యూ ఎటువంటి షరతులు లేకుండా భూములపై పారిశ్రామిక వేత్తలకు సర్వహక్కులు కల్పిస్తూ అమ్మేయడానికి జీవో-48 మార్గం సుగమం చేయడంతో ఏపీఐఐసీ చెలరేగింది. కాకినాడలోని ఓ సంస్థకు గతంలో కేటాయించిన 1,563 ఎకరాలను ఔట్ రైట్ సేల్ కింద విక్రయించేసింది. ఆ భూములను షరతులు లేకుండా రిజిస్ట్రేషన్ చేయాలని ఆ సంస్థ కోరుతోంది. మరోవైపు చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలో నాలుగు మొబైల్ సెల్‌ఫోన్ కంపెనీలకు 69.56 ఎకరాలను ఎకరం రూ.20 లక్షల చొప్పున అమ్మేయాలని ఏపీఐఐసీ నిర్ణయం తీసుకుంది. ఓ సెల్‌ఫోన్ సంస్థకు 19.28 ఎకరాలను, మరో సంస్థకు 15 ఎకరాలను, ఓ కంపెనీకి 15 ఎకరాలను, మరో పారిశ్రామిక సంస్థకు 19.28 ఎకరాలను ఔట్ రైట్ సేల్కు ఇచ్చేశారు. అనంతపురం జిల్లా గుడిపల్లి గ్రామంలో ఓ కంపెనీకి 25 ఎకరాలను ఎకరం రూ. పది లక్షల చొప్పున ఏపీఐఐసీ ఔట్ రైట్ సేల్కు ఇచ్చేసింది. కర్నూలు జిల్లాలో ఫుడ్ పార్కు ఏర్పాటుకు ఓ సంస్థకు ప్రభుత్వం 623 ఎకరాలను లీజుకు కేటాయించింది. ఆ సంస్థ కూడా లీజును తొలగించి ఔట్ రైట్ సేల్ కింద ఇవ్వాలని కోరింది. త్వరలోనే 623 ఎకరాలను ఔట్ రైట్ సేల్కు ప్రభుత్వం ఇచ్చేయనుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మరికొన్ని సంస్థలు ఔట్రైట్ సేల్ కోసం ఇక క్యూ కట్టనున్నాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. భూములను అమ్మేయడం దారుణం రైతుల నుంచి పరిశ్రమల కోసం అని తీసుకున్న భూములను పరిశ్రమలు స్థాపించకుండానే పారిశ్రామిక వేత్తలకు విక్రయ హక్కులు కట్టబెట్టడం దారుణమని ఉన్నతాధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో ఏర్పాటయ్యే ప్రత్యేక ఆర్థిక జోన్ల విధానంలో భూములను లీజుకు మాత్రమే ఇవ్వాలని ఉందని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా అమ్మేయడం, అదీ రాయితీ ధరలతో ఇవ్వడం అన్యాయమని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. పరిశ్రమల కోసం భూములు తీసుకున్న సంస్థలు... రైతుల నుంచి కారు చౌకగా తీసుకున్న భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి సొమ్ములు చేసుకున్నా అడిగే అధికారం ప్రభుత్వానికి ఉండదని అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ఏపీఐఐసీని దళారీగా పెట్టి రైతుల నుంచి నామమాత్రపు ధరకు సేకరించి, అధిక ధరలకు వాటిని అమ్ముకునే అధికారం ప్రయివేటు సంస్థలకు కట్టబెట్టడం కంటే దారుణం ఏముంటుందని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. -
రూ.13,500 కోట్లకు వచ్చింది 392 కోట్లే..!
♦ భూముల విక్రయంపై సర్కారు అంచనాలు తలకిందులు ♦ మొదటి విడత వేలంలో అమ్ముడుపోని భూములు ♦ రెండో విడత భూముల అమ్మకానికి రంగం సిద్ధం సాక్షి. హైదరాబాద్: సర్కారు భారీ అంచనాలు పల్టీ కొట్టాయి. మొదటివిడతలో భూముల అమ్మకం ద్వారా సర్కారుకు కేవలం రూ.392 కోట్ల ఆదాయం వచ్చింది. నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములు, ఆస్తులను అమ్మి అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిశ్చయించుకుంది. వీటి ద్వారా రూ.13,500 కోట్ల భారీ ఆదాయం వస్తుందని బడ్జెట్లో అంచనా వేసుకుంది. కానీ ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగకపోవడం, వేలం వేసిన కొన్ని స్థలాలకు సైతం మి శ్రమ స్పందన రావడంతో అంచనాలు తలకిం దులయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగి సేందుకు ఇంకో నెల మాత్రమే మిగిలి ఉంది. భూములు అమ్మితే వస్తుందనుకున్న ఆదాయంలో ఇప్పటివరకు మూడు శాతమే ఖజానాకు చేరింది. ప్రభుత్వం అన్ని జిల్లాల్లో నిరుపయోగంగా ఉన్న సర్కారు స్థలాల వివరాలను కలెక్టర్ల నుంచి తెప్పించుకొని, కొన్నింటిని మొదటి విడతగా నవంబరులో విక్రయించిం ది. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) ద్వారా భూముల అమ్మకానికి ఈ-వేలం నిర్వహించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కొన్ని స్థలాలనే తొలి దశలో వేలం వేశారు. నగర శివార్లలోని రాయదుర్గంలో గరిష్టంగా ఒక ఎకరానికి రూ.29 కోట్ల వరకు ధర పెట్టి కొనేందుకు ఫార్మా కంపెనీలు ముందుకొచ్చాయి. కానీ వేలం వేసిన భూముల్లో కొన్నింటికి అసలు స్పందనే లేదు. విస్తీర్ణంలో ఆ స్థలాలు చిన్నవిగా ఉండటంతోపాటు కొనేందుకు కంపెనీలు ముందుకు రాలేదు. ప్రైవేటు వ్యక్తులు, బిల్లర్లు ఆసక్తి ప్రదర్శించలేదు. కొన్ని స్థలాలకు అప్రోచ్ రోడ్లు లేకపోవటంతోపాటు మౌలిక సదుపాయాలలేమి కారణంగా అమ్ముడుపోలేదు. మరోవైపు మార్కెట్లో ఉన్న రేటు కంటే ప్రభుత్వం కనీస వేలం ధరను ఎక్కువగా నిర్ణయించిందనే విమర్శలున్నాయి. వచ్చే నెల్లో రెండో విడత వేలం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రక్రియ పూర్తవడంతోపాటు ఆర్థిక సంవత్సరం ముగియనుండటంతో ప్రభుత్వం మళ్లీ భూముల అమ్మకానికి తెర లేపింది. వచ్చే నెల్లో రెండో దశ భూముల అమ్మకానికి రంగం సిద్ధం చేస్తోంది. ఈ దశలో రూ.1,500-2,000 కోట్ల ఆదాయాన్ని అర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి దశలో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి తగు జాగ్రత్తలు పాటించాలని సర్కారు భావిస్తోంది. మొదటిదఫాలో మిగిలిన స్థలాలతో పాటు మరి కొన్నింటిని చేర్చి రెండోదశ వేలం బాధ్యతను టీఎస్ఐఐసీకి అప్పగించనుంది. కొనుగోలుదార్లకు వెసులుబాటు కల్పించేలా గతంలోని నిబంధనల్లోనూ కొన్ని మార్పులు చేసే అవకాశాలున్నాయి. అప్రోచ్ రోడ్లు లేని కారణంగా కొన్ని స్థలాలు అమ్ముడుపోలేదని గుర్తించిన అధికారులు.. వేలం వేసేందుకు ముందే రోడ్ల నిర్మాణం చేపడితే పెట్టుబడిదారులను ఆకట్టుకునే వీలుందని యోచిస్తున్నారు. తమకు కొన్ని నిధులు కేటాయిస్తే రహదార్లను అభివృద్ధి చేస్తామంటూ ఇటీవలే టీఎస్ఐఐసీ ప్రభుత్వానికి ప్రతిపాదించింది.