వయోజన విద్యపై నిర్లక్ష్యం నీడలు
తెనాలి అర్బన్, న్యూస్‌లైన్: వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు రూపుదిద్దుకున్న సాక్షరభారత్ కార్యక్రమం కునారిల్లుతోంది. సాక్షరభారత్ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి తొమ్మిది నెలలుగా వేతనాలు లేక దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. వేతనాలపై ఎప్పుడు ప్రశ్నించినా అధికారులు మాత్రం ఇదిగో ఈ వారంలో వచ్చేస్తాయని చెప్పటం మినహా కార్యరూపం దాల్చటంలేదని వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సాక్షరభారత్ కోఆర్డినేటర్లకు ఏ స్థాయిలోనూ వేతనాలు అందకపోవడంతో వయోజన విద్యా కేంద్రాలపై ఆ ప్రభావం పడుతుంది. వయోజనులకు అక్షర జ్ఞానం నేర్పించేందుకు 2009లో రాష్ర్టంలో సాక్షరభారత్ పథకం రూపుదిద్దుకుంది. ఈ పథకం నిర్వహణ వయోజన విద్యాశాఖ పరిధిలో ఉంది. ఆ శాఖ డిప్యూటీ డెరైక్టర్ జిల్లా స్థాయిలో దీనిని పర్యవేక్షిస్తున్నారు.
డివిజన్ కోఆర్డినేటర్లు, మండల కోఆర్డినేటర్లు, గ్రామ కోఆర్డినేటర్లు వారి పరిధిలో నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. గ్రామస్థాయిలో ఇరువురు గ్రామ కోఆర్డినేటర్లు ఉంటారు. వీరు నిర్వహించే కేంద్రాలకు వయోజన విద్యాకేంద్రాలుగా నామకరణం చేశారు. గ్రామ కోఆర్డినేటర్లకు నెలకు రూ.2వేలు,మండల కోఆర్డినేటర్లకు ఆరువేలు వేతనాన్ని నిర్ణయించారు. వీరు స్థానికంగా అందుబాటులో ఉన్న పాఠశాలలు, గ్రంథాలయాలు వంటి వాటిలో 15 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్కుల వారిని కనీసం 30 మందికి తగ్గకుండా సమీకరించి, వారికి అక్షరాలు నేర్పించాలి.
ఆయా సంస్థల సమయపాలనకు ఇబ్బంది లేకుండా వయోజన విద్యాకేంద్రాలను నడుపుకోవాలి. పుస్తకాలు, దినపత్రికలు చదివే విధంగా వారిని తీర్చిదిద్దాలి. నేషనల్ ఓపెన్ స్కూల్‌వారు వీరికి దశలవారీగా పరీక్షలు నిర్వహిస్తారు. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 1986 వయోజన విద్యాకేంద్రాలు ఉన్నాయి. వీటిలో 59,220 మంది వయోజనులు అక్షరాలు నేర్చుకుంటున్నారు. వయోజనుల అక్షరాస్యతలో జిల్లా ఎనిమిదో స్థానంలో వుంది. పురుషులు 75.4 శాతం, మహిళలు 60.64 శాతం అక్షరాస్యులుగా వున్నారు. కేంద్రాల్లో ఒక్కొక్కరు చొప్పున గ్రామ కోఆర్డినేటర్లు పనిచేస్తున్నారు.
తొమ్మిది నెలలుగా వేతనాలు లేవు
గ్రామ, మండల, డివిజన్ కోఆర్డినేటర్లకు ఇచ్చే అంతంత మాత్రం వేతనం కూడా సకాలంలో అందటం లేదు. ఈ ఏడాది మార్చి వరకు మాత్రమే వేతనాలు చెల్లించారు. దాదాపు తొమ్మిది నెలలుగా వేతనాలు లేవు. నిత్యావసరాల ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో వీరిచ్చే నామమాత్రపు వేతనాలు కూడా సకాలంలో అందకపోవటంతో, కేంద్రాల నిర్వహణపై నిర్లక్ష్యపు నీడలు అలముకున్నాయి. కొన్ని కేంద్రాలు ఇప్పటికే మూత పడగా, కొన్ని చోట్ల నామమాత్రంగా నడుస్తున్నాయి. ఫలితంగా పథకం లక్ష్యం నీరుగారుతోందన్నది అక్షర సత్యం. వేతనాల విషయంలో అధికారులు స్పష్టత నివ్వకపోవటంతో దిక్కుతోచని స్థితిలో మిన్నకున్నారు.
వేతనాలు జాప్యం వాస్తవమే.. సిబ్బందికి వేతనాల జాప్యం వాస్తవమే. గత నెల రోజుల క్రితమే పెండింగ్‌లో ఉన్న మూడు నెలల వేతనాలు చెల్లించాం. అది ఈ ఏడాది మార్చి వరకే సరిపోయింది. ఆ తరువాత నుంచి వేతనాలు చెల్లించాల్సి ఉంది. ఈ నెలాఖరులోగా వేతనాలకు బడ్జెట్ విడు దలయ్యే అవకాశం ఉంది. వయోజన విద్యా కేంద్రాలతో ఆశించిన ఫలితాలు వస్తున్నాయి. అయా కేంద్రాల్లో అక్షరాస్యత శాతాన్ని పరిశీలిస్తే 67.9 శాతంగా ఉంది. -ఎస్.శారద, డిప్యూటీ డెరైక్టర్, వయోజన విద్య.