breaking news
sajjad lone
-
బీజేపీ మోసం చేసింది: సజ్జాద్ లోన్
శ్రీనగర్: మంత్రిత్వ శాఖల కేటాయింపులో తనను అవమానించినందుకు జమ్మూ కశ్మీర్ సంకీర్ణం నుంచి వైదొలగుతానని వేర్పాటు వాది నుంచి రాజకీయ నేతగా మారిన సజ్జాద్ లోన్ తీవ్రంగా హెచ్చరించారు. మంత్రివర్గ కూర్పులో తమ నేతకు తగినంత ప్రాధాన్యం ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందని సజ్జాద్ పార్టీ పీపుల్స్ కాన్ఫరెన్స్ ఆరోపించింది. అధికార సంకీర్ణం నుంచి వైదొలగేందుకూ సిద్ధమని హెచ్చరించింది. తనకు శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, పశు సంవర్ధక శాఖలు కేటాయించటంపై లోన్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. వాటి బాధ్యతలు స్వీకరించటానికి నిరాకరించారు, బుధవారం జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వచ్చిన సందర్భంలో విమానాశ్రయానికి సదరు మంత్రిత్వ శాఖకు సంబంధించిన అధికారిక కారును, సెక్యూరిటీని తిరస్కరించి నేరుగా ఇంటికి వెళ్లిపోయారు. ఎవరికీ అందుబాటులోకి రాకుండా ఫోన్లను ఆపేశారు. పీడీపీతో ఎలాగూ పొత్తు కుదరడంతో ఇక తమ అవసరం లేదని బీజేపీ భావిస్తున్నట్లుందని పీపుల్స్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే అహ్మద్ దార్ అన్నారు. అయితే పీడీపీ ఆచితూచి స్పందించింది. -
వేర్పాటువాది నుంచి మంత్రిగా!
జమ్మూ: హురియత్ నేత అబ్దుల్ గనీ లోన్ తనయుడైన సజ్జద్ గనీ లోన్‌కు కరడుగట్టిన వేర్పాటువాద నేతగా పేరుంది. ఈయన ఆదివారం పీడీపీ-బీజేపీ సర్కారులో మంత్రిగా ప్రమాణం చేశారు. 2002 శ్రీనగర్‌లో మిలిటెంట్ల చేతిలో తన తండ్రి హత్యకు గురికావడం సజ్జద్ జీవితాన్ని మలుపుతిప్పింది. అదే ఏడాది హురియత్ కాన్ఫరెన్స్‌లో చీలిక రావడంతో వేర్పాటువాదులు రెండుగా చీలిపోయారు. అనంతరం 2004లో తన సోదరుడు బిలాల్ గనీ లోన్‌తో కలసి తన తండ్రి ఏర్పాటు చేసిన పీపుల్స్ కాన్ఫరెన్స్‌ను పునరుద్ధరించారు. 2008లో అమర్నాథ్ భూఆందోళనల్లో 60 మంది మరణించడం ఆయనలో మార్పు తెచ్చింది. వేర్పాటువాదులు తమ పంథాను సమీక్షించుకోవాలని పిలుపునిచ్చారు. మొన్నటి ఎన్నికల్లో పీపుల్స్ కాన్ఫరెన్స్ నుంచి పోటీ చేసిన సజ్జద్.. హన్ద్వారా స్థానం నుంచి పోటీ చేసి నెగ్గారు.