breaking news
Sadarem Camp
-
సదరన్.. పరేషాన్
తూర్పుగోదావరి, ఆలమూరు (కొత్తపేట): దివ్యాంగుల అంగవైకల్యాన్ని నిర్ధారించేందుకు జారీ చేసే ‘సదరన్ సర్టిఫికెట్’ మంజూరుకు ఆన్లైన్ సహకరించడం లేదు. పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుందామనుకున్నా, సంబంధిత సైట్ తెరచుకోకపోవడంతో పింఛన్‌దారులకు నిరాశ ఎదురవుతోంది. ఈ విషయం తెలియని అనేక మంది దివ్యాంగులు మీ సేవ కేంద్రాలకు వెళ్లి ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు.జిల్లాలో సదరన్ సర్టిఫికెట్ జారీ చేసేందుకు గతంలో కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, తుని ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే కాలక్రమేణ ఆ జాబితా నుంచి తునిని తొలగించి మిగతా మూడు కేంద్రాలను యథావిధిగా కొనసాగిస్తోంది. రెండు నెలల నుంచి సదరన్ సర్టిఫికెట్ జారీకి దరఖాస్తు చేసుకునే సైట్ పనిచేయడం లేదు. అనేకమంది దివ్యాంగులు తమ అంగవైకల్య శాతాన్ని నిర్ధారించుకునేందుకు సమీప మీ సేవ కేంద్రాలకు వెళుతున్నారు. అయితే ఆన్లైన్లో దివ్యాంగుడి వివరాలను అన్ని పొందుపరచి ఓకే చెప్పిన తరువాత మళ్లీ రీ ఎంట్రీ చేయాలని చూపుతోంది. మీ సేవ నిర్వాహకుడు ఎన్నిసార్లు వివరాలు పొందుపరచినా మళ్లీ మళ్లీ అదే పరిస్థితి నెలకొంటోంది. దీనిపై ఏపీ ఆన్‌లైన్‌కు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోతోందని ‘మీ సేవ’ నిర్వాహకులు చెబుతున్నారు. దివ్యాంగుల పట్ల ఉదాసీనతా? రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు సదరన్ సర్టిఫికెట్స్ జారీ చేయడంతో ఇంత ఉదాసీనతగా వ్యవహరించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. గతంలో మండల ప్రజా పరిషత్, వెలుగు కార్యాలయాల ద్వారా దివ్యాంగుల వివరాలను సేకరించగా ప్రస్తుతం మళ్లీ ఆ పద్ధతిని మార్చి మీ సేవ కేంద్రాలకు అప్పగించడం వల్ల దివ్యాంగుల పరిస్థితి దారుణంగా తయారైంది. దివ్యాంగుల ఉసురు పోసుకుంటున్న ప్రభుత్వానికి తగిన సమయంలో బుద్ధి చెబుతారని ప్రజలు హెచ్చరిస్తున్నారు. దివ్యాంగుల దరఖాస్తులనుస్వీకరించడం లేదు అంగవైకల్యాన్ని నిర్ధారించేందుకు జారీ చేసే సదరన్ సర్టిఫికెట్‌కు అవసరమయ్యే దివ్యాంగుల వివరాలను ఆన్లైన్ స్వీకరించడం లేదు. దివ్యాంగుల పరిస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకుని సత్వరమే సైట్‌ను పునరుద్ధరించాలి.– కేఎస్ఎస్ శర్మ, మీ సేవ కేంద్రం, ఆలమూరు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతా సదరన్ సర్టిఫికెట్స్ జారీ విషయంలో దివ్యాంగులు పడుతున్న ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతాం. గతంలో మాదిరిగానే సర్టిఫికెట్ల జారీని సరళీకృతం చేస్తాం.– టీవీ సురేందర్‌రెడ్డి,ఇన్చార్జి ఎంపీడీఓ, ఆలమూరు -
సారూ.. పింఛన్ మంజూరు చేయరూ..!
డయల్ యువర్ డీఆర్డీఏ పీడీలో వినతి సంగారెడ్డి మున్సిపాలిటీ: సదరెమ్ క్యాంపునకు హాజరైనా తనకు ఇంతవరకు సర్టిఫికెట్ ఇవ్వలేదని కొండపాక మండలం దుద్డెడ గ్రామానికి చెందిన నర్సింగ్ రావు డీఆర్డీఏ పీడీకి విన్నవించుకున్నారు. గురువారం నిర్వహించిన డయల్ యువర్ డీఆర్డీఏ పీడీ కార్యమ్రంలో పీడీ సత్యనారాయణరెడ్డి హాజరుకాకపోవడంతో అసిస్టెంట్ పీడీ వెంకటేశ్వర్లు ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా మెదక్ మండలం కాజిపల్లికి చెందిన పెంటయ్య మాట్లాడుతూ తమ కుటుంబంలో ఉన్న బీడీ కార్మికులకు జీవనభృతి పింఛన్ అంద డం లేదన్నారు. వితంతు పింఛన్ మంజూరు చేయడంతో పంచాయతీ కార్యదర్శి పక్షపాతం చూపుతున్నాడని కంగ్టి మండలం తడ్కల్‌కు చెందిన సాయిలు ఫిర్యాదు చేశారు. జీవనభృతి పింఛన్ కోసం పీఎఫ్ కార్డుతో దరఖాస్తు చేసినా మంజూరు చేయడం లేదని నంగునూర్ మండలం ఖానాపూర్‌కి చెందిన మల్లయ్య, కొడిపాక మండలం కమ్మంపల్లికి చెందిన నర్సింలు ఫిర్యాదు చేశారు. సదరెమ్ క్యాంపునకు హాజరై సర్టిఫికెట్తో వికలాంగ ఫించన్‌కు దరఖాస్తు చేసుకున్నా పింఛన్ మంజూరు కాలేదని కొండపాక మండలం ఎర్రపల్లికి చెందిన మల్లయ్య ఫిర్యాదు చేశారు. తమ గ్రామంలో 23 మందికి వితంతు, వృద్ధాప్య పింఛన్లు రాలేదని మెదక్ మండలం సర్థనకు చెందిన రామ్‌చందర్ పేర్కొన్నారు. అభయాస్తం పింఛన్ అందడంలేదని పెద్దశంకరంపేట మండలం వీరోజ్పల్లికి చెందిన రమేష్ ఫిర్యాదు చేశారు.