మైనార్టీల సంక్షేమానికి రూ. 720 కోట్లు
ఏలూరు (ఆర్ఆర్పేట) : రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.720 కోట్లు కేటాయించినట్టు ఎమ్మెల్సీ ఎంఎ.షరీఫ్ చెప్పారు. కలెక్టరేట్లో మంగళవారం మైనార్టీస్ రుణమేళా సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా రాష్ట్రంలో మైనార్టీలు బాగా వెనుకబడి ఉన్నారని అటువంటి వారి జీవనస్థితిగతులు మెరుగుపరచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో మైనార్టీలకు రూ.1,200 కోట్లు నిధులు కేటాయించేందుకు సీఎం సుముఖత వ్యక్తం చేశారని చెప్పారు. మైనార్టీ టాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం చేయూత అందించాలన్నారు. ఒక్కో కుటుంబానికి రూ. లక్షా 50 వేల సబ్సిడీతో రూ.10 లక్షల వరకు బ్యాంకు రుణాలు అందించే బృహత్తర కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే బుజ్జి, నగర మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చి నిధులు కూడా ఎక్కువగా కేటాయిస్తుందని చెప్పారు. జేసీ పి.కోటేశ్వరరావు మాట్లాడుతూ మైనార్టీలు ప్రభుత్వం అందించే పథకాలను సక్రమంగా ఉపయోగించుకోవాలని అన్నారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎం.సుబ్రహ్మణ్యేశ్వరరావు, అదనపు జేసీ ఎంహెచ్ షరీఫ్, మైనార్టీ కార్పొరేషన్ ఈడీ హురియాఖానమ్, ఎంపీపీ రెడ్డి అనురాధ పాల్గొన్నారు.