breaking news
RTC workers rally
-
ఆర్టీసీ కార్మికుల ఇళ్లలో దీపావళికీ చీకట్లే!
సాక్షి సిద్దిపేట : ఇది ఆర్టీసీ కార్మికుల కుటుంబాల పరిస్థితి. తెలంగాణలో పెద్దపండగ బతుకమ్మ అప్పుడు సమ్మె చేస్తే ప్రభుత్వం స్పందిస్తుంది.. సమస్యలు తీరుతాయని ఊహించిన కార్మికుల పరిస్థితి అంతా తారుమారైంది. దీంతో సెప్టెంబర్ నెల వేతనం అందక అక్టోబర్ నెల వేతనం వస్తుందో రాదో తెలియని దుస్థితి. బతుకమ్మకు ఇంటిల్లిపాది కొత్తబట్టలు వేసుకునే సాంప్రదాయం ఉండగా కార్మికులు మాత్రం పాత బట్టలతోనే పండుగ జరుపుకున్నారు. అలాగే కుటుంబ సభ్యులతో వంటావార్పు కార్యక్రమాలకు పరిమితమయ్యారు. దసరాకు కళ లేదు. ఆడపడుచులను ఈ ఏడాది పండుగలకు ఇంటికి కూడా పిలువలేని పరస్థితి. చూస్తూ ఉండగానే దీపావళి వచ్చింది. అందరి ఇళ్లలో దీపావళి వెలుగులు నింపగా.. కార్మికుల ఇళ్లలో మాత్రం చీకటి తెరలు కమ్మి ఉన్నాయి. నోములను వాయిదా వేస్తున్నారు. సమ్మె ఎన్ని రోజులు సాగుతుందో.. తమ సమస్యలు ఎప్పటికి తీరుతాయో అని ఆశగా ఎదురు చూస్తున్నారు. జీతంతోనే కుటుంబ పోషణ ఈ నెల 5వ తేదీ నుండి సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు జిల్లాలో మొత్తం 1,147 మంది ఉన్నారు. అంటే ఇన్ని కుటుంబాలు బతుకమ్మ, దసరా, ఇప్పుడు దీపావళి పండుగకు వీరి ఇళ్లలో కళ తప్పింది. పలువురి ఇళ్లలో పండుగ పూట పస్తులు ఉండాల్సిన పరిస్థితి. సిద్దిపేట, హుస్నాబాద్, దుబ్బాక, గజ్వేల్‌లలో బస్సు డిపోలు ఉన్నాయి. ఈ డిపోల ద్వారా ఆర్టీసీ బస్సులు 209, అద్దెబస్సులు 77 నడుస్తున్నాయి. అయితే ఇందులో పనిచేసే 411 డ్రైవర్లు, 506 కండక్టర్లు, మెకానిక్, ఇతర కార్మికులు 228 మంది ఉన్నారు. మొత్తం 1,147 కుటుంబాలు ఉండగా.. వీరికి నెలకు వేతనాలు రూ. 16వేల నుంచి ఎక్కువ ఎక్కువగా రూ. 46 వేలు సర్వీస్ మరీ ఎక్కువైతే రూ. 50వేల వరకు వస్తాయి. వీటితోనే కుటుంబాలు సాధుకోవాలి. రెండు నెలలుగా వేతనాలు నిలిచి పోవడంతో వీరికి తల్లిదండ్రులు, పిల్లలు, అత్తామామ అందరూ పండుగ పూట ఇబ్బందులు పడాల్సి వస్తోంది. భారమైన కుటుంబ పోషణ మల్లేశం ఆర్టీసీ డ్రైవర్. 26 ఏళ్లుగా సంస్థలో కార్మికునిగా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పండుగ వచ్చిందంటే చాలు పేద కుటుంబం అయినప్పటికీ మల్లేశం ఇంట్లో సందడి ఉంటుంది. ముఖ్యంగా బతుకమ్మ, దసరా పండుగ రోజు బిడ్డ, అల్లుడు, మనమరాలు, కొడుకు, భార్యతో ఎంతో ఆనందంగా సంతోషంగా ఉండేవారు. కానీ ఈ సారి పండుగ పూట పస్తులు తప్పలేదు. సమ్మె నేపథ్యంలో అందరితోపాటు మల్లేశం కూడా ఆందోళనలో పాల్గొంటున్నాడు. ఇప్పటివరకు సెప్టెంబర్ నెల వేతనాలను విడుదల చేయకపోవడంతో పూటగడవడమే కష్టంగా మారింది. ప్రతీ ఏడాది దసరా పండుగ భార్య , కూతురుకు కొత్త బట్టలు కొనిచ్చే మల్లేశానికి ఈ సారి ఆర్థిక సమస్య ఎదురైంది. జేబులో ఒక్క పైసా లేకుండా కుటుంబ సభ్యులు పోషణ తలకు మించిన భారంగా మారింది. దీపావళి పండుగ మరీ దారుణంగా ఉంటుందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. దీపావళికి కూతురు, అల్లుడిని పండుగకు పిలవాలంటే భయమేస్తుందని మల్లేశం బాధపడుతున్నాడు. -
త్యాగధనుల గడ్డ
సాక్షి, నెల్లూరు : నిన్న ఉపాధ్యాయుడు శంకర్‌యాదవ్, నేడు ఆర్టీసీ ఉద్యోగి సోమశేఖర్రాజు.. సమైక్యాంధ్ర ఉద్యమానికి ఊపిరి పోసేందుకు తమ ఊపిరి వదిలారు. సమైక్య రాష్ట్రం కోసం ఏ త్యాగాలకైనా సిద్ధమంటూ అమరులయ్యారు. ఉద్యమకారుల ప్రాణ త్యాగాలతో సింహపురిలో సమైక్య ఉద్యమం రోజురోజుకూ ఉవ్వెత్తున ఎగిసి పడుతోంది. సింహపురి వాసులు సాగిస్తున్న ఉద్యమం జిల్లాలో 57వ రోజు బుధవారం మరింత ఉధృతంగా కొనసాగింది. జిల్లావ్యాప్తంగా ఉద్యోగులు, విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు ర్యాలీలు, రాస్తారోకోలు, మానవహారాలు, నిరసన దీక్షలు నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆర్టీసీ కార్మికులు కొనసాగిస్తున్న నిరవధిక దీక్షలో ఉద్వేగానికి గురై స్క్వాడ్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్రాజు బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని ఏజేసీ పెంచలరెడ్డి, ఆర్టీసీ ఆర్ఎం రవికుమార్ సందర్శించి నివాళులు అర్పించారు. కార్మికులు ఆయన భౌతిక కాయంతో ఊరేగింపు నిర్వహించారు. నగరంలో రెవెన్యూ అసోసియేషన్ నాయకులు కలెక్టరేట్ ఎదుట ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. జిల్లా పరిషత్ ఉద్యోగుల ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన జరిగింది. శ్రీపొట్టి శ్రీరాములు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం నుంచి మూ డు రోజులు వీఆర్సీ సెంటర్లో తల్లుల రిలే నిరాహార దీక్షలు జరగనున్నాయి. నెల్లూరు వేదాయపాళెం సెం టర్లో ముదిరాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. నర్తకీ సెం టర్లో వాణిజ్య ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. గూడూరు టవర్‌క్లాక్ సెంటర్లో జరుగుతున్న రిలే దీక్షల్లో బుధవారం ప్రైవేటు పాఠశాలల బస్సు డ్రైవర్లు, సిబ్బంది పాల్గొన్నారు. టవర్‌క్లాక్ సెంటర్ వద్ద విద్యార్థి జేఏసీ నాయకులు రాస్తారోకో చేశారు. వాకాడులోని ఆర్టీసీ డిపో ఎదుట నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్మికులు మోకాళ్లపై నిలిచి నిరసన తెలిపారు. చిట్టమూరులో ఎంఈఓ ఎన్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో మండలంలో ఈ నెల జరగబోవు సమైక్య గర్జన కార్యక్రమాన్ని పురస్కరించుకుని చైతన్య రథాన్ని ప్రారంభించారు.వెంకటగిరి నియోజకవర్గం సైదాపురంలో ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరాహార దీక్షలో బుధవారం అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. ఉదయగిరి నియోజక వర్గంలోని వింజమూరులో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 54వ రోజుకు చేరాయి. సరస్వతి పాఠశాల విద్యార్థులు సంఘీభావం తెలిపారు. కలిగిరి జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం నుంచి గ్రామచైతన్య యాత్రను ప్రారంభించారు. కొండాపురం మండలం సాయిపేటలో గ్రామ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు జరిగాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా పొదలకూరులో కొయ్య మిల్లులు, తోపుడు మిల్లులు, మోటార్ రీవైండింగ్, చిన్న పరిశ్రమల కార్మికులు, యజమానుల ప్రదర్శన నిర్వహించారు. అనంతరం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. సూళ్లూరుపేటలో జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. బుధవారం గ్రామ సేవకులు, వీఆర్ఏలు దీక్షలో పాల్గొన్నారు. అక్టోబర్ ఒకటిన నిర్వహించనున్న ‘పులికాట్ పొలికేక’కు సంబంధించి కరపత్రాన్ని జేఏసీ నాయకులు విడుదల చేశారు. మహిళా టీచర్లు ఉండమ్మా బొట్టుపెడతా కార్యక్రమంలో భాగంగా ఈ కరపత్రాలను పట్టణంలోని ఇంటింటికి వెళ్లి సమైక్య ఉద్యమంలోకి రావాలని కోరారు. నాయుడుపేటలో జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా సమైక్య గ్రామీణ బస్సు యాత్రను ప్రారంభించారు. గ్రామీణులకు సమైక్య ఉద్యమం గురించి అవగాహన కల్పించేందుకు ఈ బస్సుయాత్రను చేపట్టారు. మండలంలోని ద్వారకాపురం, మేనకూరు, అరవపెరిమిడి, పుదూరు, పూడేరు, గొట్టిప్రోలు గ్రామాల్లో పర్యటించారు. కావలిలో సుమారు 500 మందితో సామూహిక రిలేదీక్షను స్థానిక శ్రీపొట్టిశ్రీరాములు విగ్రహం సెంటర్లో గురువారం నిర్వహిస్తున్నట్లు సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ తిరివీధి ప్రసాద్ తెలిపారు. పట్టణంలో వైఎస్సార్సీపీ, సమైక్యాంధ్ర జేఏసీ, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి, ఆర్టీసీ జేఏసీ, ప్రభుత్వ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యాన రిలేనిరాహారదీక్షలు కొనసాగాయి. కావలిరూరల్ మండలంలో ఎస్టీయూ ఆధ్వర్యంలో జనచైతన్యయాత్రలను నిర్వహించారు. కోవూరు ఎన్జీఓ హోంలో యువకులు దీక్షకు దిగారు. ఆత్మకూరు బస్టాండ్ సెంటర్లో పెయింటర్స్ సంఘం కార్మికులు రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు. పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నుంచి ఉపాధ్యాయ ఉద్యోగ జేఏసీ నేతలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్థానిక ఎస్ఆర్జే డిగ్రీ కళాశాల అధ్యాపకులు లక్ష్మణరావుపల్లి నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.