breaking news
rtc executive director
-
ప్రయూణికులకు మెరుగైన సౌకర్యాలు
శ్రీకాకుళం అర్బన్: ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందేలా కృషి చేస్తామని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎ.రామకృష్ణ అన్నారు. వంద రోజుల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి డిపోలోనూ బస్సుల పనితీరు, నిర్వహణ, బస్సుల్లో సీట్లు బాగున్నాయో? లేదో? చూడడం, పాడైన బస్సు గ్లాసులు బాగు చేయడం తదితరవి పరిశీలిస్తున్నామన్నారు. ప్రయాణికులను ఆకట్టుకునేలా అన్ని డిపోలను సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఆర్టీసీపై ప్రతినెలా డీజిల్ భారం పడడం వల్ల నష్టాల బాటలో నడుస్తోందన్నారు. సంస్థ లాభాల బాట పట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. జిల్లాలో సరుబుజ్జిలి బస్‌స్టేషన్‌లో సీసీ రోడ్డు నిర్మాణం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. టెక్కలి కాంప్లెక్స్‌లో అదనపు ప్లాట్‌ఫారాలను నిర్మించనున్నామన్నారు. శ్రీకాకుళం కాంప్లెక్స్ ఆవరణలో కొత్తగా సులభ్‌కాంప్లెక్స్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. దసరా పండగను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఈ నెలాఖరు నుంచి విజయవాడకు, హైదరాబాదుకు ప్రత్యేక బస్సులను నడుపుతామన్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు బస్సులను తిప్పుతామన్నారు. శ్రీకాకుళం రెండవ డిపోపై ప్రత్యేక దృష్టి జోన్లో ఏ డిపోలో లేని విధంగా శ్రీకాకుళం రెండవ డిపో సుమారు *4 కోట్ల మేర నష్టాల్లో ఉందన్నారు. ఈ డిపో లాభాల బాట పట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. తొలుత శ్రీకాకుళం రెండో డిపో గ్యారేజీలో బస్సుల పనితీరు, నిర్వహణ, పిట్లోకి దిగి బస్సు కండిషన్‌ను పరిశీలించారు. స్పేర్‌పార్టులు గది, గ్యారేజీ యార్డు, స్టాఫ్ రెస్ట్‌రూం, స్టోరు రూం తదితర గదులను తనిఖీ చేశారు. రెండవ డిపో గ్యారేజీ ఆవరణలో ఉన్న మొక్కలను పరిశుభ్రం చేసిన తీరుపై సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఆర్.అప్పన్న, డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ జి.సత్యనారాయణ, శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోల మేనేజర్లు ఎం.సన్యాసిరావు, ఎం.ముకుందరావు, బస్ స్టేషన్ మాస్టర్ బీఎల్పీ రావు, డీఈ బమ్మిడి రవికుమార్, రెండో డిపో ఎం.ఎఫ్ పాల్గొన్నారు. -
రూ. 8 కోట్లతో బస్టాండ్ల అభివృద్ధి
మార్కాపురం, న్యూస్‌లైన్: చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఉన్న 32 ఆర్టీసీ బస్టాండ్లలో జూలై 2వ తేదీ నుంచి ప్రతి టికెట్‌పై ప్రయాణికుల నుంచి ఒక రూపాయి వసూలు చేస్తున్నామని, వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ విధంగా వసూలయ్యే రూ. 8 కోట్ల నిధులతో బస్టాండ్లలో ప్రయాణికులకు అవసరమైన కనీస వసతులు కల్పిస్తామని నెల్లూరు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సూర్యచంద్రరావు తెలిపారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టికెట్లపై అదనపు వసూలు ద్వారా నెలకు దాదాపు రూ. 80 లక్షలకుపైగా ఆదాయం రావచ్చని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. తాగునీటి సౌకర్యం, ప్రయాణికులు కూర్చొనేందుకు బెంచీల ఏర్పాటు, బస్టాండ్ల మరమ్మతులు చేపడతామన్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఏడాదికి రూ. 2 కోట్లకు మించి ఇవ్వడం లేదని, దీంతో ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయామన్నారు. మూడు జిల్లాల్లోని మూడు రీజియన్లలో మూడేసి బస్టాండ్ల చొప్పున మొత్తం 9 బస్టాండ్ల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని, సెప్టెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి నిధులిస్తే ఆర్టీసీ మరికొంత కలిపి సంబంధిత బస్టాండ్లను అభివృద్ధి చేస్తామన్నారు. జోన్ పరిధిలో మార్చి నెలాఖరు నాటికి 210 బస్సులు రావాల్సి ఉండగా, ఇప్పటికే 60 బస్సులు వచ్చినట్లు చెప్పారు. అవి పాత బస్సుల స్థానంలో వచ్చాయన్నారు. జవహర్లాల్ నెహ్రూ పట్టణాభివృద్ధి పథకం కింద నెల్లూరు రీజియన్‌కు వంద బస్సులు కావాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని, ఇవి వస్తే నెల్లూరుకు 50, తిరుపతికి 50 బస్సులు కేటాయిస్తామన్నారు. చిత్తూరు, ప్రకాశం రీజియన్‌లో ఆర్టీసీ నష్టాల్లో ఉందని తెలిపారు. తిరుమల, తిరుపతి, అలిపిరి, నెల్లూరు- 2 డిపోలు మాత్రమే లాభాల్లో ఉన్నాయన్నారు. ప్రకాశం జిల్లాలో కనిగిరి డిపో లాభాల బాటలో ఉండగా, అద్దంకి డిపో నష్టాల్లో ఉందన్నారు. జిల్లాలోని మిగిలిన 7 డిపోలు నష్టాలను అధిగమించాయన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంతో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 7 రోజులుగా ఆర్టీసీ బస్సులు నడవడం లేదని చెప్పారు. ఒంగోలులో మూడు రోజులు బస్సులు తిరగలేదన్నారు. డీజిల్ ధరలు పెరగడంతో తమపై భారం పడుతోందని, నష్టాలు అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రయాణికులను అధిక సంఖ్యలో ఎక్కించుకోవడంతో పాటు ఇంధన పొదుపు పాటిస్తున్నామని తెలిపారు. కిలోమీటరుకు తమకు రూ. 27 ఖర్చవుతుండగా, రూ. 20 ఆదాయం వచ్చినా బస్సులు తిప్పుతామని చెప్పారు. మార్కాపురం డిపోకు నూతనంగా ఆరు బస్సులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. కంభం, దోర్నాల పట్టణాల్లో బస్టాండ్ల అభివృద్ధికి ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, సురేశ్‌లు నిధులు కేటాయించారన్నారు. త్వరలో ఇక్కడ పనులు ప్రారంభిస్తామన్నారు. బస్టాండ్‌లో పర్యటన: ఈడీ సూర్యచంద్రరావు స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో పర్యటించారు. డిపోలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. వివిధ డిపోల కండక్టర్లతో మాట్లాడి ఆదాయ, వ్యయాలను పరిశీలించారు. ప్రయాణికులను గౌరవిస్తూ సంస్థ గౌరవాన్ని నిలబెట్టి నష్టాలను తగ్గించేందుకు కృషి చేయాలని కోరారు. ఆయన వెంట డిపో మేనేజర్ సునీల్ జోసఫ్, ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ చిన్నయసూరి తదితరులు ఉన్నారు.