తెలంగాణకు లక్ష కోట్లు తీసుకురండి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి మంత్రి కేటీఆర్ సవాల్
బాన్సువాడ: ప్రధాని నరేంద్రమోడీ బిహార్‌కు రూ.1.25 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించారని, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి కేంద్రం లో పలుకుబడి ఉంటే రాష్ట్రానికి రూ.లక్ష కోట్లు తేవాలని పంచాయతీరాజ్ శాఖమంత్రి కె.తారకరామారావు సవాల్ విసిరారు. గురువారం నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలిపినప్పుడు నోరుమెదపని కిషన్‌రెడ్డి, ఇప్పుడు తమను విమర్శించడం హాస్యాస్పదమన్నారు.
గృహ నిర్మాణశాఖలో వేల కోట్ల కుంభకోణం జరిగినా పట్టించుకోని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రస్తుతం ప్రభుత్వాన్ని విమర్శించడం సమంజసం కాదన్నారు. రాష్ట్రంలో 8,700 గ్రామాలుండగా, సుమారు వెయ్యి గ్రామాలను మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పోలీసు లు, అధికారులు దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో 50 శాతం మంది పలు పథకాల కింద లబ్ధి పొందుతున్నారన్నారు. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం అవినీతి రహితపాలన అందిస్తోందని పేర్కొన్నారు.