breaking news
Rs 5 lakh reward
-
యజమానికి రూ. 5 లక్షలు మిగిల్చిన అంబూ
చెన్నై సాలిగ్రామానికి చెందిన శరవణన్, సంగీత దంపతులు మోంగ్రెయిల్ జాతికి చెందిన 'అంబూ' అనే కుక్కును పెంచుకున్నారు. అయితే ఆ దంపతులు ఇటీవల కెనడా పర్యటనకు వెళ్లారు. దాంతో అంబూ అలిగిందో ఏమో శుక్రవారం ఇల్లు వదిలి వెళ్లిపోయింది. ఆ విషయాన్ని ఇంటి పనివారు శరవణన్ దంపతులకు సమాచారం అందించారు. అంతే వారు ఆగమేఘాల మీద ఇండియా వచ్చారు. అంబూను వెతికే క్రమంలో ఆ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేసి... తమ వంతు ప్రయత్నంగా నగరం అంతా గాలించారు. అయిన ఫలితం లేకపోయింది. అల్లారుముద్దగా పెంచుకున్న అంబూ కనిపించకపోవడంతో ఆ దంపతులు కన్నీరు మున్నీరు అయ్యారు. ఇక లాభం లేదని ఓ నిర్ణయానికి ఆ దంపతులు వచ్చేశారు. అంబూ ఆచూకీ తెలిపిన లేక తీసుకువచ్చి తమకు అప్పగించిన అక్షరాల రూ. 5 లక్షలు ఇస్తామని ప్రకటించారు. అంబూ ఫోటోతో పాటు ఫోన్ నెంబర్లు 9940393023, 08105302635 వివరాల పోస్టర్ను శరవణన్ దంపతులు ఫేస్ బుక్ లో పెట్టారు. అలాగే అంబూ పోస్టర్ను బ్లూక్రాస్ సొసైటీ ఫేస్బుక్ పేజీలో సైతం వుంచారు. అంబూ ఆచూకీ ఎవరైన తెలపకపోతారా అంటూ వెయ్యి కళ్లతో ఆ దంపతులు ఎదురు చూడసాగారు. అంబూ ఎలాగైన తమకు దక్కితే చాలని భావించారు. అయితే తన యజమానులు తన కోసం బెంగపడ్డారనో లేక తన ఆచూకీ తెలిస్తే రూ. 5 లక్షలు ఇస్తానని ప్రకటించారని తెలిసిందో ఏమో అంబూ మంగళవారం ఉదయం శరవణన్ ఇంటి ముందుకు వచ్చి నిలబడింది. ఆ విషయాన్ని గమనించిన శరవణన్ దంపతులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇంటి ముందు ఉన్న అంబూను అమాంతంగా ఇంట్లోకి ఎత్తుకుని తీసుకువచ్చారు. అనంతరం ఆ దంపతులు అంబూపై ముద్దుల వర్షం కురిపించారు. అంబూ వచ్చిన ఆనందాన్ని శరవణన్ దంపతులు అందరితో పంచుకున్నారు. అంబూ కోసం ఇంత ప్రచారం చేసిన, భారీగా నగదును నజరానాగా ప్రకటించిన అంబూ ఎవరికి చిక్కకుండా... నేరుగా ఇంటికి వచ్చింది. దాంతో శరవణన్ దంపతులకు అంబూ రూ. 5 లక్షలు మిగిల్చింది. -
ఆ కుక్కను పట్టిస్తే ఐదు లక్షల బహుమతి
చెన్నైకు చెందిన శరవణన్, ఆయన భార్య సంగీత, తమ ఫేస్బుక్లో ఒక విచిత్రమైన పోస్టర్ ఒకటి వుంచారు. అదేమంటే మే -17న తాము పెంచుకుంటున్న మోంగ్రెయిల్ జాతికి చెందిన ‘అంబూ’ అనే అతి ఖరీదైన కుక్క సాలిగ్రామంలోని తమ ఇంటిలో నుంచి అదృశ్యమైందని, దానిని పట్టిచ్చిన వారికి అక్షరాలా 5 లక్షల రూపాయల బహుమతి ఇస్తామని ఆ పోస్టర్లో ముద్రించారు. శునకం తాలుకు వివరాలు తెలిస్తే 9940393023 లేదా 08105302635 నెంబర్లకు ఫోన్ చేయాలని వారు ఆ పోస్టర్లో పేర్కొన్నారు. అంబూ అని పిలిస్తే ఈ కుక్క వెంటనే స్పందిస్తుందన్నారు. నగరానికి చెందిన బ్లూక్రాస్ సొసైటీ ఫేస్బుక్ పేజీలో సైతం వారు ఈ పోస్టర్ను వుంచామని తెలిపారు. అత్యంత వేగంగా పరుగెత్తడం ఈ కుక్క ప్రత్యేకత అన్నారు. గోధుమరంగు తెలుపు వర్ణం కలిగిన ఈ కుక్క తమకెంతో ఆప్తురాలని సంగీత అందులో పేర్కొన్నారు. గత ఏడాది తిరుపతిలోని బ్లూక్రాస్ సొసైటీ నుంచి అంబూను తెచ్చుకున్నామని ఆమె తెలిపారు. కెనడా పర్యటనలో ఉన్న తనకు అంబూ మాయమైందని తెలియగానే ఆగమేఘాలమీద చెన్నైకి చేరుకున్నామని ఆమె తెలిపారు. తమ పోస్టర్ మెసేజికి వచ్చిన లైకుల సంఖ్యను చూసిన తర్వాత తమ అంబూ తమకు దొరుకుతుందన్న నమ్మకం కలిగిందన్నారు. చెన్నై బ్లూక్రాస్ సొసైటీ జిఎం డాన్ విలియమ్స్ ఎలాగైనా అంబూను కనిపెడతామని ధృడంగా తెలిపారు. సరిగ్గా 15 రోజుల కిందట బ్రాడ్వేకు చెందిన ఒక న్యాయవాది పెంచుకుంటున్న జర్మన్ జాతి పిల్లిని దొంగిలించిన నేపథ్యంలో అంబూను కూడా దుండగులు దొంగిలించి వుండవచ్చని శరవణన్ సందేహాన్ని వ్యక్తం చేశారు.