breaking news
Rolarkostar
-
Union Budget 2023: మురిసి ‘పడిన’ మార్కెట్!
బడ్జెట్లో వృద్ధి మంత్రంతో తారాజువ్వలా దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు... అంతలోనే చప్పున చల్లారిపోయాయి. మౌలిక రంగానికి భారీగా కేటాయింపులను పెంచుతూ.. మధ్యతరగతి వర్గాలకు ఐటీ ఊరటనిచ్చిన నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను అంతా స్వాగతించారు. కానీ, ఊహించని పరిణామాలతో మార్కెట్ లాభాలన్నీ ఆవిరైపోయాయి. అదానీ షేర్లు బేర్ గుప్పిట్లో చిక్కుకోవడంతో మార్కెట్ రోలర్ కోస్టర్‌ను తలపించింది. ముంబై: వృద్ధి ప్రోత్సాహక బడ్జెట్ లాభాలను నిలుపుకోవడంలో స్టాక్ మార్కెట్ విఫలమైంది. కేంద్రమంత్రి ప్రసంగం ఆసాంతం భారీ లాభాలను ఆర్జించిన సూచీలు ఆరంభ లాభాలను కోల్పోయి మిశ్రమంగా ముగిశాయి. ట్రేడింగ్‌లో 1,958 పాయింట్ల పరిధిలో ట్రేడైన సెన్సెక్స్ చివరికి 158 పాయింట్లు లాభంతో 59,708 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో నిఫ్టీ 619 పాయింట్ల రేంజ్లో ట్రేడైంది. ఆఖరికి 46 పాయింట్ల నష్టంతో 17,616 వద్ద నిలిచింది. ద్వితీయార్థంలో నెలకొన్న అమ్మకాల సునామీలో ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లు మాత్రమే స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ప్రభుత్వరంగ బ్యాంక్స్, మెటల్ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు ఒకశాతం చొప్పున నష్టపోయాయి. ప్రథమార్థంలో భారీ లాభాలు బడ్జెట్‌పై ఆశలతో ఉదయం సూచీలు ఉత్సాహంగా మొదలయ్యాయి. సెన్సెక్స్ 451 పాయింట్ల లాభంతో 60001 వద్ద, నిఫ్టీ 17,812 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు, మూలధన వ్యయం భారీ పెంపు, ఎల్టీసీజీ పన్ను జోలికెళ్లకపోవడంతో ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చాయి. ఫలితంగా ప్రథమార్థంలో సెన్సెక్స్ 1,223 పాయింట్లు ఎగసి 60,773 వద్ద, నిఫ్టీ 310 పాయింట్లు దూసుకెళ్లి 17,662 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేశాయి. మిడ్‌సెషన్ నుంచి లాభాల స్వీకరణ కేంద్ర మంత్రి ప్రసంగం ఆసాంతం అనూహ్యమైన ర్యాలీ చేసిన సూచీలు చివరి వరకు ఆ జోరును నిలుపుకోలేకపోయాయి. ట్రేడింగ్ ద్వితీయార్థంలో అదానీ గ్రూప్ షేర్లలో అనూహ్య అమ్మకాలు తలెత్తాయి. ఫెడ్ ద్రవ్య విధాన వైఖరి వెల్లడి నేపథ్యంలో అప్రమత్తత చోటు చేసుకుంది. గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం(60,773) నుంచి 1,958 పాయింట్లు పతనమై 58,817 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ గరిష్టం(17,972)నుంచి 619 పాయింట్లు క్షీణించి 17,353 వద్ద ఇంట్రాడే కనిష్టానికి దిగొచ్చింది. అదానీ గ్రూప్ షేర్లు విలవిల... అదానీ గ్రూప్ సంస్థలపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక వెల్లడి నేపథ్యంలో క్రెడిట్ సూయిజ్ షాక్ ఇచ్చింది. అదానీ కంపెనీల రుణాల బాండ్లను స్వీకరించడం నిలిపివేసింది. దీంతో బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో అదానీ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఈ గ్రూప్‌నకు చెందిన పది కంపెనీల షేర్లు నష్టాలతో ముగిశాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ 26%, అదానీ పోర్ట్స్ 18%, అదానీ టోటల్ గ్యాస్ 10%, అంబుజా సిమెంట్స్ 17%, అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు 6% క్షీణించాయి. అదానీ పవర్, అదానీ విల్మార్, ఎన్డీటీవీ షేర్లు 5% లోయర్ సర్క్యూట్ తాకాయి. బుధవారం ఒక్కరోజే ఈ గ్రూప్ రూ.2 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను కోల్పోయింది. మార్కెట్లో మరిన్ని సంగతులు... ► వార్షిక ప్రీమియం రూ.5 లక్షలకుపైన జీవిత బీమా పాలసీలపై పన్ను విధింపుతో బీమా కంపెనీల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఎల్ఐసీ 4%, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ 7%, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ 6%, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ షేర్లు తొమ్మిది శాతం చొప్పున నష్టపోయాయి. ► మౌలిక వసతులకు పెద్దపీట వేస్తూ రూ.10 లక్షల కోట్ల నిధుల కేటాయింపు మౌలిక సదుపాయాల కంపెనీ షేర్లకు కలిసొచ్చింది. ఈ రంగానికి చెందిన సైమన్స్ 4%, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్, హెచ్‌జీ ఇన్ఫ్రా ఇంజనీరింగ్ 3%, ఎల్అండ్టీ 1.50%, అశోక బిల్డ్‌కాన్ 1.21% చొప్పున లాభపడ్డాయి. ► సిగరెట్లపై 16 శాతం పన్ను పెంపుతో గోడ్ఫ్రే ఫిలిప్స్, ఎన్టీసీ ఇండస్ట్రీస్, వీటీఎస్ ఇండస్ట్రీస్ షేర్లు 6%, 3.50%, మూడుశాతం నష్టపోయాయి. మరోవైపు గోల్డెన్ టొబాకో 4.58%, ఐటీసీ 2.50% చొప్పున లాభపడ్డాయి. ► బడ్జెట్లో నిధులు కేటాయించడంతో రియల్టీ, రైల్వే రంగ షేర్లు ప్రథమార్థంలో భారీగా ర్యాలీ చేశాయి. అయితే మార్కెట్ పతనంలో భాగంగా ఈ రంగాల షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. రియల్టీ రంగ షేర్లు నాలుగు శాతం, రైల్వే షేర్లు తొమ్మిది శాతం చొప్పున నష్టపోయాయి. ► ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకానికి తాజా బడ్జెట్లో రూ.79 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించడంతో సిమెంట్ రంగ షేర్లు బలపడ్డాయి. ఇండియా సిమెంట్స్, రామ్‌కో సిమెంట్స్, శ్రీరాం సిమెంట్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్ షేర్లు 4–1% చొప్పున లాభపడ్డాయి. స్టాక్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపే అంశాలేవీ బడ్జెట్‌పై లేవు. వినియోగ ప్రాధాన్యత, మూలధన వ్యయం పెంపుతో తొలి దశలో ఆశావాదంతో ట్రేడయ్యాయి. బుల్స్ మెచ్చిన బడ్జెట్ ఇది. అయితే అదానీ గ్రూప్ సంక్షోభం, ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ నిర్ణయాల వెల్లడికి అప్రమత్తత సెంటిమెంట్‌ను పూర్తిగా దెబ్బతీశాయి. – ఎస్ రంగనాథన్, ఎల్కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ -
భాగ్యనగరంలో భారీ అక్వేరియం!
జీరో గ్రావిటీ అనుభూతి సందర్శకుల సొంతం స్పందించే రాక్షస బల్లులు,ఆకాశంలో గిరికీలు కొట్టించే రోలర్‌కోస్టర్ అనిశ్చితి తొలగడంతో ముందుకొచ్చిన ప్రైవేటు సంస్థ దేశంలోనే మొదటిది.. బుద్వేలులో ఏర్పాటు న్యూజిలాండ్ సాంకేతికత, బ్రిటన్ ఆర్థికసాయం హైదరాబాద్: చుట్టూ స్వచ్ఛమైన నీళ్లు... అందులో అందమైన చేపలు, ఆకట్టుకునే ఇతర జలచరాలు.. ఆ నీటికింద అద్దాలతో తయారైన సొరంగమార్గం...జలచరాల విచిత్రవిన్యాసాలు అతిదగ్గరగా తిలకిస్తూ... దానిగుండా నడుస్తూ ముందుకుసాగితే...‘జీరో గ్రావిటీ’ వ్యవస్థ సాక్షాత్కారం... అంతరిక్షంలో వ్యోమగాముల మాదిరిగా గాల్లో తేలియాడిన అరుదైన అనుభూతి మనసొంతమవుతుంది. ఆ పక్కకు చూస్తే భయంకర రూపంతో మనల్ని పలకరించే రాక్షసబల్లులు.. మనం వేసే ప్రశ్నలకు అవి క్రూరమైన గొంతుతో సమాధానాలు చెప్పి ఆశ్చర్యపరుస్తాయి... ఇంకొంచెం ముందుకెళితే ఆకాశంలో గిరికీలు కొట్టిం చే రోలర్ కోస్టర్.. ఇప్పటి వరకు విదేశాలకే పరిమితమైన ఈ అద్భుత వినోదాల విందు త్వరలో హైదరాబాద్‌లో కూడా లభించబోతోంది. దేశంలోనే తొలి ప్రయత్నంగా ఈ భారీ ప్రాజెక్టు నగరంలో సిద్ధం కానుంది. న్యూజిలాండ్, బ్రిటన్ల సాంకేతిక, ఆర్థిక సహకారంతో ఓ సంస్థ దీని నిర్మాణానికి ముందుకొచ్చింది. వాస్తవానికి ఈ సంస్థ గతంలోనే ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ఉత్సాహం చూపినా... స్థానికంగా రాజకీయ అనిశ్చితి కొనసాగుతుండడంతో వెనకడుగు వేసింది. ఇప్పుడు రాష్ట్ర విభజన పూర్తయి తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధం కావటంతో ఆ సంస్థ ముందుకొచ్చింది. ప్రాథమికంగా రూ.150 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టబోతున్నారు. ప్రత్యేకతలెన్నో: నగరంలో అండర్ వాటర్ అక్వేరియం నిర్మాణం కోసం చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరాలం జలాశయం నీటిని ఆధారం చేసుకుని జూపార్కు పక్కన ఇలాంటి ప్రాజెక్టు కోసం గతంలో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీ ఏ) ప్రయత్నించింది. ఆరు సంస్థలు ముందుకొచ్చినా ఆర్థికమాంద్యం వల్ల ప్రాజెక్టు చేపట్టలేకపోయాయి. ఇప్పుడు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ నగర శివారులోని బుద్వేల్‌లో ఈ ప్రాజెక్టు కేటాయించేందుకు ముందుకురావడంతో ‘బిగ్ బ్లూ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటె డ్’ అనే సంస్థ ప్రాజెక్టు చేపట్టేందుకు ఆసక్తి చూపింది. బ్యాంక్ గ్యారం టీతోపాటు డీపీఆర్‌ను అందజేసింది. దీంతో స్విస్ చాలెంజ్ పద్ధతిలో అధికారులు పత్రికల్లో ప్రకటనలిచ్చినా వేరే సంస్థలు రాకపోవడంతో ఆ సంస్థకే ప్రాజెక్టును కేటాయించారు. బుద్వేల్‌లో ఇందుకోసం 30 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఇందులో 8 ఎకరాల్లో అండర్‌వాటర్ అక్వేరియం రూపుదిద్దుకోనుండగా మిగతా స్థలంలో ‘జీరో గ్రావిటీ ప్రాజెక్టు’, ‘ఇంటరాక్టివ్ డైనోసార్, రోలర్ కోస్టర్, రెస్టారెంట్స్, రిసా ర్ట్స్.. ఇలా పలు వినోదకేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు న్యూజిలాండ్‌కు చెందిన ఓ సంస్థ సాంకేతిక సాయం అందిస్తుం డగా, బ్రిటన్‌కు చెందిన మరో సంస్థ ఆర్థిక చేయూతనివ్వనుందని అధికారులు చెబుతున్నారు. ముంబైలోని తారాపూర్వాలా అక్వేరియం, చండీగఢ్, సూరత్‌లలోని టన్నల్ అక్వేరియంలు మాత్రమే ఇప్పటివరకు దేశంలో గుర్తింపు పొందాయి. కానీ విదేశీ తరహాలో భారీ అండర్‌వాటర్ అక్వేరియం హైదరాబాద్‌దే కాబోతోందని అధికారులు చెబుతున్నారు. లీజ్ రెంట్తోపాటు అక్వేరియం ఆదాయంలోనూ ప్రభుత్వానికి వాటా ఉండడంతో ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి భారీగా ఆదాయం సమకూరుతుందని అధికారులు చెబుతున్నారు.